Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అవుతారా.. యంగ్‌ సైంటిస్ట్‌!

* తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇస్రో ఆహ్వానం

హైస్కూలు విద్యార్థులను యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రాంలోకి ఆహ్వానిస్తోంది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో. ఎంపికైనవారికి 12 రోజులపాటు ఇస్రో కేంద్రాల్లో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పిస్తారు. ఇంటి నుంచి రాకపోకలకూ, భోజన, వసతి, మెటీరియల్‌... తదితర ఖర్చులను భరిస్తారు.

విద్యార్థులు భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనల దిశగా అడుగులు వేేయాలనే లక్ష్యంతో ఇస్రో యంగ్‌ సైంటిస్ట్‌ కార్యక్రమాన్ని గత ఏడాది (2019) ప్రారంభించింది. ‘క్యాచ్‌ దెమ్‌ యంగ్‌’ నినాదంతో దీన్ని నిర్వహిస్తున్నారు. ఎంపికైనవారి కోసం అంతరిక్షానికి సంబంధించిన సాంకేతికాంశాలు, సైన్స్‌, అనువర్తనాల్లో ప్రాథమిక అవగాహన పెరిగే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. అంతరిక్ష వ్యవహారాలపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించి వారికున్న సందేహాలు నివృత్తి చేస్తారు. శాస్త్రవేత్తలతో ఉపన్యాసాలు ఉంటాయి. అలాగే వారు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటారు. ప్రయోగశాలలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. నిపుణులతో చర్చించడానికి కొన్ని సెషన్లు ఉంటాయి. ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. చివరలో విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు.

కార్యక్రమం వివరాలు
ఈ యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రాం మే 11 నుంచి 22 వరకు కొనసాగుతుంది. ఎంపికైనవారు ఇస్రో కేంద్రాలైన అహ్మదాబాద్‌, బెంగళూరు, షిల్లాంగ్‌, తిరువనంతపురంలో ఎక్కడైనా పాల్గొనవచ్ఛు కార్యక్రమాలు ఆంగ్ల మాధ్యమంలో జరుగుతాయి. ఇందులో పాల్గొనడానికి ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. వసతి, భోజన సదుపాయాలు ఇస్రో ఉచితంగా కల్పిస్తుంది. విద్యార్థి, వారితోపాటు తోడుగా వచ్చినవారికీ కోర్సు ప్రారంభమైనప్పుడు, ముగిసిన తర్వాత రెండువైపులా రెండో తరగతి ఏసీ టికెట్‌కు అయ్యే ఖర్చునూ భరిస్తుంది. కోర్సు మెటీరియల్‌,..ఇతర అవసరాలన్నీ చూసుకుంటుంది.

ఎంపిక కావాలంటే..
ఎనిమిదో తరగతిలో చూపిన అకడమిక్‌ ప్రతిభ, ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎనిమిదో తరగతి పరీక్షల్లో చూపిన ప్రతిభకు 60 శాతం, పాఠశాలలు లేదా బోర్డు స్థాయుల్లో నిర్వహించే కార్యక్రమాలు అంటే డిబేట్‌, ఎలక్యూషన్‌, ఎస్సే రైటింగ్‌...మొదలైనవాటిలో 2016 మొదలుకుని ఎప్పుడైనా జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచినవారికి ఆ స్థాయిని బట్టి వరుసగా 2, 4, 6, 10 శాతం వెయిటేజీ ఉంటుంది. 2016 నుంచి ఎప్పుడైనా జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఏదైనా క్రీడలో విజేతలుగా నిలిచినవారికి ఆ స్థాయిని బట్టి వరుసగా 2, 4, 6, 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ప్రస్తుతం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వీటిలో ఎందులోనైనా సభ్యులుగా ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలు లేదా మండలాల్లో చదువుతోన్న విద్యార్థులకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. మొత్తం వందశాతం వెయిటేజీలో ఎక్కువ వెయిటేజీ ఉన్నవారిని తీసుకుంటారు.

ఎంత మందికి?
ఒక్కో రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ముగ్గురికి చొప్పున అవకాశం లభిస్తుంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ మూడు బోర్డుల విద్యార్థులూ భాగమయ్యేలా చూస్తారు. విదేశాల్లో చదువుతోన్న భారతీయ విద్యార్థులకోసం 5 సీట్లు కేటాయించారు.ఎంపికైనవారి వివరాలు మార్చి 30న ప్రకటిస్తారు.
ఎవరికోసం: ప్రస్తుతం ఏ బోర్డు ద్వారానైనా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్ఛు 8, 10 తరగతులవారికి అవకాశం లేదు.
దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పంపాలి. ఇందుకోసం ఫీజు చెల్లించనవసరం లేదు. ఫిబ్రవరి 24 సాయంత్రం 6లోపు దరఖాస్తులు పంపాలి.
వెబ్‌సైట్‌: https://www.isro.gov.in/

Back..

Posted on 05-02-2020