Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ప్యాకేజింగ్‌కీ ప్రామాణిక కోర్సులు

ఎవరికైనా బహుమతి ఇచ్చేటప్పుడు దాన్ని చక్కగా అలంకరించి ఇస్తాం. ఎందుకంటే చూడగానే ఆకట్టుకొని ఎదుటివారిని ఆనందింపచేయాలని! పరిశ్రమలూ అంతే. తమ వస్తువుల నాణ్యత పాడైపోకుండా ఆకర్షణీయంగా ప్యాకింగ్‌ చేసి పంపుతాయి. వినియోగదారుల విశ్వసనీయతను పొందాలని. ఇప్పుడు ప్రతి సంస్థలోనూ ప్రత్యేకంగా ప్యాకింగ్‌ శిక్షణ తీసుకున్నవారు ఉంటున్నారు. దీంతో ప్యాకేజింగ్‌ ఒక కెరియర్‌గా రూపుదిద్దుకుంది.

భారత దేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు తయారీ రంగ సంస్థలున్నాయి. వాటిలోని ఉత్పత్తులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి సుశిక్షితులైన మానవవనరులను అందించే లక్ష్యంతో కేంద్రం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ (ఐఐపీ) కళాశాలలను ఏర్పాటు చేసింది. ఇవి ప్యాకేజింగ్‌లో షార్ట్‌టర్మ్‌ సర్టిఫికెట్‌, డిప్లొమా, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌ (పీజీడీపీ)లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఐఐపీ భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. దేశంలోని అన్ని పరిశ్రమల్లో ప్యాకేజింగ్‌ ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇది పనిచేస్తుంది. ఎగుమతులను ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌ నగరాల్లో ఐఐపీ కళాశాలలున్నాయి. భారత్‌లో ఔషధ పరిశ్రమలు, ఎఫ్‌ఎంజీసీ, ఆహార తయారీ పరిశ్రమ, తయారీ పరిశ్రమ, ఆరోగ్య రంగాలు ఎంతో అభివృద్ధిని సాధించాయి. అందులో భాగంగానే ప్యాకేజింగ్‌ రంగానికి డిమాండు ఏర్పడింది. ఉద్యోగుల అవసరమూ పెరిగింది. ఈ రంగంలో భారత్‌ ప్రపంచదేశాల్లో అయిదో స్థానంలో ఉంది. దీని విలువ దాదాపు 32 బిలియన్‌ డాలర్లు. గత ఐదేళ్లలో 15 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా‌ ప్యాకేజింగ్‌ కోర్సును ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌ (పీజీడీపీ):
అగ్రికల్చర్‌/ ఫుడ్‌సైన్స్‌/ పాలిమర్‌ సైన్స్‌ లేదా ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిగ్రీ లేదా డిగ్రీలో ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ మ్యాథమేటిక్స్‌, మైక్రోబయాలజీ లేదా బయోకెమిస్ట్రీలో ఏదైనా ప్రధాన/రెండో సబ్జెక్టుగా చదివి ఉత్తీర్ణులైన వారు లేదా చివరి సంవత్సరం పరీక్షలు రాసినవారు అర్హులు.
* 31/05/2019 నాటికి అభ్యర్థుల వయఃపరిమితి 30 సంవత్సరాలు మించకూడదు.

కోర్సు - సీట్ల వివరాలు
దేశంలో ముంబయి, దిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌ ఐఐపీ ప్రాంగణాల్లో ఈ కోర్సును అందిస్తున్నారు. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు. నాలుగు సెమిస్టర్లు ఉన్న ఇందులో మొదటి మూడు కళాశాలలో నిర్వహిస్తారు. చివరి సెమిస్టర్‌లో విద్యార్థులు దేశంలో ఉన్న ప్రముఖ పరిశ్రమల్లో ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ముంబయిలో 280, దిల్లీలో 100, కోల్‌కతాలో 80, హైదరాబాద్‌లో 40 సీట్లు ఉన్నాయి.

ఎంపిక విధానం
దేశవ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులు ఐఐపీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేస్తుంటారు. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. బ్యాచిలర్స్‌ డిగ్రీలో చదివిన సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఉంటాయి. ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌ ప్రాంగణాల్లో ప్రవేశపరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థికి సీటు కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది: జూన్‌ 07
పరీక్ష తేది: జూన్‌ 13
మరింత సమాచారం కోసం: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ (ఐఐపీ), ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, సనత్‌నగర్‌, హైదరాబాద్‌ - 500018, తెలంగాణ. ఫోన్‌: 040-2381 4321
ఈ-మెయిల్‌:iiphyd@iip-in.com
వెబ్‌సైట్‌:http://iip-in.com/

ఉద్యోగ అవకాశాలు
దేశవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం మొత్తం 7000 వ్యవస్థీకృత పరిశ్రమలు, 4,50,000 చిన్న తరహా పరిశ్రమలున్నాయి. అందులో ఉత్పత్తయ్యే వస్తువులకు ప్యాకింగ్‌ చేయడానికి సాంకేతిక సిబ్బంది అవసరం. విదేశాల్లో సైతం వీరికి మంచి డిమాండు ఉంది. పరిశ్రమల్లో వీరికి క్వాలిటీ టెస్టింగ్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ప్యాకేజింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, ప్యాకేజింగ్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.


Back..

Posted on 14-05-2019