Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉద్యోగానికి తొలిమెట్టు!

‘ఇంటర్న్‌షిప్‌లో మీరు ఏం చేశారు?’ ‘మీరు ఇంటర్న్‌షిప్‌ చేసిన కంపెనీ ఇటీవల ఒక కొత్త ప్రొడక్ట్‌ విడుదల చేసింది. దాని గురించి చెబుతారా?’ ఈ ప్రశ్నలతో నకిలీ ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్‌తో ఇంటర్వ్యూకి హాజరైన నరేశ్‌కి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. తడబడుతూ ఏదేదో ఒక అయిదు నిమిషాలపాటు చెప్పాడు. తలూపుతూ అంతా విని ‘ఇక మీరు వెళ్లొచ్చు’ అన్నారు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు. వూహించినట్లుగానే అతడికి ఉద్యోగం రాలేదు. నేర్చుకోవాలనే తపన, కొత్త విషయాల పట్ల జిజ్ఞాస అతడిలో లేవనే విషయం బోర్డు సభ్యులు గ్రహించారు. అకడమిక్‌ రికార్డు బాగానే ఉన్నా ఇంటర్న్‌షిప్‌ చేయకపోవడంతో నరేశ్‌ నష్టపోయాడు. ఉద్యోగాన్ని త్వరగా సాధించడానికి ఇంటర్న్‌షిప్‌ ఇప్పుడు తొలిమెట్టుగా మారింది.

శిక్షణ - సంపాదన
ఇంటర్న్‌షిప్‌ కాలంలో మనం ఎంచుకున్న సంస్థ కార్యకలాపాలపై కనీస పరిజ్ఞానం సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఈ పరిజ్ఞానం ఇంటర్వ్యూ సమయంలో ఉపయోగపడుతుంది. ఇంటర్న్‌షిప్‌ చేసిన అభ్యర్థులు వీటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. మౌలిక అంశాలపై వీరికి పట్టు ఉండటం వల్ల ఏ సమస్యకైనా పరిష్కారం చూపగలుగుతారు. శిక్షణ సమయంలో ఆయా సంస్థలు తగిన ఉపకారవేతనం లేదా పారితోషికం చెల్లిస్తాయి.

ప్రతిభ, సృజనాత్మకతలను వెలికితీసే ఇంటర్న్‌షిప్‌
ప్రముఖ సంస్థలు తమ పరిశోధనలు, వినూత్నమైన ఆవిష్కరణల్లో భాగంగా విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌ చేయడానికి ప్రోత్సహిస్తాయి. విద్యార్థుల ఉత్సాహం, జిజ్ఞాస, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌లు చేయడం వల్ల భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న సాంకేతిక విషయాలపై పనిచేసే సదవకాశం లభిస్తుంది. ఉద్యోగాల ఎంపికలో కంపెనీలు వీరికి మొదటి ప్రాధాన్యం ఇస్తాయి. ఈవిధంగా సృజనాత్మక సాంకేతిక ప్రయత్నంలో పాలుపంచుకున్న విద్యార్థులకు ఉద్యోగం సులువుగా లభిస్తుంది. కొన్నిసార్లు వీరికి మౌఖిక పరీక్ష నుంచి మినహాయింపు కూడా ఇస్తారు. నేరుగా ఉద్యోగ బాధ్యతలు అప్పగించి మొదటి రోజు నుంచే పూర్తిస్థాయి నికర వేతనం లేదా పారితోషికం అందిస్తారు. ఈ రకంగా ఉద్యోగాన్వేషణ అనే సుదీర్ఘ ప్రక్రియలో విద్యార్థి విలువైన సమయం సద్వినియోగమవుతుంది.

పూర్వానుభవానికి ప్రాధాన్యం
ఇంటర్న్‌షిప్‌ ద్వారా విద్యార్థులు విషయ పరిజ్ఞానం, వివిధ సాంకేతిక విభాగాల పనితీరుపై అవగాహన పొందుతారు. ప్రయోగపూర్వకంగా నేర్చుకుంటారు. తరగతుల్లో చదివిన మౌలిక అంశాలను పరిశ్రమల్లో నేర్చుకున్న విషయాలతో అనువర్తించుకోడానికి వీలుంటుంది. ప్రస్తుతం కళాశాలల్లో పొందిన జ్ఞానానికి, పరిశ్రమల అవసరాలకు పెద్ద అంతరం ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు ఎల్లప్పుడూ తమ కార్యకలాపాలపై అవగాహన ఉన్నవారికి లేదా పూర్వానుభవం ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

మొదటి ఏడాది నుంచే మొదలు
విద్యార్థులు మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ నుంచే ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశాలను శోధించడం మంచిది. దీనివల్ల వారు ఏయే విషయాలపై పరిజ్ఞానం పెంచుకోవాలో తెలుస్తుంది. అంతేకాకుండా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి ప్రణాళికను తయారు చేసుకునే క్రమశిక్షణ అలవడుతుంది.

తరగతికి మించి...
తరగతి గదుల్లో చెప్పని ఎన్నో విషయాలను ఇంటర్న్‌షిప్‌ ద్వారా ప్రత్యక్షంగా నేర్చుకోవచ్చు. ప్రాంగణ నియామకాల్లో ఈ ఇంటర్న్‌షిప్‌ అనుభవం తోడ్పడుతుంది. శిక్షణ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రాయోగిక జ్ఞానం పోటీ ప్రపంచంలో ముందుండటానికి సహకరిస్తుంది. ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న సమయంలోనే తమ ఉద్యోగ ప్రయత్నానికి గట్టి పునాది ఏర్పరచుకోవచ్చు. తద్వారా వాస్తవిక దృక్పథం అలవడుతుంది.

పరిశ్రమ అవసరాలకూ విషయ పరిజ్ఞానానికీ అంతరం

ఏం నేర్చుకోవచ్చు?
ఇంటర్న్‌షిప్‌లో వృత్తి సంబంధిత నైపుణ్యాలు, బృందంలోని సభ్యులతో సమన్వయంగా పనిచేయడం, భాషేతర సమాచార మార్పిడి, భావవ్యక్తీకరణ, అశాబ్దిక సంవాదం (నాన్‌వెర్బల్‌ కమ్యూనికేషన్‌)పై పట్టు, నాయకత్వ లక్షణాలను విద్యార్థులు నేర్చుకుంటారు. సంపూర్ణ మూర్తిమత్వాన్ని పొంది విలక్షణమైన, విభిన్నమైన ఆలోచనలు చేయగల నైపుణ్యాన్ని పొందుతారు.

శిక్షణలోనే ఉద్యోగం
కార్యాలయంలో ఉద్యోగుల వ్యవహారశైలి, బృందంలో కలసి పనిచేయడం, సంస్థ పనితీరు, కంపెనీ సేవలు వినియోగదారులకు చేరే విధానం లాంటి అంశాలు ఇంటర్న్‌షిప్‌లో తెలుస్తాయి. సంస్థలోని వివిధ సాంకేతిక విభాగాలపై అవగాహన ఏర్పడుతుంది. నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే క్రమంలో ప్రణాళికాబద్ధమైన జీవనం కొనసాగించడమూ అలవాటవుతుంది. ఇంటర్న్‌షిప్‌ చేసే క్రమంలో సంస్థలోని పై అధికారులు విద్యార్థి ప్రతిభా పాటవాలు, శక్తిసామర్థ్యాలు, గ్రాహ్యశక్తిని నిత్యం పరిశీలిస్తారు. ప్రతిభావంతులను గుర్తించడంలో వీరు నిష్ణాతులై ఉంటారనే విషయాన్ని మరిచిపోకూడదు. వారు కోరుకునే అర్హతలున్న అభ్యర్థులకు పూర్తిస్థాయి ఉద్యోగం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

ఇంటర్వ్యూకి ఇలా వెళ్లండి!
ఇంటర్న్‌షిప్‌ ఇంటర్వ్యూకి అభ్యర్థులు ముందస్తు సన్నద్ధతతో వెళ్లాలి. ఆయా సంస్థల కార్యకలాపాలపై పూర్తి సమాచారం సేకరించాలి. చేయబోయే పనిపై కనీస అభిప్రాయం, అవగాహన ఏర్పరచుకోవాలి. ఇప్పటివరకు ఆ సంస్థ ఎలాంటి వినూత్నమైన ఆవిష్కరణలు చేసిందో వాకబు చేయాలి. వారి క్లయింట్లు ఎవరో తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలో తమ సంస్థ గురించి అభ్యర్థులకు ఎంత అవగాహన ఉందో పరీక్షిస్తారు. దీని ద్వారా విద్యార్థుల ఉత్సాహాన్ని, ఆసక్తిని అంచనా వేస్తారు. ఇలాంటి అంశాల్లో సీనియర్ల, ప్రొఫెసర్ల సాయం తీసుకోవచ్చు. కనీస సాంకేతిక పరిజ్ఞానం పైనే ప్రశ్నలు ఎదురవుతాయి. లోతైన అంశాల జోలికి వెళ్లే అవకాశం దాదాపు ఉండదు. దీనికి తోడు జీవితకాల లక్ష్యాలు, వ్యక్తిగత అభిరుచులు, వ్యాపకాల గురించి ప్రశ్నలు సంధిస్తారు. వాటిపట్ల అభ్యర్థుల దృక్పథం కూడా చాలా ముఖ్యమని గుర్తించాలి.

‘దశ’ తిరుగుతుంది!
1. పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు.
2. బయోడేటాలో ఇంటర్న్‌షిప్‌ అనుభవాన్ని పేర్కొంటే ఉద్యోగ ఎంపికలో ప్రాధాన్యం లభిస్తుంది.
3. పనిచేస్తున్న సంస్థలోని ఉద్యోగుల వ్యవహార శైలి, రీతులను గమనించి అభ్యర్థులు పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చు.
4. వివిధ వ్యక్తుల ఉపాధి నెట్‌వర్క్‌లో భాగస్వాములు కావచ్చు.
5. భవిష్యత్తులో ఉద్యోగ ప్రయత్నాలు వెంటనే సఫలమయ్యే దగ్గరి దారి ఏర్పడుతుంది.
6. ప్రతిభాపాటవాల ప్రదర్శనకు విద్యార్థి దశలోనే వేదిక దొరుకుతుంది.
7. బృందంలో సమష్టిగా పనిచేసే సామర్థ్యం పెంపొందించుకోవచ్చు.
8. అభివృద్ధి అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.
9. వృత్తిలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి తగిన నైపుణ్యాలు, క్రమశిక్షణ అలవడుతుంది.
10. విద్యార్థి దశ నుంచే పూర్తిస్థాయి ఉద్యోగిగా రూపాంతరం చెందే అవకాశం లభిస్తుంది.

అవకాశాలు పొందడం ఎలా?
అంతర్జాలంలో వివిధ సంస్థలు ఇంటర్న్‌షిప్‌ ఖాళీల గురించి ప్రకటిస్తాయి. తమ కళాశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు లేదా ఆచార్యుల సాయం తీసుకొని ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్ని పొందవచ్చు.
ఈ కింది వెబ్‌సైట్ల నుంచి ఖాళీల వివరాలు పొందవచ్చు.
* ఇంటర్న్‌శాల
* లింక్‌డ్‌ఇన్‌
* లెట్స్‌ఇంటర్న్‌
* లెట్‌మినో
* ఇంటర్న్‌వరల్డ్‌

Posted on 30-11-2017

Back..