Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇంటర్‌ నుంచి ఇంజినీరింగ్‌కు!

ఇంజినీరింగ్‌ కళాశాలల్లోకి నూతన విద్యార్థులు ఉత్సాహంగా అడుగుపెడుతున్న సమయమిది. ఈ వృత్తివిద్యను విజయవంతంగా అభ్యసించాలంటే కొన్ని అంశాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. భవితకు పటిష్ఠంగా పునాది వేసుకోవాలి!

పాఠశాల/ ఇంటర్మీడియట్‌ విద్య మాదిరి కాకుండా విద్యార్థి సంపూర్ణ పరిణతి సాధించడానికి కళాశాల విద్య దోహదపడుతుంది. ప్రయోగశాలలూ, అనుబంధ కోర్సుల ద్వారా ఎంతో నేర్చుకునే వెసులుబాటూ ఉంటుంది. ఆసక్తి ఉన్న కెరియర్‌లో ముందుకు సాగాలన్నా, పీజీలో సీటు సాధించాలన్నా ఇంజినీరింగ్‌ తొలి ఏడాది నుంచే తగిన ప్రణాళిక వేసుకోవాలి.
ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎప్పుడూ కొత్తవి నేర్చుకోవాలన్న కుతూహలం ఉండాలి. సమస్యా విశ్లేషణ, పరిష్కార మార్గాల రూపకల్పన; అభివృద్ధి, సంక్లిష్ట సమస్యలను అర్థం చేసుకోవడం, అత్యాధునిక పరికరాల వినియోగం, భావప్రకటనా నైపుణ్యాలు, ఒంటరిగా /ఇతరులతో కలిసి పనిచేయగలగడం... ఇవన్నీ అలవరచుకోవడానికి రానున్న నాలుగేళ్ళలో విద్యార్థులు కృషిచేయాలి.
తొలి ఏడాది సైన్స్‌, గణితం, ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లోని మౌలికాంశాలను బోధిస్తారు. ఇంటర్మీడియట్‌ స్థాయిలో ప్రత్యామ్నాయాల నుంచి జవాబులు రాబట్టే (ఆబ్జెక్టివ్‌) విధానానికి అలవాటుపడివుంటారు. దాన్నుంచి విద్యార్థులు త్వరగా బయటపడి, వాస్తవిక సమస్యలను పరిష్కరించగలిగేలా, మౌలికాంశాలపై అవగాహన ఏర్పరచుకునే కృషిచేయాలి.
తరగతులకు క్రమం తప్పకుండా వెళుతున్నారా లేదా అని కౌమార దశలో ఉన్న విద్యార్థులను పర్యవేక్షించడం అటు తల్లిదండ్రులకూ, ఇటు అధ్యాపకులకూ కూడా సాధ్యం కాదు. సబ్జెక్టులపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవడానికి ఇదో అవరోధంగా పరిణమిస్తోంది. గైర్హాజరు మూలంగా అధ్యాపకులు చెప్పే పాఠం అర్థంకాక చాలామంది అవస్థలు పడుతున్నారు. క్రమంగా ఇది తరగతులపై అనాసక్తతకు దారితీస్తోంది.

అనుదినం... అభ్యాసం
ఏవైనా ముఖ్యమైన కుటుంబపర కార్యక్రమాలుంటేనో, అస్వస్థతకు గురైతేనో తప్ప తరగతులకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా విద్యార్థులు ప్రయత్నించాలి. చాలామంది క్రమం తప్పకుండా చదవడాన్ని విస్మరించి కేవలం మిడ్‌టర్మ్‌, సెమిస్టర్‌ పరీక్షల ముందు మాత్రమే చదువుతారు. మంచి మార్కులు సాధించడానికి ఈ తరహా విధానం ఉపకరించదు. మంచి గ్రేడు /మార్కులు సాధించాలంటే ప్రతి విద్యార్థీ రోజుకు 2 నుంచి 3 గంటలు చదవడం తప్పనిసరి.
అసైన్‌మెంట్లు పూర్తిచేయడం ద్వారా పాఠ్యాంశాలపై పట్టు సాధించవచ్చు. అసైన్‌మెంట్లపై తేలిక భావంతో కొందరు సబ్జెక్టుపై అవగాహన ఏర్పరచుకోకుండా, మిత్రుల సాయంతో వాటిని పూర్తిచేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది సరికాదు.
లేబొరేటరీ తరగతులను పెద్దగా పట్టించుకోకుండా, ప్రయోగాల వెనుకున్న మౌలికాంశాలను తెలుసుకోకుండానే కొంతమంది ప్రాజెక్టు నివేదికలను సమర్పిస్తుంటారు. నేర్చుకున్న ప్రాథమిక సూత్రాలను ప్రయోగరూపంగా కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు ఇతర లేబొరేటరీల్లో తెలుసుకోవాలి. సిద్ధాంతపరంగా తాము నేర్చుకున్న మౌలికాంశాలను ప్రయోగరూపంగా ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడం తప్పనిసరి.
విద్యార్థుల్లో భాషాపరమైన, భావప్రకటనకు సంబంధించిన నైపుణ్యాలు తక్కువగా ఉంటున్నాయని చాలా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఆంగ్ల దిన, వారపత్రికలను రోజూ చదవడం, వార్తలు వినడం ద్వారా ఈ సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలి. తొలి ఏడాది నుంచే ఇందుకు సన్నద్ధం కావాలి.
ప్రశ్నలకు జవాబులిచ్చే, విని నేర్చుకునే సాఫ్ట్‌వేర్లు ఆంగ్ల భాషా లేబొరెటరీల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులు భాషా నైపుణ్యాలు పెంపొందించుకునే లేబొరేటరీలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. దీంతోపాటు ఆంగ్లంలో ఇతరులతో మాట్లాడటం, రాయడం ద్వారా తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలి.

పాఠ్యపుస్తకాల ప్రాముఖ్యం
సిలబస్‌లో ఉన్న పుస్తకాలను కొనుక్కోవడానికి చాలామంది విద్యార్థులు సంకోచిస్తారు. ‘పాత చొక్కానైనా ధరించు, కానీ కొత్త పుస్తకాన్ని కొనుక్కో’ అనేది సూక్తి. మంచి పుస్తకం కోర్‌ (మౌలిక) కోర్సుల్లోని పాఠ్యాంశాలను తెలుసుకోవడంతోపాటు వృత్తిలో రాణించడానికి కూడా తోడ్పడుతుంది.
ఖాళీగా ఉన్నపుడో, గ్రంథాలయానికి కేటాయించిన సమయంలోనో రెఫరెన్స్‌ పుస్తకాలకు కొంత సమయం కేటాయించాలి. పుస్తకాలను అరువు తెచ్చుకుని కూడా చదువుకోవచ్చు. నిపుణులు రూపొందించిన ఎన్‌పీటెల్‌ వంటి ఆన్‌లైన్‌ వీడియో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని విని సొంతంగా నోట్సు తయారుచేసుకోవచ్చు. అలాగే వీడియో ఉపన్యాసాలు, పాఠ్య పుస్తకాలు, తరగతిలో వింటూ కూడా నోట్సు రాసుకోవచ్చు.
విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా పాఠ్యాంశాలను ఎంపిక చేసుకోవాలి. ప్రముఖ ప్రచురణకర్తలు ప్రచురించిన మంచి పుస్తకాలను రెఫరెన్స్‌గా చదవాలి. పోటీ పరీక్షలు /గేట్‌ వంటి పరీక్షలకు సిద్ధమయేటపుడు ముందుగా పాత ప్రశ్నపత్రాలను చూడాలి. మౌలికాంశాలపై ఉన్న జ్ఞానాన్ని తెలుసుకునేలా ఎలా ప్రశ్నలు ఇస్తున్నారో తెలుసుకుని, అందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలి. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తర్ఫీదయ్యేవారు తగిన జ్ఞానాన్ని సమకూర్చుకోవడంతోపాటు బ్యాక్‌లాగ్‌ల నుంచీ తప్పించుకోవచ్చు. మంచి గ్రేడును పొందడంతోపాటు ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కొని విజయం సాధించవచ్చు.

పాఠ్యాంశాల కంటే అదనంగా కొన్ని అనుబంధ కోర్సులను కూడా వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలలు అందిస్తున్నాయి. ఉద్యోగాలిచ్చే వారి అంచనాలకు తగ్గట్టు రాణించేలా తగిన తర్ఫీదు ఆయా కళాశాలల్లోని శిక్షణ, ఉపాధి కల్పన (ట్రెయినింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌) విభాగాలు ఇస్తున్నాయి. కోర్సు ముగిసేలోపే ఉద్యోగాలు పొందడానికి దోహదపడుతున్నాయి. ఆయా శిక్షణ తరగతులకు నిబద్ధతతో, క్రమం తప్పకుండా హాజరై తమకు వచ్చిన అవకాశాన్ని ప్రతి విద్యార్థీ సద్వినియోగం చేసుకోవాలి.

పునాది తొలి ఏడాదే!

ఇంజినీరింగ్‌లోని ఈ నాలుగు సంవత్సరాల్లో మొదటి సంవత్సరం చాలా కీలకం. ఈ కోర్సుకి సంబంధించిన పునాది పడేదప్పుడే. అందుకే మొదటి సంవత్సరంలో పట్టుదలగా చదవవలసి ఉంటుంది. మొదటి సంవత్సరంలో కొద్దిపాటి తేడాతో ప్రతి బ్రాంచిలోనూ కామన్‌ సబ్జెక్టులు ఉంటాయి. ఇక రెండో సంవత్సరం నుంచి వారు ఎంచుకున్న కోర్‌ సబ్జెక్టుపై దృష్టిసారించవలసి ఉంటుంది.
* ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచికి చెందిన విద్యార్థి అయినా గణితం, డ్రాయింగ్‌ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈ రెండు సబ్జెక్టుల్లో ఇష్టం, ప్రావీణ్యం సంపాదించకపోతే తరువాతి సంవత్సరాల్లో దీని ప్రభావం పడుతుంది.
* సబ్జెక్టు, ఇతర సంబంధిత పుస్తకాలు చదువుతుండాలి. ఏ విషయాలపై పట్టు సాధించాలి, ఏ నైపుణ్యాలు సంపాదించాలో అధ్యాపకుల, సీనియర్‌ విద్యార్థుల సలహాలతో అవగాహన పెంచుకుని ముందుకుసాగాలి.
* సబ్జెక్టు పరిజ్ఞానం, వినూత్న ఆలోచనలు ఇంజినీర్లకు అవసరం. వాటికి సరైన రూపమిచ్చి వ్యక్తపరచడానికి భావప్రకటన సామర్థ్యం ఉండాలి. మొదటి సంవత్సరం నుంచే ఆంగ్లభాషపై పట్టుకోసం సాధన చేయాలి. తరగతిలో చెప్పే పాఠాలు వింటూ సహవిద్యార్థులతో, అధ్యాపకులతో ఆంగ్లంలోనే సంభాషించడం ద్వారా పట్టు సాధించవచ్చు.
* మొదటి సంవత్సరంలో ఇంగ్లిష్‌ లాబ్‌ తరగతులు ఉంటాయి. ఈ తరగతిలో ఆడియో, వీడియో ఉపయోగిస్తూ బృందచర్చలు, ఒక్క నిమిషంలో ఇచ్చిన అంశంపై తడబాటు లేకుండా అనర్గళంగా మాట్లాడడం , డిబేట్లలో చురుకుగా పాల్గొనటం చేయాలి. స్టేజ్‌ఫియర్‌ పోవటంతోపాటు ఈ క్రమంలో నాయకత్వ లక్షణాలు కూడా అలవడే అవకాశం ఉంది.
* ఈ పోటీ ప్రపంచంలో ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచి తీసుకున్నా ప్రతి విద్యార్థికీ కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. కాబట్టి కనీసం ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌ మీద అవగాహన సంపాదించాలి.
* కేవలం చదువులోనే కాకుండా ఇంజినీరింగ్‌ తర్వాత ఏ రంగంలో స్థిరపడదలచుకున్నారో (ఎంఎస్‌, ఎంటెక్‌, గేట్‌, ఉద్యోగం) కచ్చితంగా ధ్యేయం పెట్టుకుని దానిపై దృష్టిసారించాలి.
* ఏ బ్రాంచికి చెందినవారైనా సాంకేతిక నైపుణ్యాలతోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌ కూడా అవసరం. సాఫ్ట్‌ స్కిల్స్‌ అంటే భావప్రకటన నైపుణ్యాలతోపాటు సానుకూల దృక్పథం, శరీరభాష, వినడం, రాయడం, ప్రదర్శన, నాయకత్వ, సృజనాత్మక నైపుణ్యాలు కూడా. ప్రతి సంస్థా ఉద్యోగ నిమిత్తం తాము ఎంచుకునే అభ్యర్థిలో ఈ లక్షణాలన్నీ ఉండాలని ఆశిస్తుంది. వీటిలో నిష్ణాతులు అవడానికి మొదటి సంవత్సరం నుంచే తగిన ప్రయత్నం ఆరంభించవలసి ఉంటుంది.

Back..

Posted on 09-08-2016