Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అత్యున్నత ప్రమాణాలకు చిరునామా ఐఎస్‌ఐ

భిన్నత్వంలో ఏకత్వం నినాదం ప్రధానంగా పార్లమెంటు చట్టంతో ఏర్పడిన జాతీయస్థాయి సంస్థ ఐఎస్‌ఐ (ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌). విభిన్న పరిశోధనలకు ప్రోత్సాహాన్నిస్తూ పలురకాల కోర్సులను నిర్వహిస్తోంది. స్టాటిస్టిక్స్‌, నేచురల్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌లో పరిశోధన, బోధన, అనువర్తనలకు అంకితమైన ఈ సంస్థ ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ప్రారంభిస్తున్న క్రిప్టాలజీ అండ్‌ సెక్యూరిటీ కోర్సు ఈ విద్యా సంవత్సరానికి ప్రధాన ఆకర్షణ.

స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌ కోర్సులపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దృష్టిసారించాల్సిన సంస్థల్లో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) ముఖ్యమైంది. వీటిలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదువుకునే వారికి నాణ్యమైన బోధన, ఉన్నత ప్రమాణాలు, వసతులతోపాటు ప్రతినెలా స్టైపెండ్‌ అందించడం ఐఎస్‌ఐ ప్రత్యేకత. డిగ్రీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.3 వేలు, అదే పీజీ కోర్సులైతే రూ.5 వేలు, ఎంటెక్‌ కోర్సులకు ఎంపికైనవారికి రూ.8 వేలు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే నెలకు రూ.28,000 ఇతర కోర్సులకు అయితే రూ.25,000 చొప్పున చెల్లిస్తున్నారు. ప్రవేశపరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఐఎస్‌ఐలో కోర్సులు, అర్హతలు, సీట్ల వివరాలు తెలుసుకుందాం..

ఐఎస్‌ఐ స్టాటిస్టిక్స్‌లోనే కాకుండా మ్యాథ్స్‌, క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు ప్రసిద్ధి చెందింది. బీస్టాట్‌, బీమ్యాథ్స్‌, ఎంస్టాట్‌, ఎంమ్యాథ్స్‌, ఎంఎస్‌ (క్యూఈ), ఎంఎస్‌ (క్యూఎంఎస్‌), ఎంఎస్‌ (ఎల్‌ఐఎస్‌), ఎంటెక్‌ (సీఎస్‌), ఎంటెక్‌ (సీఆర్‌ఎస్‌), ఎంటెక్‌ (క్యూఆర్‌ఓఆర్‌), పీజీ డిప్లొమాలు, రిసెర్చ్‌ ఫెలోషిప్పులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం కోల్‌కతాలో ఉంది. దిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్‌పూర్‌లో శాఖలున్నాయి. అలాగే కోయంబత్తూరు, హైదరాబాద్‌, ముంబయి, పుణెల్లో నెట్‌వర్క్‌ కార్యాలయాలు ఉన్నాయి. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, సిబిల్‌, డెలాయిట్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌, సిటీ కార్పొరేషన్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, మెకిన్సే, హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం, ఐసీఐసీఐ, జేపీమోర్గాన్‌, కేపీఎంజీ, నీల్సన్‌, మైక్రోసాఫ్ట్‌, రిలయన్స్‌, శాంసంగ్‌, వాల్మార్ట్‌ తదితర కంపెనీలెన్నో ఐఎస్‌ఐ విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

* యూజీ
బీస్టాట్‌: మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తి చేసినవాళ్లు ఈ కోర్సుకు అర్హులు. కోల్‌కతా క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. నెలకు రూ.3000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. 50 సీట్లు ఉన్నాయి.
బీమ్యాథ్స్‌: మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తిచేసినవాళ్లు ఈ కోర్సుకు అర్హులు. బెంగళూరు క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. నెలకు రూ.3000 స్టైపెండ చెల్లిస్తారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. సీట్ల సంఖ్య 50.

* పీజీ
మాస్టర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌: స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ / బీటెక్‌ కోర్సు చదివి ఉండాలి. ఈ కోర్సు దిల్లీ, చెన్నై క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. ఎంపికైనవారికి నెలకు రూ.5000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. 30 సీట్లు ఉన్నాయి.
మాస్టర్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ / బీటెక్‌ కోర్సు పూర్తిచేసినవారు అర్హులు. ఈ కోర్సు కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.5000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. 20 సీట్లు ఉన్నాయి.
క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌: ఏదైనా డిగ్రీ కోర్సుతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవాలి. కోల్‌కతా, దిల్లీ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. దిల్లీలో 27, కోల్‌కతాలో 18 సీట్లు ఉన్నాయి.
క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ పూర్తి చేయాలి. బెంగళూరు, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో కోర్సు నిర్వహిస్తున్నారు. 16 సీట్లు ఉన్నాయి.
లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకి దరఖాస్తు చేసుకోవచ్చు. బెంగళూరు క్యాంపస్‌లో అందిస్తున్నారు. పది సీట్లు ఉన్నాయి.

* ఎంటెక్‌
కంప్యూటర్‌ సైన్స్‌: మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వీటిలో ఎందులోనైనా పీజీ లేదా బీఈ/ బీటెక్‌ చదివినవారు ఈ కోర్సుకు అర్హులు. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు. 35 సీట్లు ఉన్నాయి.
క్రిప్టాలజీ అండ్‌ సెక్యూరిటీ: మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ.. వీటిలో ఎందులోనైనా పీజీ లేదా బీఈ/ బీటెక్‌ చేసి ఉండాలి. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు. 20 సీట్లు ఉన్నాయి. ఇది కొత్త కోర్సు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నారు.
క్వాలిటీ, రిలయబిలిటీ అండ్‌ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌: స్టాటిస్టిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు ఇంటర్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదివి ఉండాలి. లేదా మ్యాథ్స్‌లో మాస్టర్‌ డిగ్రీతోపాటు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌, ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదవాలి. లేదా బీఈ/ బీటెక్‌ ఉండాలి. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందుబాటులో ఉంది. 25 సీట్లు ఉన్నాయి.
పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ స్టాటిస్టికల్‌ మెథడ్స్‌ అండ్‌ అనలిటిక్స్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌ చదివిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. తేజ్‌పూర్‌ క్యాంపస్‌లో అందిస్తున్నారు. 30 సీట్లు ఉన్నాయి.
పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 15 సీట్లు ఉన్నాయి. గిరిడీ క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 7
చివరి తేదీ: మార్చి 9. అడ్మిట్‌ కార్డులు: ఏప్రిల్‌ 11 నుంచి అందుబాటులో ఉంటాయి.
పరీక్ష తేదీ: మే 13
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం. దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీలకు రూ.500.

జేఆర్‌ఎఫ్‌
స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌; క్వాలిటీ, రిలయబిలిటీ అండ్‌ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌; ఫిజిక్స్‌, జియాలజీ, బయలాజికల్‌ సైన్స్‌, లైబ్రరీ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో జేఆర్‌ఎఫ్‌ అందిస్తోంది ఐఎస్‌ఐ. ఎంపికైన వారికి ఇంజినీరింగ్‌ కోర్సులకైతే ప్రతినెలా రూ.28,000, మిగిలిన అన్ని కోర్సులకు రూ.25,000 చొప్పున చెల్లిస్తారు.
ఇంటర్‌/డిగ్రీ/ పీజీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హతల ప్రకారం తాము కోరుకున్న కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Back..

Posted on 07-11-2017