Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

బాలల సృజనకు భలే పోటీ!

చురుకైన చిన్నారుల మదిలో ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఉందో? సమాజానికి మేలు చేసే ఆలోచనలను అందిస్తారేమో? అందుకే ప్రభుత్వం హైస్కూలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తోంది. కొత్తదనాన్ని ప్రోత్సహించి ఆవిష్కరణల దిశగా వారిని నడిపిస్తోంది. దీని కోసం ఇన్‌స్పైర్‌ మనాక్‌ పేరుతో పోటీలను నిర్వహిస్తోంది. వీటిని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ), నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఐఎఫ్‌) పర్యవేక్షిస్తున్నాయి.

ఆరు నుంచి పదో తరగతి చదువుతోన్న 10 నుంచి 15 ఏళ్ల వయసు విద్యార్థుల్లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరంగా ఉండే ప్రతిభను వెలికి తీయడానికి మనాక్‌ చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగపడే అంశాల్లో సొంత ఆలోచనలను ప్రోత్సహించి వాటిలో మేటిగా ఉన్నవాటిని కార్యరూపం దాల్చేలా చూడడమే ఈ పోటీల లక్ష్యం. దేశవ్యాప్తంగా ఏ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులైనా పోటీలో పాల్గొనవచ్చు.

లక్ష ఆలోచనలు
ముందుగా దేశవ్యాప్తంగా అన్ని హైస్కూళ్ల విద్యార్థుల్లోనూ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తారు. వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. అనంతరం ఆయా పాఠశాలల పరిధిలో అంతర్గత పోటీలు నిర్వహిస్తారు. విద్యార్థుల సొంత ఆలోచనలతో తమ ప్రతిపాదనలు తెలుపుతారు. వీటిలో బాగా ఉన్న రెండు లేదా మూడింటిని ఆయా పాఠశాలలు ఎంపిక చేస్తాయి. ఇలా ఎంపికైనవాటిని పాఠశాల ప్రధానాచార్యులు ఇన్‌స్పైర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పాఠశాలలవారీ వచ్చిన ఆలోచనలు క్రోడీకరిస్తారు. దాదాపు పది లక్షల వరకు ప్రాజెక్టులు/ ఆలోచనలు దేశవ్యాప్తంగా నమోదవుతాయి. వీటిని నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ పరిశీలించి అందులోంచి లక్ష ఆలోచనలు ఎంపిక చేస్తుంది.

ఈ వడపోతలో ఎంపికైన ఆలోచనలకు సంబంధించిన విద్యార్థుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా రూ.పదివేలు జమ చేస్తారు. ఈ లక్ష ఆలోచనల జాబితాను ఆయా జిల్లాలవారీ విడదీస్తారు. ఆ జిల్లా పరిధిలోని వారంతా జిల్లా స్థాయి ప్రాజెక్ట్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటారు. అన్ని జిల్లాల నుంచి కలిపి పదివేల ప్రతిపాదనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఈ ఎంపికలను నిర్వహిస్తాయి. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న పదివేల మంది నుంచి అత్యుత్తమమైన వెయ్యి ఆలోచనలను జాతీయస్థాయి పరిశీలనకు తీసుకుంటారు. నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఐఎఫ్‌) ఈ ఎంపికలు చేపడుతుంది. ఈ దశలో ఎన్‌ఐఎఫ్‌ విద్యార్థులకు మెంటర్‌గా వ్యవహరిస్తుంది. ప్రఖ్యాత విద్యాసంస్థలు, సాంకేతిక కేంద్రాల ద్వారా విద్యార్థులకు అవసరమైన తోడ్పాటునూ అందిస్తుంది.

కొత్తదనం, సామాజిక అనువర్తనం, పర్యావరణహితం, సులువుగా ఉపయోగించగలగడం, ప్రస్తుతం అదే విభాగంలో ఉపయోగిస్తోన్న సాంకేతికత కంటే మెరుగ్గా, మరింత ఉపయుక్తంగా ఉండడం...తదితర అంశాలకు జాతీయస్థాయి పోటీల్లో ప్రాధాన్యమిస్తారు. దీని ప్రకారం వెయ్యి ఆలోచనల నుంచి 60 ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైనవారికి జాతీయ అవార్డు ప్రదానం చేస్తారు. దీంతోపాటు ఆ ఆలోచనల భవిష్యత్త్తుకు బాటలు వేస్తారు. ఇలా ఎంపికైనవాటిని ఎన్‌ఐఎఫ్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ)కి చెందిన అదే తరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తారు. ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ వార్షిక వేడుకల్లో వీటిని ప్రదర్శిస్తారు. అవసరమైన ప్రోత్సాహకాలు లభిస్తాయి. నిపుణులు మరింత మెరుగులు దిద్దుతారు. అవసరమైన సాంకేతికత, ఇతర అభివృద్ధి చేపడతారు. వినూత్న ఆలోచనలకు పేటెంట్‌ కోసమూ దరఖాస్తు చేస్తారు.

గడువు తేదీ: జులై 31
వెబ్‌సైట్‌: www.inspireawards-dst.gov.in


Back..

Posted on 02-07-2019