Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇలా చదివితే ఇట్టే మార్కులు..!

* ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రత్యేకం
ఈనాడు, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి ముఖద్వారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం.. ఇందులో సాధించే మార్కులు, చూపించే ప్రతిభ విద్యార్థుల భవితను నిర్దేశిస్తుంది.. మార్కుల సాధనకు అందరూ శ్రమిస్తారు.. తెలివిగా.. సులువుగా చదవడం.. చదివింది శతశాతం జవాబు పత్రంలో ప్రతిబింబించేలా రాసినప్పుడే విద్యార్థి రెండేళ్ల శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు ఎలా చదివితే ఎక్కువ మార్కులు సాధిస్తారో పాఠ్యాంశాల నిపుణులు ‘ఈనాడు’కు వివరించారు.. వారిచ్చిన సూచనలు, చిట్కాలు.. ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేకం...
ఆంగ్లం
* మార్పులను గమనిస్తేనే మార్కులు
ఆంగ్ల పాఠ్యాంశ సిలబస్‌తో పాటు ప్రశ్నపత్రమూ మారింది. మొత్తం 20 ప్రశ్నలకు సమాధానం రాయాలి. గద్యం, పద్య విభాగాలు, నాన్‌ డిటైల్డ్‌ భాగం అన్నింటినీ కలిసి మాడ్యూల్స్‌గా విభజించారు.
* ప్రశ్నపత్రాన్ని మూడు విభాగాలుగా విభజించారు. సెక్షన్‌-ఏలో 40 మార్కులు( 5 బిట్స్‌), సెక్షన్‌-బిలో 16 మార్కులు (4 బిట్స్‌), సెక్షన్‌-సిలో 44 మార్కులు (11 బిట్స్‌)కు సమాధానం రాయాలి.
* సెక్షన్‌-ఏలో గద్య, పద్య భాగం నుంచి యాంటానమ్స్‌, స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. చిన్న కథలు (షార్ట్‌ స్టోరీస్‌) నుంచి షార్ట్‌ ఆన్సర్‌ ప్రశ్నలు ఇస్తారు. 1వ బిట్‌లో గద్య భాగం నుంచి 3 యాంటానమ్స్‌ ఉంటాయి. వాటిల్లో రెండు రాయాలి. 2వ బిట్‌లో పద్య భాగం నుంచి 3 యాంటానమ్స్‌లో రెండు రాయాలి. ఎక్కువ మార్కులు పొందాలంటే నాలుగు మాడ్యూళ్లు పూర్తిగా చదవాలి.
* సెక్షన్‌-బిలో 4 బిట్స్‌ ఉంటాయి. 6వ బిట్‌లో ఏదైనా ఒక షార్ట్‌ స్టోరీ నుంచి ఒక పాసేజ్‌ ఇస్తారు. దాని కింద ఇచ్చిన ఆరు ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానాలు గుర్తించాలి. అందుకు పాఠాల చివరన పాసేజ్‌లతో పాటు, రివిజన్‌ టెస్టులు, నమూనా ప్రశ్నపత్రంలో ఇచ్చిన పాసేజ్‌లను క్షుణ్ణంగా చదవాలి.
* ఛాయిస్‌ ఉందని వదిలివేయడం సరైన పద్ధతి కాదు. ఒక్కోసారి అతి విశ్వాసంతో తప్పులు చేస్తుంటారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఉత్తమం. ముఖ్యంగా సెక్షన్‌-బి, సీల్లో ఇది పాటించాలి.
                    - చకిలం అమరేందర్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ధర్మసాగర్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లా
తెలుగు
* వ్యాకరణ అంశాల్లో కొట్టివేతలు వద్దు
తెలుగు ప్రశ్నపత్రంలో మొత్తం 16 ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రాన్ని 1-8 వరకు ప్రధాన విభాగంగా, 9-16 వరకు సహాయ విభాగంగా చెప్పుకోవచ్చు. సహాయ విభాగం తెలివైన విద్యార్థులకు మార్కుల స్కోరింగ్‌కు, సాధారణ విద్యార్థుల ఉత్తీర్ణతకు సహాయకారిగా చెప్పుకోవచ్చు.
* అడిగిన రెండు పద్యాల్లో రాయదలచుకున్న పద్యాన్ని ఒకసారి శ్రద్ధగా చదవాలి. పాఠంలో ఆ పద్యం వచ్చిన సందర్భాన్ని అర్ధం చేసుకొని ప్రతి పదానికి అర్ధం రాయాలి. వరుసగా రాసిన అర్ధాలతో వాక్యాల్ని నిర్మిస్తూ భావం రాయాలి. ఒకటీ అరా వ్యాకరణాంశాల్ని జోడించడం ద్వారా పూర్తి మార్కులు పొందవచ్చు. పద్య భాగంలోని 1, 3 పాఠాల్లోని చుక్క పద్యాలు ముఖ్యమైనవి.
* 2, 3వ ప్రశ్నలు: పద్య, గద్య భాగాల్లోని వ్యాసరూప ప్రశ్నలు. రెండు చొప్పున అడుగుతారు. ఒకటి చొప్పున సమాధానాలివ్వాలి. 20 పంక్తుల సమాధానాన్ని మూడు పేరాలుగా విభజించి రాయాలి. 4వ ప్రశ్నలో నాటక స్రవంతి నుంచి అడిగిన నాలుగు ప్రశ్నల్లో రెండింటికి జవాబు రాయాలి. దీనికి 12-18 పంక్తుల వరకు రెండు పేరాలుగా రాస్తే సరి.
* 5, 6 ప్రశ్నలు: విద్యార్థికి పాఠ్య పుస్తకంతో ఉన్న అనుబంధాన్ని ప్రశ్నించే ప్రశ్నలివి. ఇవి సందర్భ వాక్యాలు. పద్యభాగం, నాటక స్రవంతి నుంచి నాలుగేసి చొప్పున అడుగుతారు. రెండేసి జవాబులు చొప్పున రాయాలి. పరిచయం, సందర్భం, వివరణ అనే మూడు ఉప శీర్షికల కింద విషయాన్ని వివరంగా రాయాలి.
* 7, 8 ప్రశ్నలు: ఈ ప్రశ్నల నుంచే ప్రశ్నపత్రం తేలికవడం మొదలవుతుంది. తరగతి గదిలో పాఠాలు శ్రద్ధగా వినని విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో సమాధానాలు రాయవచ్చు. పద్య, గద్య భాగాల నుంచి నాలుగేసి ప్రశ్నలు అడుగుతారు. రెండేసి చొప్పు జవాబులు రాయాలి.
                    - ఎస్‌ఎస్‌ రాజు, తెలుగు అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, హుస్నాబాద్‌
భౌతికశాస్త్రం
* ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి
ఇంటర్‌ రెండో సంవత్సరం భౌతికశాస్త్రంలో మొత్తం 16 అధ్యాయాలున్నాయి. మొత్తం 76 మార్కుల ప్రశ్నపత్రం నుంచి 60 మార్కుల ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. వంద శాతం మార్కులు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న వారు అన్ని ప్రశ్నలపైనా దృష్టి సారించాలి. ఇప్పటివరకు అంతగా సిలబస్‌ను పట్టించుకోని వారు ఇప్పటి నుంచి మిగిలిన సమయంలో ఎక్కువ మార్కులు సాధించడానికి తన శక్తి సామర్ధ్యాలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలి.
* భౌతికశాస్త్రం అంశాలపై పూర్తి పట్టు సాధించడానికి ఒకటికి రెండు సార్లు జవాబులను రాసి సరిచూసుకోవాలి. వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులు. మూడింట్లో రెండింటికి సమాధానాలు రాయాలి. ఇవి ప్రధానంగా తరంగాలు, ప్రవాహ విద్యుత్తు, కేంద్రకాలు అనే అధ్యాయాల నుంచి వచ్చే అవకాశముంది. వ్యాసరూప ప్రశ్నలో నిర్వచనం, పటం, చిన్న లెక్క, ఉత్యాదనలు ఉండొచ్చు. వాటి నిడివి ఆధారంగా 8 మార్కులను విభజిస్తారు. 1, 6, 14వ అధ్యాయాల నుంచి వచ్చే వ్యాసరూప ప్రశ్నల్లోని చిన్న లెక్కలను సాధించడానికి ఆ అధ్యాయాల్లోని చిన్న లెక్కలను సాధన చేయాలి. పటాన్ని గీయడానికి అనవసరంగా రంగు పెన్సిళ్లు, కలాలు వాడాల్సిన అవసరం లేదు.
* సెక్షన్‌-బిలోని 8 స్వల్ప సమాధాన ప్రశ్నల నుంచి ఆరింటికి సమాధానాలు రాయాలి. నాలుగు మార్కుల ప్రశ్నలు, 2, 3, 4, 5, 7, 9, 13, 15వ అధ్యాయాల నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ.
* 10, 11, 16వ అధ్యాయాల నుంచి కేవలం రెండు మార్కుల ప్రశ్నలే వచ్చే అవకాశముంది.
                    - అనంత రామకృష్ణ, భౌతికశాస్త్ర అధ్యాపకుడు, ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల, జగిత్యాల
జంతుశాస్త్రం
* అవగాహనతో చదివితేనే ప్రయోజనం
జంతుశాస్త్రం వార్షిక పరీక్షల్లో 2 దీర్ఘ సమాధాన, 6 స్వల్ప, 10 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. దీర్ఘ సమాధాన తరహా ప్రశ్నలు చదివేటప్పుడు పూర్తి విషయ అవగాహనతో చదివితే దానికి సంబంధించిన 4, 2 మార్కుల ప్రశ్నలకు కూడా సమాధానం రాయవచ్చు.
* గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే దీర్ఘ సమాధాన తరహా ప్రశ్నలు ఎక్కువగా 1 నుంచి 6వ యూనిట్‌లోంచి రావడాన్ని గమనించవచ్చు. తరచుగా 1.గుండె అంతర్‌ నిర్మాణం, గుండె పనిచేసే విధానం, 2.జీర్ణ వ్యవస్థ, జీర్ణ క్రియా విధానం 3.శ్వాస వ్యవస్థ, వాయువుల రవాణా 4.నాడీ వ్యవస్థ, నాడీ ప్రబోధనం 5.స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పిండాభివృద్ధిలకు సంబంధించిన అంశాల నుంచి వచ్చే అవకాశముంది.
* స్వల్ప సమాధాన ప్రశ్నల్లో ఎనిమిదింటికి ఆరు రాయాలి. ఇవి ప్రతి యూనిట్‌ నుంచి రావొచ్చు. ఈ విభాగంలో ఛాయిస్‌ ఉండటం వల్ల చదివేటప్పుడు కొంత వెసులుబాటు ఉంటుంది. ఒక ప్రశ్న పటం (డయాగ్రమ్‌)కు సంబంధించింది వస్తుంది. దీనికి తప్పక ప్రయత్నం చేస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు. పటంతో పాటు భాగాలకూ సమ ప్రాధాన్యముంటుంది. భాగాలను కుడి వైపు వచ్చే విధంగా చూసుకుంటే మంచిది.
* ముఖ్యమైన పటాలు ఇవీ. 1.దంతం నిలువుకోత 2.కశేరు నాడీ దంతం 3.మూత్రపిండం, 4.సైనోవియల్‌ కీలు 5.స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు.
* స్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానం వీలైనంత వరకు పాయింట్ల వారీగా (కనీసం 8 పాయింట్లు) రాయాలి. భేదాలకు సంబంధించిన ప్రశ్నలకు పట్టికల రూపంలో సమాధానాలు రాయడం ఉత్తమం. ఉదాహరణకు ధమనులు, సిరల మధ్య వ్యత్యాసం.
* అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు దాదాపుగా అన్ని యూనిట్ల నుంచి వచ్చే అవకాశముంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే 7, 8 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తుండటాన్ని గమనించవచ్చు. ఈ రకమైన ప్రశ్నలకు సమాధానాలు తక్కువ సమయంలో రాయవచ్చు. ప్రశ్నలను పూర్తిగా చదవాలి. ఒక్కోసారి ప్రశ్నలో రెండు భాగాలుంటే ఒకటే రాసే అవకాశముంది. ఉదాహరణకు స్వయం ఉత్ప్రేరణ అంటే ఏమిటి? రెండు ఉదాహరణలు ఇవ్వండి? అని అడిగితే ఉదాహరణలు రాయకపోతే ఒక మార్కు కోల్పోయే ప్రమాదముంది.
                    - ఐ.రాంప్రసాద్‌, జంతుశాస్త్ర అధ్యాపకుడు
రసాయనశాస్త్రం
* ఫార్ములాలు... సమీకరణాలపై పట్టు అవసరం
రసాయనశాస్త్రంలో ఉండే 13 యూనిట్లలో ముఖ్యమైన ప్రశ్నల్ని మొదట సాధన చేస్తే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. తర్వాత మిగిలిన ప్రశ్నలకు సమాధానం నేర్చుకోవచ్చు. రౌల్ట్‌ నియమం, కోల్‌రాష్‌ నియమం వంటి నిర్వచనాలన్నింటినీ నేర్చుకుంటే 15 మార్కులు సాధించవచ్చు.
* ప్రశ్నపత్రంలో సెక్షన్‌ ఏ, బీ లలో వచ్చే లెక్కలను ప్రయత్నిస్తే బైపీసీ విద్యార్థులూ చేయవచ్చు. ద్రావణాలు, విద్యుత్తు రసాయన శాస్త్రాల నుంచి ఈ లెక్కలు వచ్చే అవకాశముంది. ప్రశ్నలను సరిగా అర్ధం చేసుకొని దాంట్లోని విలువలను క్రమపద్ధతిలో రాసుకోవాలి. సరైన ఫార్ములాను రాసి ఆయా విలువలను ప్రతిక్షేపించి సూక్ష్మీకరిస్తే సమాధానం వస్తుంది.
* పటాలు ఉండే ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ పటాన్ని తప్పక గీయాలి.
* రసాయన శాస్త్రంలో రసాయన సమీకరణాలు ఉంటాయి. వాటిల్లో ఉండే ఫార్ములాలను ముందు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆ సమీకరణాలను సాధన చేయాలి.
* సెక్షన్‌-ఏ లో ఇచ్చే 10 ప్రశ్నలకు సమాధానాలు ఒక చోట రాస్తే మంచిది. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు మొదటి అరగంటలో సరిగా రాస్తే 20 మార్కులు సాధించవచ్చు. తర్వాత 8 స్వల్ప సమాధాన ప్రశ్నల్లో ఆరింటికి గంటన్నర రాయాలి. చివరగా వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు రాస్తే మంచిది.
* సెక్షన్‌-సిలో వ్యాసరూప ప్రశ్నలను రెండు భాగాలుగా విభజించి ఇస్తున్నారు. అందువల్ల అన్ని యూనిట్లలో ఉండే ముఖ్యమైన స్వల్ప సమాధాన ప్రశ్నలను నేర్చుకుంటే సెక్షన్‌-బి, సీల్లోని ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాయొచ్చు.
* ముఖ్యమైన స్వల్ప సమాధాన ప్రశ్నలు సుమారుగా 40 ఉన్నాయి. రోజుకు 4 ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకోవచ్చు. అంటే 10 రోజుల్లో సెక్షన్‌- బి, సిల లోని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేయవచ్చు. తర్వాత పునశ్చరణ చేయవచ్చు.
* దీర్ఘ సమాధాన ప్రశ్నలు 1.విద్యుత్తు రసాయన శాస్త్రం, రసాయన గతిక శాస్త్రం 2. పి.బ్లాక్‌ మూలకాలు 3. కర్బన రసాయన శాస్త్రం (11, 12, 13 యూనిట్లు) నుంచి వచ్చే అవకాశముంది.
                    - ఆర్‌. నరేందర్‌ గౌడ్‌, రసాయనశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పటానుచెరు
గణితం
* సిలబస్‌ పూర్తిగా చదివితేనే...
మిగతా సబ్జెక్టులకు భిన్నంగా గణితంలో రెండు పేపర్లు ఉంటాయి. గణితం 2-ఏ, 2-బి. ఒక్కో దానికి 75 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో 7 దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వాటిల్లో అయిదింటికి సమాధానాలు రాయాలి. ఏడు స్వల్ప ప్రశ్నలకు అయిదింటికి జవాబులు ఇవ్వాలి. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 10 ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి. గణితం 2-బి పేపర్‌లోనూ ఇలాగే ఉంటుంది.
* సాధారణంగా కొందరు విద్యార్థులు కష్టంగా ఉన్నాయనే భావనతో లేదా తగిన సమయం లేదనో కొన్ని అధ్యాయాలను చదవకుండా వదిలేస్తుంటారు. గణితం లాంటి సబ్జెక్టుల్లో అలా వదిలేస్తే నష్టపోతారు. ప్రతి అధ్యాయానికి ముందు ఉన్న అధ్యాయంతో సంబంధముంటుంది. ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఒకవేళ ప్రథమ సంవత్సరంలో ఏవైనా అధ్యాయాలను వదిలేస్తే వాటిని ఒకసారి చదివి... తర్వాత వాటితో సంబంధమున్న రెండో సంవత్సరం అంశాలను చదవాలి.
* సిలబస్‌ను చదవడం పూర్తయిన తర్వాత మొదటి, రెండో రివిజన్‌ సమయంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు, ఉదాహరణలకు ప్రాధాన్యమివ్వాలి. విద్యార్థులు తొలుత తేలికైన అంశాలను చదవటం దిగ్విజయంగా పూర్తిచేస్తే తర్వాత కష్టమైన అంశాలను పూర్తి చేసేందుకు తగిన ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది.
* గణితం 2-ఏలో 10 అధ్యాయాలుంటాయి. సంకీర్ణ సంఖ్యలు నుంచి 8 మార్కులు, డీ మోయిరేస్‌ సిద్ధాతం- 9 మార్కులు, వర్గ సమీకరణాలు- 6, సమీకరణ వాదం-9, ప్రస్తారాలు, సంయోగాలు- 12, ద్విపద సిద్ధాంతం- 16, పాక్షిక భిన్నాలు-4, విస్తరణ కొలతలు- 9, సంభావ్యత- 15, యాదృచ్ఛిక చలరాశులు- సంభావృత విభాజనాలు- 9 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. అంటే మొత్తం 97 మార్కులకు ప్రశ్న పత్రం ఇస్తే 75 మార్కులకు సమాధానాలు రాయాలి.
* ద్విపద సిద్ధాంతం అధ్యాయంలో కొన్ని సమస్యలు సంక్లిష్టంగా ఉన్నా... ఎక్కువ మార్కులు దీనికి కేటాయించారని గమనించాలి. అందువల్ల సాధనకు అధిక సమయం వెచ్చించాలి. సంభావ్యతలోని రెండు అధ్యాయాలు సిద్ధాంతపరంగానే కాకుండా మార్కులపరంగానూ ముఖ్యమైనవి. సంభావ్యత సంకలన సిద్ధాంతం, ఇచ్చిన పట్టిక నుంచి స్థిర విలువ మధ్యమం, విస్తృతిని కనుగొనడం చాలా ముఖ్యమైనవి.
* గణితం 2- బిలో 8 అధ్యాయాలున్నాయి. వృత్తం- 22 మార్కులు, వృత్త సరణులు-6, పరావలయం-9, దీర్ఘవృత్తం-8, అతి పరావలయం-6, సమకలనం- 18, నిశ్చిత సమకలనులు- 15, అవకలన సమీకరణాలు- 13 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
* 2-బి ప్రశ్నపత్రంలో వచ్చే ప్రశ్నలు దాదాపు నేరుగా, ఎలాంటి తికమకలు లేకుండా వస్తాయి.
                    - ఎం.విజయభాస్కర్‌, గణిత అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బీహెచ్‌ఈఎల్‌
వృక్షశాస్త్రం
* అవసరమైన చోట పటాలు ముఖ్యం
వృక్షశాస్త్రపాఠ్య ప్రణాళిక మొత్తం ఆరు యూనిట్లు్లగా విభజించారు. అందులో 8 మార్కుల దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. కచ్చితంగా...1, 5, 6వ యూనిట్ల నుంచి ఒక్కో ప్రశ్న వస్తుంది.
* ఒకటో యూనిట్‌లో 4వ అధ్యాయం నుంచి కాల్విన్‌ వలయం గురించి, 5వ అధ్యాయం నుంచి గ్లైకాలిసిస్‌ లేదా క్రెబ్స్‌ వలయం గురించి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువ. 5వ యూనిట్‌లో జీవ సాంకేతిక శాస్త్రం అధ్యాయం నుంచి పునఃసంయోజక సాంకేతిక ప్రక్రియలోని వివిధ దశలు అనే ఈ ప్రశ్న సాధారణంగా పునరావృతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 6వ యూనిట్‌లో ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు అనే అధ్యాయం నుంచి కణజాల వర్ధనం ప్రక్రియ దశలు, ప్రయోజనాలు లేదా మొక్కల ప్రజననంలో ఒక కొత్త రకాన్ని విడుదల చేసే క్రమంలో ప్రజననకర్తలు పాటించే వివిధ దశలు- ఈ రెండు అంశాల నుంచి ఒక ప్రశ్న తప్పక వచ్చే అవకాశం ఎక్కువ.
* నాలుగు మార్కుల స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎనిమిదింటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. అందులో యూనిట్‌-1లో 3 ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఎక్కువ. అవి సాధారణంగా అధ్యాయం 1-6 అధ్యాయాల్లో దేన్నుంచైనా రావొచ్చు. ఎక్కువగా ‘ఖనిజ పోషణ’ అధ్యాయం నుంచి వేరు బుడిపెలు ఏర్పడే విధానం లేదా ‘నత్రజని వలయంలోని వివిధ దశలు, ఎంజైమ్‌లు’ అధ్యాయం నుంచి వివిధ రకాల సహ కారకాల గురించి వివరణ, కిరణజన్య సంయోగక్రియ అధ్యాయం నుంచి సీ3 వలయం, సీ4 వలయాల మధ్యగల 8 తేడాలు, హరితరేణువు నిర్మాణం, శ్వాసక్రియ అధ్యాయం నుంచి శ్వాసక్రియ కోషంట్‌ లేదా కిణ్వన పద్ధతి, మొక్క పెరుగుదల అభివృద్ధి అధ్యాయం నుంచి ఏదైనా ఫైటోహార్మోన్‌ ప్రదర్శించే క్రియాత్మక ప్రభావాలు అనే అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.
* రెండు మార్కుల అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను అన్ని అధ్యాయాల నుంచి నేర్చుకోవాలి. వీటిల్లో ఛాయిస్‌ ఉండదు...అన్నింటికీ సమాధానాలు రాయాలి.
* అవసరమైన చోట భాగాలు గుర్తించిన పటాలు గీయండి. అందమైన చిత్రపటాల జవాబు పత్రానికి అదనపు ఆకర్షణ. ముఖ్యమైన పాయింట్లను రంగు కలాలతో అండర్‌లైన్‌ చేయడం అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది.
* భాగాలు గుర్తించిన పటాలు గీయకపోతే దీర్ఘ సమాధాన ప్రశ్నలకు 3 మార్కులు, స్వల్ప సమాధాన ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున కోల్పోతారని గుర్తుంచుకోవాలి.
* నాలుగు మార్కుల ప్రశ్నలు కొన్నింటికి పటాలు గీయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు సీ3 మొక్కలు, సీ4 మొక్కల మధ్య తేడాలు, జన్యు సంకేతం ప్రధాన లక్షణాలు, ఏకకణ ప్రొటీన్ల గురించిన లఘుటీక, జన్యు పరివర్తిత మొక్కల ఉపయోగాలు, జీవ ఎరువులు తదితర వాటికి పటాలు గీయాల్సిన అవసరం లేదు. అటువంటి ప్రశ్నలను ఎంపిక చేసుకుంటే సమయం ఆదా అవుతుంది.
                    - ఎం.రఘునాథ్‌, ప్రిన్సిపల్‌, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, గద్వాల్‌

Back..

Posted on 18-12-2016