Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇంట‌ర్‌తో ఇంటిగ్రేటెడ్ బీఎడ్‌

* ఆర్ఐఈ, సెంట్రల్ యూనివ‌ర్సిటీల్లో ప్రవేశం
* బీఎస్సీ ఎడ్‌, బీఏ ఎడ్ కోర్సులు చ‌దువుకునే అవ‌కాశం

     ఇంటిగ్రేటెడ్ పీజీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్‌ గురించి వినే ఉంటారు. అయితే వీటికంటే చాలా ఏళ్ల ముందు నుంచే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులు ఆర్ఐఈల్లో ప్రవేశ‌పెట్టారు. వీటితోపాటు జార్ఖండ్ సెంట్రల్ యూనివ‌ర్సిటీ, గాంధీగ్రామ్ రూర‌ల్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా బీఎస్సీ ఎడ్, బీఏ ఎడ్ కోర్సులు అందిస్తున్నాయి. హ‌ర్యానాలోని ప్రారంభ్ స్కూల్ ఆఫ్ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ కూడా ఆర్ఐఈల ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశం క‌ల్పిస్తుంది. ఈ సంస్థల్లో ప్రవేశానికి ప్రక‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో ఆ వివ‌రాలు తెలుసుకుందాం.
డిగ్రీతోపాటు బీఎడ్
జాతీయ విద్యా ప‌రిశోధ‌న‌ శిక్షణా మండ‌లి (ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో ప్రాంతీయ విద్యా సంస్థలు (ఆర్ఐఈ)లు ఏర్పడ్డాయి. వీటిని కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ ప‌ర్యవేక్షిస్తుంది. దేశంలో 5 ఆర్ఐఈ క్యాంప‌స్‌లు (అజ్మీర్‌, భోపాల్‌, భువ‌నేశ్వర్‌, మైసూర్‌, షిల్లాంగ్‌) ఉన్నాయి. ఈ సంస్థలు ఇంట‌ర్ విద్యార్థుల కోసం బీఎస్సీ-ఎడ్‌, బీఏ-ఎడ్ కోర్సులు అందిస్తున్నాయి. ఆర్ఐఈ ఉన్న ప్రాంతాన్ని బ‌ట్టి స‌మీప రాష్ట్రాల విద్యార్థుల‌ను వాటి ప‌రిధిలోకి చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు ఆర్ఐఈ, మైసూర్ ప‌రిధిలోకి వ‌స్తారు.
ఆర్ఐఈ ప్రత్యేక‌త‌:
ఉచితంగా డిగ్రీ, బీఎడ్ కోర్సుల‌ను పూర్తిచేయ‌వ‌చ్చు. పూర్తిగా రెసిడెన్షియ‌ల్ విధానంలో విద్యాభ్యాసం కొన‌సాగుతుంది. భోజ‌నం, వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పిస్తారు. నిష్ణాతులైన బోధ‌నా సిబ్బంది ఈ సంస్థల‌ బ‌లం. ఏ కోర్సులో చేరిన‌ప్పటికీ సెమిస్టర్ విధానంలో బోధ‌న కొన‌సాగుతుంది. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఎంపికైన విద్యార్థులు కామ‌న్ కోర్సు, కోర్ కోర్సు, ఎల‌క్టివ్స్‌ను అభ్యసిస్తారు. కోర్సు పూర్తయిన త‌ర్వాత ప్రముఖ విద్యా సంస్థల్లో పెద్దమొత్తంలో వేత‌నానికి ఉపాధ్యాయుడిగా చేరొచ్చు. ఏటా క్యాంప‌స్ ప్లేస్‌మెంట్లు నిర్వహిస్తున్నారు.. కావాల‌నుకుంటే ఉన్నత చ‌దువుల్లో కొన‌సాగొచ్చు. ఆర్ఐఈల్లో ఎమ్మెస్సీ ఎడ్ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థల్లో ఎడ్యుకేష‌న్‌లో పీహెచ్‌డీ కూడా చేసుకోవ‌చ్చు. కోర్సు వ్యవ‌ధి నాలుగేళ్లు. ఇంట‌ర్ ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణులు బీఎస్సీఎడ్‌; ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు బీఏ ఎడ్ కోర్సుల‌కు అర్హులు.
ప్రవేశం: ఉమ్మడి రాత ప‌రీక్ష ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. అభ్యర్థి ద‌ర‌ఖాస్తు చేసుకున్న కోర్సుకు సంబంధించి ఇంట‌ర్ సిల‌బ‌స్‌పై ప్రశ్నలుంటాయి.. ఆబ్జెక్టివ్ విధానంలో ప‌రీక్ష నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మే 11
ప‌రీక్ష తేదీ: జూన్ 7
ఫ‌లితాలు: జులై మొద‌టివారంలో వెలువ‌డ‌తాయి.
వెబ్‌సైట్‌: http://riemysore.ac.in
సెంట్రల్ యూనివ‌ర్సిటీలు
కొత్తగా ఏర్పడిన 8 కేంద్రీయ విశ్వవిద్యాల‌యాలు క‌లిసి ఉమ్మడి ప్రవేశ ప‌రీక్ష ద్వారా యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం క‌ల్పిస్తున్నాయి.వీటిలో కొన్ని యూనివ‌ర్సిటీల్లో బీఎస్సీ బీఎడ్‌, బీఏ బీఎడ్ కోర్సులు ఉన్నాయి. సీయూ సెట్ ప్రక‌ట‌న వెలువ‌డింది.
ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్ బీఎ బీఎడ్ రెండు కోర్సుల‌నూ జార్ఖండ్ సెంట్రల్ యూనివ‌ర్సిటీ అందిస్తోంది. ఒక్కో విభాగంలోనూ 50 చొప్పున సీట్లు ఉన్నాయి.
అర్హత‌: ఇంట‌ర్ సైన్స్ కోర్సు విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్‌కి, ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ బీఏ ఎడ్ కోర్సుకి అర్హులు. ఇంట‌ర్‌లో 55 శాతం మార్కులు సాధించాలి.
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ బీఎడ్‌- మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కోర్సుల‌ను రాజ‌స్థాన్ సెంట్రల్ యూనివ‌ర్సిటీ అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి బీఎస్సీ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కోర్సులు చ‌దివిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పీజీలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ఏదో ఒక‌దానితోపాటు క‌లిపి బీఎడ్ చదువుకోవ‌చ్చు. ఒక్కో స‌బ్జెక్టులో 15 సీట్లు చొప్పున‌ ఉన్నాయి.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మే 5
ప‌రీక్ష తేదీ: జూన్ 6,7 తేదీల్లో
వెబ్‌సైట్‌: www.cucet2015.co.in/Home.aspx
గాంధీగ్రామ్ రూర‌ల్ ఇన్‌స్టిట్యూట్‌, గాంధీగ్రామ్‌, దిండిగ‌ల్ జిల్లా, త‌మిళ‌నాడు కేంద్ర మాన‌వ వ‌న‌రుల విభాగం ఆధ్వర్యంలో న‌డుస్తోంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ బీఎడ్‌ కోర్సులో ప్రవేశానికి ప్రక‌ట‌న వెల‌వ‌డింది.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వెబ్‌సైట్‌: www.ruraluniv.ac.in

posted on 30.4.2015