Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రణాళికతో అడుగేయండి.. సైన్యంలో చేరండి..

* విజయనగరంలో ఆర్మీ నియామక ర్యాలీ
* 6 నుంచి 17వ తేదీ వరకు

దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఉందా.. సైన్యంలో చేరి మాతృభూమికి సేవ చేయాలని ఉందా.. సరిహద్దుల్లో శత్రుమూకలను తరిమికొట్టాలనే కసి ఉందా.. ఇలాంటి యువతకో మంచి అవకాశం. విజయనగరం జిల్లాలో అక్టోబర్ 6 నుంచి 17 వరకు ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా సరే సరైన ప్రణాళికతో ముందుకెళ్తేనే విజయం సాధిస్తారు. దీంతో పాటు అభ్యర్థులు సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే అడుగు ముందుకేయగలరు. అందుకే ఆర్మీ నియామక ప్రక్రియ, నియమ నిబంధనలు, ఆరోగ్య సూత్రాలపై అవగాహన అవసరం. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం అందిస్తున్న కథనం.. - న్యూస్‌టుడే, విజయనగరం రింగ్‌రోడ్డు

ఏర్పాట్లు పూర్తి
ర్యాలీని విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ క్రీడా మైదానంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులకు హాల్‌టిక్కెట్ల జారీ ప్రక్రియ కూడా ముగిసింది. గతంలో నిర్వహించిన నియామకాలకు, ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పూర్తి అవగాహనతో మైదానంలోకి అడుగుపెడితే మంచిది.

హాల్‌ టిక్కెట్‌ ఉంటేనే..
ఈసారి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారానే స్వీకరించారు. హాల్‌ టిక్కెట్లు(ప్రవేశ పత్రాలు) దాని ద్వారానే విడుదల చేశారు. అవి ఉంటేనే మైదానంలోకి అనుమతిస్తారు.

55 వేల మందికి అవకాశం
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోవడం వల్ల 55 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఎవరు పడితేవారు పెట్టేయకుండా ఆయా అర్హతలు గల వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఫలితంగా గతంలో నియామక ప్రక్రియ జరిగితే 70 వేల మందికిపైగానే రాగా ఈసారి 55వేల మందికి పరిమితమయ్యారని అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి రోజుకు సుమారు ఏడువేల మంది వరకు వచ్చే అవకాశముంది.

ఈ తేదీల్లో ఇలా
గతంలో ఒక్కో జిల్లాను ఒక్కో రోజు పిలిచేవారు. ఈసారి అలా కాక ట్రేడ్లు వారీగా పిలుస్తున్నారు. ఆయా తేదీల్లోనే అభ్యర్థులు రావాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే పెట్టుకోవాలన్న నిబంధన అమలు చేశారు. హాల్‌టిక్కెట్లపై ఉన్న తేదీల ప్రకారం అభ్యర్థులు ముందుగా మైదానానికి చేరుకునేలా చూసుకోవాలి.

ఆ రోజు మైదానంలో మాత్రం ఇలా ఉండాలి
* అభ్యర్థి ఉద్యోగం కోసం సాధారణ సమయంలో ఎలా సాధన చేసి వచ్చినా.. ఆ రోజు అసలైన పరుగు వద్ద ప్రణాళిక, అవగాహన లేకుండా లోపలికి వెళ్తే మాత్రం గందరగోళానికి గురికాక తప్పదు. ఫలితంగా అలసట బారిన పడాల్సి వస్తుంది. ఆ రోజు గ్రౌండ్‌లో నియామకం ఇలా జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థులు ఈ విధంగా సిద్ధపడితే కొంత వరకు ప్రయోజనం ఉండొచ్చు.
* దరఖాస్తు చేసుకున్న వారికి అడ్మిన్‌ కార్డు(హాల్‌టిక్కెట్‌) ఇస్తారు. అది ఉన్నవారిని మాత్రమే మైదానంలోకి అనుమతిస్తారు.
* ప్రవేశద్వారం వద్ద ఎత్తు, ఛాతి కొలిచే సాధన ఉంటుంది. అక్కడే అభ్యర్థుల ఎత్తు పరిశీలించి లోపలికి పంపిస్తారు.
* తర్వాత అడ్మిన్‌ కార్డులను బార్‌ కోడింగ్‌ చేస్తారు.
* అనంతరం అర్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. ఏమైనా నకిలీవి, అనర్హతవి ఉంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఈ ప్రక్రియతో పాటు పరుగు కోసం టోకెన్లు ఇస్తారు.
* మూడోది రన్నింగ్‌(పరుగు) ఉంటుంది. ఇక్కడి నుంచే అభ్యర్థికి అసలు పరీక్ష మొదలవుతుంది. ఇందులో నాలుగు రౌండ్లు ఉంటాయి. 400 మీటర్ల ట్రాక్‌లో నాలుగుసార్లు 1600 మీటర్ల పరుగు ఉంటుంది. ఈ నాలుగు రౌండ్లు పరుగులో 5.25 నిమిషాల నుంచి 5.35 నిమిషాల లోపు చేస్తే (ఎక్స్‌లెంట్‌) బాగా చేసినట్లుగా గుర్తిస్తారు. ఇందులో నెగ్గితే 60 మార్కులు ఇస్తారు. 5.35 నిమిషాల నుంచి 5.45 నిమిషాల లోపు పూర్తి చేయగలిగితే (ఏ గ్రేడ్‌)గా నిర్ణయిస్తారు. దీనికి 40 మార్కులు కేటాయిస్తారు. ఈ రెండు గ్రౌండ్‌ మార్కుల్లోకి వస్తాయి.
* తర్వాత పులప్స్‌ ఉంటాయి. సమాంతరంగా ఉన్న ఇనుపరాడ్డు మీద వేలాడుతూ పులప్స్‌ తీయాల్సి ఉంటుంది. అంటే నిటారుగా నిల్చొని కింద నుంచి మీదకు కేవలం చేతులతోనే ఈ ప్రక్రియ ఉంటుంది. ఇందులో ఆరు పులప్స్‌గాని తీస్తే 40 మార్కులు, పది తీస్తే 60 మార్కులు ఉంటాయి.
* అనంతరం వైద్య పరీక్షలు ఉంటాయి. చెవి, ముక్కు, దంతం, కళ్లు పరిశీలిస్తారు. పుట్టుమచ్చలు, గుండె కొట్టుకునే విధానంలో తేడా, టాటూస్‌ వంటివి ఉంటే మాత్రం అనర్హత వేటు వేస్తారు.

ఇలా చేరుకోవచ్చు..
విజయనగరం బస్సు, రైల్వేస్టేష్‌న్‌ నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఎంపికలు నిర్వహించే మైదానానికి రూ.8 నుంచి రూ.10 వరకు ఛార్జీ తీసుకుంటారు. సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది.

ముందుగా వస్తే..
అభ్యర్థులు కచ్చితంగా ఒకరోజు ముందుగా వస్తే అందుకు తగ్గట్టుగా సిద్ధమై రావాలి. నియామకాలు చేపట్టే ప్రాంతంలో ఎటువంటి వసతి ఉండదు. సమీప ప్రాంతాల్లో వసతి సౌకర్యాలు ప్రైవేటుగా ఉంటాయి. అయితే అభ్యర్థులు ఒరిజనల్‌ ధ్రువీకరణపత్రాలు పట్టుకొని వస్తారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.

ఖాళీ కడుపుతో మాత్రం వద్దు
అభ్యర్థుల్లో చాలామంది ఖాళీ కడుపుతో మైదానానికి హాజరవుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. కనీసం అరటిపండ్లుగాని, పంచదార వేసుకొని రెండు ఇడ్లీగాని తినడం మేలు. ప్రశాంతంగా ఆలోచించడం, మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం చేయాలి. మైదానంలోకి వెళ్లక ముందే అలసటకు గురైతే లోపల మరింత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

సమతుల ఆహారం తీసుకోవాలి
ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో ఆరోగ్యంగా ఉండేందుకు నాణ్యమైన ఆహారం తీసుకోవడం మంచిది. ఆర్మీ ఎంపికలకు వెళ్లే అభ్యర్థులకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. నియామకాలు జరిగే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. అరటి పండు, అంబలి, కొబ్బరి బొండం వంటివి తీసుకోవడం వలన పరుగు సమయంలో కోల్పోయిన శక్తి తిరిగి పొందే అవకాశం ఉంటుంది. సమతుల ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం.
- స్వర్ణలత, పౌష్టికాహార నిపుణులు, విజయనగరం

అన్ని ఏర్పాట్లు పూర్తి
రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి విజయనరం రాజీవ్‌ క్రీడా మైదానాన్ని ఎంపిక చేశాం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఉదయం ఐదు గంటలకే పరుగు ప్రక్రియ మొదలవుతుంది. అడ్మిన్‌కార్డులు, ఒరిజనల్‌ ధ్రువీకరణ పత్రాలు పట్టుకొని రావాల్సి ఉంటుంది.
- ఎం.సత్యనారాయణ, యువజన సర్వీసుల శాఖ, రిక్రూట్‌మెంట్‌ నిర్వహణ ప్రతినిధి

విభాగాల వారీగా ప్రక్రియ
* 6,7,8,9 తేదీల్లో జనరల్‌ డ్యూటీ
* 10, 11 తేదీల్లో టెక్నికల్‌, క్లర్కు
* 12, 13 నర్సింగ్‌
* 14, 15, 16, 17 తేదీల్లో ట్రేడ్‌మేన్‌

Back..

Posted on 05-10-2017