Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇంట‌ర్‌తో వాయుసేన‌లో ఎక్స్‌, వై ట్రేడుల్లోకి...

ఇంట‌ర్, డిప్లొమా విద్యార్థుల‌కు ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ఆహ్వానిస్తోంది. ఎంపీసీ లేదా మూడేళ్ల డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్న‌వారు గ్రూప్ ఎక్స్‌, ఏదైనా గ్రూప్ తో ఇంట‌ర్ చ‌దివిన‌వాళ్లు గ్రూప్ వై ట్రేడుల్లో పోస్టుల‌కు పోటీప‌డ‌వ‌చ్చు. ఎంపికైన‌వారు ఎయిర్ ఫోర్స్ లో ఫిట్ట‌ర్, టెక్నీషియ‌న్ హోదాల‌తో కెరీర్ ప్రారంభించి మంచి భ‌విష్య‌త్తును సొంతం చేసుకోవ‌చ్చు. ఆన్ లైన్ ప‌రీక్ష‌, శారీర‌క సామ‌ర్థ్య ప‌రీక్ష‌లు, వైద్య ప‌రీక్ష‌ల ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

విద్యార్హత:
గ్రూ ప్ - ఎక్స్: ఈ ఉద్యోగాలకు ఇంటర్ / ప్లస్ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్ తో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే ఇంగ్లిష్ లోనూ 50 శాతం మార్కులు తప్పనిసరి. లేదా 50 శాతం మార్కులతో ఏదైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసినవారు అర్హులే. డిప్లొమా ఇంగ్లిష్ లో 50 శాతం మార్కులు తప్పనిసరి. డిప్లొమాలో ఇంగ్లిష్ స‌బ్జెక్టు లేకపోతే ఇంటర్ లేదా పదో తరగతి ఇంగ్లిష్ లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.

గ్రూప్ - వై: ఈ ఉద్యోగాలకు ఇంటర్ ఏదైనా గ్రూప్ లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. అలాగే ఇంగ్లిష్ లోనూ 50 శాతం మార్కులు ఉండాలి. ఈ గ్రూప్ లో మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ పోస్టుల‌కు మాత్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే ఇంగ్లిష్ లోనూ 50 శాతం మార్కులు తప్పనిసరి.

మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్ చ‌దువుకున్న విద్యార్థులు గ్రూప్ - ఎక్స్, గ్రూప్ - వై రెండు ఉద్యోగాల‌కూ అర్హులే. వీరు ఎక్స్ , వై ల్లో న‌చ్చిన గ్రూప్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుని ప‌రీక్ష రాసుకోవ‌చ్చు లేదా రెండు గ్రూప్ ల‌కూ క‌లిపి నిర్వ‌హించే ప‌రీక్ష‌నూ ఎంచుకోవ‌చ్చు. ఈ అవకాశం ఆన్ లైన్ అప్లికేషన్ పూరించినప్పుడు ఉపయోగించుకోవాలి. డిప్లొమా విద్యార్థులు మాత్రం గ్రూప్ ఎక్స్ పోస్టుల‌కు మాత్ర‌మే అర్హులు.
ఎంపిక విధానం: ఫేజ్ 1, ఫేజ్ -2 పరీక్షల‌ ద్వారా.

ఫేజ్ -1 పరీక్ష ఇలా...
ఈ ప‌రీక్ష‌ను ఆన్ లైన్ లో నిర్వ‌హిస్తారు. ప్ర‌శ్న‌ల‌న్నీ ఆబ్జెక్టివ్ త‌ర‌హాలోనే వ‌స్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. గ్రూప్ ఎక్స్ ట్రేడ్ పరీక్ష వ్య‌వ‌ధి ఒక గంట‌. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్ ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం సీబీఎస్ఈ 10+2 సిలబస్ ప్రకారం ఉంటుంది. గ్రూప్ వై పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్ నెస్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ విభాగంలోని ప్రశ్నలు సీబీఎస్ఈ 10+2 సిలబస్ నుంచే వస్తాయి. గ్రూప్ - ఎక్స్, వై రెండింటికీ దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్ష 85 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్ నెస్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రశ్నలు సీబీఎస్ ఈ 10+2 సిలబస్ నుంచే ఉంటాయి. అభ్య‌ర్థులు https://airmenselection.cdac.in లో మాక్ ప‌రీక్ష‌ను రాసుకోవ‌చ్చు.

ఫేజ్ -2లో...
పరీక్ష జరిగిన 15 రోజుల వ్యవధిలో ఫలితాలు వెలువడతాయి. ఫేజ్ -1 లో అర్హత సాధించినవారికి ఫేజ్ -2 కోసం మెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఎంపికైనవారు నిర్దేశిత ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ వద్దకు చేరుకోవాలి. ఫేజ్ -2 అడ్మిట్ కార్డు, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు ల కలర్ ప్రింటవుట్ తీసుకెళ్లాలి. వీటితోపాటు హెచ్ బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్ నర్, గ్లూ స్టిక్, స్టాప్లర్, బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకెళ్లాలి. ఆన్ లైన్ అప్లికేషన్ లో నమోదు చేసిన పాస్ పోర్టు సైజు ఫొటోలు 8, అలాగే పదోతరగతి, ఇంటర్, డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్లు, 4 జతల కాపీలు తీసుకెళ్లాలి. వీటిని పరిశీలిస్తారు. అభ్యర్థులు ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షల్లో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 6 నిమిషాల 30 సెకెన్లలో పూర్తిచేయాలి. అలాగే నిర్ణీత వ్యవధిలో 10 పుష్ అప్స్, 10 సిట్ అప్స్, 20 స్క్వాట్స్ పూర్తిచేయాలి.

ఎంపికైతే...
ఎంపికైనవారికి శిక్షణలో రూ.14600 స్టైపెండ్ గా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం విధుల్లో చేరినవారికి గ్రేడ్ పే తో కలుపుకుని గ్రూప్ ఎక్స్ లో అయితే రూ.33100, గ్రూప్ వై లో రూ. 26900 మూలవేతనం లభిస్తుంది. దీనికి డీఏ, హెచ్ ఆర్ ఎ...మొదలైనవి అదనం. స‌ర్వీసులో చేరిన‌వారు 20 ఏళ్ల‌పాటు సేవ‌లు అందించ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత ఈ వ్య‌వ‌ధిని పొడిగించ‌డానికి అవ‌కాశం ఉంది. గ‌రిష్ఠంగా అభ్య‌ర్థులు 57 ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కు ఉద్యోగిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌వ‌చ్చు. ఎంపికైన‌వారిని బెళ‌గ‌వి (క‌ర్ణాట‌క‌)లోకి ప్రాథ‌మిక శిక్ష‌ణ కేంద్రంతో త‌ర్ఫీదు నిర్వ‌హిస్తారు.అనంత‌రం అభ్య‌ర్థుల‌ను సంబంధిత ట్రేడ్ శిక్ష‌ణ కేంద్రాల‌కు పంపుతారు. ఆ ట్రేడుల్లో విజ‌య‌వంతంగా శిక్ష‌ణ పూర్తిచేసుకున్న‌వారిని విధుల్లోకి తీసుకుంటారు. గ్రూప్ ఎక్స్ లో ఎంపికైన‌వారు వివిధ ఫిట్ట‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తారు. గ్రూప్ వైలో చేరిన‌వారు టెక్నీషియ‌న్ గా సేవ‌లు అందిస్త‌రు. విధుల్లో కొన‌సాగిన‌వారు భ‌విష్య‌త్తులో ప్ర‌మోష‌న్ల ద్వారా మాస్ట‌ర్ వారెంట్ ఆఫీస‌ర్ (ఎం డ‌బ్ల్యువో) స్థాయి వ‌ర‌కు చేరుకోవ‌చ్చు. అలాగే స‌ర్వీసులో కొన‌సాగుతూ కొన్ని ప‌రీక్ష‌ల్లో అర్హ‌త‌లు సాధించిన‌వారు క‌మిష‌న్డ్ ఆఫీస‌ర్లు కావ‌డానికీ అవ‌కాశాలు ఉన్నాయి.

ముఖ్య స‌మాచారం
ఆన్ లైన్ దరఖాస్తుల ప్రారంభం: జులై 3
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 24
ఆన్ లైన్ పరీక్షలు: సెప్టెంబరు 13 నుంచి 16 వరకు నిర్వహిస్తారు.
అడ్మిట్ కార్డులు: ఆగస్టులో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు: రూ. 250
వయసు: జులై 14, 1998 - జూన్ 26, 2002 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎత్తు: కనీసం 152.5 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి. దృష్టిదోషం ఉండరాదు. వినికిడి సామర్థ్యం స్పష్టంగా ఉండాలి.

Back..

Posted on 23-06-2017

Notification
Website
Syllabus & Model Papers
English
Mathematics
Physics
Reasoning & General Awareness