Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఐటీ కెరియర్‌కు ఆసరా

సమాచార సాంకేతికత (ఐటీ) లో సరికొత్త నైపుణ్యాలను నేర్చుకోవటం నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఈ రంగంలో ప్రవేశించి కెరియర్‌ను తీర్చిదిద్దుకోవాలనుకునే విద్యార్థులు వివిధ సర్టిఫికేషన్లు చేసి, పరిజ్ఞానం సంపాదించటం అవసరం. ఇందుకు దారిచూపే కథనం...!
ఇండస్ట్రీ సర్టిఫికేషన్‌ అనేది డిగ్రీ పూర్తిచేసి, విద్యార్థి తనకు ఇష్టమైన, సరైన ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేకంగా చేసే సర్టిఫికేషన్‌. డిగ్రీ చదివేటపుడే ప్రొఫెషనల్‌ కెరియర్‌ కోసం చేసేది- ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్‌.
ఇండస్ట్రీ, ప్రొఫెషనల్‌... సర్టిఫికేషన్‌ ఏది అయినా పరిశ్రమకు చాలా ముఖ్యం. అది ఐటీ కానీ, మరే పరిశ్రమ కానీ నైపుణ్యమున్న ఉద్యోగుల ద్వారా తమ ఉత్పత్తిని అభివృద్ధి చేసుకుని మార్కెట్‌లో పైచేయిగా ఉండాలని కోరుకుంటాయి. అంతేకాకుండా సర్టిఫికేషన్‌ అనేది ఉద్యోగి పనితనాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ప్లేస్‌మెంట్‌లో, ఇంటర్వ్యూలో ఇద్దరు అభ్యర్థుల మధ్య సమానావకాశాలు ఉన్నప్పుడు సర్టిఫికేషన్‌ ఉన్నవారికి అది ప్రత్యేకంగా ఉపయోగపడి, వారిపై మొగ్గు చూపే అవకాశముంది. నియామకాల్లోనే కాకుండా పరిశ్రమల్లో ప్రవేశించిన తర్వాత కూడా ప్రతీ సంవత్సరం వృత్తిపరంగా ఎదగడానికి సర్టిఫికేషన్ల పరిజ్ఞానం సాయపడుతుంది. ఈ రకంగా సర్టిఫికేషన్‌ అనేది ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోవడంతోపాటు ప్రత్యేక గుర్తింపును కూడా ఇస్తుంది. తద్వారా సంస్థ తన వ్యాపారాన్నీ, క్లయింట్ల కాంట్రాక్టులనూ పెంచుకోవడానికి వీలుంటుంది.

ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్‌ లాభాలు
* చేస్తున్న ఉద్యోగంలో ఆచరణాత్మకంగా నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు.
* సంస్థలోని వివిధ విభాగాల్లో పరిజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుంది.
అయితే ఇండస్ట్రీ ఓరియెంటెడ్‌ శిక్షణ అనేది పరిశ్రమకు కావాల్సిన పరిజ్ఞానాన్ని తక్కువ సమయంలో (మూడు, నాలుగు వారాల నుంచి ఆరు నెలల్లోపు) నేర్చుకుని పరిశ్రమలో ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది.
పెద్ద పరిశ్రమలయితే కొత్త గ్రాడ్యుయేట్లను (ఫ్రెషర్స్‌) ఎంచుకుని, వారికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు శిక్షణనిస్తాయి. ఆపై తమ క్లయింట్స్‌ కోసం ఉపయోగించుకుంటాయి. కానీ వృద్ధిలోకి రాబోతున్న సంస్థలు ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకుని వారికి శిక్షణనిచ్చేంత బడ్జెట్‌ను కేటాయించడం చాలా కష్టం. అటువంటి సంస్థలు ఇండస్ట్రీ ఓరియెంటెడ్‌ శిక్షణ పూర్తిచేసినవారిని ఎంపిక చేసుకోవాలనుకుంటాయి. ఒక్కోసారి పెద్ద సంస్థలు కూడా తమ క్లయింట్‌ డిమాండు మేరకు అలాంటి నైపుణ్యాలు ఉన్నవారి కోసం చూస్తాయి.

విభాగాలూ.. సర్టిఫికేషన్లూ
పరిశ్రమల్లో వివిధ విభాగాలు ఉన్నట్టే, వివిధ విభాగాలకు వివిధ సర్టిఫికేషన్లు ఉంటాయి. ఉదాహరణకు- ఐటీ పరిశ్రమనే తీసుకుంటే.. డెవలప్‌మెంట్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ప్రొడక్టైజేషన్‌, మార్కెటింగ్‌, సిస్టం ఇంటిగ్రేటర్స్‌, సిస్టం నెట్‌వర్కింగ్‌ విభాగాలు మిగతా పరిశ్రమల్లాగానే ఐటీలోనూ ఉంటాయి. ఈ విభాగాలన్నింటికీ సర్టిఫికేషన్లు ఉంటాయి. ఈ విభాగాల్లో వ్యక్తిగత ఇష్టాలమేరకు కెరియర్‌ను మలచుకోవడం విద్యార్థి చేతుల్లోనే ఉంటుంది.
ఐటీ పరిశ్రమలోని శిక్షణను ఆరు విభాగాలుగా విభజించవచ్చు. వివిధ శిక్షణ సంస్థలు మార్కెట్‌కి అనుగుణంగా దాదాపుగా ఈ ఆరు విభాగాల్లోనే ఎక్కువగా ఇండస్ట్రీ శిక్షణను అందిస్తున్నాయి.
1. ప్రోగ్రామింగ్‌లో ఇండస్ట్రీ శిక్షణ: దీనిలో ముఖ్యంగా డెవలపర్‌, ప్రోగ్రామర్లుగా కెరియర్‌ ప్రారంభించాలని అనుకునేవారికి అవకాశాలుంటాయి.
2. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌: ముఖ్యంగా ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ను నిర్మించి, సాంకేతిక నిర్వహణ, మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం సంపాదించడం కోసం.
3. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ పాకేజింగ్‌ ఇండస్ట్రీ అప్లికేషన్స్‌
4. డేటాబేస్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌ అప్లికేషన్స్‌ శిక్షణ: పెద్ద సంస్థలు కానీ, పరిశ్రమలు కానీ వివిధ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌తో వాటికి సంబంధించిన మొత్తం వ్యవస్థను నిర్వహించటం.
5. డెస్క్‌టాప్‌ అప్లికేషన్స్‌, రాఫిక్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌, వెబ్‌ డిజైన్‌ శిక్షణ: ఇందులో మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, ఎక్సెల్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అప్లికేషన్స్‌ మీద ఇండస్ట్రీ శిక్షణ. ముఖ్యంగా ఈ శిక్షణ డెస్క్‌టాప్‌ యూజర్స్‌, వాటి అప్లికేషన్స్‌ మీద ఉంటాయి.
6. కాంప్లియెన్స్‌, స్టాండర్డ్స్‌ ట్రైనింగ్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ మీద నైపుణ్యాలను సంపాదించుకోవడానికి అవకాశాలున్నాయి.
ముందుగా ప్రోగ్రామింగ్‌లో ఎలాంటి ఇండస్ట్రీ సర్టిఫికేషన్‌ అవకాశాలున్నాయో చూద్దాం.
అ) ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌: సి, సి++, జావా, మైక్రోసాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌, డాట్‌ నెట్‌, హెచ్‌టీఎంఎల్‌ ప్రోగ్రామింగ్స్‌ వంటి వాటిలో నైపుణ్యాన్ని సంపాదించుకోవడం.
ఆ) సిస్టం ఇంజినీరింగ్‌లో నైపుణ్యం సంపాదించుకోవడం- అంటే ఆపరేటింగ్‌ సిస్టం ఇంటర్నల్స్‌, కెర్నల్‌ ప్రోగ్రామింగ్‌ వంటి వాటిలో కెరియర్‌ను సంపాదించుకోవడం.
ఇ) కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ అప్లికేషన్స్‌లో నిష్ణాతులవ్వడాని- వెబ్‌సైట్లకు బదులుగా వెబ్‌ పోర్టల్స్‌ డిజైన్‌, డెవలప్‌మెంట్‌ కెరియర్‌ కోసం.
ఈ) సెక్యూరిటీ ప్రోగ్రామింగ్‌- రాసే ప్రతి ప్రోగ్రాంలో సెక్యూరిటీని అనుసంధానించటం, తద్వారా అప్లికేషన్స్‌, సిస్టంలను సెక్యూరిటీ బేస్‌డ్‌ సిస్టమ్స్‌ చేసే కెరియర్‌.

ప్రోగ్రామింగ్‌ టెక్నాలజీస్‌లో ఇండస్ట్రీ కోర్సులు
సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సి-డేక్‌) రెండు రకాల ఆరు నెలల కోర్సులను (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ సిస్టం సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌) హైదరాబాద్‌, పుణె, బెంగళూరు, నోయిడాల్లో అందిస్తోంది. ఏటా రెండుసార్లు ఉమ్మడి ప్రవేశపరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకుని, శిక్షణనిచ్చి ప్లేస్‌మెంట్ల ద్వారా ఐటీ పరిశ్రమలో అవకాశం కల్పిస్తోంది.
పీజీ డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌:
ఈ కోర్సు ద్వారా ఆపరేటింగ్‌ కాన్సెప్టులు; ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌, ఆల్గారిథమ్స్‌, డేటా స్ట్రక్చర్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ వంటి కాన్సెప్టులు ఐటీ పరిశ్రమలో ప్రోగ్రామర్‌కి కావాల్సిన ప్రాథమిక నైపుణ్యాలతో ప్రారంభిస్తారు. సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ మీద అవగాహన కల్పిస్తారు. ఆ తరువాతే వెబ్‌ ప్రోగ్రామింగ్‌, డేటాబేస్‌ ప్రోగ్రామింగ్‌, అడ్వాన్స్‌డ్‌ అంశాలను నేర్పుతారు. https://cdac.in/index.aspx?id=DAC&courseid=0#

పీజీ డిప్లొమా ఇన్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌:
అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ మీద కాకుండా సిస్టమ్‌ డిజైన్‌లో కెరియర్‌ను మలచుకోవాలంటే ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో అడ్వాన్స్‌డ్‌ సి లేదా సి++ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌లపై మొదటి నెలలో అవగాహన కల్పిస్తారు. విండోస్‌ ఇంటర్నల్స్‌, లినక్స్‌ ఇంటర్నల్స్‌ మీద దృష్టిపెట్టడం వల్ల విద్యార్థులకు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ప్రోగ్రామింగ్‌ మీద నైపుణ్యాలు పెరుగుతాయి. చివరి రెండు నెలల్లో మొబైల్‌ కంప్యూటింగ్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం ప్రోగ్రాం, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మీద పనిచేయడం వల్ల సిస్టమ్స్‌ ప్రోగ్రామింగ్‌ మీద, సిస్టం సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ మీద పూర్తి అవగాహన కలుగుతుంది. పరిశ్రమకు చేరువ కావడానికి అవకాశాలు బాగా ఏర్పడతాయి.
ఈ రెండు పీజీ డిప్లొమాల్లో ఒకటి పూర్తిగా అప్లికేషన్‌ మీద, మరొకటి డిప్లొమా సిస్టమ్స్‌, నెట్‌వర్క్‌ ప్రోగ్రామింగ్‌ మీద కాబట్టి నచ్చిన కెరియర్‌ని దృష్టిలో ఉంచుకుని ఎంచుకోవచ్చు.
ఈ శిక్షణలో విద్యార్థులు ఆరు నెలలపాటు విరామం లేకుండా.. అంటే 24 గంటలు ల్యాబ్‌ల్లో అంకితభావంతో పనిచేయాల్సివుంటుంది. ప్రతి ఆరు నెలలకు పరిశ్రమ నిపుణులతో అనుసంధానం అవడం ద్వారా ఈ కోర్సుల్లోని మాడ్యూళ్లు, అంశాలను ఎప్పటికప్పుడు పరిశ్రమలకు అనుగుణంగా మారుస్తుంటారు. దీని వల్ల ఈ కోర్సులకు గిరాకీ ఎక్కువ. గత కొద్ది సంవత్సరాల్లో సుమారుగా 20,000 మంది విద్యార్థులు 300 వరకు సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. పరిశ్రమ మందకొడిగా ఉన్నపుడు కూడా 80% ప్లేస్‌మెంట్లు రావటం విశేషం.

ప్రోగ్రామింగ్‌లో కెరియర్‌ను ప్రారంభిద్దామనుకుంటే ప్రోగ్రామర్‌గా, డెవలపర్‌గా, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, అనలిస్టుగా, టెస్టర్‌గా ఉండే అవకాశాలు చూద్దాం.

ఏదైనా ఒక కోర్సు అంటే... సి, సి++, జావా, డాట్‌నెట్‌లలో ఏదో ఒక ప్రోగ్రామ్‌ మీద దృష్టి పెట్టి అందులో ప్రావీణ్యం సంపాదించుకోవటం ద్వారా మిగతావి అర్థం చేసుకోవడం. వీటికైతే నైపుణ్యాల గుర్తింపు కోసం ఏదైనా ఒక సర్టిఫికేషన్‌ చేస్తే సరిపోతుంది. లేదా రెండు మూడు ప్రోగ్రాముల్లో పట్టు సాధించి డేటాబేస్‌, కమ్యూనికేషన్లలో కూడా ప్రావీణ్యం సాధించుకోవాలంటే ఏదైనా పరిశ్రమ ఆధారిత శిక్షణ పొందటం ఉత్తమం.
నిట్‌ (NIIT) గ్రాడ్యుయేట్‌ పోగ్రాంను కళాశాల నుంచి విద్యార్థి తనకు ఇష్టమైన కెరియర్‌తో ఐటీ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి దగ్గరి దారి అంటారు. ఎందుకంటే ఫాస్ట్‌ ట్రాక్‌ పీజీ ప్రోగ్రాం కోర్సులు తక్కువ సమయంలో ఎక్కువ సాంకేతికతతో ఉద్యోగావకాశాలు పెరగడానికి దోహదం చేస్తాయి. ఈ ప్రోగ్రాం.. ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యాలు, కాన్సెప్ట్స్‌ ఓరియెంటెడ్‌ కావడం వల్ల ఐటీ పరిశ్రమలోకి సులభమార్గాన్ని కల్పిస్తుంది.
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ జావా ప్రోగ్రాములు జావా టెక్నాలజీలు, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌.నెట్‌ మైక్రోసాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల్లో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాలకు...http://www.niit.com/india/training/personals/graduate/information-technology
ఆప్‌టెక్‌ (APTECH) కూడా నాణ్యత ఆధారితం. ఈ కింది విభాగాల్లో ఐటీ విద్యను తమ కేంద్రాల ద్వారా అందిస్తుంది. ఆప్‌టెక్‌ సర్టిఫైడ్‌ కంప్యూటర్‌ ప్రొఫెషనల్‌తో జావా, డాట్‌నెట్‌, సి ప్రోగ్రామింగ్‌, క్లౌడ్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌ వంటి కోర్సులనూ, విడిగానూ ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం డిజైన్‌ చేసింది. అంతేకాకుండా సర్టిఫైడ్‌ రెడ్‌ హాట్‌, జావా, డాట్‌నెట్‌ కోర్సులను కూడా అందిస్తోంది. మరిన్ని వివరాలకు...-http://www.aptech-education.com/

Back..

Posted on 31-07-2017