Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పదును పెడితేనే.. ఫలితం!

యాంత్రీకరణ మూలంగా నేడు చాలా ఉద్యోగాలకు గండిపడుతోంది. ఐటీ రంగంలో చాలా కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో ప్లాన్‌-ఎ విఫలమైతే నిరుత్సాహపడనక్కర్లేదు. ప్రత్యామ్నాయ మార్గంపై (ప్లాన్‌-బి) దృష్టిపెట్టాలి. ఒక్కసారి ఉద్యోగం దొరికితే జీవితానికి ఢోకా లేదనుకుంటాం. కానీ అలాంటి నిశ్చింతకు నేడు విఘాతం కలుగుతోంది. కార్పొరేట్‌ రంగంలో వస్తున్న మార్పులు, ఆర్థిక నష్టాలు, పనిలో నూతన నైపుణ్యాల లేమి వంటి కారణాలతో చాలామంది కొలువులను కోల్పోతున్నారు. అమెరికా వంటి దేశాల్లో వీసా సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి ఫలితంగా అంకుర సంస్థలు మొదలుకొని కార్పొరేట్‌ సంస్థలూ సతమతమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కెరియర్‌ కోసం ప్రత్యామ్నాయం చూసుకోవడం అభ్యర్థులకు అనివార్యం. అందుకు కొన్ని అంశాలను గమనించాలి.

రెజ్యూమే నవీకరణ
ఉద్యోగం చేస్తున్న సమయంలో రెజ్యూమేను నవీకరించుకోవటానికి చాలామంది ఆసక్తి చూపించరు. దాన్ని కాలయాపనగా భావిస్తారు. ఇది సరైన ఆలోచన కాదు. దీని వల్ల ఉద్యోగ సంక్షోభ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ప్రతి మూడు నెలలకోమారు సాధించిన నైపుణ్యాలనూ, విజయాలనూ రెజ్యూమేలో చేర్చాలి. ఉద్యోగ సైట్లలో సరికొత్త రెజ్యూమేను పోస్ట్‌ చేస్తుండాలి. అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ ఈ మార్పులు ప్రతిఫలించేలా చేయాలి.

నెట్‌వర్కింగ్‌
ఇతరులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించే నెట్‌వర్కింగ్‌ను విస్మరించకూడదు. కెరియర్లో విజయానికి ఇది ఉపయోగపడుతుంది. ఇతరులతో మనకేం అవసరం ఉంటుందిలే అనుకోకూడదు. వీరి ఆ పరిచయాలే మీ ప్లాన్‌-బిలో కీలకంగా మారొచ్చు. ఇవే మీ లక్ష్యాల్ని చేరుకోవటంలో క్రియాశీల పాత్ర పోషిస్తాయి. పనిచేస్తున్న ప్రాంతంలో నలుగురితో కలసిపోవాలి. నెట్‌వర్కింగ్‌ సమావేశాల్లో పాల్గొనటం, పూర్వ సహాధ్యాయులను తరచుగా కలుస్తూ ఉండటం... ఇవన్నీ అవసరమే.

నైపుణ్యాలకు సాన
మీ ప్రస్తుత నైపుణ్యాలు మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వచ్చేలా చేశాయి. వాటిని ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ ఉండాలి. అలా చేస్తే నలుగురిలో మీ ప్రత్యేకత తెలుస్తుంది. మీరు ఐటీ పరిశ్రమలో పనిచేస్తుంటే ఎవరికీ తెలియని నూతన అప్లికేషన్లను తెలుసుకోవాలి. ఫిట్‌నెస్‌ శిక్షకుడు అయితే కొత్త ప్రమాణాలను అందిపుచ్చుకోవాలి. మీలో ఉన్న భావప్రసరణ, బృంద స్ఫూర్తి, అనుకూల స్వభావాలకు మెరుగులు దిద్దుకోవాలి.

కొత్త అంశాలపై ఆసక్తి
చేసే పని ఏదైనా అభిరుచిని విస్మరించాల్సిన అవసరం లేదు. ఇంజినీరుగా విధులు నిర్వహిస్తూ కూడా రచనా వ్యాసంగంపై ఆసక్తి ఉన్నవారుంటారు. ఇలాంటివారు తమకు అభిరుచివున్న రంగంలో నూతన మార్పులను తెలుసుకోవటంలో తప్పులేదు. నూతన నైపుణ్యాలను అభ్యసించడం పట్ల చురుకుగా ఉండాలి. ఒకే రంగానికే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో కనీస పరిజ్ఞానాన్ని సంపాదించుకోవటం ఉన్నత స్థానానికి చేరుస్తుందని నిపుణులు చెపుతున్నారు.

కలల సంస్థల పట్టిక
ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం వల్ల ఆనందంగా ఉన్నామని భావిస్తున్నప్పటికీ భరోసాతో ఉండటం సరికాదు. అభివృద్ధి చెందాలనీ, ఎదగాలనీ కోరుకుంటూ దానికి ప్రయత్నిస్తుండాలి. దీనికోసం.. మీరు పనిచేయాలని కలలు కనే సంస్థల పట్టికను తయారుచేసుకోవాలి. వీటి వెబ్‌సైట్లు, సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు తదితర సమాచారాన్ని భద్రపర్చుకోవాలి. అప్పుడప్పుడూ వీటిని చూస్తూ, తాజా సమాచారం చేరుస్తుండాలి. కొత్త అవకాశాలేమున్నాయో గమనిస్తుండాలి. ఇవన్నీ మీ ప్లాన్‌-బికి చాలా అవసరమవుతాయి.

సమాచార సేకరణ
చేస్తున్న ఉద్యోగాలను ఏ రోజైనా అకస్మాత్తుగా వదిలిపెట్టాల్సిరావొచ్చు. ఇలాంటి సమయంలో ఉద్యోగులు మరో ఉద్యోగం చూసుకోవటానికి అవసరమైన సమాచారం పూర్వ సంస్థ నుంచి పొందటం కష్టమవుతుంది. అందుకే సంస్థ విధానాలకు అనుగుణంగా కెరియర్‌కు ఉపయోగపడే వర్క్‌ శాంపిల్స్‌, ఫైళ్ళు, డాక్యుమెంట్లు మొదలైనవి ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవటం మంచిది. కొన్ని మార్పులు చేసి, ఇతర ఉద్యోగాలకు తక్షణం పంపేలా ఈ-మెయిల్‌ను సిద్ధం చేసుకునివుండటం మేలు. ఈ ముందు జాగ్రత్త అత్యవసర సమయాల్లో నిశ్చయంగా అనుకూల ఫలితమిస్తుంది.

Back..

Posted on 03-10-2017