Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వేసవి సెలవుల్లో నైపుణ్య ప్రాప్తిరస్తు!

సమ్మర్‌ సెలవులు వస్తున్నాయ్‌.. వీటిని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలని కళాశాల విద్యార్థులందరికీ ఉంటుంది. కానీ ఎలా? ఇంటర్న్‌షిప్‌ల ప్రాధాన్యం తెలిసినప్పటికీ ఏవిధంగా ముందడుగు వేయాలీ, తమ విద్యార్హతలకు తగ్గవి ఏమున్నాయి, ఎంచుకునే పద్ధతేమిటి అనే సందేహాలు ఎదురవుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఇవి ఎక్కువ. అందుకే వేసవి ఇంటర్న్‌షిప్‌ల్లో చేరి పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంచుకోవటానికి ఉపకరించే సూచనలను అందిస్తున్నాం.

సందీప్‌ మారుమూల పల్లెటూరి అబ్బాయి. ఓ మోస్తరు పట్నంలో డిగ్రీ చదివి, హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో ఎంబీఏ- హెచ్‌ఆర్‌, మార్కెటింగ్‌ చదవడానికి వచ్చాడు. అయితే తన ఆత్మవిశ్వాసం తగ్గడం అతడి అనుభవంలోకి వచ్చింది. తన సహాధ్యాయులు అప్పటికే చొరవతో కళాశాలలో గుర్తింపు పొందారు. వివిధ కార్యకలాపాల్లో, కాలేజీ ఈవెంట్లలో పాల్గొనడం ద్వారా దూసుకువెళ్తున్నారు. సందీప్‌ విద్యాపరంగా తెలివిగల విద్యార్థే. కానీ ఇతరులతో పోటీపడటానికి ధైర్యం ఎంతో కొంత కూడగట్టుకుంటున్నప్పటికీ వెనుకంజ తప్పటంలేదు. ఏం చేయాలా అని మథనపడసాగాడు.
ఒకరోజు సామాజిక మాధ్యమాలను చూస్తుంటే ఇంటర్న్‌షిప్‌ల గురించి తెలిసింది. వాటిపై ఆసక్తి ఏర్పడింది. కుతూహలంతో వివిధ ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేశాడు. ఒక పార్ట్‌టైం సేల్స్‌ ఇంటర్న్‌గా చేరాడు.. దీనిలో భాగంగా తను ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడి దుకాణదారులకు ఆన్‌లైన్‌ విధానం, డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రాముఖ్యాన్ని వివరించేవాడు. తనకు తెలియకుండానే కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం అతడిలో బాగా పెరిగాయి.
ఇంటర్న్‌షిప్‌ అనుభవం అతడికి ఎంతగా ఉపయోగపడిందంటే.. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అతడు కంటెంట్‌ రైటర్‌, హెచ్‌ఆర్‌.. ఇంకా కొన్ని ఇంటర్న్‌షిప్‌లనూ చేశాడు. క్యాంపస్‌ అంబాసిడర్‌గా కళాశాల క్యాంపస్‌లో పాల్గొన్నాడు. ఈ ఇంటర్న్‌షిప్‌లన్నిటి అనుభవం తను వివిధ కెరియర్‌ ఆప్షన్లను ఎంచుకోవడంలో, తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంలో, కళాశాలలో పేరు తెచ్చుకోవటంలో బాగా తోడ్పడింది. గొప్ప ఆత్మవిశ్వాసాన్నీ పొందగలిగాడు. తను ఇక చిన్న కుగ్రామం నుంచి వచ్చిన సాధారణ అబ్బాయి కాదు. ఇప్పుడు తనకు ఏ వృత్తి అనువైనదో ఎంచుకోగల ఆత్మవిశ్వాసం ఏర్పడి, సహాధ్యాయులతో కలిసి ఎన్నో ఈవెంట్లలో ధైర్యంగా పాల్గొన్నాడు.
ఎందరో విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌లు ఇలాగే తీర్చిదిద్దటం అసాధారణమేమీ కాదు. ముఖ్యంగా ఈ వేసవి కాలం సెలవులు ఇంటర్న్‌షిప్‌లను చేయడానికి చాలా అనువైన సమయం. ఇంటర్న్‌షిప్‌లు వృత్తిగత అనుభవాన్ని అందిస్తాయి. తద్వారా విద్యార్థులకు తమ గ్రాడ్యుయేషన్‌ పూర్తికాక ముందే నిజ వాతావరణంలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తాయి. తద్వారా ఫుల్‌ టైం ఉద్యోగాల ప్రపంచంలోకి వెళ్ళేముందే కావాల్సిన అనుభవాన్ని అందుకున్నట్లవుతుంది.
బీఏ, బీకాం, బీఎస్‌సీ ఇంటర్న్‌షిప్స్‌
సమ్మర్‌ ఇంటర్న్‌షిప్స్‌ అనేవి మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులకే పరిమితం కావు. హ్యుమానిటీస్‌, సైన్స్‌, కామర్స్‌ నేపథ్యమున్నవారు కూడా తమ ప్రొఫైల్స్‌కు తగిన రంగాల్లో ఇంటర్న్‌షిప్‌లు చేయవచ్చు.
* హ్యుమానిటీస్‌ విద్యార్థులు కంటెంట్‌ రైటింగ్‌, ఎడిటోరియల్‌ ఇంటర్న్‌షిప్స్‌, మీడియా, జర్నలిజం ఇంటర్న్‌షిప్‌లు చేయటానికి వీలుంది.
* సైన్స్‌ నేపథ్యమున్నవారు ప్రొఫెసర్లూ, శాస్త్రవేత్తల వద్దా, పరిశోధన సంస్థల్లోనూ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇంటర్న్‌లుగా చేరవచ్చు.
* కామర్స్‌ విద్యార్థులకు ఫైనాన్స్‌, అకౌంట్స్‌, సీఏ, టాలీ మొదలైన ఇంటర్న్‌షిప్‌లుంటాయి.
మొత్తమ్మీద ఎన్‌జీఓ, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, ఆపరేషన్స్‌, సోషల్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌లలో అన్ని రకాల విద్యార్థులూ ఇంటర్న్‌లుగా చేరవచ్చు. తమ పరిజ్ఞానం మెరుగుపరుచుకోవచ్చు.
వ్యవధి ఎంతకాలం?
ఇంటర్న్‌షిప్‌ల వ్యవధి సాధారణంగా 2-6 నెలలు ఉంటుంది. విద్యార్థి తాను అందుబాటులో ఉండగల సమయాన్ని బట్టి వీటిని ఎంచుకునే వీలుంటుంది. వీటిని బాగా అర్థం చేసుకునేందుకు వీలుగా.. ఇంటర్న్‌షిప్‌లను ఎందుకు చేయాలో చూద్దాం.
1. నైపుణ్యాల మెరుగుదల: ఒక సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేసేటపుడు ఒక ప్రొఫెషనల్‌ వాతావరణంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ప్రొఫెషనల్‌ కమ్యూనికేషన్‌ను నేర్చుకునే అవకాశమూ ఉంటుంది. ఇది మీ భావప్రకటన నైపుణ్యాలతోపాటు ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవడంలో, ఐక్యూను పెంచడంలో, పీపుల్‌, సోషల్‌ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా రియల్‌ టైం ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం లభిస్తుంది. కొత్త సవాళ్లను స్వీకరిస్తూ, రోజువారీ పనిలో భాగంగా కొత్త ఆలోచనలతో రావాల్సి ఉంటుంది. తద్వారా సమస్యా పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు.
2. నూతన సాంకేతికతలపై అవగాహన: వృత్తిగత వాతావరణంలో పనిచేయడం ద్వారా కొత్త సాంకేతికత, ప్రస్తుతం మార్కెట్‌లో ఉపయోగించే పద్ధతులను తెలుసుకోవచ్చు. ఇది రెజ్యూమేలో మీ వృత్తి అనుభవాన్ని చూపించుకోవడానికే పరిమితం కాక పనితీరులో తరచూ వచ్చే మార్పులను అనుసరించగల తీరునూ, కొత్త వాటిని అలవరచుకోవడానికీ తోడ్పడుతుంది.
3. భిన్న అవకాశాల పరిజ్ఞానం: సాధారణంగా ఇంటర్న్‌షిప్‌ల్లో దీర్ఘకాల నిబద్ధత అవసరముండదు. వివిధ రంగాల్లో లేదా ఏదైనా ఒక రంగంలోని వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ను చేయొచ్చు. ఇది వివిధ స్థాయుల నైపుణ్యాలతోపాటు వివిధ రంగాల్లో అనుభవాన్ని పొందగల అవకాశాన్నీ ఇస్తుంది. భిన్న అవకాశాల పరిజ్ఞాన ఫలితంగా మీకు సరైన రంగం ఏదో ఎంచుకునే వీలూ ఉంటుంది.
వర్చువల్‌/ వర్క్‌ ఫ్రం హోం
ఇంటర్న్‌షిప్‌ల్లో కాలేజ్‌తోపాటుగా పనిచేసే వీలు కల్పించే పార్ట్‌టైం/ వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్లూ ఉంటాయి. నిజానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 75% విద్యార్థులు ఆఫీసుల్లో చేసేవాటి కంటే కూడా వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లనే ఎంచుకుంటున్నారు. ఇవి గ్రామీణ విద్యార్థులకూ అందుబాటులోనే ఉంటున్నాయి.
ఇంటర్న్‌షిప్‌ను పొందేదెలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూళ్ళ నుంచి వచ్చే విద్యార్థులు ఈ విషయంలో చాలా అపనమ్మకంతో, దారి తెలియని స్థితిలో ఉంటున్నారు. నిజానికి ఇదంత సమస్యేమీ కాదు. ఏప్రాంతం వారైనా సరే, ఆసక్తి ఉన్న ఇంటర్న్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ల్లో సులువుగానే వెతుక్కోవచ్చు.
* ఆన్‌లైన్‌ అంటే.. ఇంటర్నెట్‌ సాయంతో ఇంటర్న్‌షిప్‌లను అందించే వెబ్‌సైట్లను చూడటం, వివిధ యూనివర్సిటీలు, కళాశాలలకు మెయిల్‌ చేయడం, ప్రొఫెసర్లు, హెచ్‌ఆర్‌లను ఆన్‌లైన్‌లో సంప్రదించడం, మీ రెజ్యూమేను వివిధ సంస్థల కెరియర్‌ విభాగాల్లో పొందుపరచడం మొదలైనవి చేయడం.
* ఆఫ్‌లైన్‌ విధానానికి వస్తే.. మీ కాలేజ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌, వివిధ సంస్థలకు నేరుగా వెళ్లడం, కళాశాల సీనియర్లను సంప్రదించడం మొదలైన విధానాలు కనిపిస్తాయి.
సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌‌ రకాలు
విద్యార్థులకు తమ ఆసక్తి, అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి ఇంటర్న్‌షిప్‌లను ఎంచుకునే వీలుంది. కొన్ని ప్రముఖ ఇంటర్న్‌షిప్‌ శాఖలను పరిశీలిస్తే..
* మేనేజ్‌మెంట్‌: మేనేజ్‌మెంట్‌ను కెరియర్‌గా ఎంచుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఇంటర్న్‌షిప్‌ల పరంగా ఎక్కువ అవకాశాలను అందిస్తున్న రంగాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కల్పిస్తున్నవాటిలో మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, సేల్స్‌, ఆపరేషన్స్‌ మొదలైనవి ఉన్నాయి.
* ఇంజినీరింగ్‌: పెరుగుతున్న సాంకేతికాభివృద్ధి కారణంగా ఇంజినీర్లకు ఎక్కువ గిరాకీ ఉంది. వీరికి వెబ్‌ డెవలప్‌మెంట్‌, క్యాడ్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైనవాటిల్లో ఎక్కువ అవకాశాలున్నాయి.
* మీడియా: ఇతర ప్రముఖ ఇంటర్న్‌షిప్‌ ప్రొఫైళ్లలో కంటెంట్‌ రైటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ ముందున్నాయి. మీడియా రంగం సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, బ్లాగింగ్‌, వీడియో మేకింగ్‌, జర్నలిజం, కంటెంట్‌ రైటింగ్‌ మొదలైన వాటిల్లో అవకాశాలను అందిస్తోంది.
* డిజైన్‌: ప్రతి రెండో సంస్థ నేడు డిజైనర్లను ఎంపిక చేసుకుంటోంది. దీంతో ఇది గిరాకీ ఉన్న విభాగమైంది. యూఐ/యూఎక్స్‌ డిజైన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌ మొదలైన ప్రొఫైళ్లన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి.
నైపుణ్యాలను ఏర్పరచుకోవడంతోపాటు మీ రెజ్యూమేలో పని అనుభవ విలువను పెంచడంలోనూ ఇంటర్న్‌షిప్‌లు తోడ్పడతాయి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవడంతోపాటు వృత్తిగత వ్యవహారాలను అర్థం చేసుకోవడంలో, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికీ సాయపడతాయి.
ఇక దేనికోసం ఎదురుచూస్తున్నారు? త్వరగా వెళ్లి మీ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ను అందుకోండి. ఈ సెలవులను ఫలప్రదం చేసుకోండి.
ప్రభుత్వ, ప్రైవేటు ప్రోత్సాహం
* భారత ప్రభుత్వం విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు చేసేలా ప్రోత్సహిస్తోంది. నైపుణ్య శిక్షణకు ఉద్దేశించిన TASK , APSSDC లు విద్యాభ్యాస కాలంలో ఇంటర్న్‌లుగా మారి తమ నైపుణ్యాలు పెంచుకోమని సూచిస్తున్నాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఎంఈఏ, ఫైనాన్స్‌, ఎంసీఏ మంత్రిత్వ శాఖలు, ఆర్‌బీఐ, నీతి ఆయోగ్‌ మొదలైనవి స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్‌లను విద్యార్థులకు అందిస్తున్నాయి. సంబంధిత మంత్రిత్వశాఖల (మినిస్ట్రీల) వెబ్‌సైట్లలో ఈ అవకాశాలు చూడవచ్చు.
ప్రైవేటు సంస్థలూ, బహుళజాతి సంస్థలూ, విద్యాసంస్థలూ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందిస్తున్నాయి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, కేపీఎంజీ, పీడబ్ల్యూసీ, డెలాయిట్‌, ఉబర్‌ మొదలైన సుప్రసిద్ధ సంస్థల్లో కూడా విద్యార్థులకు వేసవి ఇంటర్న్‌షిప్‌లు లభిస్తున్నాయి.
టీచ్‌ ఫర్‌ ఇండియా, సీఆర్‌వై, స్మైల్‌ ఫౌండేషన్‌, ఎంఏడీ లాంటి ప్రభుత్వేతర సంస్థల్లో (ఎన్‌జీఓలు) వాలంటీరింగ్‌ ప్రోగ్రాములున్నాయి. ఈ వేసవిలో విద్యార్థులు వాటిని ఎంచుకోవచ్చు.
కళాశాల విద్యార్థులకే కాదు; పాఠశాల విద్యార్థులకు.. ముఖ్యంగా టెన్త్‌, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా అసంఖ్యాకంగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు చేస్తే అవి వారు తోటి విద్యార్థులకంటే మిన్నగా వృత్తినైపుణ్యాలూ, విషయ స్పష్టత పెంచుకోగలుగుతారు. కంటెంట్‌ రైటింగ్‌, వాలంటీరింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, కష్టమర్‌ సపోర్ట్‌, ఇంకా బిజినెస్‌ డెవలప్‌మెంట్‌లో కూడా స్కూలు విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లను ఎంచుకోవచ్చు. దీనిద్వారా వీరు లైఫ్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను అద్భుతంగా పెంచుకునే అవకాశం ఉంది.
ఎన్నో వెబ్‌సైట్లు
internshala.com 80 వేల సంస్థలకు చెందిన 4+ లక్షల ఇంటర్న్‌షిప్‌లకు వేదికగా ఉంది. ఇది కాకుండా ఇంకా.. InternAbroad, HelloIntern, Twenty19, LetsIntern సంస్థలు ఇంటర్న్‌షిప్‌ల సమాచారం అందిస్తూ విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి.

- సురేష్ అగ‌ర్వాల్‌, సీఈఓ, ఇంట‌ర్న్‌శాల

Back..

Posted on 03-04-2018