Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
గణిత.. గణాంక శాస్త్రాలకు ఘన వేదిక

* ఐఎస్‌ఐ

మనదేశంలో గణాంక శాస్త్ర, గణితశాస్త్ర (స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌) కోర్సులకు శిఖరాగ్ర సంస్థ- ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ). ఈ సబ్జెక్టుల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి నుంచే అత్యున్నత బోధన ఇక్కడ లభిస్తుంది. 2019 -20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తాజాగా ఐఎస్‌ఐ ప్రకటన వెలువడింది. ఈ సంస్థ అందిస్తోన్న కోర్సులు, పరీక్షల గురించి వివరంగా తెలుసుకుందామా?
ఎక్కడుంది: ఐఎస్‌ఐ ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది. హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్‌పూర్‌ క్యాంపస్‌ల్లోనూ కోర్సులు అందిస్తున్నారు.
ఎందుకోసం: మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారికి నాణ్యమైన విద్య అందించి అందులో నిపుణులుగా మార్చడానికి.
ఏయే కోర్సులు: బీస్టాట్‌, ఎంస్టాట్‌, బీ మ్యాథ్స్‌, ఎం మ్యాథ్స్‌, ఎంటెక్‌, పీజీడీసీఏ, పీజీడీబీఏ, పీహెచ్‌డీ.
ఎవరు చేరవచ్చు: ఇంటర్‌, డిగ్రీ, పీజీ పూర్తిచేసినవారు, ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు.
ప్రత్యేకతలు: డిగ్రీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.3 వేలు, పీజీ కోర్సులైతే రూ.5 వేలు, ఎంటెక్‌ కోర్సులకు ఎంపికైనవారికి రూ.8000 స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే నెలకు రూ.28,000, ఇతర కోర్సులకైతే రూ.25,000 చొప్పున చెల్లిస్తున్నారు. కోర్సు చివరి సంవత్సరంలో ప్రసిద్ధ సంస్థలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా మంచి వేతనాలతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.
బీస్టాట్‌ చదవటానికి మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. కోల్‌కతా క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. 50 సీట్లు ఉన్నాయి. బీమ్యాథ్స్‌లో చేరటానికి మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. బెంగళూరు క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. 50 సీట్లు ఉన్నాయి.

పీజీ కోర్సులు
* మాస్టర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌: స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ / బీటెక్‌ కోర్సు చదివుండాలి. ఈ కోర్సును దిల్లీ, చెన్నై క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. 30 సీట్లు ఉన్నాయి.
* మాస్టర్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ / బీటెక్‌ కోర్సు పూర్తిచేసినవారు అర్హులు. ఈ కోర్సు కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తున్నారు. 20 సీట్లు ఉన్నాయి.
* క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌: ఏదైనా డిగ్రీ కోర్సుతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కోల్‌కతా, దిల్లీ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. దిల్లీలో 27, కోల్‌కతాలో 18 సీట్లు ఉన్నాయి.
* క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా డిగ్రీలో చదివుండాలి లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ పూర్తిచేయాలి. 16 సీట్లు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో నిర్వహిస్తున్నారు.
* లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకి దరఖాస్తు చేసుకోవచ్చు. బెంగళూరు క్యాంపస్‌లో అందిస్తున్నారు. 10 సీట్లు ఉన్నాయి.

ఎంటెక్‌ కోర్సులు
* కంప్యూటర్‌ సైన్స్‌: మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వీటిలో ఎందులోనైనా పీజీ లేదా బీఈ/ బీటెక్‌ చదివినవారు ఈ కోర్సుకు అర్హులు. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు. 35 సీట్లు ఉన్నాయి.
* క్రిప్టాలజీ అండ్‌ సెక్యూరిటీ: మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వీటిలో ఎందులోనైనా పీజీ లేదా బీఈ/ బీటెక్‌. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు. 20 సీట్లు ఉన్నాయి.
* క్వాలిటీ, రిలయబిలిటీ అండ్‌ ఆపరేషన్‌ రిసెర్చ్‌: స్టాటిస్టిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు ఇంటర్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదివుండాలి. లేదా మ్యాథ్స్‌ లో మాస్టర్‌ డిగ్రీతోపాటు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ ఇంటర్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదివుండాలి. లేదా బీఈ/ బీటెక్‌ ఉండాలి. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందుబాటులో ఉంది. 25 సీట్లు ఉన్నాయి.

పీజీ డిప్లొమా
* స్టాటిస్టికల్‌ మెథడ్స్‌ అండ్‌ అనలిటిక్స్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. చెన్నై, తేజ్‌పూర్‌ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. ఒక్కో క్యాంపస్‌లో 15 చొప్పున సీట్లు ఉన్నాయి.
* కంప్యూటర్‌ అప్లికేషన్స్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 15 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి ఏడాది.

జేఆర్‌ఎఫ్‌
స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌; క్వాలిటీ, రిలయబిలిటీ అండ్‌ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌; ఫిజిక్స్‌, జియాలజీ, బయలాజికల్‌ సైన్స్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో అవకాశం లభిస్తుంది.
పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను కోర్సులోకి ఎంపిక చేస్తారు. సంబంధిత కోర్సులకు ఇంటర్‌/ డిగ్రీ/ పీజీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 12 వరకు స్వీకరిస్తారు
పరీక్ష: మే 12న నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1250, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీలకు రూ.625
వెబ్‌సైట్‌:www.isical.ac.in


Back..

Posted on 13-02-2019