Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మేధా హక్కుల రక్షకులు!

* ఐపీఆర్‌ కోర్సులతో పలు రకాల ఉద్యోగాలు

దేశ ఆర్థిక వ్యవస్థలను బలంగా నిర్మించేందుకు ఎప్పటికప్పుడు సంపద సృష్టి జరుగుతోంది. అందుకోసం కొత్త కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిపై హక్కుల రక్షణకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో మేధాసంపత్తి హక్కుల (ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ - ఐపీఆర్‌) పరిరక్షణ కోర్సులకు డిమాండ్‌ ఎక్కువైంది. ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్న ఈ కోర్సులను చేస్తే పలు రకాల ఉద్యోగాలను అందుకోవచ్చు. ఏప్రిల్‌ 26 ప్రపంచ మేధా హక్కుల దినోత్సవం సందర్భంగా ఐపీఆర్‌ కోర్సుల గురించి తెలుసుకుందాం.

ఒక దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే సహజ వనరులు ప్రధానం. అయితే వాటిని సద్వినియోగం చేసుకుంటూ సంపదగా మార్చడానికి మానవ వనరులు కావాలి. ప్రపంచ దేశాలు కేవలం సంప్రదాయ పద్ధతులనే కాకుండా మానవ మేధస్సుతో అధునాతన పరికరాలను, విధానాలను రూపొందించడం ద్వారా సంపదను వేగంగా సృష్టించగలుగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రపంచవ్యాప్తంగా అనేక రిసెర్చ్‌ సెంటర్లలో నూతన ఆవిష్కరణలకు ప్రయోగాలు జరుగుతున్నాయి. ఒక దేశ ప్రజల ఆలోచనలను మేధాసంపత్తిగా రక్షించడం ద్వారా వ్యాపార రంగంలో వీటిని ఎగుమతుల రూపంలో విదేశీ మారకద్రవ్యంగా మార్చుకోవచ్చు. రాబోయే రోజుల్లో డిజిటల్‌ ప్రపంచంలో మేధాసంపత్తికి సంబంధించి నిపుణుల అవసరం పెరగనుంది. మేధాసంపత్తి అనేది టెక్నాలజీ, న్యాయశాఖల సమ్మిళితంగా సాగుతోంది. అందువల్ల ఇది న్యాయవిద్యగా మాత్రమే కాకుండా డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలందరికీ ఉపయోగపడే కనీస పరిజ్ఞానంగా మారనుంది. మేధాసంపత్తి నిపుణులకు ఫార్మా, కెమికల్‌, డిజిటల్‌ ఐఓటీ, బ్లాక్‌ చెయిన్‌, మెటీరియల్స్‌, ఆటోమొబైల్‌ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ ద్వారా ఐపీ రంగంలో ఆయా దేశాల పటిష్టతను అంచనా వేస్తారు. అందులో భారత్‌ 60వ స్థానంలో ఉంది. ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలను ఐపీఆర్‌ రూపంలో మార్చాల్సిన అవసరం ఉంది. అందుకు భారత ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఆర్‌కి విశేష ప్రోత్సాహాన్నిస్తోంది. ఐపీఆర్‌తో విద్యా, ఉపాధి అవకాశాలు మరింత మెరుగవనున్నాయి.

ఉపాధి అవకాశాలు
జాతీయ, బహుళ జాతీయ సంస్థలన్నింటిలో ప్రస్తుతం ఇన్నోవేషన్‌ ఐపీఆర్‌ విభాగం పనిచేస్తోంది. పేటెంట్‌ ఏజెంట్‌లు, పేటెంట్‌ అటార్నీలుగా వాటిలో ఉద్యోగాలు లభిస్తాయి.
* ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఇండియన్‌ పేటెంట్‌ ఏజెంట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైతే స్వతహాగా సంస్థను స్థాపించవచ్చు. టెక్నాలజీ లేదా సైన్స్‌ విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన అర్హత పొందిన అందరూ ఈ పరీక్ష రాయడానికి అర్హులు.
* స్టార్టప్‌ కంపెనీలు ఐపీకి సంబంధించిన సలహాల కోసం ఈ నిపుణులను సంప్రదిస్తాయి. ‌
* యూనివర్సిటీ, అకడమిక్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఇన్‌క్యుబేషన్‌ సెంటర్లకు ఐపీఆర్‌ అధిపతిగా ఉద్యోగాలు లభిస్తాయి. ‌
* ఫార్మా, సాఫ్ట్‌వేర్‌, బయోటెక్నాలజీ కంపెనీలు ఐపీఆర్‌ నిపుణులకు ఏటా వందల ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

ఐపీఆర్‌ నిపుణుల పాత్ర
ప్రస్తుతం దాదాపు అన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ ఐపీఆర్‌ శాఖను ఏర్పాటు చేస్తున్నాయి. సంస్థకి సంబంధించిన ఉత్పత్తి గోప్యతను, గుర్తింపును రక్షించడం ఆ శాఖల విధి. ముఖ్యంగా ఈ కింది విధులు ఐటీఆర్‌ నిపుణులు నిర్వహిస్తుంటారు.
* కంపెనీ బ్రాండ్‌ లేదా ప్రాడక్ట్‌ను రక్షించడం
* పేటెంట్‌/ట్రేడ్‌మార్క్‌ సర్చ్‌
* పేటెంట్‌/ డ్రాఫ్టింగ్‌/ఫైలింగ్‌, గ్రాంట్‌
* పేటెంట్‌ ఇన్‌ఫ్రింజ్‌మెంట్‌ వాచ్‌
* న్యూప్రాడక్ట్‌ / ఐడియా వ్యాలిడేషన్‌ ‌& కాంపిటీటర్‌ అనాలసిస్‌
* లైసెన్సింగ్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌
* ప్రిపరేషన్‌ ఆఫ్‌ నాన్‌-డిస్‌క్లోజర్‌ అగ్రిమెంట్స్‌
* ఐపీ ఆడిట్‌
* ఐపీ అవేర్‌నెస్‌ సెషన్స్‌

ఐపీఆర్‌ - ఎవరి కోసం?
ఇంజినీరింగ్‌, ఫార్మసీ, బయోటెక్నాలజీ, మెడిసిన్‌ విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ చేసే విద్యార్థులు ఐపీఆర్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా అనేక ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇందుకోసం కొన్ని ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు కూడా పలు రకాల కోర్సులు నిర్వహిస్తున్నాయి. సాధారణగా గ్రాడ్యుయేషన్‌ అర్హత సరిపోతుంది. కోర్సులు, వాటి అర్హతల కోసం అభ్యర్థులు సంస్థల వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.

ఆన్‌లైన్‌లో..!
కొన్ని ఆన్‌లైన్‌ సంస్థలు అందిస్తున్న కోర్సులను నేర్చుకొని విద్యార్థులు సర్టిఫికేషన్‌ లేదా పీజీ డిప్లొమా పొందవచ్చు.
* ఎఫ్‌ఐసీసీఐ ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సెస్‌ ఆన్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ
* ఎమ్‌హెచ్‌ఆర్‌డీ స్వయం (www.swayam.gov.in)
* డబ్ల్యూఐపీఓ - వరల్డ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ‌(www.wipo.int)
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పేటెంట్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్‌ అటార్నీ (www.iipta.com)
* ఇండియన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ (www.ili.ac.in)
* ఇగ్నో (www.ignuonline.ac.in)
* సీఎస్‌ఐఆర్‌ - యూఆర్‌డీఐపీ పాట్‌ఇన్‌ఫర్మాటిక్స్‌ కోర్సెస్‌ (www.urdip.res.in)
* ఎన్‌ఐపీఓ ఐపీ అకాడమీ ఎక్స్‌పర్ట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ పేటెంట్స్‌ (www.nipoipacademy.com)
* ఐఐపీఆర్‌డీ (www.iiprd.com)
* రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌, నాగ్‌పూర్‌ (www.ipindia.nic.in)

కోర్సులు అందించే విద్యాసంస్థలు
కొన్ని విద్యాసంస్థలు డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయుల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి.
* అమిటీ లా స్కూల్‌, న్యూ దిల్లీ
* రాజీవ్‌గాంధీ స్కూల్‌ అండ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ లా, ఐఐటీ ఖరగ్‌పూర్‌
* నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌
* జీఎన్‌ఏ పేటెంట్‌ గురుకుల్‌, ముంబయి
* శ్రీవల్‌ పార్లే కెలవానీ మండల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌వర్స్‌ ప్రాపర్టీ స్టడీస్‌
* ఏషియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సైబర్‌ లాస్‌, పుణె
* ఎస్‌ఆర్‌ఐఎస్‌టీఐ, సొసైటీ ఫర్‌ రిసెర్చ్‌ అండ్‌ ఇనీషియేటివ్స్‌ ఫర్‌ సస్టేనబిల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, అహ్మదాబాద్‌
* ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, న్యూదిల్లీ
* యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
* నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు
* బయోఇన్‌ఫర్మాటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, నోయిడా
* అకాడమీ ఆఫ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ స్టడీస్‌, ముంబయి
* వీపీఎమ్స్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ సెంటర్‌, థేన్‌

- రవి కటుకం, ఇన్నోవేషన్‌ ఇవాంజిలిస్ట్‌


Back..

Posted on 24-04-2019