Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మెలకువలతో మెరుగైన మార్కులు

* ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులకు నిపుణుల సూచనలు
న్యూస్‌టుడే, నవాబ్‌పేట, చేవెళ్ల గ్రామీణ :ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోగ పరీక్షల (ప్రాక్టికల్స్‌) సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 3 నుంచి ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దేశంలోని ఐఐటీ వంటి అత్యున్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించి ర్యాంకు పరిశీలనలో, అలాగే రాష్ట్రంలో ఎంసెట్‌ ర్యాంకు లెక్కింపులో ఇంటర్‌ మార్కులకు కూడా ప్రాధాన్యం ఇవ్వనుండడంతో వీటిపై విద్యార్థులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అయితే ఎక్కువ మార్కులు సాధించాలనే తపనతో విద్యార్థులు కొంత ఆందోళనకు కూడా లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్న సమయాన్ని వినియోగించుకుంటూ ప్రణాళికాబద్ధంగా ఎలా చదవాలి, ఏ అంశాలను ఏ విధంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చనే విషయమై ‘న్యూస్‌టుడే’ సంబంధిత సబ్జెక్టు నిపుణులను సంప్రదించగా వారు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

చిత్రాల సాధన తప్పనిసరి
వృక్ష శాస్త్రంలో మౌఖిక (వైవా) పరీక్ష ఉండదు. ప్రశ్నపత్రంలో మొత్తం నాలుగు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో వర్గీకరణ శాస్త్రంలోని మొక్కల కుటుంబాలు ఫాబేసి, సోలనేసి, లిలియోసి కుటుంబాలకు చెందిన మొక్కలుంటాయి. వీటి గుర్తింపునకు 6 మార్కులుంటాయి. రెండో విభాగంలో అంతర్నిర్మాణ శాస్త్రం ఉంటుంది. దీనికి 6 మార్కులు కేటాయించారు. స్లెడుల తయారీకి 3 మార్కులు, గుర్తింపునకు ఒక మార్కు కేటాయించారు. మూడో విభాగంలో ప్రత్యక్ష ప్రయోగాలుంటాయి. దీనికి 6 మార్కులు కేటాయించారు. ఇందులో ఉప విభాగాలుంటాయి. నాలుగో విభాగంలో స్పెసిమన్‌, స్లెడుల గుర్తింపునకు-5 మార్కులుంటాయి (ఇక్కడ చిత్రాలు వేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం స్లైడులు, స్పెసిమన్లు కలిపి ఐదు ఉంటాయి). వృక్షశాస్త్రం ప్రయోగాల్లో ప్రావీణ్యం సాధించాలంటే నిత్యం కళాశాలకు వచ్చి ప్రత్యేంగా సాధన చేయాలి. పరీక్షహాలులో తొందరపాటు లేకుండా ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా చదివి విభాగాల వారీగా చేయాలి. నిత్యం సాధనలో పలు సందేహాలు వస్తాయి. వీటి నివృత్తికి సబ్జెక్టు అధ్యాపకుల సలహాలు తీసుకోండి. ప్రణాళి ప్రకారం వెళ్తే ఎక్కువ మార్కులు మీ సొంతమే.
- వసంత, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నవాబుపేట
పరీక్ష నమూనాలతో సాధన
భౌతిక శాస్త్రంలో సూత్రాలు, పద్ధతికి అర మార్కు, పట్టిక రీడింగ్‌ గ్రాఫ్‌కు 8 మార్కులు, గణన ఫలితాలు, ప్రమాణాలకు 6 మార్కులు, మౌఖిక పరీక్ష(వైవా)కు 5 మార్కులు, రికార్డులకు 4 మార్కులుంటాయి. జాగ్రతలకు 2 మార్కులుంటాయి. మిగతా మార్కులు ఇతరాలకు కేటాయిస్తారు. ఇందులో ప్రతి అశం ప్రాధాన్యమైనదే. భౌతిక శాస్త్రంలో మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థులకు సాధనే ముఖ్యం. నిత్యం కళాశాలకు వచ్చి పరీక్షల్లో వచ్చే ముఖ్య ప్రయోగాలపై సాధన చేస్తే పరీక్షలో ఏ పద్ధతిలో చేయాల్సి వచ్చినా సునాయాసంగా మార్కులు సాధించవచ్చు. ప్రయోగాలకు సాధన చేయడంవల్ల థియరీ పరీక్షలకు బాగా ఉపయోగపడుతుంది. పదే పదే చేయడంవల్ల సంబంధిత అంశాలు విద్యార్థులకు బాగా గుర్తుండి పోతాయి. దీంతో విద్యార్థులు భౌతిక శాస్త్రంలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఏవైనా సందేహాలు వస్తే విద్యార్థులు అధ్యాపకుల సహాయం తీసుకోవాలి. మొదటి ఒక గంట ప్రయోగానికి సంబంధించిన విషయాలను అంటే ఫార్ములా, ప్రయోగ పద్ధతి, ప్రయోగానికి సంబంధించిన పట్టిక, జాగ్రత్తలు జవాబు పత్రంలో రాయాలి. తర్వాత ప్రయోగాన్ని చేయాలి. ప్రయోగంలో వచ్చిన విలువలను ప్రయోగపట్టికలో వేసి గణించి ఆ విలువలను ఫార్ములాలో వేసి గుణిస్తే ప్రయోగానికి సంబంధించిన ఫలితం వస్తుంది. వచ్చిన ఫలితానికి కచ్చితంగా ప్రయోగాలు రాయాలి.
- శివరాజు, భౌతిక శాస్త్ర అధ్యాపకులు, నవాబుపేట; వి.వెంకట్‌రావు, భౌతిక శాస్త్ర అధ్యాపకులు, చేవెళ్ల

రసాయన శాస్త్రం... కీలకం..
రసాయన శాస్త్రంలో మంచి మార్కుల కోసం రసాయనాలు, ఫార్ములాల గురించి ఆందోళన చెందకూడదు. రసాయన శాస్త్రం విషయంలో గుణాత్మక విశ్లేషణకు 10 మార్కులు, ఘన ప¾రిమాణాత్మక విశ్లేషణకు 8 మార్కులు, కర్బన సమ్మేళనాలలో ప్రమేయ సమూహం గుర్తుంచుకోవడం/కొల్లాయిడ్‌ ద్రావణాల తయారీ/క్రొమటోగ్రఫీ/కార్బోహైడ్రేట్స్‌/ప్రొటీన్స్‌లకు - 6 మార్కులు ఉంటాయి. గుణాత్మక విశ్లేషణలో ఆనయాన్‌, కాటయాన్‌ల నిర్ధారణకు భౌతిక చర్యలు, గుర్తింపు చర్యలు, నిర్ధారణ చర్యలు, కాటయన్‌ గ్రూపు విభజన పట్టిక, కాటయాన్‌ నిర్ధారణ ఫలితం క్రమ పద్ధతిలో రాస్తే మంచి మార్కులు సాధించేందుకు ఆవకాశం ఉంది. అలాగే ఘన పరిమాణాత్మక విశ్లేషణలో అంశమాపనాలతో అంతిమ స్థానానికి సరిగ్గా గుర్తించిన దోషం ఒకశాతం వరకు వచ్చినా మార్కుల విషయంలో ఏ విధమైన కోత ఉండదు. విలువలను పట్టికలో నమోదు చేస్తూ, యూనిట్లు సరిగ్గా రాసి గణన చేస్తే మంచి మార్కులు వేస్తారు. రసాయన శాస్త్ర ప్రయోగ విభాగంలో ప్రాజెక్టుకు 2 మార్కులు కేటాయించారు. అందువల్ల ప్రతి ఒక్కరు ప్రాజెక్టును క్షుణ్ణంగా క్రమంగా రాయాలి. రికార్డుకు రెండు మార్కులు, మౌఖిక పరీక్షకు రెండు మార్కులు ఉన్నందున ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఎమ్‌.కృష్ణప్రసాద్‌, అధ్యాపకులు, రసాయన శాస్త్రం, చేవెళ్ల

జంతుశాస్త్రంపై పూర్తి అవగాహన అవసరం
జంతుశాస్త్రానికి సంబంధించి 30 మార్కుల ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో ఇచ్చిన నమూనా ఛార్ట్‌ లేదా ప్రొజెక్షన్ల గుర్తింపునకు 6 మార్కులుంటాయి. రెండో విభాగంలో జంతుశాస్త్ర, శరీర ధర్మ శాస్త్ర ప్రయోగాలుంటాయి దీనికి 5 మార్కులు కేటాయిస్తారు. మూడో విభాగంలో స్పాటర్ల గుర్తింపునకు 14 మార్కులుంటాయి. ఈ స్పాటర్లలో అకసేరుకాలు, సకసేరుకాలకు చెందిన స్లెడులు, స్పెసిమన్లు, కీళ్ల ఎముకలుంటాయి. మొత్తం 7 స్పాటర్లు ఉంటాయి. ఒక్కో స్పాటరు గుర్తింపునకు 2 మార్కులు కేటాయిస్తారు. మొదటగా ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని ఒకటికి రెండుసార్లు చదివి పూర్తిగా అర్థం చేసుకోవాలి. జంతు శాస్త్రంలో ప్రయోగపటం పుస్తకంలో భాగాలతో పటాలను చక్కగా వేయాలి. జంతు వర్గాల పేర్లు, శరీరదర్శన ప్రయోగాలు, ఇతరాలను బాగా గుర్తుంచుకునే విధంగా సాధన చేయాలి. చిత్రాలు ఎక్కువసార్లు గీయాలి. కళాశాలకు నిత్యం వచ్చి ప్రయోగ నమూనాలను సాధన చేయడంతోపాటు, అధ్యాపకుల సూచనలు, సలహాలు పాటించాలి
- సురేశ్వర స్వామి, జంతుశాస్త్ర అధ్యాపకులు, నవాబుపేట


Back..

Posted on 19-01-.2016