Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అక్కడ ఫీజు చెల్లించ‌కుండా చ‌దువుకోవ‌చ్చు...

చ‌దువు... సంపాదించు..తిరిగి చెల్లించు..
కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన ఐఐటీ-ఖ‌ర‌గ్‌పూర్‌

ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో చ‌దువుతోన్న ప్రతిభ ఉన్న పేద విద్యార్థుల‌కు ఉచితంగా విద్య అందించ‌డానికి ఆ సంస్థ వ్యూహ‌ర‌చ‌న చేసింది. అయితే ఇది పూర్తిగా ఉచితమ‌నికాదు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా హాయిగా చ‌దువుకుని...ఉద్యోగంలోచేరిన‌ అనంత‌రం ఏటా క‌నీసం రూ.ప‌దివేలు చెల్లిస్తేచాలు అంటోంది ఈ ఐఐటీ. ఈ విద్యా సంవ‌త్సరం నుంచే ఈ విధానాన్ని అమ‌ల్లోకితెస్తున్నట్టు ఐఐటీ-ఖ‌ర‌గ్‌పూర్ ప్రక‌టించింది. ఇందుకు అవ‌స‌ర‌మైన ఆర్థిక‌సాయాన్ని పూర్వవిద్యార్థుల నుంచి ఆశిస్తోన్నట్లు తెలిపింది.

ప్రఖ్యాత సంస్థలైన‌ ఐఐటీలు, ఐఐఎంలు స్వయం ఆదాయ మార్గాలు అన్వేషించుకోవాల‌ని కేంద్రమాన‌వ వ‌న‌రుల విభాగం కోరుకుంటోంది. దీంతో బ‌డ్జెట్లో ఏటా కేటాయింపులూ త‌గ్గుతూ వ‌స్తున్నాయి. మ‌రోవైపు నిర్వహ‌ణ ఖ‌ర్చులు పెరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ ప‌రిష్కార మార్గంగా ఆదాయ అన్వేష‌ణపై ఐఐటీలు దృస్టిసారించ‌డం మొద‌లెట్టాయి. అందులో భాగంగానే లెర్న్‌..ఎర్న్‌..రిట‌న్ విధానానికి ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ శ్రీకారం చుట్టింది. ముందు హాయిగా చ‌దువుకో..ఉద్యోగంలో చేరిన త‌ర్వాత చెల్లించు నినాదంతో ముందుకొచ్చిందీ సంస్థ. ఈ విధానం విద్యార్థుల‌కూ ఎంతో సౌల‌భ్యంగా ఉంటుంద‌నే చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఉద్యోగం వ‌చ్చిన త‌ర్వాత చెల్లిస్తాన‌ని విద్యార్థి అంగీక‌రిస్తే ఎలాంటి ఫీజులూ వ‌సూలు చేయ‌రు. అలా జ‌ర‌గ‌డం వ‌ల్ల పేద విద్యార్థుల‌పై ఏవిధ‌మైన ఆర్థిక ఒత్తిడీ ఉండ‌దు. ఇందుకోసం అవ‌స‌ర‌మైన నిధులు సేక‌రించ‌డానికి ఖ‌ర‌గ్‌పూర్ ఐఐటీ పూర్వ విద్యార్థుల‌పై దృష్టి సారించింది. ఇదేవిష‌య‌మై ఆ సంస్థ డైరెక్టర్ ప్రతిమ్ చ‌క్రవ‌ర్తి మాట్లాడుతూ...కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నామ‌న్నారు. ముప్పైవేల మంది ఐఐటీ పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరూ ఏడాదికి రూ.ప‌దివేలు చొప్పున సంస్థకు కేటాయిస్తే రూ.30 కోట్లు వ‌స్తాయ‌న్నారు. ఇదే విధానాన్ని ఏటా పూర్వవిద్యార్థులు కొన‌సాగించిన‌ట్లైతే కొత్త విధానాల‌తో ముందుకుసాగ‌డం సాధ్యమ‌వుతుంద‌న్నారు. విఖ్యాత హార్వార్డ్ యూనివ‌ర్సిటీ బ‌డ్జెట్‌లో 60 శాతం పూర్వ విద్యార్థుల నుంచే అందుతుంద‌ని చెప్పారు.

ఐఐటీల్లో విద్యాభ్యాసం ఖ‌రీదైన వ్యవ‌హారంగా మారుతోంద‌ని, ప్రభుత్వం ఒక్కొక్కరిపైనా ఏడాదికి రూ.6 ల‌క్షల వ‌ర‌కు వెచ్చించాల్సి వ‌స్తోంద‌న్నారు. తాజాగా బీటెక్ కోర్సుల‌కు ఫీజులు పెంచినప్పటికీ వాటితోనే లోటు పూడ్చడం సాధ్యంకాద‌ని అభిప్రాయప‌డ్డారు. అందువ‌ల్ల ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల‌పై దృష్టిసారించామ‌న్నారు. అక‌డమిక్స్‌లో మంచి ప్రతిభ చూపి, ఆర్థికంగా వెనుక‌బ‌డిన విద్యార్థుల‌కు పూర్తి ఫీజు మిన‌హాయింపు ఇస్తామ‌న్నారు. వీరు ఉద్యోగంలో చేరిన‌ త‌ర్వాత ఏటా క‌నీసం రూ.ప‌దివేల‌కు త‌గ్గకుండా తిరిగి చెల్లించ‌వ‌చ్చు. ఈ విద్యా సంవ‌త్సరంలో ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో చేరిన విద్యార్థుల్లో టాప్ వంద మందికి ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు సెమిస్టర్ల వారీ చూపిన ప్రతిభ ఆధారంగా ఈ ఫండింగ్ కొనసాగుతుంది. అలాగే వీళ్లు విద్యాభ్యాసం పూర్తిచేసిన త‌ర్వాత అవ‌స‌ర‌మైతే ఐఐటీ విద్యార్థుల‌కు బోధ‌నలో స‌హాయ‌ప‌డ‌టానికి ముందుకు రావాలి. ప‌రిశోధ‌న‌ల్లో పాల్గొనాలి.

విద్యార్థుల‌కు ఉచితంగా చ‌దువు చెప్పాలంటే అవ‌స‌ర‌మైన నిధులు స‌మ‌కూర్చుకోవ‌డం చాలా కీల‌కం. ఇందుకోసం ప‌లు మార్గాలు అన్వేషిస్తోన్నట్లు ప్రతిమ్ చ‌క్రవ‌ర్తి తెలిపారు. పూర్వ విద్యార్థుల దృష్టికి విష‌యాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఆ ప్రయ‌త్నం మొద‌లైంద‌నీ, సానుకూల‌త కూడా ల‌భిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. వారంతా ఆర్థిక‌సాయంతో ముందుకొస్తే పేద విద్యార్థులకు ఉచితంగా చ‌దువు ద‌క్కడ‌మే కాకుండా, ఐఐటీలు ఆర్థిక ప‌రిపుష్టిని సంత‌రించుకోవ‌డ‌మూ సాధ్యమ‌వుతుంది. అలా జ‌ర‌గాలని ఆశిద్దాం. అన్నివిద్యా సంస్థలూ ఐఐటీ-ఖ‌ర‌గ్‌పూర్ బాట ప‌ట్టాల‌ని కోరుకుందాం.


Back..

Posted on 01-08-2016