Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రపంచ స్థాయిలో పాకయాజి అవుతారా?

కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో తిరుపతి, నోయిడాల్లో స్థాపించిన ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్ల ప్రవేశ ప్రకటన వెలువడనుంది. ఈ సంస్థలు అందించే బీబీఏ- కలినరీ ఆర్ట్‌ ప్రోగ్రాములో సీటు సాధించాలంటే జేఈఈలో మంచి ర్యాంకు తప్పనిసరి. దీనిలో మూడేళ్ల శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయి చెఫ్‌ నిపుణుడిగా- పాకయాజిగా మారితే.. ఉపాధికి ఢోకా ఉండదు!

దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. అనుబంధంగా ఆతిథ్య సేవలు కూడా విస్తృతమవుతున్నాయి. సుశిక్షితులైన అంతర్జాతీయ స్థాయి చెఫ్‌ల కొరత మనదేశంలో ఎక్కువగా ఉంది. అందుకే దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఆతిథ్యం అందించేందుకు భారీ పారితోషికాలు చెల్లించి చెఫ్‌లను నియమించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో హోటళ్లకు అవసరమైన పాకశాస్త్ర ప్రవీణులను తయారుచేసేందుకు తిరుపతిలో ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ (ఐసీఐ)ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఒక బ్యాచ్‌కు శిక్షణ పూర్తి కావస్తోంది. రానున్న రోజుల్లో దీన్ని విస్తరించి విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నారు. బీబీఎ- కలినరీ ఆర్ట్‌ ప్రోగ్రాములో శిక్షణ పొందిన విద్యార్థులకు స్టార్‌ హోటళ్లలో, ఫ్లైట్‌ కిచెన్‌ సర్వీసుల్లో, కిచెన్‌ మేనేజ్‌మెంట్‌లో, సంబంధిత బోధనరంగంలో ఉద్యోగావకాశాలుంటాయి.
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ ‘ఇందిరాగాంధీ
జాతీయ గిరిజన విశ్వవిద్యాలయా’నికి అనుసంధానమైనది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నోయిడాలో; ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ప్రాంతంలో ఈ ఇన్‌స్టిట్యూట్లను ఏర్పాటుచేసింది. తిరుపతికి సమీపంలోని కుర్రకాల్వ వద్ద 14.21 ఎకరాల విస్తీర్ణంలో రూ.99 కోట్లతో సంస్థ భవనాలను నిర్మించారు. విద్యార్థులు ఉండేందుకు వీలుగా హాస్టళ్ల నిర్మాణం చేపట్టారు. అత్యాధునికమైన ఎనిమిది వంటశాలలను నిర్మించారు. ఇందులో నాలుగు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకూ, మరో నాలుగు ప్రత్యేకంగా వంటలపై పరిశోధనలు చేసేందుకూ వినియోగిస్తారు.

జేఈఈలో ఐదు విభాగాలు
జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈలో ఉత్తీర్ణులైనవారికి వారి ర్యాంకు ఆధారంగా ఐసీఐలో సీˆట్లు కేటాయిస్తారు.
జేఈఈ 2 గంటల వ్యవధి పరీక్ష. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో పరీక్ష ఉంటుంది. నెగిటివ్‌ మార్కులుండవు. ఐదు విభాగాలుంటాయి.

వచ్చే ఏడాది ఎంబీఏ
ప్రస్తుతం మూడేళ్ల బీబీఎ కోర్సు ఉంది. వచ్చే ఏడాది నుంచి ఎంబీఏ కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత క్రమేణా ఇక్కడ పీˆహెచ్‌డీ కోర్సును తీసుకొచ్చి దేశంలోనే ఒక గొప్ప సంస్థగా ఐసీˆఐని తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నారు.
ఐసీఐలో ప్రజలకు బలమైన ఆహారాన్ని అందించేందుకు అవసరమైన వంటకాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయోగాలు చేయనున్నారు. దీంతోపాటు వంటకాలపై ప్రత్యేక డాక్యుమెంటేషన్‌ చేయనున్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులు తమ అభిరుచికి అనుగుణంగా వంటకాలు కోరుకుంటారు. సుశిక్షితులైన చెఫ్‌ నిపుణులను తయారు చేయడం వల్ల మరింత మంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
- మహంకాళి కిరణ్‌కుమార్‌, ఈనాడు, తిరుపతి

బీబీఏ ఇన్‌ కలినరీ ఆర్ట్‌
విద్యార్హత: ఇంటర్మీడియట్‌/ +2
పరీక్ష: జేఈఈ ద్వారా ఎంపిక
కోర్సు వ్యవధి: 3 ఏళ్లు
మొత్తం సీట్లు: 120 (వచ్చే విద్యా సంవత్సరం నుంచి)
నోటిఫికేషన్‌ విడుదలయ్యే సమయం: డిసెంబరు నెలాఖరు/ జనవరి
సెమిస్టర్‌ ఫీజు: రూ.75 వేలు
వసతి, భోజనం కోసం: నెలకు రూ.5 వేలు అదనం
వెబ్‌సైట్‌: www.ici.nic.in

Back..

Posted on 24-09-2018