Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సైన్యంలో... స్థైర్యంగా!

* ఆర్నెల్లకోసారి నియామక ప్రకటనలు
* అర్హతలను బట్టి హోదాలు

‘ఆర్మీలో ఉద్యోగం’ అంటే దేశానికి సేవ చేస్తున్నామన్న సంతృప్తితో సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదిప్పుడు. ఆకర్షణీయ వేతనం, పదోన్నతులు, భత్యాలు, ప్రోత్సాహకాలు, వసతులు... ఎన్నో ఉన్నాయి. ఎనిమిదో తరగతి విద్యార్హతతోనే సైన్యంలో అడుగెట్టవచ్చు. పది నుంచి పీజీ వరకు పలు ఉద్యోగాలున్నాయి. ఇంటర్‌ విద్యార్హతతో లక్షణమైన లెఫ్టినెంట్‌ కొలువు సొంతం చేసుకోవచ్చు. పోస్టు ఏదైనప్పటికీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రకటన గ్యారంటీ. విద్యార్హతల వారీగా సైన్యంలో ఉన్న ఉద్యోగాల విశేషాలు తెలుసుకుందాం...
దేశంలో తప్పనిసరిగా ప్రకటనలు వెలువడే వాటిలో డిఫెన్స్‌ ఉద్యోగాలు ముందుంటాయి. దేశ రక్షణలో ఈ ఉద్యోగులు కీలకం. అందువల్ల దాదాపు ప్రతి పోస్టుకూ ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వస్తున్నాయి. చిన్న స్థాయి ఉద్యోగాలకు ఆయా ప్రాంతాలవారీ రిక్రూట్మెంట్‌ ర్యాలీలు నిర్వహిస్తారు. వీటికి రాష్ట్రం లేదా కొన్ని జిల్లాలను యూనిట్‌గా తీసుకుని స్థానికులతో భర్తీ చేస్తారు. అన్ని పోస్టులకూ తగిన ఎత్తు, బరువు, శారీర ప్రమాణాలు ఉండాలి.
సాధారణంగా 8, 10, ఇంటర్‌ విద్యార్హతలతో ఉన్న ఆఫీసర్‌ స్థాయి కాని పోస్టులకు ర్యాలీల ద్వారా ఎంపిక చేస్తారు. మిగిలిన పోస్టులకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష ద్వారా నియామకాలు ఉంటాయి. ఏ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరీక్షలో జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, లాజికల్‌ రీజనింగ్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఆ పోస్టుకి ఉన్న విద్యార్హత ప్రకారం ప్రశ్నల స్థాయుల్లో వ్యత్యాసం ఉంటుంది. ఆయా పరీక్షల వారీ సిలబస్‌, మోడల్‌ పేపర్లు జాయిన్‌ ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లోని డౌన్‌లోడ్‌ విభాగంలో లభిస్తాయి.
ఎక్కువ ఖాళీలు పర్మనెంట్‌ కమిషన్‌ విధానంలో భర్తీ చేస్తారు. కొంతమందిని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో తీసుకుంటారు.
* సాధారణ సెలక్షన్ల ద్వారా వెళ్లినవారు అంటే పదోతరగతి తదితర అర్హతలతో చేరినవారు సిపాయ్‌, నాయక్‌, హవల్దార్‌, నయీబ్‌ సుబేదార్‌, సుబేదార్‌, సుబేదార్‌ మేజర్‌ హోదా వరకు చేరుకోవచ్చు.
* ఆఫీసర్‌ స్థాయిలో చేరినవారు లెఫ్టినెంట్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభించి కెప్టెన్‌, మేజర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌, కల్నల్‌, బ్రిగేడియర్‌, మేజర్‌ జనరల్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌, జనరల్‌ స్థాయికి చేరుకుంటారు.

8వ తరగతితో...
పదోతరగతి ఉత్తీర్ణులు కాలేకపోయినా, పది వరకు చదవకపోయినా సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌ విభాగంలో కొన్ని ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. ఎనిమిదో తరగతి పూర్తిచేసుకున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. హౌస్‌ కీపర్‌, మెస్‌ కీపర్‌, గుర్రాల పర్యవేక్షణ పోస్టులు లభిస్తాయి.

10వ తరగతితో...
సోల్జర్‌ ట్రేడ్‌ మెన్‌: చెఫ్‌, వాషర్‌ మెన్‌, డ్రెస్సర్‌, స్టివార్డ్‌, టైలర్‌, ఆర్టిజన్‌ (వడ్రంగి/ ఇస్త్రీ/ తాపీపని) మొదలైన పోస్టులను సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌ విభాగంలో భర్తీ చేస్తారు. వీటికి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి.
సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ: పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే చాలు సోల్జర్‌ జనరల్‌ డ్యూటీకి అర్హత లభించినట్టే. వయసు 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి.

ఇంటర్‌తో...
సోల్జర్‌ టెక్నికల్‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు సోల్జర్‌ టెక్నికల్‌ పోస్టులకు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించాలి.
సోల్జర్‌ టెక్నికల్‌ (ఏవియేషన్‌): మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు సోల్జర్‌ టెక్నికల్‌ (ఏవియేషన్‌) పోస్టులకు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. కొన్ని బ్రాంచీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసినవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
సోల్జర్‌ క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌: ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్‌లో 60 శాతం మార్కులు పొందినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఇంటర్‌ లేదా పదో తరగతిలో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.
సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌: ఆర్మీ మెడికల్‌ కోర్‌ (ఏఎంసీ)లో ఈ పోస్టులుంటాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు అర్హులు. ప్రతి సబ్జెక్జులోనూ 40 శాతం మార్కులు తప్పనిసరి.
పై పోస్టులన్నిటికీ వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి.
సిపాయి (ఫార్మా): ఇంటర్‌ తర్వాత ఫార్మసీలో డిప్లొమా లేదా బీఫార్మసీ కోర్సు పూర్తిచేసినవాళ్లు ఈ పోస్టులకు అర్హులు. డి ఫార్మసీలో 55, బీ ఫార్మసీలో అయితే 50 శాతం మార్కులు సాధించాలి. వయసు 19 - 25 ఏళ్లలోపు ఉండాలి.
క్యాటరింగ్‌ జేసీవో: ఇంటర్‌ తర్వాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీలో డిప్లొమా కోర్సు పూర్తిచేసినవారు క్యాటరింగ్‌ విభాగంలో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 -27 ఏళ్లలోపు ఉండాలి.

డిగ్రీఅర్హతతో...
హవల్దార్‌ ఎడ్యుకేషన్‌: డిగ్రీ లేదా పీజీతోపాటు బీఎడ్‌ చదివినవారు హవల్దార్‌ ఎడ్యుకేషన్‌ గ్రూప్‌ - ఎక్స్‌ పోస్టులకు అర్హులు. సాధారణ డిగ్రీతో గ్రూప్‌-వై పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.
రెలిజియస్‌ టీచర్‌ (జేసీవో): డిగ్రీతోపాటు సంబంధిత మత ఆచారాలు, సంప్రదాయాలు తెలిసుండాలి. 27-34 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సర్వేయర్‌ ఆటోమేటెడ్‌ కార్టోగ్రాఫర్‌: డిగ్రీలో మ్యాథ్స్‌ చదివినవారు ఈ పోస్టులకు అర్హులు. వీరు ఇంటర్‌లో మ్యాథ్స్‌తోపాటు సైన్స్‌ కోర్సులు చదివుండాలి. వయసు 20-25 ఏళ్లలోపు ఉండాలి.

ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగాలు...
కేవలం ఇంటర్మీడియెట్‌ విద్యార్హతతోనే ఆర్మీలో ఆఫీసర్‌ ఉద్యోగానికి అవకాశాలున్నాయి. కొన్ని పరీక్షలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహిస్తుండగా కొన్నింటిని మాత్రం ఆర్మీ నేరుగా భర్తీ చేస్తోంది.

ఇంటర్‌తో ఎన్‌డీఏ
కేవలం ఇంటర్‌ అర్హతతో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్డీఏ) ద్వారా ప్రారంభ స్థాయి ఆఫీసర్‌ ఉద్యోగమైన లెఫ్టినెంట్‌ హోదాను సొంతం చేసుకోవచ్చు. ఎంపికైనవారికి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ, పుణెలో చదువు, శిక్షణ అందిస్తారు. ఆర్మీ పోస్టులకు ఎంపికైనవారు బీఏ లేదా బీఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు. అనంతరం మిలటరీ అకాడెమీ, డెహ్రాడూన్‌లో శిక్షణ ఉంటుంది. ఏటా రెండు సార్లు జనవరి, ఆగస్టుల్లో ప్రకటన వెలువడుతుంది. ఒక్కో విడతలో ఆర్మీలో 200కు పైగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తోంది. మ్యాథ్స్‌, జనరల్‌ ఎబిలిటీ అంశాల్లో 900 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టులు నిర్వహించి ఎన్‌డీఏలో శిక్షణకు ఎంపిక చేస్తారు. 16 1/2 - 19 1/2 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీతో సీడీఎస్‌ఈ
డిగ్రీ పూర్తిచేసివారు కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) రాసుకోవచ్చు. ఈ పరీక్షనూ యూపీఎస్సీ ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తోంది. జూన్‌, అక్టోబరుల్లో ప్రకటన వెలువడుతుంటుంది. 19 నుంచి 24 ఏళ్లలోపువారు ఐఎంఏ, ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ఇందులో ఆర్మీ విభాగానికి సంబంధించి ఐఎంఏలో వంద ఖాళీలు ప్రతి విడతలోనూ ఉంటాయి. ఇందులోనే ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ(ఓటీఏ) పోస్టులు సైతం ఉంటాయి. వీటిని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో భర్తీ చేస్తారు. ఈ విభాగంలో పురుషులకు 225, మహిళలకు 15 ఖాళీలు కేటాయిస్తున్నారు. ఇండియన్‌ మిలటరీ అకాడెమీ (ఐఎంఏ)కు ఎంపికైనవారికి డెహ్రాడూలో 18 నెలల శిక్షణ ఉంటుంది. ఓటీఏకు ఎంపికైనవారికి చెన్నైలో ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టయిపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌
ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు ఉచితంగా బీటెక్‌ విద్యతోపాటు లెఫ్టినెంట్‌ ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తోంది 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం. ఈ పరీక్షకు ఏటా జూన్‌, నవంబరుల్లో ప్రకటన వెలువడుతుంది. ఇంటర్‌ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో కనీసం 70 శాతం మార్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 16 1/2 - 19 1/2 ఏళ్లలోపు ఉండాలి. ఒక్కో విడతలో 90 మంది చొప్పున తీసుకుంటారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన దరఖాస్తులను ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. అనంతరం మెడికల్‌ టెస్టులు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి అయిదేళ్ల శిక్షణ ఇస్తారు. ఏడాదిపాటు ఐఎంఏ- గయలో ప్రాథమిక శిక్షణ అనంతరం నాలుగేళ్లు బీటెక్‌ విద్య అభ్యసిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ బీటెక్‌ డిగ్రీ ప్రదానం చేస్తుంది. లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇవి పర్మనెంట్‌ కమిషన్‌ పోస్టులు.

టీజీసీ(ఇంజినీర్స్‌)
నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్‌ పూర్తిచేసుకున్నవారికి టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ) ఇంజినీర్స్‌ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ఏటా జూన్‌, డిసెంబరుల్లో ప్రకటన వెలువడుతుంది. 20- 27 ఏళ్ల లోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిసారీ 40 మందిని తీసుకుంటారు. షార్ట్‌లిస్టు చేసిన దరఖాస్తులకు సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఎంపికైనవారికి ఐఎంఏ డెహ్రాడూన్‌లో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. అనంతరం లెప్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ పోస్టులు పర్మనెంట్‌ కమిషన్‌ కిందికి వస్తాయి.

టీజీసీ ఎడ్యుకేషన్‌ (ఏఈసీ)
ఈ పోస్టులకు ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీఏ, ఎంబీఏలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 23-27 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఎంపికైనవారికి ఐఎంఏ, డెహ్రాడూలో ఏడాది శిక్షణ ఉంటుంది. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
వెబ్‌సైట్లు: http://joinindianarmy.nic.in, www.www.upsc.gov.in

Back..

Posted on 17-12-2018