Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సరైన వ్యూహంతో సీఏ సులువెంతో!

మరో రెండు నెలల్లో సీఏ ఐపీసీసీ, సీఏ ఫైనల్‌ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఎలాంటి వ్యూహంతో పరీక్షలకు సన్నద్ధమవాలి? ఏ సబ్జెక్టుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెలకువలు పాటించాలి?
సీఏ కోర్సులోని అన్ని స్టేజీల్లో ఐపీసీసీ కీలక దశ. ప్రణాళికబద్ధంగా చదివితే దీన్ని మొదటి ప్రయత్నంలోనే సులువుగా పూర్తిచేయవచ్చు. ముందుగా మంచి సంస్థను వీలైతే అన్ని సబ్జెక్టులకు ఒకేచోట కోచింగ్‌ అందించే దాన్ని ఎంచుకోవడం మంచిది. దీనివల్ల సమయపు వృథాను అరికట్టవచ్చు.
తరగతిలో వివరించే ఉదాహరణలు, చార్టులను తప్పకుండా రాసుకోవాలి. రన్నింగ్‌ నోట్స్‌ రాసుకుని పునశ్చరణ సమయంలో దీనితోపాటు ప్రాక్టీస్‌ మాన్యువల్‌ను చదవాలి. కోచింగ్‌ పూర్తయ్యాక పూర్తిస్థాయిలో సన్నద్ధత మొదలుపెట్టాలి.
అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను ముందుగానే సమకూర్చుకోవాలి. ఉదా: ప్రాక్టీసు మాన్యువల్స్‌, పాత ప్రశ్నపత్రాలు, రివిజన్‌ టెస్ట్‌ పేపర్లు, ఎంటీపీసీలు మొ॥వి.
రోజుకు రెండు సబ్జెక్టులను చదివేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. వీలైనంతవరకు ఆ రెండు సబ్జెక్టుల్లో ఒక థియరీ, మరొకటి ప్రాబ్లమాటిక్‌ పేపర్లుగా ఎంచుకోవాలి. సన్నద్ధమయ్యే సమయంలో కీ వర్డ్స్‌ను రాసిపెట్టుకోవడం, మెటీరియల్‌లో అండర్‌లైన్‌ చేస్తూ చదవడం లాంటివి చేస్తే పునశ్చరణ సులభమవుతుంది.
మొదటి నుంచి చదువుతున్న మెటీరియల్‌నే చివరివరకూ కొనసాగించాలి. మారుస్తూ ఉండకూడదు. ఉన్న ఏడు సబ్జెక్టుల్లో ఏవైనా 4 సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే ఆ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించే వీలుంటుంది.

సబ్జెక్టులవారీ జాగ్రత్తలు
అకౌంటింగ్‌: అకౌంటింగ్‌ స్టాండర్స్‌ను తప్పక చదవాలి. ప్రతి చాప్టర్‌లో ఒక బేసిక్‌ ప్రాబ్లమ్‌ను ఎంచుకుని సాధన చేయాలి. మిగతా వాటిలోని ప్రముఖ అంశాలను (కీ అడ్జస్ట్‌మెంట్స్‌) హైలైట్‌ చేసుకోవాలి. ఇది పునశ్చరణకు బాగా ఉపయోగపడుతుంది.
ప్రతి అంశాన్నీ చదువుతున్నపుడు కాన్సెప్టుకే ప్రాధాన్యమివ్వాలి. వీలైనంతవరకూ ప్రతిరోజూ ఒక అకౌంట్‌ స్టాండర్డ్‌ను చదవాలి, నేర్చుకోవాలి.
చిన్న చిన్న అధ్యాయాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి (సెల్ఫ్‌ బాలెన్సింగ్‌ లెడ్జర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అకౌంట్స్‌ మొ॥వి). సమయముంటే అమాల్గమేషన్‌కి కూడా ప్రాధాన్యమివ్వాలి.
పరీక్ష సమయంలో ప్రశ్నలన్నింటికీ సమాధానం రాయడానికి సమయం సరిపోకపోవచ్చు. కాబట్టి ముందునుంచే వేగంగా రాయడం అలవాటు చేసుకోవాలి.
బిజినెస్‌ లాస్‌, ఎథిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: ముందుగా కమ్యూనికేషన్‌, ఎథిక్స్‌ కాన్సెప్టులను పూర్తిచేయాలి. కంపనీ లాలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండే అంశాలైన షేర్‌ కాపిటల్‌, జనరల్‌ మీటింగ్‌, ప్రాస్పెక్టస్‌ వంటివి బాగా చదవాలి.
పరీక్ష రాసేటపుడు సెక్షన్‌ నంబర్లను మిళితం చేసి రాయాలి (సరిగా తెలిస్తేనే). కమ్యూనికేషన్‌, ఎథిక్స్‌లకు సంబంధించి పాత ప్రశ్నపత్రాల్లో తరచుగా ఇస్తున్న ప్రశ్నలను చదవాలి.
కంపనీ లాలోని చిన్న చిన్న అధ్యాయాలను చదవాలి. అదర్‌ లాస్‌లో (పీఎఫ్‌, గ్రాట్యుటీ, బోనస్‌ యాక్ట్‌) ప్రొసీజర్‌పై దృష్టి కేంద్రీకరించాలి.
ఎన్‌ఐ యాక్ట్‌కు సమయం లేకపోతే ఫీచర్స్‌, డాక్యుమెంట్స్‌ గురించి చదివితే చాలు.
కాస్ట్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌: ఈ సబ్జెక్టుకి సంబంధించి తరగతులు జాగ్రత్తగా వినాలి. ప్రాక్టీసు మాన్యువల్‌లోని థియరీ తప్పనిసరిగా చదవాలి. ప్రాబ్లమ్స్‌ను బాగా సాధన చేయాలి. ఈ సబ్జెక్టుల్లో సమయపాలన ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి సమయాన్ని సరిగా వినియోగించుకోవాలి. ఫార్ములాలను గుర్తుపెట్టుకోవాలి.
ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లో కాపిటల్‌ బడ్జెటింగ్‌, వర్కింగ్‌ కాపిటల్‌ మేనేజ్‌మెంట్‌, రేషియో అనాలిసిస్‌కు ప్రాధాన్యమివ్వాలి.
కాస్ట్‌ అకౌంటింగ్‌లో మార్జినల్‌ కాస్టింగ్‌, స్టాండర్డ్‌ కాస్టింగ్‌, ప్రాసెసింగ్‌ కాస్టింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి.
పరీక్ష రాసేటపుడు థియరీని సరళమైన భాషలో రాయాలి. ప్రాబ్లమ్స్‌ చేసేటపుడు ప్రొసీజర్‌ను అర్థవంతంగా రాస్తూ వర్కింగ్‌ నోట్స్‌ను తప్పనిసరిగా రాయాలి.
టాక్సేషన్‌ (డైరెక్ట్‌ టాక్స్‌ లాస్‌): అమెండమెంట్స్‌ (సవరణలు)పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాక్టీస్‌ మాన్యువల్‌ తప్పనిసరి. తరగతిలో వివరించే ఉదాహరణలు, చార్టులు తప్పక రాసుకోవాలి. రన్నింగ్‌ నోట్స్‌ రాసుకుని, పునశ్చరణ సమయంలో ప్రాక్టీస్‌ మాన్యువల్‌తోపాటుగా దీన్నీ చదవాలి.
టాక్స్‌లోని అన్ని అంశాలూ ముఖ్యమే. చిన్న అధ్యాయాలను కూడా చదవాలి (క్లబింగ్‌, ప్రొవిజన్స్‌, రిటర్న్‌ ఆఫ్‌ ఇన్‌కం, సెట్‌ ఆఫ్‌ అండ్‌ కారీ ఫార్వర్డ్‌, టీడీఎస్‌).
పరీక్ష రాసేటపుడు బాగా గుర్తున్న సెక్షన్‌ నంబర్లు కూడా రాస్తే మంచిది. సెక్షన్‌ నంబర్లను తెలిస్తేనే రాయాలి. లేదంటే రుణాత్మక మార్కులు తెచ్చుకునే ప్రమాదముంది.
టాక్సేషన్‌ (ఇన్‌డైరెక్ట్‌ లాస్‌): అమెండమెంట్స్‌ (సవరణలు)పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సర్వీస్‌ టాక్స్‌కి ప్రాధాన్యమివ్వాలి. సర్వీస్‌టాక్స్‌లో నెగెటివ్‌ లిస్ట్‌, కాంపొజిషన్‌ స్కీం, మెగా ఎక్సెంప్షన్స్‌పై అవగాహన పెంచుకోవాలి. థియరీ, సమస్యల సాధనకు సమప్రాధాన్యమివ్వాలి. చిన్న అధ్యాయాలను (వ్యాట్‌, సీఎస్‌టీ, సీఈఎన్‌వీఏటీ మొ॥వి) కూడా సాధన చేయాలి.
అడ్వాన్స్‌డ్‌ అకౌంటింగ్‌: అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ తప్పకుండా చదవాలి. ఫార్మాట్‌ ఉన్న చాప్టర్స్‌ (బ్యాంకింగ్‌ కంపనీస్‌ అకౌంట్స్‌, ఇన్సూరెన్స్‌ కంపనీస్‌ అకౌంట్స్‌ మొ॥వి) సాధన చేయాలి. డిపార్ట్‌మెంటల్‌ అకౌంట్స్‌, పార్ట్‌నర్‌షిప్‌ అకౌంట్స్‌కి ప్రాధాన్యమివ్వాలి. సాధ్యమైనన్ని ఎక్కువ లెక్కలు సాధన చేయాలి.
ఆడిటింగ్‌ అండ్‌ అస్యూరెన్స్‌: రోజుకో ఆడిటింగ్‌ స్టాండర్స్‌ చదవాలి. ప్రతి స్టాండర్డ్‌కి ఫ్లోచార్ట్‌ తయారు చేసుకుంటే పునశ్చరణకు ఉపయోగం. వీలైనన్ని ప్రాక్టికల్‌ ప్రశ్నలు సాధన చేయాలి. పరీక్షలో ఎక్కువ శాతం ప్రాక్టికల్‌ ప్రశ్నలే ఉంటాయి. వీటికి ప్రాధాన్యమివ్వాలి. అన్ని అంశాలకూ రన్నింగ్‌ నోట్స్‌ సమకూర్చుకోవాలి.
కంపనీ ఆడిట్‌కు ప్రాధాన్యమివ్వాలి. స్టాండర్డ్‌ సంఖ్యలపై పూర్తి అవగాహన ఉంటేనే పరీక్షలో వాటిని రాయాలి.
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌: ప్రాక్టికల్‌ మాన్యువల్‌ చదవడం తప్పనిసరి. వీలైనంతవరకూ సొంత నోట్స్‌, ఫ్లోచార్ట్స్‌ తయారు చేసుకోవాలి. చదివినది ఏరోజు కారోజు పునశ్చరణ చేసుకోవాలి.
స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి టాపిక్స్‌పై ప్రాక్టికల్‌ వ్యూని అలవరచుకోవాలి. డిఫరెన్సెస్‌కు సంబంధించి ప్రశ్నలు బాగా చదవాలి. ట్రూ/ ఫాల్స్‌, డెఫినిషన్స్‌ బాగా చదవాలి. కాన్సెప్టులను బాగా చదివి అవగాహన ఏర్పరచుకోవాలి.

సీఏ ఫైనల్‌కు సన్నద్ధత
* కోచింగ్‌ తీసుకునే సమయంలోనే ఏవైనా రెండు పేపర్లను రోజువారీ పద్ధతిలో పునశ్చరణ చేసుకోవాలి. * సొంతంగా ఫాస్ట్‌ ట్రాక్‌ నోట్స్‌ తయారు చేసుకుంటే మేలు.
* సాధన చేస్తున్నపుడే అనవసరం అనుకున్న లెక్కలను తీసివేస్తూ వెళ్లడం వల్ల సులువుగా పునశ్చరణ చేసుకోవచ్చు.
* ఫార్ములాలన్నింటినీ ఒక పుస్తకంలో రాసిపెట్టుకుంటే మంచిది.
* వీలును బట్టి ఫ్లో చార్ట్‌ వేసుకుంటే ఉపయోగకరం.
* గత 5 సంవత్సరాల పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే మంచిది.
* ప్రాక్టీస్‌ మాన్యువల్‌లోని ప్రశ్నలన్నింటినీ సాధన చేయాలి.
* ఇటీవల చేసిన సవరణలు (అమెండ్‌మెంట్స్‌) తప్పనిసరిగా చదవాలి.
* ఉన్న 8 సబ్జెక్టుల్లో ఏవైనా నాలుగింటిపై ఎక్కువ శాతం దృష్టి కేంద్రీకరిస్తే ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించే వీలుంటుంది.
* ప్రాక్టీస్‌ మాన్యువల్‌లోని ప్రశ్నలకు జవాబులు ఎలా సూచించారో నిశితంగా పరిశీలించాలి.
* మొదటి నుంచి ఏ మెటీరియల్‌ను చదువుతున్నారో ఆఖరి వరకూ దాన్నే కొనసాగించడం మేలు.
ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌
* ఏదైనా ఒక ఆథర్‌ బుక్‌, ఒక ప్రాక్టీస్‌ మాన్యువల్‌లను సమకూర్చుకోవాలి.
* ప్రతి చాప్టర్‌లో ఏదో ఒక ప్రాథమిక సమస్య విధానాన్ని తెలుసుకుని, మిగతా సమస్యల్లోని ముఖ్యమైన అంశాల (అడ్జస్ట్‌మెంట్స్‌) వరకు సాధన చేస్తే చాలు.
* ప్రతి చాప్టర్‌లోని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఉదా: వాల్యుయేషన్‌ ఆఫ్‌ గుడ్‌విల్‌
* అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌పై మంచి అవగాహన అవసరం.
* చిన్న చిన్న అధ్యాయాలను కూడా వదలకుండా అన్ని అంశాలూ చదవాలి. ఉదా: వాల్యూ యాడెడ్‌ స్టేట్‌మెంట్స్‌, ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ మొ॥వి.
* సమయం అందుబాటులో ఉంటే కన్సాలిడేషన్‌ కూడా చదవాలి. లేదా కొంత ప్రాముఖ్యం ఇస్తే సరిపోతుంది.
స్ట్రాటజిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌
* డెరివేటివ్స్‌లో చాలా అంశాలున్నాయి. కాబట్టి వీలైనంతవరకూ దీనికి తుది ప్రాధాన్యమివ్వాలి.
* డివిడెండ్‌ పాలసీ, మెర్జర్స్‌- అక్విజిషన్స్‌, బాండ్‌ వాల్యూయేషన్‌ వంటి చిన్న అంశాలతో సన్నద్ధత ప్రారంభిస్తే మంచిది.
* పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ అనే అంశం కేవలం ఫార్ములాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని త్వరగా పూర్తిచేయవచ్చు.
* ఆ తరువాత ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌, చివరగా డెరివేటివ్స్‌ చదివితే మేలు.
* థియరీకి ప్రాక్టీస్‌ మాన్యువల్‌ చదివితే చాలు.
అడ్వాన్స్‌డ్‌ ఆడిటింగ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌
* ప్రాక్టీస్‌ మాన్యువల్‌ తప్పనిసరి.
* ముందుగా ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ పూర్తిచేయాలి.
* రోజుకో ఆడిటింగ్‌ స్టాండర్డ్‌ చొప్పున చదవాలి. వీలైతే ఫ్లోచార్ట్‌లు వేసుకోవాలి.
* పరీక్షలో ప్రాక్టికల్‌ ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. కాబట్టి వీటిపైనే దృష్టి కేంద్రీకరించాలి.
కార్పొరేట్‌ అండ్‌ అలైడ్‌ లాస్‌
* ముందుగా అలైడ్‌ లాస్‌ పూర్తిచేయాలి. అన్ని లాస్‌లో చివరి ప్రొసీజర్స్‌ ఒకేలా ఉంటాయి. కాబట్టి ఒకటి చదివి మిగతావి చూసుకుంటే చాలు.
* పునశ్చరణ సమయంలో సెబీకి సంబంధించిన ప్రశ్నల్లో ఎక్కువసార్లు అడిగిన ప్రశ్నల వరకు చదివితే చాలు. *లాస్‌లో మార్పులు జరిగేటపుడు పెనాల్టీ ప్రొవిజన్స్‌కే ప్రాధాన్యం ఉంటుంది. వాటన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి.
* చదివిన ఆథర్‌ బుక్‌, ప్రాక్టీస్‌ మాన్యువల్‌ దగ్గర పెట్టుకుని సాధన చేయాలి. ఒక్కోసారి జవాబుల్లో నిర్ణయాలకు సంబంధించిన వ్యత్యాసాలు ఉండవచ్చు. కాబట్టి ఒక ఆథర్‌బుక్‌ చదివాక ప్రాక్టీస్‌ మాన్యువల్‌ ద్వారా సాధన చేస్తే మేలు.
అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌
* ఈ సబ్జెక్టుకు సంబంధించినంత వరకూ ఆథర్‌ బుక్స్‌ కన్నా పాఠాలు విని, తయారుచేసుకున్న క్లాస్‌ నోట్స్‌, ప్రాక్టీస్‌ మాన్యువల్‌ మీద ఆధారపడితే మేలు.
* ప్రాక్టీస్‌ మాన్యువల్‌లోని థియరీ చదవాలి. సమయపాలన అత్యంత అవసరం.
* ఆపరేషనల్‌ రీసర్చ్‌తో సన్నద్ధత ప్రారంభిస్తే మంచిది.
ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ కంట్రోల్‌ అండ్‌ ఆడిట్‌
*స్టడీ మెటీరియల్‌ను తప్పనిసరిగా సాధన చేస్తూ సొంతంగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. వీలైతే ఫ్లోచార్ట్‌ వేసుకోవాలి.
* ఏరోజుది ఆరోజు పునశ్చరణ చేసుకోవాలి.
డైరెక్ట్‌ టాక్స్‌ లాస్‌
* ప్రాక్టీస్‌ మాన్యువల్‌ తప్పనిసరి.
* పునశ్చరణ సమయంలో సమరీ మాడ్యూల్‌, ప్రాక్టీస్‌ మాన్యువల్‌లను తప్పనిసరిగా చదవాలి.
* ఫైవ్‌ హెడ్స్‌ (అంశాలు) తప్పనిసరిగా చదవాలి. సమయం ఉంటే కేస్‌లాస్‌ను కూడా చూసుకోవాలి.
* పరీక్షలో సెక్షన్స్‌, కేస్‌లాస్‌ మిళితం చేసి రాయాలి. తప్పులు రాయకూడదు.
* సవరణలు మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
ఇండైరెక్ట్‌ టాక్స్‌ లాస్‌
* ఈ సబ్జెక్టులో కేస్‌ లాస్‌ పాత్ర కీలకం కాబట్టి అవన్నీ బాగా చదివి గుర్తుపెట్టుకోవాలి.
* ముందుగా సర్వీస్‌ టాక్స్‌కి తరువాత ఎక్సైజ్‌ డ్యూటీస్‌కి ప్రాధాన్యమివ్వాలి.
* కస్టమ్‌ డ్యూటీస్‌ విషయంలో అవసరమైన అంశాల వరకు చూసుకోవాలి.
ఐపీసీసీ, సీఏ-ఫైనల్‌ విషయంలో విద్యార్థులు ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించి సన్నద్ధమైతే సీఏ కోర్సును సులువుగా పూర్తిచేసుకోవచ్చు.


Back..

Posted on 06-09-2016