Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఐఐటీల కొత్త పరీక్ష... ఏ తీరు?

వచ్చే సంవత్సరం (2017) నుంచీ ఐఐటీ ప్రవేశపరీక్ష స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. పరీక్ష విధానం ఏ తీరులో రూపుదిద్దుకున్నప్పటికీ దాని గురించి ఐఐటీ ఆశావహులు ఆందోళన పడనవసరం లేదు. ప్రస్తుతం తమ సన్నద్ధతను మామూలుగానే కొనసాగిస్తూ ఉండాలి. అమలు కాబోయే మార్పుల గురించి లేనిపోని అపోహలేమీ పెట్టుకోకుండా ఉండాలి!
జేఈఈ- అడ్వాన్స్‌డ్‌కు ముందుగా ఐఐటీలకు అర్హత సంపాదించే ఒక ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (యోగ్యతా పరీక్ష) నిర్వహణకు కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఐఐటీల్లో చేరదల్చుకున్న విద్యార్థులు కోచింగ్‌ కేంద్రాలపై ఆధారపడకుండా చేయటం యోగ్యతాపరీక్ష లక్ష్యాల్లో ఒకటి. ఈ పరీక్షను ఏడాదికి రెండు మూడు సార్లు, అమెరికాలో నిర్వహించే SAT లాగా నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
కొత్త పరీక్ష స్వరూపంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ‘కమిటీ ఆఫ్‌ ఎమినెంట్‌ పర్సన్స్‌’ (సీఈపీ)ని 2015 అక్టోరు 6న నియమించింది. అనుభవజ్ఞుడైన విద్యావేత్త అశోక్‌మిశ్రా దీనికి సారథి. ఈ కమిటీ తన సిఫార్సులను నవంబరు 5న కేంద్రప్రభుత్వానికి సమర్పించింది.
ఐఐటీల్లో ప్రవేశం పొందడానికి విద్యార్థులు వేలంవెర్రిగా కోచింగ్‌ సెంటర్లవైపు వెళ్ళటాన్ని ఆపడం కోసం మార్పులు చేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ చెపుతోంది. ఆప్టిట్యూడ్‌కు శిక్షణ ఇవ్వటం సాధ్యపడదనేది కమిటీలోని సభ్యుల అభిప్రాయం.
ఈ కమిటీ ప్రతిపాదనల ప్రకారం-
* వచ్చే ఏడాది నుంచి ఐఐటీల్లో చేరబోయే విద్యార్థులు ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే యోగ్యతాపరీక్షను ముందుగా రాయాల్సివుంటుంది.
* ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఎన్‌టీఎస్‌) ఏడాదికి రెండు లేదా ఎక్కువసార్లు నిర్వహిస్తుంది.
* విద్యార్థిలోని నైపుణ్యాలను శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసేలా ఈ పరీక్షను రూపొందిస్తారు.
* అమెరికాలో నిర్వహించే SAT ను స్ఫూర్తిగా తీసుకుని ఈ పరీక్షను నిర్వహించాలనుకుంటున్నారు.
* యోగ్యతాపరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసి, తద్వారా ఐఐటీల్లో ప్రవేశం పొందుతారు. (ప్రస్తుతం ఐఐటీ ఆశావహులు రాసే జేఈఈ-మెయిన్‌ పరీక్షను అప్పుడు వీరు రాసే అవసరం ఉండదు).
* అర్హత సాధించడానికి కటాఫ్‌ మార్కులు ఉండవచ్చు. వివరాలన్నీ ఇంకా వెల్లడి కాలేదు.
కమిటీ ప్రతిపాదనలపై విద్యార్థులూ, తల్లిదండ్రులూ, విద్యావేత్తల నుంచి అభిప్రాయాలు సేకరించి పరీక్ష స్వరూపానికి తుది రూపం కల్పించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది.
వ్యూహం ఫలిస్తుందా?
ఐఐటీ ప్రవేశపరీక్ష రూపాన్ని మార్చదలచటానికి కారణాలు ఏమిటి? కోచింగ్‌ కేంద్రాల ప్రాబల్యాన్ని తగ్గించాలన్నది కేంద్రప్రభుత్వ లక్ష్యం అయితే, దిగజారుతున్న ఐఐటీల ప్రతిష్ఠను పెంచాలన్నది ఐఐటీల వ్యూహం.
యోగ్యతాపరీక్ష ఉన్నంతమాత్రాన కోచింగ్‌ వెళ్ళే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం లేదు. మరింత పెరగవచ్చు కూడా! ఈ మార్పులకు ప్రేరణగా ఉన్న SAT కోసం కోచింగ్‌ ఇచ్చే సంస్థలూ, తీసుకునే విద్యార్థులూ ఎందరో ఉన్నారు. ఈ SATకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చే కేంద్రాలు మనదేశంలో కూడా ఉన్నాయి. యోగ్యతాపరీక్ష మొదలైతే వాటికి విద్యార్థుల తాకిడి మొదలవుతుంది.
(ఇంటర్మీడియట్‌) బోర్డు పరీక్షలోని ప్రశ్నలు ఒకవిధంగా (సబ్జెక్టివ్‌), ప్రవేశపరీక్షలోని ప్రశ్నలు మరో విధంగా (ఆబ్జెక్టివ్‌) ఉన్నపుడు ప్రవేశపరీక్ష కోసం విద్యార్థులు శిక్షణ తీసుకోవడం అనివార్యంగా జరుగుతుంది.
అమెరికాలోని అన్ని విశ్వవిద్యాలయాలూ కేవలం SAT స్కోరు ఆధారంగా ప్రవేశం కల్పించవు. అక్కడ మూల్యాంకన పద్ధతి భిన్నంగా ఉంటుంది. పాఠశాల స్థాయిలో విద్యార్థి ప్రతిభ కనబరిచిన అన్ని విషయాలనూ (రీడింగ్‌, రైటింగ్‌ నైపుణ్యాలు; అకడమిక్‌, కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌, ప్రాజెక్టులు లాంటివి) పరిగణనలోకి తీసుకుంటారు. పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చే రికమెండేషన్‌ లెటర్లకు కూడా ఎంతో విలువనిస్తారు.
కానీ మనదగ్గర మాత్రం కేవలం జేఈఈ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో, ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం ఉంటుంది. అందుకనే ఆ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించడం కోసం విద్యార్థులు కోచింగ్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.
పరీక్ష పేరు ఏఐఈఈఈ అయినా, జేఈఈ- మెయిన్‌ అయినా, జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ అయినా, ఎంసెట్‌ అయినా, యోగ్యతాపరీక్ష అయినా కోచింగ్‌ ఇచ్చే సంస్థలూ, తీసుకునే విద్యార్థులూ తప్పకుండా ఉంటూనే ఉంటారు. ఈ కారణం వల్ల ప్రతి రెండు మూడేళ్ళకోసారి పరీక్షలో మార్పులు ప్రతిపాదించడం, దానికి కమిటీ వేయడం, అవి కొత్త సిఫార్సులు చేయడం, దానిప్రకారం పరీక్ష విధానాన్ని మార్చడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండటం లేదని విద్యావేత్తల, నిపుణుల అభిప్రాయం.
గత పది సంవత్సరాలుగా ఐఐటీ ప్రవేశపరీక్ష విషయంలో వివిధ మార్పులు చేస్తూవచ్చారు. ఇలాంటి పరిణామాల వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఏమోగానీ, అనవసరంగా తికమకకూ, ఒత్తిడికీ లోనవుతున్నారనేది తల్లిదండ్రుల ఆవేదన. ఐఐటీ ప్రవేశపరీక్షలో మార్పులు చేసిన ప్రతిసారీ శిక్షణ తీసుకునే విద్యార్థుల సంఖ్య 15-25 శాతం పెరిగిందంటూ కోటాలోని ఒక ప్రసిద్ధ శిక్షణకేంద్రం నిర్వాహకుని పరిశీలన ఇక్కడ గమనించదగ్గది.
‘ఆబ్జెక్టివ్‌’ పరిమితి
2006 నుంచి ఐఐటీ ప్రవేశపరీక్ష పూర్తిస్థాయి ఆబ్జెక్టివ్‌ పరీక్షగా మారింది. ఈ విధానంలో విద్యార్థి జ్ఞాపకశక్తినీ, వేగాన్నీ మాత్రమే అంచనా వేయడం సాధ్యమవుతుంది గానీ పరిజ్ఞానాన్నీ, సమస్య సాధనా చాతుర్యాన్నీ కాదని నిపుణులు వాదిస్తున్నారు.
దీనివల్ల అత్యంత ప్రతిభావంతులు మాత్రమే ఐఐటీల్లో చేరే పరిస్థితి మారింది. కోచింగ్‌ ద్వారా జ్ఞాపకశక్తి, వేగం మెరుగుపరుచుకున్న విద్యార్థులూ, వీరితో పాటు బహుళైచ్ఛిక ప్రశ్నలకు ఏబీసీడీల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకున్న కొందరు కూడా ఐఐటీల్లో చేరుతున్నారు. గత పదేళ్ళలో ఐఐటీల ర్యాంకు ప్రపంచస్థాయిలో బాగా పడిపోవటం కూడా గమనార్హం.
విద్యావేత్తల సూచనలు
ప్రస్తుతం కొనసాగుతున్న జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పద్ధతి బాగుందనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీలు పూర్వ ప్రతిష్ఠను సాధించాలంటే జరగాల్సిన మార్పుల విషయంలో విద్యావేత్తల సూచనలు...
* ఐఐటీల్లో సమస్య సాధనా చాతుర్యం కలిగిన ప్రతిభావంతులైన విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలి.
* అంటే జేఈఈ ప్రవేశపరీక్షలో కనీసం 50 శాతం ప్రశ్నలైనా సబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉండాలి.
* విద్యార్థులు వాటికి రాసే జవాబులను ఐఐటీ ప్రొఫెసర్లు చదివి, మూల్యాంకనం చేయాలి.
* ఎక్కువమంది విద్యార్థుల పేపర్లను దిద్దడం ప్రొఫెసర్లకు సాధ్యపడకుంటే వడపోత పరీక్ష అయిన జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి, అడ్వాన్స్‌డ్‌ రాసే విద్యార్థుల సంఖ్యను తగ్గించాలి.
* ఒకవేళ యోగ్యతా పరీక్షను నిర్వహించినా ఐఐటీల్లో చేరడం కోసం నిర్వహించే చివరిదైన అడ్వాన్స్‌డ్‌ పరీక్ష పూర్తిస్థాయి ఆబ్జెక్టివ్‌ పరీక్షగా ఉండకుండా చూడాలి.
* అది సాధ్యం కాదనుకుంటే కేవలం అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగానే కాకుండా మౌఖిక పరీక్ష/ బృంద చర్చ ద్వారా ఐఐటీల్లో ప్రవేశం కల్పించాలి.
* కేవలం ఒక ఆబ్జెక్టివ్‌ పద్ధతి రాతపరీక్షే ఐఐటీల్లో ప్రవేశానికి ప్రాతిపదిక అయితే ఆ పరీక్ష పేరు ఏమైనా ఫలితం ఉండదు.
* ఐఐటీల్లో ప్రవేశానికి యోగ్యతాపరీక్షతో పాటు శాట్‌ మూల్యాంకన పద్ధతిని కూడా అనుసరించాలి.
* పాఠశాల స్థాయి నుంచే విద్యార్థి మ్యాథమాటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ప్రశ్నలూ జవాబులూ బట్టీ పట్టకుండా అన్ని విషయాలపై శ్రద్ధ కనబరిచేలాగా ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికీ, ప్రాజెక్టుకూ ప్రాధాన్యం పెరిగేలాగా సిలబస్‌ను రూపొందించాలి. ఆ దిశగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తే మేలు.
ఐఐటీ ప్రవేశపరీక్షలో మార్పులు చేసిన ప్రతిసారీ శిక్షణ తీసుకునే విద్యార్థుల సంఖ్య 15-25 శాతం పెరిగిందంటూ కోటాలోని ఒక ప్రసిద్ధ శిక్షణకేంద్రం నిర్వాహకుని పరిశీలన. కమిటీ ప్రతిపాదనలపై విద్యార్థుల, తల్లిదండ్రుల, విద్యావేత్తల నుంచి అభిప్రాయాలు సేకరించి ఐఐటీ ప్రవేశపరీక్ష స్వరూపానికి తుది రూపం కల్పించాలనేది కేంద్రప్రభుత్వ ఆలోచన.
విద్యార్థులు ఏం చేయాలి?
ఐఐటీల్లో ప్రవేశం కోసం కొత్తగా రాబోయే యోగ్యతా పరీక్ష గురించి విద్యార్థులు ఆందోళనపడవలసిన అవసరం లేదు.
అమెరికాలో నిర్వహించే శాట్‌లో కేవలం ఇంగ్లిష్‌, గణిత శాస్త్రాలే ఉంటాయి. ఐఐటీల యోగ్యతాపరీక్ష ఇదేవిధంగా ఉంటుందా? లేదా భౌతిక రసాయన శాస్త్రాల నుంచి కూడా ప్రశ్నలుంటాయా అనే విషయంలో స్పష్టత లేదు. రీజనింగ్‌, ఎనలిటికల్‌ ఎబిలిటీలను పరీక్షిస్తారా అనేదీ ఇంకా తేలలేదు.
* ఈ పరీక్షలో కూడా భౌతిక రసాయన గణిత శాస్త్రాల్లో నుంచే ప్రశ్నలుంటే ఇది మరో జేఈఈ మెయిన్‌ పరీక్షలాగే ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు.
* విద్యార్థులు ప్రస్తుతం తమ సన్నద్ధతను యధావిధిగా కొనసాగిస్తూ పరీక్ష తుది రూపం కోసం వేచిచూడటం మంచిది.
* తదనుగుణంగా తమ సంసిద్ధతను అవసరమైతే మార్చుకోవచ్చు.
* ఎటూ పరీక్ష ఏడాదిలో రెండు మూడు సార్లు ఉంటుంది కాబట్టి మొదటిసారి బాగా రాయకున్నా రెండో ప్రయత్నంలో తమ స్కోరు మెరుగుపరచుకోవచ్చు.

Posted on 04-03-2016

Back..