Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సత్వర ఉపాధికి.. ఐటీఐ

తక్కువ వ్యవధిలోనే స్థిరపడడానికీ, స్వల్ప వ్యవధిలో స్వయం ఉపాధి పొందడానికీ ఐటీఐ కోర్సులు మార్గం. ఆంధ్రప్రదేశ్‌ ఐటీఐల్లో కౌన్సెలింగ్‌కు ఇంకా వ్యవధి ఉండగా తెలంగాణలోని పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐలు) ప్రవేశానికి గడువు ముగుస్తోంది. తెలంగాణలో మొత్తం 63 ప్రభుత్వ, 208 ప్రైవేటు ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో చేరవచ్చు. ఏడాది, రెండేళ్ల వ్యవధితో వీటిని అందిస్తున్నారు.

ఐటీఐ కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత విద్యకూ అవకాశం ఉంది. రెండేళ్ల ఐటీఐ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పాలిటెక్నిక్‌ సంస్థల్లో నేరుగా డిప్లొమా రెండో ఏడాది కోర్సులో చేరిపోవచ్చు. లేదా యూజీ డిగ్రీ కోర్సులు చదువుకోవచ్చు. ఆసక్తి, అభిరుచిల మేరకు ఎంచుకోవడానికి వివిధ ట్రేడులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. అందుబాటులో ఉన్న ట్రేడుల్లో ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 85 సీట్లు స్థానిక అభ్యర్థులకే కేటాయిస్తారు. 15 శాతం సీట్లకు ఎవరైనా పోటీ పడవచ్చు. 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు. మైనార్టీ ఐటీఐల్లో ఆయా వర్గాలకు చెందినవారికే ప్రవేశం లభిస్తుంది. ప్రభుత్వ ఐటీఐల్లో ఫీజు చెల్లించనవసరం లేదు. అయితే వాటిలోని పేమెంటు కోటా సీట్లకు మాత్రం ఫీజు తప్పనిసరి. ప్రైవేటు సంస్థల్లో ఇంజినీరింగ్‌ ట్రేడుల్లో చేరినవారు పట్టణాల్లో అయితే రూ.16,500; గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థలకు రూ.15 వేలు చెల్లించాలి. నాన్‌ ఇంజినీరింగ్‌ ట్రేడులకు పట్టణాల్లో రూ.13,200; గ్రామీణ ప్రాంతాల్లో రూ.12 వేలు ఫీజు ఉంటుంది. వీటిలో మార్పులకు అవకాశం ఉంది.

ఇందులో ఇంజినీరింగ్, నాన్‌ ఇంజినీరింగ్‌ ట్రేడులున్నాయి. ట్రేడును బట్టి ఏడాది లేదా రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. కొన్నింటికి ఎనిమిదో తరగతితో అవకాశం లభిస్తుంది. మిగిలినవాటికి పది తప్పనిసరి.

* ఇంజినీరింగ్‌: ఏడాది వ్యవధితో కార్పెంటర్, ఫౌండ్రీ మెన్, మెకానిక్‌ ఆటో బాడీ పెయింటింగ్, మెషీన్‌ ఆటో బాడీ రిపేర్, డీజిల్‌ మెకానిక్, ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ ఆపరేటర్, ప్లంబర్, షీట్‌ మెటల్‌ వర్కర్, వెల్డర్‌ కోర్సులు ఉన్నాయి. కార్పెంటర్, ప్లంబర్, షీట్‌ మెటల్‌ వర్కర్, వెల్డర్‌ ట్రేడులకు ఎనిమిదో తరగతి విద్యార్హతతోనూ అవకాశం ఉంటుంది. మిగిలినవాటికి పది పూర్తవ్వాలి. రెండేళ్ల వ్యవధితో డెంటల్‌ లేబొరేటరీ ఎక్విప్‌మెంట్‌ టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్, డ్రాఫ్ట్స్‌మెన్‌ మెకానికల్, ఎల్రక్టీషియన్, ఎల్రక్టానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ (కెమికల్‌ ప్లాంట్‌), ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ (కెమికల్‌ ప్లాంట్‌), మెకానిక్‌ (గ్రైండర్‌), మ్యాషినిస్ట్, మెకానిక్‌ (మోటార్‌ వెహికల్‌), మెకానిక్‌ (రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌), టర్నర్, వైర్‌మెన్‌ ట్రేడులు ఉన్నాయి. వీటిలో వైర్‌మెన్‌ ఒక్కటే ఎనిమిదో తరగతితో అందిస్తున్నారు. మిగిలినవాటికి పది పాస్‌ తప్పనిసరి.

* నాన్‌ ఇంజినీరింగ్‌: ఈ విభాగంలోని ట్రేడులను ఏడాది వ్యవధితో అందిస్తున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, డ్రెస్‌ మేకింగ్, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, లిథో- ఆఫ్‌సెట్‌ మ్యాషిన్‌ మైండర్, సూయింగ్‌ టెక్నాలజీ, స్టెనోగ్రాఫర్‌ అండ్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ ట్రేడులున్నాయి. సూయింగ్‌ టెక్నాలజీ కోర్సుకు ఎనిమిదో తరగతి సరిపోతుంది. మిగిలినవాటికి పది ఉత్తీర్ణత సాధించాలి.

అవకాశాల సంగతి?
ఐటీఐ కోర్సు పూర్తిచేసుకున్నవారికి పెద్ద ఎత్తున మహారత్న, సవరత్న, మినీరత్న సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. భారతీయ రైల్వే, షిప్‌ యార్డులు, డాక్‌ యార్డులు, తయారీ సంస్థలు, పరిశ్రమలు, రక్షణ, పారా మిలటరీ దళాల్లో వీరికి ఉద్యోగాలు ఉంటాయి. పేరున్న సంస్థల్లో క్యాంపస్‌ నియామకాలు జరుగుతున్నాయి. విదేశాల్లో వీరు ఉపాధి పొందవచ్చు. వీరు సంబంధిత ట్రేడ్‌లో సేవలందిస్తున్న సంస్థల్లో అప్రెంటీస్‌గా చేరి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. ‘భారత్‌లో తయారీ’ నినాదం ఐటీఐ చదివినవారికి మంచి అవకాశంగా మారింది. ప్రత్యేక శిక్షణ ద్వారా వీరు ఇన్‌స్ట్రక్టర్‌ గానూ రాణించవచ్చు.

అర్హత: సంబంధిత ట్రేడును బట్టి 8 లేదా టెన్త్‌ ఉత్తీర్ణత.
వయసు: ఆగస్టు 1 నాటికి 14 ఏళ్లు నిండాలి. గరిష్ఠ వయసు నిబంధన లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: సెప్టెంబరు 14
వెబ్‌సైట్‌: https://iti.telangana.gov.in/

ఏపీలో కౌన్సెలింగ్‌ వారంలో..
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీఐల ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసేందుకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆగస్టు 20 నుంచి 31 వరకు విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్‌ ఆరంభించి పూర్తి చేయాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన అధికారులు విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. విద్యార్థులకు ఎలాంటి మార్కులు, గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లూ ఇవ్వలేదు. దీంతో పదోతరగతి అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలంటూ ఐటీఐలకు దరఖాస్తు చేసిన విద్యార్థుల వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించారు. పరీక్షల విభాగం నుంచి వివరాలు వచ్చిన అనంతరం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు భర్తీ కాకపోతే మరోసారి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. - ఈనాడు, అమరావతి

Back..

Posted on 14-09-2020