Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ధీమానిచ్చే బీమా కొలువులు

ఆధునిక జీవనంలోని అనిశ్చితి కారణంగా భద్రతకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టుగా బీమా చేస్తున్నారు. మనుషులతోపాటు పెంపుడు జంతువులు, ప్రియమైన వస్తువులు... అన్నింటికీ ఇది వర్తిస్తుంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనదేశంలో బీమాదారుల సంఖ్య తక్కువే. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ప్రపంచీకరణ, కొత్త సంస్థల విస్తరణ, పాలసీల్లో వైవిధ్యం, ఆదాయ వనరులు పెరగడం... తదితర కారణాలతో ప్రస్తుతం ఈ రంగం ఆశాజనకంగా విస్తరిస్తూ ముందుకెళ్తోంది. బీమా సంస్థలకు అవసరమెన మానవ వనరులను సిద్ధం చేయటానికి ఎన్నో సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి.

ప్రస్తుతం మనదేశంలో 63 బీమా సంస్థలు సేవలు అందిస్తున్నాయి. వీటిలో 24 జీవిత బీమా సంస్థలు, 39 నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు. మన దేశ బీమా రంగం 2020 నాటికి 280 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం మందే జీవిత బీమా తీసుకున్నారని లెక్కగట్టారు. అందువల్ల ఈ రంగంలో మరింత వృద్ధికి అవకాశాలున్నాయి.

బీమాలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ అని రెండు రకాలుంటాయి. ఇంట్లో విలువైన వస్తువులు ఎవరైనా దొంగిలించినా, మార్గంలో వాహనం ప్రమాదానికి గురైనా, జబ్బుచేసి ఆసుపత్రిపాలైనా బీమా ఉంటే పరిహారం పొందవచ్చు. మనదేశంలో బీమా రంగాన్ని పర్యవేక్షించడానికి ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ) ఏర్పాటైంది. సంబంధిత కోర్సుల నిర్వహణకు నేషనల్‌ ఇన్సూరెన్స్‌ అకాడమీ (ఎన్‌ఐఏ)ని నెలకొల్పారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అందుబాటు ధరల్లో కొత్త పాలసీలను తీసుకొస్తున్నాయి. అందువల్ల భవిష్యత్తులో బీమా చేసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరగనుంది. దీంతో ఈ విభాగంలో మానవ వనరుల సేవలు కీలకం కానున్నాయి.

పలు రకాల కోర్సులు
ఇన్సూరెన్స్‌లో బీబీఏ/ బీకాం/ బీఏ / ఎంబీఏ/ పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులను పలు సంస్థలు అందిస్తున్నాయి. బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌/ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌/ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌/ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌/ రిస్క్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌ంట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణులు యూజీ కోర్సుల్లో, డిగ్రీ పూర్తిచేసినవారు పీజీల్లో చేరవచ్చు. పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులకు డిగ్రీ పూర్తిచేసుకున్నవారు అర్హులు. యూజీ కోర్సులు మూడేళ్లు, పీజీ రెండేళ్లు, డిప్లొమా ఏడాది నుంచి రెండేళ్లు, సర్టిఫికెట్‌ ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధితో ఉంటాయి. పలు సంస్థలు రెగ్యులర్‌తో పాటు దూరవిద్య ద్వారా కోర్సులు అందిస్తున్నాయి. అందిస్తున్న సంస్థలు: ఈ సంస్థలు అందించే ఎక్కువ కోర్సులు పీజీ డిప్లొమా రూపంలో లేదంటే ఎంబీఏలో ఒక స్పెషలైజేషన్‌గానో ఉన్నాయి.

వాటిలో ముఖ్యమైనవి.. బ్రాకెట్‌లో అవి అందిస్తున్న కోర్సులు..
* నేషనల్‌ ఇన్సూరెన్స్‌ అకాడమీ, పుణె (పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఇన్సూరెన్స్‌)
* ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌. (పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- ఇన్సూరెన్స్‌; ఇంటర్నేషనల్‌ డిప్లొమా ఇన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లానింగ్‌ అండ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.
* ముంబయి యూనివర్సిటీ, ముంబయి (బీకాం - బ్యాంక్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌)
* ఇన్సూరెన్స్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ముంబయి (పలు రకాల డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు)
* పాండిచ్చేరి యూనివర్సిటీ (ఎంబీఏ - ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌)
* ఇన్‌స్ట్టిట్యూట్‌ఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ - ఐపీఈ, హైదరాబాద్‌. (పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.)
* అమిటీ యూనివర్సిటీ (బీఏ - ఇన్సూరెన్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌)
* చార్టర్డ్‌ ఇన్సూరెన్స్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ - సీఐఐ, యూకే. ఇది బీమా రంగంలో ప్రపంచస్థాయి సంస్థ. (సర్టిఫికెట్‌, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా).

ఏయే ఉద్యోగాలు?
బీమా రంగంలో ప్రాథమిక స్థాయిలో ఏజెంట్లు ఉంటారు. నేరుగా వినియోగదారుల (పాలసీదారుల)తో మాట్లాడి, వాళ్లకు అవగాహన కలిగించి, బీమా తీసుకునేలా ఒప్పిస్తారు. వీరికి మంచి కమిషన్‌ దక్కుతుంది. ఏజెంట్ల తర్వాతి స్థాయిలో డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు ఉంటారు. తమ పరిధిలోని ఏజెంట్లను కార్యోన్ముఖులను చేసి, కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడం వీరి విధి. ఇన్సూరెన్స్‌ విభాగంలో సర్వేయర్లు సైతం ఉంటారు. వీరు ఏదైనా ప్రమాదం, దొంగతనం జరిగినప్పుడు ఆర్థికంగా ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తారు. కంపెనీలకు కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తారు. ఈ తరహా ఉద్యోగాన్ని ఆశించేవారు కొన్ని సంస్థల్లో ఫెలోషిప్‌ లేదా అసిస్టెంట్‌షిప్‌ చేసుండాలి. ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ సర్వేయర్స్‌ అండ్‌ లాస్‌ అసెసర్స్‌ (ఐఐఐఎస్‌ఎల్‌ఎ) తదితర సంస్థలు ఈ తరహా కోర్సులు అందిస్తున్నాయి. ఐఆర్‌డీఏ వీరికి లైసెన్స్‌ మంజూరు చేస్తుంది. వీరిని లాస్‌ అడ్జస్టర్‌ లేదా అసెసర్‌గా వ్యవహరిస్తారు. పాలసీని బట్టి ప్రీమియం ఎంత ఉండాలో యాక్చురీ నిపుణులు నిర్ణయిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టం భర్తీ చేయడానికి క్లెయిమ్స్‌ ఎగ్జిస్టర్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎంత పరిహారం కంపెనీ చెల్లిస్తుందో బీమాదారులకు వివరిస్తారు. తర్వాత దశలో క్లెయిమ్స్‌ ఎగ్జామినర్లు ఉంటారు. ఒకవేళ అందులో ఏదైనా మోసం ఉన్నట్లు అనిపిస్తే ఇన్సూరెన్స్‌ ఇన్వెస్టిగేటర్‌ దాన్ని శోధిస్తారు. ఇంకా ఇన్సూరెన్స్‌ అండర్‌ రైటర్లు ఉంటారు. వీరు పాలసీ మంజూరుకు ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

అవకాశాలు ఎక్కడ?
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, ఆర్థిక సంస్థలు, కన్సల్టెన్సీలు, క్రెడిట్‌ కంపెనీలు, ప్రభుత్వ బీమా సంస్థలు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, శాఖల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బీమా పాలసీలను అమ్మే సామర్థ్యం ఉన్నవారు కెరియర్లో స్వల్ప వ్యవధిలోనే రాణించవచ్చు. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ, బిజినెస్‌ ఎనలిస్ట్‌, యాక్చూరియల్‌ ఎనలిస్ట్‌, ఇన్సూరెన్స్‌ ఎనలిస్ట్‌ తదితర ఆరంభ స్థాయి ఉద్యోగాలుంటాయి. ప్రారంభంలో వేతనాలు ఏడాదికి రూ.3 లక్షల నుంచి మొదలుకొని రూ.6 లక్షల వరకు ఉండవచ్చు. పనిచేస్తున్న కంపెనీ బట్టి జీతాల్లో వ్యత్యాసాలుంటాయి.

వివిధ ఐటీ కంపెనీలు ఇన్సూరెన్స్‌ కోర్సు చదివినవారిని డొమైన్‌ ఎక్స్‌పర్ట్‌, బిజినెస్‌ ఎనలిస్ట్‌ ఉద్యోగానికి తీసుకుంటున్నాయి. ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు (డీవో), అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు (ఏఏవో), అసిస్టెంట్స్‌ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తుంది. అలాగే నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (ఎన్‌ఐసీ), న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఐఏసీఎల్‌), ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌...తదితర కంపెనీలు ప్రకటనల ద్వారా అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏవో) పోస్టులను భర్తీ చేస్తున్నాయి. ఈ ప్రకటనలు ఏటా వెలువడుతున్నాయి. డిగ్రీ అర్హతతో ఈ విభాగాల్లోని జనరల్‌ పోస్టులకు పోటీ పడవచ్చు.

శిక్షణతో ఉద్యోగం..
కొన్ని బీమా కంపెనీలు విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎంపికచేసిన వారికి ఈ సంస్థల్లో శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు.
* హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ మణిపాల్‌ గ్లోబల్‌ సంస్థతో కలిసి స్మార్ట్‌ అఛీవర్స్‌ పేరుతో ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇన్సూరెన్స్‌ కోర్సు అందిస్తోంది.
* ఐఎఫ్‌బీఐతో కలిసి ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో సర్టిఫికెట్‌ ప్రోగ్రాం అందిస్తోంది. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలోకి తీసుకుంటారు.
* మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌తో కలిసి టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఏడాది వ్యవధితో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తోంది. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ హోదాతో తీసుకుంటారు.


Back..

Posted on 23-05-2019