Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
దర్జాగా కార్పొరేట్‌ ప్రపంచంలోకి!

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం గేట్‌ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కానీ ప్రైవేటు, బహుళజాతి కంపెనీల్లో ఉండే ఎన్నో రకాల ఉద్యోగాల కోసం సరైన పరీక్ష ఇప్పటివరకు లేదు. మొదటిసారిగా భారత పరిశ్రమల సమాఖ్య ఒక టెస్ట్‌ను నిర్వహించబోతోంది. ఆ స్కోరుతో పలు ఇంజినీరింగ్‌ బ్రాంచీల అభ్యర్థులు కార్పొరేట్‌ ప్రపంచంలోని కొలువుల కోసం దర్జాగా ప్రయత్నించవచ్చు.

ఎవరు అర్హులు?
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులను గుర్తించే పరీక్ష ఇది. బీటెక్‌ నాలుగో సంవత్సరంలో ఉన్నవారు లేదా తత్సమానమైన ఇంజినీరింగ్‌ చేస్తున్న అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌ ఉత్తీర్ణులు, ఎంటెక్‌ పాసైనవారూ, చదువుతున్న విద్యార్థులూ, ఉద్యోగానుభవం ఉన్నవాళ్లూ అర్హులే. వయసు పరిమితి లేదు.
* గేట్‌కు హాజరుకానివారు, అర్హత సాధించలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
* ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే కార్పొరేట్‌లో ఉద్యోగాలకు మాత్రమే అర్హత ఉంటుంది. గేట్‌ మాదిరిగా ఉన్నత చదువులకు దీన్ని పరిగణనలోకి తీసుకోరు.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగాల్లో సమాన అవకాశాలను కల్పించడానికి ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను మొదటిసారిగా ఈ సంవత్సరమే నిర్వహిస్తున్నారు. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్‌ ఇస్తారు.

సంఖ్య పరంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ముందు వరుసలో ఉంటుంది. ఇంజినీరింగ్‌కి సంబంధించిన ప్రభుత్వరంగ సంస్థల్లో, ప్రభుత్వేతర పరిశ్రమల్లో గౌరవప్రదమైన కెరియర్‌ ఏర్పరచుకోవాలని వీరందరూ కోరుకుంటారు. ప్రముఖంగా ఇంజినీరింగ్‌ అభ్యర్థుల కోసం జరిపే పోటీ పరీక్షల్లో ఐఐటీలు నిర్వహించే గేట్‌ ప్రముఖమైంది. గేట్‌ పరీక్ష ప్రధానంగా ఉన్నత విద్యకు మార్గంగా ఉపయోగపడుతోంది. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఆ ర్యాంకుల ఆధారంగా ఉద్యోగాలూ ఇస్తున్నాయి. ఈ పరీక్షలో సాంకేతిక రంగంలో అభ్యర్థుల ప్రావీణ్యతకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేటు సంస్థలు, బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాల విషయానికి వస్తే ఒక్క ఐటీ మినహాయించి మిగతా బ్రాంచీలకు, ముఖ్యంగా మౌలిక ఇంజినీరింగ్‌ బ్రాంచీలకు ఉద్యోగాలను అందించే ప్రామాణిక అర్హత పరీక్ష లేదు. ఈ నేపథ్యంలో అన్ని సంస్థలకూ ఆమోదయోగ్యమైన టెస్ట్‌ను భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించడానికి సిద్ధమైంది. ఏ గేట్‌ వే టు కార్పొరేట్‌ వరల్డ్‌ నినాదంతో సాగే ఆ టెస్ట్‌ పేరు ఇండస్ట్రియల్‌ ప్రొఫిషియెన్సీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఫర్‌ ఇంజినీర్స్‌ (ఐపీఏటీఈ). ఇంజినీరింగ్‌ తర్వాత ఏ దిశగా అడుగులు వేయాలనే సందిగ్ధంలో ఉండేవాళ్లందరికీ మార్గదర్శనం చేస్తుంది. ప్రత్యేకంగా రెండో, మూడో శ్రేణి ప్రాంతాల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్న సమాచార లోపాన్ని నివారిస్తుంది. తగిన అభ్యర్థులను ఎంచుకోవడంలో పరిశ్రమలు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తుంది.

పరీక్ష విధానం
ఐపీఏటీఈ వ్యవధి మూడు గంటలు. ఆన్‌లైన్‌లో జరుగుతుంది. పరీక్ష నాలుగు విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగం ఆప్టిట్యూడ్‌ గరిష్ఠంగా 20 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ ప్రశ్నలు ఇస్తారు. రెండో పార్ట్‌లో ఇంటర్మీడియట్‌ స్థాయి భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి గరిష్ఠంగా 10 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. మూడో విభాగంలో ప్రశ్నలు వృత్తి సంబంధ సామర్థ్యాలపై ఉంటాయి. ఇందులో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, కాంట్రాక్టు చట్టం, మధ్యవర్తిత్వం, సామాజిక బాధ్యత, వృత్తి నైతికత (ఎథిక్స్‌) అంశాల నుంచి గరిష్ఠంగా 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఈ మూడూ అన్ని బ్రాంచీల వారికీ కామన్‌. ఆఖరి విభాగంలో సంబంధిత బ్రాంచి నుంచి గరిష్ఠంగా 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. 19 ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో పరీక్ష జరుగుతుంది. మౌలిక ఇంజినీరింగ్‌ సబ్జెక్టులతోపాటు అగ్రికల్చర్‌, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌, ఆర్కిటెక్చర్‌, మైనింగ్‌, కెమికల్‌, కంప్యూటర్‌, పెట్రోలియం, ఏరోస్పేస్‌, ఫుడ్‌ టెక్నాలజీ, ప్రొడక్షన్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ వంటి బ్రాంచీల్లోనూ పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఏదైనా ఒక బ్రాంచి కింద పరీక్షకు హాజరుకావచ్చు. సరైన సమాధానానికి ఒక మార్కు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకు అర మార్కు కోత ఉంటుంది. సిలబస్‌, ఇతర వివరాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. పరీక్ష ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు. స్కోరు మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటవుతుంది. పరీక్ష రెండు విడతల్లో ఉంటుంది. మొదటిదశ ఉదయం జరుగుతుంది. ఇందులో మొదటి మూడు పార్ట్‌లపై ప్రశ్నలు ఉంటాయి. రెండోదశ మధ్యాహ్నం ఉంటుంది. సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇస్తారు. కరోనా వైరస్‌ కారణంగా పరీక్ష వాయిదా పడుతుందనే ఆలోచన అభ్యర్థులు పెట్టుకోకూడదు. రిజిస్ట్రేషన్‌ తర్వాత ఆన్‌లైన్‌లో నమూనా పరీక్ష రాస్తే ఫలిత విశ్లేషణ ఈ-మెయిల్‌ ద్వారా అందుతుంది. వివిధ విభాగాల్లోని బలాలు, బలహీనతలతో కూడిన వివరణ అందులో ఉంటుంది. దాని ఆధారంగా ప్రిపరేషన్‌లో మార్పులు చేసుకోవచ్చు.
- నీలమేఘశ్యామ్‌ దేశాయ్‌

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: 10 మే, 2020.
హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌: 15 జూన్‌, 2020.
సీఐఐ ఐపీఏటీఈ పరీక్ష తేదీలు: 4, 5, 11, 12 జులై, 2020.
స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌: 1 ఆగస్టు 2020.
వెబ్‌సైట్‌: https://www.ipate.in

దరఖాస్తు ఎలా?
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ అనంతరం వెబ్‌సైట్‌లో మాదిరి పరీక్షలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ ఈ-మెయిల్‌ సమాచారం అందుతుంది. అందులో పరీక్షకు ఎలా సిద్ధం కావాలి, వివిధ వనరులు, పుస్తకాల వివరాలు ఉంటాయి. పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్‌టికెట్‌, ఆధార్‌ కార్డు తీసుకెళ్లాలి.

Back..

Posted on 29-04-2020