Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నేవీలో ఛెఫ్‌, స్టివార్డ్స్‌, హైజీనిస్టులు

ఇండియన్ నేవీ ఛెఫ్‌, స్టివార్డ్స్‌, హైజీనిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఈ ఉద్యోగాల‌కు ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త ఉంటే చాలు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ప‌రీక్ష‌లో ఎంపికై, విజ‌య‌వంతంగా శిక్ష‌ణ ముగించుకుని విధుల్లో చేరిన‌వారు మొదటి నెల నుంచే రూ.35,000 వేతనం రూపంలో పొందవచ్చు. వీటితోపాటు ప‌లు ప్రోత్సాహ‌కాలు అందుకోవ‌చ్చు. ప్రకటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

పరీక్ష ఇలా..
ప్ర‌శ్న‌ల‌న్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మాల్లో ఉంటుంది. ప్ర‌శ్న‌ప‌త్రంలో రెండు విభాగాలు ఉంటాయి. సైన్సు, మ్యాథ‌మెటిక్స్ ఒక విభాగంలో; జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ మ‌రో విభాగంలో అడుగుతారు. అభ్య‌ర్థులు రెండు సెక్ష‌న్ల‌లోనూ అర్హ‌త సాధించ‌డం త‌ప్ప‌నిస‌రి. ప‌రీక్ష వ్య‌వ‌ధి 30 నిమిషాలు. సిల‌బ‌స్, మాదిరి ప్ర‌శ్న‌ప‌త్రం ఇండియ‌న్ నేవీ వెబ్ సైట్ లో ల‌భిస్తాయి. ప‌రీక్ష జ‌రిగిన రోజే ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. ఇందులో అర్హ‌త సాధించిన‌వారికి ఫిజిక‌ల్‌, మెడిక‌ల్ ప‌రీక్ష‌లు ఒక‌టి లేదా రెండు రోజుల్లో పూర్తిచేస్తారు.

దేహదార్ఢ్య పరీక్షలు
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తిచేయాలి. స్క్వేట్ అప్స్ - 20, పుష్అప్స్ -10 తీయగలగాలి.
అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. రావాలి.
దేహదార్ఢ్య పరీక్షలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన మెరిట్ ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల‌తో వెళ్లాలి. ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తులో పేర్కొన్న వివ‌రాల‌తో స‌ర్టిఫికెట్లు స‌రిపోవాలి. చిన్న ఫొటోలు, ఏదైనా గుర్తింపు కార్డు, స‌ర్టిఫికెట్ల ఫొటో కాపీలు.. మొద‌లైన‌వి తీసుకెళ్ల‌డం మంచిది.

ఎంపికైతే: అన్ని దశలూ విజయవంతంగా పూర్తిచేసుకుని ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ ఎస్ చిల్క‌లో మ‌రోసారి మెడిక‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఇందులోనూ అర్హ‌త సాధించిన‌వారికి ఏప్రిల్‌, 2019 నుంచి ఐఎన్ఎస్ చిల్కలో 15 వారాల‌పాటు ప్రాథ‌మిక‌ శిక్షణ నిర్వ‌హిస్తారు. అనంత‌రం నేవీ శిక్ష‌ణ కేంద్రాల్లో వృత్తి సంబంధిత శిక్ష‌ణ అందిస్తారు. శిక్ష‌ణ స‌మ‌యంలో రూ.14600 స్టైపెండ్ గా చెల్లిస్తారు. విజ‌య‌వంతంగా శిక్ష‌ణ పూర్తిచేసుకున్న‌వారిని విధుల్లోకి తీసుకుంటారు. ఛెఫ్‌గా ఎంపికైన‌వారు విధుల్లో భాగంగా ఆహారాన్ని వండాలి. ఆహార ప‌దార్థాల స్టోర్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను చూసుకోవాలి. స్టివార్డ్ గా విధులు నిర్వ‌హించేవారు వ‌డ్డ‌న బాధ్య‌త‌లు తీసుకుంటారు. భోజ‌న త‌యారీలోనూ వీరు పాలుపంచుకుంటారు. అలాగే వీరు వెయిట‌ర్ గా నూ వ్య‌వ‌హ‌రించాలి. హైజీనిస్ట్‌గా ఎంపికైన‌వారు గ‌దులు, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాలి. విధుల్లో చేరిన మొద‌టి నెల నుంచి రూ. 21,700 మూలవేతనం చెల్లిస్తారు. ప్ర‌తి నెలా రూ.5200 మిల‌ట‌రీ స‌ర్వీస్ పే (ఎంఎస్‌పీ) అందుతుంది. డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర ఆలవెన్సులు ఉంటాయి. వీటన్నింటితో నెలకు రూ. 35,000కు పైగా వేతనం రూపంలో లభిస్తుంది. క్యాంటీన్, ఎల్టీసీ, వైద్య సేవలు..మొదలైన సౌకర్యాలు కల్పిస్తారు. భవిష్యత్తులో వీరు మాస్ట‌ర్ చీఫ్ పెటీ ఆఫీస‌ర్ - 1 హోదా వరకు చేరుకోవచ్చు.ఉద్యోగంలో చేరిన‌వారు 15 ఏళ్ల‌పాటు విధుల్లో కొన‌సాగుతారు. ఈ వ్య‌వ‌ధిలో వివిధ ప్రొఫెష‌న‌ల్ కోర్సుల‌ను పూర్తిచేస్తారు. స‌ర్వీస్ నుంచి వైదొలిగే స‌మ‌యానికి డిగ్రీతో స‌మాన హోదా ఉన్న స‌ర్టిఫికెట్ అందుకుంటారు. ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం జీవితాంతం పింఛ‌ను ల‌భిస్తుంది.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణ‌త‌
వయసు: ఏప్రిల్‌ 1, 1998 - మార్చి 31, 2002 మధ్య జన్మించాలి.
ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జులై 1
ప్ర‌వేశ ప‌త్రాలు: ఆగ‌స్టులో డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు
పరీక్ష: సెప్టెంబ‌రు లేదా అక్టోబ‌రులో నిర్వ‌హిస్తారు
ఫ‌లితాలు: ఫిబ్ర‌వ‌రి 21, 2019న ప్ర‌క‌టిస్తారు.
వెబ్ సైట్‌: www.joinindiannavy.gov.in

నోటిఫికేష‌న్‌ సిల‌బ‌స్ మాదిరి ప్ర‌శ్న‌లు

Back..

Posted on 20-06-2017

Notification
Syllabus
Model Paper