Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నేవీలో యూనివర్సిటీ ఎంట్రీ స్కీం ఉద్యోగాలు

- బీటెక్ ఆఖ‌రు సంవ‌త్స‌రం విద్యార్థులు అర్హులు
- సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం

బీటెక్ చివరి సంవత్సరం, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చివరి ఏడాది కోర్సులు చదువుతున్న విద్యార్థులకు భారతీయ నౌకాదళం ఆహ్వానం పలుకుతోంది. వివిధ ఇంజినీరింగ్ బ్రాంచీలవారికి ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచీల్లో శాశ్వ‌త‌, తాత్కాలిక క‌మిష‌న్ విధానంలో ఉద్యోగాలు కల్పిస్తుంది. బీటెక్ లో అయిదో సెమిస్ట‌ర్ వ‌ర‌కు కనీసం 60 శాతం మార్కులు సాధించినవాళ్లు ఈ పోస్టులకు పోటీపడవచ్చు. బీటెక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ఎస్ఎస్ బీ ముఖాముఖి చేపడుతుంది. ఎంపికైన‌వారిని శిక్షణలోకి తీసుకుంటారు. ఈ స‌మ‌యంలో స్టైపెండ్ అందిస్తారు. విజ‌య‌వంతంగా శిక్ష‌ణ పూర్తిచేసుకున్న‌వారిని స‌బ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇండియన్ నేవీ అందిస్తోన్న యూనివర్సిటీ ఎంట్రీ స్కీం (యూఈఎస్) గురించి వివరంగా తెలుసుకుందాం...

అర్హ‌త‌లు: అభ్యర్థులు ఇంజినీరింగ్ (బీఈ/ బీటెక్) నాలుగో సంవత్సరం లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయిదో సంవత్సరం కోర్సు చదువున్నవారై ఉండాలి. బీటెక్ విద్యార్థులైతే అయిదో సెమిస్ట‌రు వ‌ర‌కు, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వాళ్లైతే ఏడో సెమిస్ట‌ర్ వ‌ర‌కు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే అభ్య‌ర్థులు స‌ర్వీసులో చేరే స‌మ‌యానికి బీటెక్ / ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో మొత్తం మీద 60 శాతం మార్కులు సాధించ‌డం త‌ప్ప‌నిస‌రి.
వయసు: జులై 2, 1995 - జులై 1, 1998 మధ్య జన్మించినవాళ్లే అర్హులు.
ఎత్తు: 157 సెం.మీ. ఉండాలి. మ‌హిళ‌లు 152 సెం.మీ. త‌ప్ప‌నిస‌రి.
ఖాళీల వివ‌రాలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచీల్లో అవకాశాలు ఉంటాయి.

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్..
ఇందులో జనరల్ సర్వీస్ (ఎక్స్), ఐటీ అనే రెండు విభాగాలు ఉన్నాయి.

జనరల్ సర్వీస్ (ఎక్స్) : బీఈ/ బీటెక్ ఏ బ్రాంచీ విద్యార్థులైనా జనరల్ సర్వీస్ (ఎక్స్) ఉద్యోగానికి అర్హులు. అయితే పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప‌ర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ రెండు విభాగాల్లోనూ అవకాశాలు ఉంటాయి.

ఐటీ: కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ చదివినవాళ్లు ఐటీ విభాగం పోస్టులకు అర్హులు. మహిళలకు అవకాశం లేదు. షార్ట్ సర్వీస్ కమిషన్ లో ఈ పోస్టులు భర్తీ చేస్తారు.

టెక్నికల్ బ్రాంచ్..
ఇందులో ఇంజినీరింగ్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, నేవల్ ఆర్కిటెక్చర్ అనే మూడు విభాగాలు ఉన్నాయి. పోస్టులను షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భర్తీ చేస్తారు.

ఇంజినీరింగ్ బ్రాంచ్: మెకానికల్, మెరైన్, ఇన్ స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్ మెంట్, కంట్రోల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, మెటలర్జీ, మెకట్రోనిక్స్, ఇన్ స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ వీటిలో ఏదైనా విభాగం విద్యార్థులు ఇంజినీరింగ్ బ్రాంచ్ పోస్టులకు అర్హులు. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎలక్ట్రికల్ బ్రాంచ్: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజినీరింగ్, కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్, ఇన్ స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ విభాగాల్లో ఎందులోనైనా ఇంజినీరింగ్ చదివినవాళ్లు అర్హులు. పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

నేవల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఏ): మెకానికల్, సివిల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, మెటలర్జీ, నేవల్ ఆర్కిటెక్చర్, ఓషియన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, షిప్ టెక్నాలజీ, షిప్ బిల్డింగ్, షిప్ డిజైన్ ఈ విభాగాల్లో ఎందులోనైనా ఇంజినీరింగ్ చదివినవాళ్లు నేవల్ ఆర్కిటెక్చర్ పోస్టులకు అర్హులు. మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం..
ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను బీటెక్ అయిదో సెమిస్టర్ / ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఏడో సెమిస్టర్ వరకు సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్‌ చేస్తారు. ఇలా కుదించిన అభ్యర్థులకు నేవల్ క్యాంపస్ సెలక్షన్ టీం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైనవారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్ బీ) ఇంటర్వ్యూలు చేపడుతుంది. విశాఖ‌ప‌ట్నం, కోల్ క‌తా, బెంగళూరు, భోపాల్, కోయంబత్తూర్ ల్లో డిసెంబరు - ఏప్రిల్ మధ్యలో ఎస్ఎస్ బీ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ కేంద్రాల్లో అభ్యర్థులకు అయిదు రోజులపాటు ఇవి కొనసాగుతాయి. వీటిని రెండు దశల్లో చేపడతారు. తొలిరోజు స్టేజ్-1 పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్టు, పిక్చర్ పెర్సెప్షన్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్-2 ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. దీనిలో భాగంగా సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే వైద్య పరీక్షలు ఉంటాయి. వీటిని కూడా అయిదు రోజుల వ‌ర‌కు నిర్వహించి అర్హుల‌ను ఉద్యోగానికి ఎంపికచేస్తారు.

ఎంపికైతే...
యూఈఎస్ విధానంలో ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడెమీ - ఎజిమాలలో వచ్చే ఏడాది జూన్ నుంచి శిక్షణ మొదలవుతుంది. అభ్యర్థులు శిక్షణలో చేరేటప్పటికి బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అభ్యర్థులకు 22 వారాలపాటు శిక్షణ కొనసాగుతుంది. అనంత‌రం సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్ శిక్ష‌ణ నిర్వ‌హిస్తారు. జనరల్ సర్వీస్ కి ఎంపికైనవారికి శిక్షణ వ్యవధి 44 వారాలు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. పర్మనెంట్ కమిషన్ విదానంలో ఎంపికైనవాళ్లు పదవీ విరమణ వయసు వచ్చేంత వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అదే షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎంపికైతే ప‌దేళ్లు స‌ర్వీసులో కొన‌సాగుతారు. ఆ త‌ర్వాత అవ‌కాశాన్ని బ‌ట్టి ఒక్కో విడ‌త‌లో రెండేళ్లు చొప్పున‌ మ‌రో నాలుగేళ్ల పాటు కొన‌సాగిస్తారు. అనంత‌రం ఖాళీలు ఉండి, అభ్య‌ర్థులు అన్ని విధాలా అర్హులుగా ఉంటే ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ విధానంలోకి తీసుకుంటారు. విధుల్లో చేరిన‌వారికి రూ.56,100 మూల వేత‌నం ల‌భిస్తుంది. దీనికి తోడు రూ.15,500 మిల‌ట్రీ స‌ర్వీస్ పే (ఎంఎస్ పీ) గా చెల్లిస్తారు. డీఏ, హెచ్ ఆర్ ఎ ఉంటాయి. అన్నీ క‌లుపుకుని సీటీసీ విధానంలో నెల‌కు రూ.85 వేల‌కు పైగా వేత‌న రూపంలో పొంద‌వ‌చ్చు. త‌క్కువ ధ‌ర‌ల‌కు క్యాంటీన్‌, రైలు, విమాన ప్ర‌యాణాల్లో రాయితీలు, పిల్ల‌ల చ‌దువుల‌కు ఆర్థిక ప్రోత్సాహం... ప‌లు ఇతర ప్ర‌యోజ‌నాలు ద‌క్కుతాయి.

దరఖాస్తులు: ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హతలు ఉన్నవారు ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఆయా పోస్టుల‌కు విడివిడిగా ద‌ర‌ఖాస్తు చేయ‌రాదు.
ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తుల ప్రారంభం: జూన్ 30
ఆన్ లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 30
వెబ్ సైట్‌: :www.joinindiannavy.gov.in

Back..

Posted on 21-06-2017

Notification