Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తొలి అడుగు

ఉద్యోగ సాధనను సులభతరం చేసేవీ, కోర్సును కెరియర్‌గా మలుచుకోవటానికి తోడ్పడేవీ ఇంటర్న్‌పిప్‌లు. అధ్యయనం చేసిన రంగంలో ఆచరణాత్మక పరిజ్ఞానం సంపాదించటానికి అవకాశమిచ్చే ఇవి వివిధ సంస్థల్లో పరిమిత కాలంలో లభిస్తాయి. ఇంత ముఖ్యమైన ఇంటర్న్‌షిప్‌లను ఎంచుకునేముందు ఏం గమనించాలి? తెలుసుకుందాం!
జయ ఇంటర్‌ పరీక్షల తర్వాత ఓ వెబ్‌ ఆధారిత పోర్టల్లో ‘వర్క్‌ ఫ్రమ్‌ ఎడిటోరియల్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ ఇంటర్న్‌షిప్‌’ కోసం దరఖాస్తు చేసుకుంది. తక్కువ వయసు కాబట్టి దరఖాస్తును మొదట్లోనే తిరస్కరించారు. కానీ తనకు అవకాశమిస్తే నెలరోజుల్లో తనను నిరూపించుకుంటానని అభ్యర్థించింది. అంగీకారం లభించింది.
మొదట ఒక నెలకోసం ఉద్దేశించిన ఇంటర్న్‌షిప్‌ 12 నెలలపాటు కొనసాగింది. అది పూర్తయ్యే సమయానికి ఆమె ఆ పోర్టల్‌కు ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా మాత్రమే కాదు, వ్యాపార సోషల్‌ మీడియా వ్యవహారాలకు హెడ్‌గా వ్యవహరించింది. ఇంటర్న్‌షిప్‌లో నేర్చుకున్న రచన, పరిశోధన నైపుణ్యాలూ, నెట్‌వర్క్‌ సాయంతో ఆమె ‘పబ్లిక్‌ పాలసీ’లో మరొక ఇంటర్న్‌షిప్‌, ఫెలోషిప్‌ సంపాదించగలిగింది. ఆమె ఎంచుకున్న కెరియర్‌ అది!
వినాయక్‌ ఎన్‌ఐటీలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్‌. బీటెక్‌ తర్వాత ఒక సంవత్సరం ఉత్పత్తి కర్మాగారం దగ్గర పనిచేశాడు కానీ, ఆ పని అతడికి సంతృప్తిని ఇవ్వలేదు. మేనేజ్‌మెంట్‌లో కెరియర్‌ సాగించాలనుకున్నాడు. ఎంబీఏకు చాలా డబ్బు, సమయం కావాలి. అందువల్ల ఒక అంకుర (స్టార్టప్‌) సంస్థలో ‘డిజిటల్‌ మార్కెటింగ్‌’లో ఆర్నెల్ల ఇంటర్న్‌షిప్‌ చేశాడు.
ఇప్పుడు వినాయక్‌ అదే సంస్థలో ప్రొడక్ట్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగాడు. అతడు తన కెరియర్‌ లక్ష్యాన్ని కేవలం ఆరునెలల సమయంలో డబ్బును పైసా కూడా ఖర్చుపెట్టకుండా చేరుకున్నాడు!
జయ, వినాయక్‌లే కాదు; ఇలాగే ప్రతి రంగంలోనూ లక్షల మంది విద్యార్థులూ, యువ నిపుణులూ ఇంటర్న్‌షిప్‌, దాని ఉపయోగాలు తెలుసుకుని వీటిని ఎంచుకోవటానికి ముందుకువస్తున్నారు. అర్థవంతమైన ఇంటర్న్‌షిప్‌ తమ జీవితాలను ఎలా మారుస్తుందో గ్రహిస్తున్నారు.
ఎన్ని ప్రయోజనాలో...
ఇంటర్న్‌షిప్‌ అంటే ఎవరైనా విద్యార్థి/యువ నిపుణుడు ఒక సంస్థలో కొంత కాలం (1 నెల నుంచి 6 నెలలు) కొన్ని రియల్‌ ప్రాజెక్టులపై అనుభవమున్న మెంటార్‌ కింద పనిచేయడం. ఇంటర్న్‌షిప్‌ అన్నది మీలో ఉన్న అభిరుచిని బయటకుతీస్తుంది. ప్రాక్టికల్‌ నైపుణ్యాలు నేర్పిస్తుంది. నెట్‌వర్క్‌ను నిర్మిస్తుంది. ఇంకా కళాశాలలో ప్లేస్‌మెంట్ల విషయంలో చాలా ఉపయోగపడుతుంది.
వీటి ఉపయోగాలు, ఇవెందుకు చేయాలన్నదీ చూశాం కదా? ఇప్పుడు ఏదైనా ఇంటర్న్‌షిప్‌ చేయడానికి/ఎంచుకోవడానికి ముందుగా తెలియాల్సిన ఐదు విషయాలు చూద్దాం!
* ఆలోచనలో స్పష్టత: ఏ రంగంలో ఇంటర్న్‌షిప్‌ చేస్తే మంచిది, ఏయే రంగాల్లో ఎక్కువ అవకాశాలున్నాయో ముందుగా తెలుసుకోవాలి. అధ్యాపకుల, సీనియర్ల సలహాలు తీసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌ ఎంచుకునేముందు దాని మీద అవగాహన ఉండాలి.
* ప్రొఫెషనల్‌ రెజ్యూమే: రెజ్యూమేను తయారుచేసుకునే తొలి సందర్భం దాదాపు ఇదే అవుతుంది. ప్రొఫెషనల్‌ రెజ్యూమే... సంస్థలకు మీపై అనుకూల అభిప్రాయం కలిగించి, ఇంటర్వ్యూకు ఆహ్వానించే అవకాశాలను పెంచుతుంది. అంతర్జాలంలో అనేక ఉచిత రెజ్యూమే మేకర్లు, లేఔట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో మీకు నచ్చిన పద్ధతిలో సులువుగా తయారుచేసుకోవచ్చు.
* ంబంధిత నైపుణ్యాలు నేర్చుకోవటం: ఇంటర్న్‌షిప్‌లకు చాలా పోటీ ఉంది ఈ రోజుల్లో. కాబట్టి వీటికి సంబంధించిన నైపుణ్యాల్లో పట్టు ఉన్నవారికే ఇంటర్న్‌షిప్‌ లభించే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు ఒక వెబ్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్న్‌షిప్‌కు పీహెచ్‌పీపై అవగాహన అవసరమైవుండొచ్చు. ఒక డిజైనింగ్‌ ఇంటర్న్‌షిప్‌కు ఫొటోషాప్‌ పరిజ్ఞానం అవసరం కావొచ్చు. ఎవరైనా సులభంగా ఈ నైపుణ్యాలను ఆన్‌లైన్లో నేర్చుకోవచ్చు.
* సంస్థ గురించి తెలుసుకోవాలి: ఇంటర్న్‌షిప్‌కు లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ వెబ్‌సైట్‌నూ, సోషల్‌ పేజీలనూ (ఫేస్‌బుక్‌, ట్విటర్‌) పరిశీలించాలి. ఆ సంస్థ కీలక వివరాలను (ఆ కంపెనీ ఏ వ్యాపారం చేస్తోంది, రెవిన్యూ, ఉద్యోగుల పరంగా ఎంత పెద్దది...) గ్రహించాలి. ఇటీవలికాలంలో ఆ సంస్థ వార్తల్లోకి ఎక్కితే ఆ వివరాలూ తెలిసివుండాలి. గతంలో అక్కడ ఇంటర్న్‌లుగా ఉన్నవారి ఇంటర్వ్యూలూ, కథనాలూ సేకరించవచ్చు. దీనివల్ల మెరుగైన దరఖాస్తు తయారీ, ఇంటర్‌వ్యూల్లో బాగా చేయటం మాత్రమే కాకుండా అక్కడి పని వాతావరణం, సంస్కృతి కూడా అర్థమవుతుంది.
* దరఖాస్తును తరచూ గమనించాలి: మీరు తగిన ప్రాథమిక నైపుణ్యాలు సాధించి- చక్కని రెజ్యూమేతో, మంచి దరఖాస్తును తయారుచేసి సంస్థ హెచ్‌ఆర్‌ విభాగానికి పంపారు. వారి స్పందన కోసం ఎదురుచూస్తుంటారు. వారేమీ సమాచారం పంపకపోతే? చాలామంది విద్యార్థులు అక్కడితో దాన్ని వదిలి, మరోచోట దరఖాస్తు చేయటం మొదలుపెడతారు.
అయితే విద్యార్థులు దరఖాస్తు పంపిన 5-7 రోజుల తర్వాత సంగతేమైంది అన్నదానికోసం ‘ఫాలోఅప్‌ అభ్యర్థన’ను పంపించాలి. ఒక్కోసారి మీ దరఖాస్తును సరిగా గమనించకపోయివుండొచ్చు.
ఇలాంటపుడు రిమైండర్‌ ఈ-మెయిల్‌ మీ దరఖాస్తును సంస్థ ప్రతినిధులు గమనించేలా చేస్తుంది. మరో విషయం- ఫాలోఅప్‌ వల్ల ఆ సంస్థలో ఇంటర్న్‌షిప్‌పై మీకు నిజమైన ఆసక్తి ఉందనేది రుజువై, మీరు ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయి.
అర్థవంతమైన ఇంటర్న్‌షిప్‌ అనేది విద్యార్థి జీవితాన్నే మలుపు తిప్పగలదు. అందుకని దానికోసం ఇవాళే ప్రయత్నాలు ప్రారంభించండి!

Back..

Posted on 12-04-2016