Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మీరెవరు?

* హెచ్‌ఆర్‌ ముఖాముఖి

హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ (ముఖాముఖి)లో అడిగే ప్రతి ప్రశ్నకు ఒక ప్రత్యేక లక్ష్యం ఉంటుంది. సాధారణంగా కనిపించినా... వాటి నుంచే అసాధారణ అంశాలను అంచనా వేస్తారు. ఈ ప్రశ్నకు ఇంతకంటే సమాధానం ఏముంటుందని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే తగిన మూల్యాన్నిచెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, టెక్నికల్‌ రౌండ్‌లను దాటి వచ్చిన కష్టాన్ని వృథా చేస్తుంది. అందుకే చిన్న చిన్న ప్రశ్నలే అనిపించినప్పటికీ పెద్ద పెద్ద ఆలోచనలు, అవగాహనలతో జవాబులు చెప్పాలి. అభ్యర్థి ఆసక్తి, అభిరుచులను స్పష్టమైన అభిప్రాయాలతో వెల్లడిస్తూ.. ఒప్పించి, మెప్పించాలి. ఆఫర్‌ లెటర్‌ అందుకోవాలి.‘టెక్నికల్‌ రౌండ్‌ క్లియర్‌ చేసేశా. హెచ్‌ఆర్‌ రౌండే మిగిలింది. ఇక ఉద్యోగం వచ్చేసినట్లే!’ అని చాలామంది అభ్యర్థులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఫ్రెషర్లు ఎక్కువగా ఇలాంటి అభిప్రాయంతో ఉంటారు. ఆఫర్‌ లెటర్‌ ఇవ్వడానికి నిర్వహించే లాంఛన ప్రక్రియే హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ అనేది వీరి ఉద్దేశం. ఇది అపోహ మాత్రమే.
నియామక సంస్థలకు అభ్యర్థుల పరిజ్ఞానం ఒక్కటే సరిపోవడం లేదు. అంతకుమించి ఆశిస్తున్నాయి. ఆ అంచనాలను అభ్యర్థులు అందుకోగలరో లేదో తెలుసుకోవడానికి తోడ్పడే ముఖ్య సాధనం హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ. అభ్యర్థిలోని సహజ లక్షణాలను తెలుసుకోవడమే దీని ఉద్దేశం. ఇందులో హెచ్‌ఆర్‌ మేనేజర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఉన్న కొద్ది సమయంలో సంస్థకు తగ్గవారిని ఎంపిక చేస్తారు.
ఈ రౌండ్‌ తేలిగ్గా అనిపించినా కనిపించని కష్టం ఉంటుంది. ప్రశ్నలన్నీ సులువుగా ఉంటాయి. కానీ ప్రతిదాని వెనకా బలమైన కారణం ఉంటుంది. అందుకే ఆలోచించి సమాధానం చెప్పాలి. ఇందులో ఉన్న ఇంకో సమస్య.. సమాధానాల్లో తప్పు, ఒప్పు అంటూ ఏం ఉండదు. సరైన రీతిలో చెబుతున్నారా లేదా అనేది ముఖ్యం. అది పూర్తిగా అభ్యర్థిపైనే ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా 45 నిమిషాల నుంచి గంట వరకూ ఇంటర్వ్యూ సాగుతుంది. ఈ కొద్ది సమయంలోనే అభ్యర్థి మనస్తత్వం, పరిణతి, ప్రవర్తన తీరు, ఉద్యోగం, సంస్థ పట్ల అభిప్రాయం, పనిపై గౌరవం, ఈ ఇంటర్వ్యూనూ, ఉద్యోగాన్నీ ఎంత వరకూ సీరియస్‌గా తీసుకున్నారు? అందుకు తగ్గ ముందస్తు సంసిద్ధతకు ఏం చేశారు వంటి వాటన్నిటినీ తెలుసుకుంటారు. కాబట్టి, ఈ దశను దాటి ఉద్యోగాన్ని అందుకోవాలంటే.. అభ్యర్థి కొంత సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఇంటర్వ్యూలో అభ్యర్థులను తరచుగా అడిగే ప్రశ్నలేమిటి? దేనికి ఏవిధంగా స్పందించాలో అవగాహన ముందుగానే పెంచుకోవడం అవసరం.
మీతోనే మొదలు
మీ గురించి చెప్పండి..
‘మీ గురించి చెప్పండి (టెల్‌ మీ ఎబౌట్‌ యువర్‌సెల్ఫ్‌)?’ ‘ఇక్కడికి చేరుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా?’.. కలవగానే సంభాషణను ప్రారంభించడానికి అడిగిన ప్రశ్నల్లాగా అనిపిస్తున్నాయి కదూ. కానీ వాటిలోనూ కొంత మతలబు ఉంది. ఫ్రెషర్లు అయితే ఇంటర్వ్యూ ఒత్తిడిని పోగొట్టడానికి అడుగుతారు. ఎంత త్వరగా ఆ టెన్షన్‌ నుంచి బయటకు వచ్చారో గమనిస్తారు. అనుభవం ఉన్నవారినీ అవే ప్రశ్నలు అడుగుతుంటారు. అభ్యర్థిని అక్కడి వాతావరణంలోకి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశం.
తన గురించి చెప్పమన్నప్పుడు.. అభ్యర్థి తన పేరు, కుటుంబ వివరాలు, సాధించిన మార్కులకు పరిమితం కాకూడదు. అవన్నీ రెజ్యూమెలో ఉంటాయి. వాటికి అదనంగా సమాచారాన్ని జోడించాలి. అభ్యర్థి రెజ్యూమెను యథాతథంగా చెబుతున్నాడా.. తన గురించి సంస్థకు ముఖ్యమైన సమాచారాన్ని అందించే అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడా అనేది గమనిస్తారు. ఇక సంస్థను చేరుకోవడానికి పడ్డ ఇబ్బంది గురించి చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. నెగెటివ్‌ సమాధానం మనకు ప్రతికూలంగా మారవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులను కూడా ఎంతో పెద్దవిగా చెబుతూ కష్టాన్ని పెద్దగా చేస్తే బోర్డు సభ్యులు తేలిగ్గా పట్టేస్తారు. మనకు ఆసక్తి లేని పనులు చేసేటప్పుడే చిన్న సమస్యలు కూడా పెద్దగా అనిపిస్తాయి. అదే ఇష్టమైనవి చేసేటప్పుడు ఎంత పెద్ద ఇబ్బంది అయినా చిన్నగానే అనిపిస్తుంది. ఒక్కోసారి దాన్ని గుర్తుంచుకోరు కూడా. అభ్యర్థిలోని ఆసక్తిని అంచనా వేయడానికి ఈ ప్రశ్నను సాధారణంగా ఉపయోగిస్తారు. నిజంగా ఇబ్బందులు పడినప్పటికీ వాటిని సానుకూల దృక్పథంతో చెప్పడం అభ్యర్థి ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
మీ బలహీనతలు
ఏమిటి.. బలాలూ.. బలహీనతలు
‘మీ బలం ఏమిటి (‘వాట్‌ ఈజ్‌ యువర్‌ స్ట్రెంత్‌?), మీ బలహీనతల్లో కొన్నింటిని చెప్పండి (వాట్‌ ఆర్‌ సమ్‌ ఆఫ్‌ యువర్‌ వీక్‌నెసెస్‌?), మీ అభివృద్ధికి మీరు పెట్టుకున్న ఒక లక్ష్యం ఏమిటో తెలియజేయండి (టెల్‌ మీ ఎబౌట్‌ ఎ డెవలప్‌మెంట్‌ గోల్‌ దట్‌ యూ హావ్‌ సెట్‌’), వచ్చే సంవత్సరానికల్లా మీరు ఏం మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు (వాట్‌ డూ యూ మోస్ట్‌ వాంట్‌ టూ ఇంప్రూవ్‌ నెక్స్ట్‌ ఇయర్‌)’ ఇలా ప్రశ్నను ఎలా అడిగినా హెచ్‌ఆర్‌ అధికారి ఉద్దేశం అభ్యర్థి తన బలాలు, బలహీనతల పట్ల తగిన అవగాహన కలిగి ఉన్నాడో లేదో తెలుసుకోవడమే. అభ్యర్థి ఇంటర్వ్యూను ఎంత సీరియస్‌గా తీసుకున్నాడో, ఎంత సిద్ధంగా ఉన్నాడో ఇచ్చే సమాధానాన్ని బట్టి అంచనా వేస్తారు.
అభ్యర్థి తన బలాలుగా భావించే కొన్ని అంశాలు అన్ని ఉద్యోగాలకూ పనికి రాకపోవచ్చు. కాబట్టి, తను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగ విధులకు సరిపోయే బలాల గురించి మాత్రమే ప్రస్తావించాలి. తగిన ఉదాహరణలతో జవాబులు ఇవ్వాలి. బలహీనతల గురించి వస్తే ఉద్యోగంపై ప్రభావం చూపని దేన్నైనా చెప్పవచ్చు. ఉదాహరణకు- గత కొన్నేళ్లుగా ఒంటరిగా ఉన్నా వంట, దుస్తులు ఉతకడం నేర్చుకోలేకపోయా వంటివి చెప్పొచ్చు. ప్రత్యేకంగా పని గురించో, చదువుకు సంబంధించో బలహీనత చెప్పమన్నప్పుడు బలాన్ని బలహీనతగానూ చెప్పొచ్చు. ఉదాహరణకు దేన్నయినా పర్‌ఫెక్ట్‌గా చేయాలనుకోవడం, దాంతో ఆలస్యం జరగడం, ఏదైనా మనస్ఫూర్తిగా బాగుందని రూఢి చేసుకోందే పక్కనపెట్టేయలేకపోవడం వంటివి అని చెప్పవచ్చు.
తాజా గెలుపు... ఎప్పటిదో తప్పిదం!
అవరోధాలు వస్తే ఏం చేస్తారు..
అభ్యర్థిలో ఉన్న పోటీతత్వాన్నీ, వృత్తిపరమైన విలువలనీ తెలుసుకోవడానికి విజయాలేమిటని అడుగుతారు. కష్ట సమయంలో లేదా పని ప్రాంతంలో ఏవైనా అవరోధాలు ఎదురైనపుడు ఎలా తట్టుకోగలుగుతారో, స్పందిస్తారో అంచనా వేయడానికి చేసిన తప్పుల గురించి ప్రశ్నిస్తారు.
విజయానికి సంబంధించి చెప్పేటప్పుడు అది తాజాది అయ్యేలా చూసుకోవాలి. ఉద్యోగానికి సంబంధమున్నదయితే ఇంకా మంచిది. ఉదాహరణకు కళాశాలలో అప్పజెప్పిన ఒక కార్యక్రమాన్ని కేటాయించిన బడ్జెట్‌ కంటే తక్కువలో విజయవంతంగా పూర్తిచేయడం వంటివి. ఒకవేళ అకడమిక్‌, ప్రొఫెషనల్‌ అంశాలకు సంబంధించి ప్రధానమైనవి లేకపోతే సాంఘిక జీవనానికి సంబంధించినవి (రక్త దానం చేయడం, వేరేవారికి సాయపడటం తదితరాలు) ప్రస్తావించవచ్చు.దానికి తగ్గ ఉదాహరణను తప్పక జోడించాలి.
చేసిన తప్పుల గురించి అడిగితే అందులోనూ ఉదాహరణలను ఇవ్వాలి. అయితే ఇక్కడ వీలైనంత చిన్నదాన్ని చెప్పాలి. ఎప్పుడో చేసిన తప్పును ప్రస్తావిస్తే ఇటీవల ఏమీ చేయలేదు అనే అభిప్రాయాన్ని కలిగించవచ్చు. అలాగే చేసిన తప్పును సరిదిద్దుకోడానికి చేసిన ప్రయత్నాన్ని వివరిస్తే అభ్యర్థిపై సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది.
భవిష్యత్తు గురించి...
వచ్చే అయిదేళ్లలో మీరెక్కడుంటారు..
‘మిమ్మల్ని వచ్చే మూడేళ్లు లేదా అయిదేళ్లలో ఎక్కడ చూడాలనుకుంటున్నారు?’, ‘పై చదువులు చదవాలనుకుంటున్నారా?’, ‘పీజీ చేస్తే మీ కెరియర్‌కు ఇంకా మంచిదని మీకు అనిపించడం లేదా?’.. ఈ ప్రశ్నల వెనకనున్న ఉద్దేశం అభ్యర్థి కెరియర్‌ లక్ష్యాల గురించి తెలుసుకోవడమే. అలాగే సంస్థలు ఒక అభ్యర్థిని ఎంచుకోవడానికి ఎంతో కొంత సమయం, డబ్బు పెట్టుబడిగా పెడతాయి. కొన్నేళ్లపాటు అభ్యర్థి తమతో ఉన్నప్పుడే వారికీ లాభం. కాబట్టి, సంస్థలో దీర్ఘకాలం సాగాలనుకుంటున్నాడా లేదా కొంతకాలమే ఉండగలడా అనేది తెలుసుకోవడానికీ అడుగుతారు. సంస్థలో ఒక బాధ్యతాయుతమైన హోదాలో తనను తాను చూసుకోవాలనుకుంటున్నట్లుగా అభ్యర్థి సమాధానం ఉండాలి. తాను ఎదగడంతోపాటు సంస్థకూ ఉపయోగపడతాననీ చెప్పాలి. పై చదువులపై ఆసక్తి కనబరిచినా ప్రత్యామ్నాయ మార్గాల్లోనే (దూరవిద్య, ఆన్‌లైన్‌ కోర్సులు మొదలైనవి) చేస్తానని వివరించాలి.
మీరే ఎందుకు?
మిమ్నల్నే ఎందుకు ఎంచుకోవాలి..
‘మీరు ఈ ఉద్యోగానికి తగినవారని ఎలా చెప్పగలరు?’, ‘మిమ్నల్నే ఎందుకు ఎంచుకోవాలి?’, ‘మా సంస్థకే ఎందుకు దరఖాస్తు చేశారు?’.. ఇలాంటి ప్రశ్నలతో అభ్యర్థిలోని ఏ లక్షణం సంస్థకు ఉపయోగపడుతుందో గ్రహిస్తారు. అభ్యర్థి తనను తాను ఎంతవరకూ ప్రొజెక్ట్‌ చేసుకోగలుగుతున్నాడో కూడా పరీక్షిస్తారు. అభ్యర్థి తన గురించి తాను ఒప్పించగలిగేలా చెప్పగలగాలి. అకడమిక్‌ పరంగా తన విజయాలు, ఉద్యోగ విధుల దృష్ట్యా తన నేపథ్యం ఎంతవరకూ ఉపయోగకరమో ప్రస్తావించాలి. ఇంటర్వ్యూకు ముందు సంస్థ గురించి తెలుసుకుని ఉండటం ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఒకవేళ తెలియకపోతే.. త్వరగా నేర్చుకునే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారగలగడం, బృందంలో పనిచేయగలగడం వంటి లక్షణాలను ప్రస్తావించాలి. అలాగే సంస్థకు సంబంధించి నచ్చిన అంశాలనూ జోడించాలి.
ఏమైనా ప్రశ్నలున్నాయా?
మీరేమైనా అడుగుతారా..
అభ్యర్థి ఆసక్తినీ, అనాసక్తినీ తెలియజేసే మహాయుధమే ఈ ప్రశ్న. రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. ఏమీ లేవని చెబితే అభ్యర్థి ఎలాంటి సంసిద్ధత లేకుండా వచ్చాడని అనిపిస్తుంది. సంస్థపై అనాసక్తినీ తెలియజేస్తుంది. సాధారణమైనవీ, సంస్థ వెబ్‌సైట్‌ను చూసినా తెలిసే ప్రశ్నలు అడిగినా అదే అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఉద్యోగ విధులకు సంబంధించిన ప్రశ్నలు అడగడం మేలు. ఉదాహరణకు మీరు పనిచేయబోయే విభాగం, ఉద్యోగ జీవితం, ఫీడ్‌బ్యాక్‌ వీలుందా, పని సంస్కృతి, ఎంపికైన విషయాన్ని తెలియజేసే విధానం మొదలైనవాటి గురించి అడగవచ్చు.

Back..

Posted on 13-12-2018