Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఆర్మీ.. నేవీల్లోకి ఆహ్వానం

రక్షణ రంగాల్లో చేరాలనుకునే వారి కోసం ఆర్మీ, నేవీల నుంచి కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి. పదోతరగతి, డిగ్రీ, వెటర్నరీ కోర్సులు చేసిన అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, శరీరదార్ఢ్య పరీక్షల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.

ఉత్సాహం పొంగే నవ యువతకు భారత రక్షణరంగం ఏటా క్రమం తప్పకుండా అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తోంది. పలు నోటిఫికేషన్లను ప్రకటించి, రాత పరీక్షలు జరిపి ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది. దీంతో చిన్న వయసులోనే సర్కారీ కొలువులు లభించడంతో చక్కటి జీతభత్యాలు, సదుపాయాలతోపాటు పదోన్నతులతో ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారు. తరచూ ఖాళీల ప్రకటనలు వెలువడుతున్నప్పటికీ పోటీ ఎక్కువగానే ఉంటుంది. అందుకే వీటిని సాధించుకోవాలంటే సరైన ప్రణాళికతో కష్టపడి సంసిద్ధం కావాల్సిందే. ప్రస్తుతం ఆర్మీ, నేవీల నుంచి కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి.

ఇండియన్‌ ఆర్మీ
ఎన్‌సీసీ అభ్యర్థులకు..
ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ అవివాహితుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ పూర్తి చేసినవారు లేదా చివరి ఏడాది చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీసీ ఎ/బి/సి సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలి. 19-25 సంవత్సరాల మధ్య వయసున్నవారు మాత్రమే అర్హులు. విధి నిర్వహణలో మరణించిన, శాశ్వత వైకల్యం పొందిన లేదా తప్పిపోయిన ఇండియన్‌ ఆర్మీ సిబ్బంది పిల్లలకు ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ అవసరం లేదు. వాళ్లు కేవలం డిగ్రీతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. వాటిలో ఉత్తీర్ణులైనవారికి తదుపరి దశలో శరీర దార్ఢ్య, మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు.దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పంపాలి. చివరి తేదీ ఆగస్టు 8, 2019.
వెటర్నరీ కార్ప్‌
ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ రిమౌంట్‌ వెటర్నరీ కార్ప్‌ఉద్యోగాలను భర్తీ చేయనుంది. బీవీఎస్సీ/ఏహెచ్‌/ఎంవీఎస్సీ/ పీహెచ్‌డీతో పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. 21-32 మధ్య వయసు ఉన్నవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
ఎంపిక: షార్ట్‌లిస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. తర్వాత శరీరదార్ఢ్య, మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో ఉత్తీర్ణత సాధించినవారిని ఉద్యోగానికి తీసుకుంటారు.దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో పంపాలి. చివరి తేదీ సెప్టెంబరు 4, 2019.
రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ
యూనిట్‌ హెడ్‌క్వార్టర్స్‌ కోటా కింద జనరల్‌ డ్యూటీ సోల్జర్స్‌, ఔట్‌ స్టాండింగ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఉద్యోగాల భర్తీ కోసం సికింద్రాబాద్‌లో ఇండియన్‌ ఆర్మీ ర్యాలీ నిర్వహిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు దీనికి అర్హులు. ఔట్‌ స్టాండింగ్‌ స్పోర్ట్స్‌మన్‌గా బాస్కెట్‌బాల్‌, ఫుట్బాల్‌, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, కబడ్డీ, స్విమ్మింగ్‌... ఏదైనా ఒక ఆటలో ప్రావీణ్యం ఉండాలి. దరఖాస్తు తేదీ నుంచి కనీసం రెండేళ్లలోపు ఆయా క్రీడల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ, స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. వయసు 17-21 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే అర్హులు.
ఎంపిక: ర్యాలీలో ఉత్తీర్ణులైనవారికి ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. తర్వాత శరీర దార్ఢ్య, మెడికల్‌ పరీక్షలు ఉంటాయి. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 18, 2019. మరిన్ని వివరాలకు హెడ్‌ క్వార్టర్స్‌, ఏఓసీ సెంటర్‌, ఈస్ట్‌ మారేడుపల్లి, తిరుమలగిరి, సికింద్రాబాద్‌-500015 చిరునామాలో సంప్రదించవచ్చు.
వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

నౌకాదళంలోకి...
నాలుగొందల ఖాళీలు
భారత నౌకాదళంలో 400 పోస్టులు ఉన్నాయి. మెట్రిక్యులేషన్‌ లేదా సమాన అర్హత కలిగినవారు అర్హులు. శరీరదార్ఢ్యంతో పాటు సంబంధిత విభాగాల్లో నైపుణ్యం ఉండాలి. అవివాహిత యువకులు మాత్రమే అర్హులు. చెఫ్‌, స్టీవార్డు, హైజీనిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎంపిక: మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ తరహాలో మొత్తం 50 మార్కులకు రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగం సైన్స్‌, మ్యాథ్స్‌. రెండో భాగంలో జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. సమయం 30 నిమిషాలు. నెగెటివ్‌ మార్కు ఉంది. ఇందులో ఉత్తీర్ణులైనవారికి రెండు, మూడు దశల్లో శరీరదార్ఢ్య, మెడికల్‌ పరీక్షలు ఉంటాయి.దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాలి. చివరి తేదీ ఆగస్టు 1, 2019.
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in


Back..

Posted on 31-07-2019