Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మౌఖిక విజయానికి ముందస్తు వ్యూహం! నైపుణ్య

మార్కుల్లో మనమే టాప్‌ మౌఖికం (ఇంటర్వ్యూ) మనకు లెక్కే లేదు అంటూ తల ఎగరేస్తే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ తలరాతలను తారుమారు చేసేస్తుంది. అడుగు దూరం వరకు వచ్చిన ఆఫర్‌ లెటర్‌ను అందకుండా చేసేస్తుంది. అప్పటికప్పుడు జవాబులు అవే వస్తాయనే అతి విశ్వాసానికిపోతే అనర్థం తప్పదు. సబ్జెక్టు ఒకసారి చూసుకుంటే సరిపోతుందనే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే నష్టం ఖాయం. అందుకే ఇంటర్వ్యూ బోర్డును ఆకట్టుకోవాలంటే సబ్జెక్టుతోపాటు ఆయా సంస్థల గురించి తెలుసుకోవాలి. మన గురించి మనం మార్కెట్‌ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మొదలైన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకు హాజరయ్యే అభ్యర్థులు, ప్రైవేటు కంపెనీల్లో హెచ్‌ఆర్‌ రౌండ్‌ను ఎదుర్కొనేవారు ఈ అదనపు సన్నద్ధతను అనుసరిస్తే విజయం వారి వెంటే వస్తుంది.

ఏసంస్థ అయినా అభ్యర్థి గురించి నేరుగా తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. సంస్థ అవసరాలకు అభ్యర్థి సరిపోతాడా లేదా అని తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యం. కాబట్టి, వేసుకునే దుస్తులు, సాధారణంగా అడిగే ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేసుకున్నంతమాత్రాన సరిపోదు. సంస్థ గురించీ, చేరబోయే స్థానం గురించీ తెలుసుకోవాలి. అభ్యర్థి వివరాలూ, పరిజ్ఞానం సంస్థకు అవసరం కానీ, సంస్థ వివరాలు అభ్యర్థికి ఎందుకు అవసరమవుతాయి? ఈ సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ, కంపెనీ విధానం, ఎంపిక చేసుకునేవారిలో ఏం చూస్తుంది వంటి విషయాలను తెలుసుకోవటం వల్ల స్పష్టత వస్తుంది. ఈ పరిశోధన గానీ, అవగాహన గానీ... సంస్థ అభ్యర్థిలో కోరుకునే అంశాలు తెలుసుకోవడానికీ, అభ్యర్థి తాను సంస్థలో ఇమడగలడో లేదో అర్థం చేసుకోవడానికే కాదు.. మిగతావారితో పోల్చినపుడు ముందంజలో ఉండటానికీ తోడ్పడుతుంది.
ఇంటర్వ్యూ సమయంలో హెచ్‌ఆర్‌ అధికారి సందేహాలుంటే అడగమని అభ్యర్థిని అడుగుతుంటారు. అభ్యర్థికి సంస్థ గురించి తెలుసుకోవాలన్న ఆసక్త్తీ, ఉత్సుకతా ఎంతవరకూ ఉన్నాయో తెలుసుకోవడమే ఈ ప్రశ్న వెనుక ఉద్దేశం. సంస్థ గురించిన కనీస అవగాహన ఉన్నప్పుడే వేటిని అడగాలో, అడగొచ్చో తెలుస్తుంది. ఇంతకీ ఇంటర్వ్యూకు వెళ్లేముందు ఏ విషయాల గురించి కనీసంగా తెలుసుకోవాలంటే..
* సంస్థ ఏం చేస్తుంది?
ఇది తెలిసిన విషయమేగా అనిపిస్తుంది. ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్‌ సంస్థకు దరఖాస్తు చేసుకున్నారు అనుకుందాం. సాఫ్ట్‌వేర్‌ అంటే ఒక్క ప్రోగ్రామింగే ఉండదు కదా! కాబట్టి, ఆ సంస్థ దేనిపై పనిచేస్తుందో, ఏ సేవలు అందిస్తుందో క్షుణ్ణంగా తెలుసుకునుండాలి. హైరింగ్‌ మేనేజర్లు చాలావరకూ.. సంస్థ గురించి ఏం తెలుసో చెప్పమని అడుగుతుంటారు. దాని ఉద్దేశం అభ్యర్థి ఆసక్తి, పరిశ్రమపై అతనికున్న పరిజ్ఞానాన్ని తెలుసుకోవడమే! ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేకపోతే.. ‘సంస్థ గురించి పట్టించుకునే ఉద్దేశం లేదు.. ఉద్యోగ సాధనే అభ్యర్థి ఏకైక లక్ష్యం’ అనే దురభిప్రాయం ఏర్పడుతుంది.
* ఉద్యోగ బాధ్యతలేంటి?
దరఖాస్తు చేసే స్థానానికి సంబంధించిన సమాచారాన్నంతా ఇంటర్వ్యూకు ముందే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఏయే అంశాలపై సిద్ధమవ్వాలో తెలుస్తుంది. అలాగే సంబంధిత స్థానానికి మీరే ఎలా తగినవారో మెరుగ్గా వివరించడానికి వీలూ ఉంటుంది.
* వినియోగదారులెవరు?
ఒక సంస్థనూ, దాని శక్తిసామర్థ్యాలనూ దాని వినియోగదారులను బట్టి అంచనా వేయొచ్చు. సంస్థ ఏ ప్రొడక్ట్‌లను, సర్వీస్‌లను అందిస్తోందో తెలుసుకోవాలి. సంస్థ వినియోగదారులనూ, వారి అవసరాలనూ అర్థం చేసుకోగలరన్న అభిప్రాయాన్ని కలుగజేయగలగాలి. అప్పుడే పరిజ్ఞానమున్న ఉత్సాహవంతుడైన అభ్యర్థిగా ఇంటర్వ్యూ అధికారి మిమ్మల్ని పరిగణిస్తారు. చాలా సంస్థలు తమ వినియోగదారుల్లో ప్రముఖమైన వారి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. ఆ సమాచారం సన్నద్ధతకు పనికొస్తుంది.
* గమనించాల్సినవేంటి?
చాలావరకూ ఇంటర్వ్యూ అధికారులు అభ్యర్థులకు తమ సంస్థ గురించిన ప్రాథమిక సమాచారం తెలిసుండాలని భావిస్తుంటారు. మీరు దానికి అదనంగా పరిశ్రమలో వస్తున్న కొత్త ధోరణుల గురించి కూడా తెలుసుకుని ఉంటే మంచిది. కంపెనీ ఇప్పుడు ఏ స్థానంలో ఉంది, కొత్తగా ఏ మార్పులను చేపట్టబోతోందన్నవాటిపై అవగాహన తెచ్చుకోండి. ఉదాహరణకు- సంస్థ ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ను/ సర్వీసులను ప్రవేశపెట్టబోతోందా? వాటికి ఏదైనా గుర్తింపు/ అవార్డులు వచ్చాయా? వంటివి తెలుసుకోవాలి.
* లీడర్లు ఎవరు?
సంస్థ నాయకత్వ బృందంలో ఉన్న సభ్యుల గురించి తెలుసుకోవాలి. అంటే సంస్థలో పెద్ద స్థానాల్లో ఉండి, కీలకపాత్ర పోషించేవారి వివరాలను తెలుసుకోవాలి. మేనేజర్లు, డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్లు, సీఈఓ.. ఇలా వారి గురించి తెలుసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాన్ని బట్టి ఒక్కోసారి వారిని ఇంటర్వ్యూలో కలిసే అవకాశమూ రావొచ్చు. ఇంటర్వ్యూ అధికారికి మీరు తగినంత సన్నద్ధమై వచ్చారని చెప్పడానికే కాదు.. సంస్థ విలువలు, సంస్కృతి గురించి తెలుసుకోవడానికీ ఈ సమాచారం పనికొస్తుంది. కేవలం సంస్థకు సంబంధించిన ఈ సమాచారంతోనే హెచ్‌ఆర్‌ను కొంతవరకూ ఆకట్టుకోవచ్చు.

పరిశోధన ఎలా?
వెబ్‌సైట్లు: ప్రతి కంపెనీకీ తమకంటూ వెబ్‌సైట్‌ ఉంటోంది. దానిలో సంస్థకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటోంది. కంపెనీ చరిత్ర దగ్గర్నుంచి వారి ప్రొడక్ట్‌, సర్వీసులు, మేనేజ్‌మెంట్‌, చివరికి సంస్థ సంస్కృతి మొత్తం అక్కడే దొరుకుతుంది. సాధారణంగా ఈ సమాచారమంతా ‘ఎబౌట్‌ అజ్‌’లో దొరుకుతుంది. అలాగే కార్పొరేట్‌ విలువలు, సంస్థ తమ గురించి చెప్పడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్న పదాలను గమనించుకోవాలి.
సోషల్‌ మీడియా: సంస్థలకు సోషల్‌ మీడియా అకౌంట్లు ఉన్నాయేమో చూసుకోవాలి. వారికి సంబంధించిన ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. అన్ని ఖాతాలను చూడాలి. వాటిల్లో చేరొచ్చు కూడా. వినియోగదారులను ఆకర్షించేలా ఏయే పోస్టింగులు పెడుతున్నాయో గమనించడానికి ఇది సాయపడుతుంది.
లింక్‌డిన్‌: నియామక సంస్థల గురించి వెతకడానికి తోడ్పడే అత్యుత్తమ మార్గమిది. ఖాళీలు, ప్రమోషన్లు, కొత్తగా చేరినవారు, కంపెనీ గణాంకాలతో సహా.. సంస్థకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడే దొరుకుతుంది. అలాగే సంస్థలో మీకు తెలిసినవారెవరైనా ఉన్నారో లేదో కూడా తెలుస్తుంది. ఒకవేళ ఉంటే సంస్థ గురించీ, ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తిచేయటం గురించీ తగిన సలహాలు పొందే వీలుంటుంది. తెలిసినవారు లేకపోయినా సంస్థ ప్రతినిధులతో చాట్‌ చేయడం ద్వారా వివరాలను పొందొచ్చు. ఇంటర్వ్యూ చేసేవారి ప్రొఫైల్‌ కనిపిస్తే వారి నేపథ్యాన్నీ తెలుసుకోవచ్చు.
గూగుల్‌: ఇంటర్వ్యూకు వెళ్లబోయే సంస్థ పేరుతో గూగుల్‌లో వెతకండి. దానికి సంబంధించిన తాజా సమాచారమంతా దొరకుతుంది. ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడంలో ఈ సమాచారం చాలా తోడ్పడుతుంది.
ఉద్యోగులు: సంస్థలో ప్రస్తుతం చేస్తున్న, పూర్వ ఉద్యోగులెవరైనా ఉన్నారేమో చూసుకోవాలి. ఉంటే వారి సాయం తీసుకోవచ్చు. వారినుంచి కావాల్సిన సమాచారాన్ని పొందొచ్చు.

‘మీ గురించి చెప్పండి’!
ఇంటర్వ్యూలో ప్రతి అభ్యర్థికీ ఎదురయ్యే ప్రశ్న- Tell me about yourself (మీ గురించి చెప్పండి). మన గురించి చెప్పుకోవడమే కదా అని తేలికగానే అనిపిస్తుంది కానీ అంత సులువేం కాదిది. సంస్థ అధికారిని మెప్పించేలా మన గురించి మనం వివరించడమంటే.. కష్టమైన గణిత సమస్యను సాధించటంతో సమానమే!
అసలు సమాధానం ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఇన్నేళ్ల జీవితాన్ని వాళ్ల ముందు ఉంచాలా? ఖాళీ సమయంలో ఏం చేస్తామో చెబితే చాలా? విద్యాభాస్యం, ఉద్యోగానుభవాలకు పరిమితమవ్వాలా?.. ప్రతి ఒక్కరిలో ఎన్నెన్నో ప్రశ్నలు. అయినా ఈ వివరాలన్నీ రెజ్యూమెలో ఉన్నప్పటికీ ఈ ప్రశ్న ఎందుకు?
అభ్యర్థికి తన గురించి తనకు ఎంతవరకూ తెలుసో అంచనాకు రావటం కోసమే ఈ ప్రశ్న. తన గురించి తాను చెప్పిన ప్రకారం అతడు సంస్థకు ఎంతవరకూ ఉపయోగకరమో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీని వెనుక మరో ఉద్దేశం కూడా ఉంది. నేరుగా సబ్జెక్టు, లోతైన ప్రశ్నలను అడిగితే అభ్యర్థి కంగారు పడతాడు. అదే.. తన గురించి తాను చెప్పడానికి కొంచెం ఉత్సాహం చూపిస్తాడు. కాబట్టి అక్కడ తేలికపాటి వాతావరణం ఏర్పడుతుంది.

ఎలా చెప్పాలి?
ఈ ప్రశ్నకు ఇదే సరైంది, ఇది కాదు అని చెప్పగలిగే సమాధానమేదీ లేదు. కానీ అభ్యర్థి తనలోని నైపుణ్యాలను ప్రభావవంతంగా చెప్పే అవకాశం దీని ద్వారా వస్తుంది. కాబట్టి, చిన్నతనం నుంచి ప్రస్తుత స్థితి వరకు ఏకరువు పెట్టడం లాంటివి చేయొద్దు. అలాగే కళాశాలలు, వాటిని పూర్తిచేసిన సంవత్సరాలకే పరిమితం కాకూడదు. ఈ చర్యలు అభ్యర్థి సరిగా సన్నద్ధమవలేదనీ, అన్‌ ప్రొఫెషనల్‌ అనీ సూచనలిస్తాయి. కాబట్టి, వ్యక్తిగత వివరాలకు చోటిచ్చినా.. ఇంటర్వ్యూ జరుగుతున్న హోదాకి అవసరమైన లక్షణాలు తనలో ఉన్నాయనే సూచనలు ఇవ్వగలగాలి. ఇది అభ్యర్థి ముందస్తు సన్నద్ధతతోనే సాధ్యమవుతుంది. సంస్థ గురించి కొంత పరిశోధన చేసి దాని ప్రకారం సిద్ధమైతే, అభ్యర్థి ప్రయత్నం కూడా ఇంటర్వ్యూ అధికారికి అర్థమవుతుంది. అయితే చెప్పే సమాధానం బట్టీ పట్టినట్టు ఉండకూడదు.

ఏ అంశాలుండాలి?
* వృత్తిగతంగా ఎలాంటి నిబద్ధత ప్రదర్శించగలరో చెప్పొచ్చు. ఇది వరకు చేసిన ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌ల వివరాలను కోట్‌ చేయొచ్చు.
ఉదా: ‘మినీ ప్రాజెక్టు సమాచారానికి స్వయంగా ఒక సంస్థలో కొన్నిరోజులపాటు పనిచేశాను’, ‘నేను చేసిన ప్రాజెక్టు ద్వారా ఇంటర్న్‌షిప్‌ అవకాశం దక్కించుకున్నాను’ వంటివి చెప్పొచ్చు. బీ సాధించిన విజయాల గురించి ప్రస్తావించొచ్చు. కానీ, సీవీ/ రెజ్యూమెలో పొందుపరిచిన వాటికే పరిమితం కాకూడదు. ఇంటర్వ్యూ అధికారి మీ రెజ్యూమెను పూర్తిగా చూసేసుంటాడని చెప్పలేం. అయినప్పటికీ వాటికి అదనంగా చెప్పేలా చూసుకోవాలి. ఉదాహరణకు- ‘గత ఏడాది కాలంగా నేను నా డ్రీమ్‌ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నాను. దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించాను. ఇంకొంత పరిశోధన చేయాల్సి ఉంది’ ఇలా చెప్పొచ్చు.
* చివరగా.. ఈ ఉద్యోగం ఎందుకు మీకు తగినదో చెప్పి ముగించాలి. అది అధికారిని ఆకట్టుకునేలా ఉండాలి. అంటే.. ‘ఈ సంస్థలో పనిచేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను’, ‘ఇక్కడ కొత్తవారికి అవకాశాలు ఎక్కువ, నా నైపుణ్యాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నా’ వంటివి జోడించొచ్చు.

Back..

Posted on 20-09-2018