Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో యాంత్రిక్ పోస్టులు

* డిప్లొమా పూర్తిచేసిన‌వారికి అవ‌కాశం

ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసినవాళ్లు వీటికి పోటీ పడవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. రాత, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి ఆగస్టు నుంచి శిక్షణ మొదలవుతుంది. శిక్షణ అనంత‌రం ఉద్యోగంలోకి తీసుకుంటారు. కెరీర్ ప్రారంభంలోనే నెలకు రూ.50,000 వరకు వేతనం పొందవచ్చు. త‌ర్వాత ద‌శ‌ల‌వారీ ప‌దోన్నతుల‌కూ అవ‌కాశం ఉంది.

అర్హత‌:
ఎల‌క్ట్రిక‌ల్ / మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్ ఈ విభాగాల్లో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు 60 శాతం మార్కుల‌తో పూర్తిచేసిన‌వాళ్లు అర్హులు. ఎస్సీ, ఎస్టీలైతే 55 శాతం మార్కులు స‌రిపోతాయి.
వయసు- కనిష్ఠం 18 ఏళ్లు, గరిష్ఠం 22. అంటే ఆగస్టు 1, 1996 - జులై 31, 2000 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయఃపరిమితి సడలింపు ఉంది.

రాత పరీక్ష ఇలా..
ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు డిప్లొమాలో చ‌దివిన బ్రాంచ్ (ఎల‌క్ట్రిక‌ల్ / మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్) నుంచి ప్రశ్నలు వ‌స్తాయి. వీటితోపాటు ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, రీజ‌నింగ్ ఆప్టిట్యూడ్ అంశాల్లో ప‌రిజ్ఞానాన్ని ప‌రీక్షిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించినవారికి శరీరదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.

శరీరదార్ఢ్య పరీక్ష (పీఈటీ)
అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ­ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. ఉండాలి. ఈ విభాగంలో అర్హత సాధించడానికి 7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్‌లు తీయగలగాలి. పీఈటీలో అర్హత పొందితే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్పష్టమైన కంటిచూపు ఉండాలి, వినికిడిలోపం ఉండకూడదు.

అభ్యర్థుల వివరాలను రాతపరీక్ష సమయంలో పరిశీలిస్తారు. పరీక్షకు వెళ్లేటప్పుడే పదోతరగతి, డిప్లొమా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫొటోలు, ఏదైనా ఐడీ, సర్టిఫికెట్ల నకళ్లు తీసుకెళ్లాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలి. వీటిని పరిశీలించిన తర్వాతే పరీక్షకు అనుమతిస్తారు.

తుది ఎంపిక
రాతపరీక్ష, పీఈటీ, మెడికల్‌ టెస్టుల్లో ఉత్తీర్ణులైన వారితో తుది నియామకాలు చేపడతారు. ఎంపికైనవారి వివరాలను జులైలో కోస్ట్‌గార్డు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ప్రాథమిక శిక్షణ ఆగస్టు, 2018 నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో ప్రారంభమవుతుంది. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. విధుల్లో చేరినవారికి రూ.29,200 మూలవేతనం చెల్లిస్తారు. దీంతోపాటు రూ.6200 యాంత్రిక్ పే చెల్లిస్తారు. వీటికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు అదనం. పలు ఇతర ప్రయోజనాలు (క్యాంటీన్‌, వసతి, దుస్తులు, ఎల్‌టీసీ...మొదలైనవి) ఉంటాయి. ఉద్యోగంలో చేరిన మొద‌టి నెల నుంచే సుమారు రూ.50,000 వేత‌నంగా పొంద‌వ‌చ్చు. త‌ర్వాత ప‌దోన్నతుల ద్వారా అసిస్టెంట్ ఛీఫ్ ఇంజినీర్ హోదా వ‌ర‌కు చేరుకోవ‌చ్చు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జ‌న‌వ‌రి 12 నుంచి
ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 19 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు స్వీక‌రిస్తారు.
ప‌రీక్ష కేంద్రాలు: ముంబై, చెన్నై, కోల్‌క‌తా, నోయిడాల్లో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌: www.joinindiancoastguard.gov.in

Back..

Posted on 12-01-2018