Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఉద్యోగ సాధనలో.. అదనంతో అదుర్స్‌

విద్యా సంవత్సరం ఇంకొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లూ విడుదలయ్యాయి. చేరబోయే కోర్సులూ ఖరారై ఒకరకంగా కెరియర్‌ నిర్ణయం అయిపోయినట్టే. ‘ఇంకేంటి? డిగ్రీ సబ్జెక్టులను బాగా చదివి, మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు, కొలువు వచ్చేసినట్లే’ అని భావిస్తున్నారా? కానీ నియామక సంస్థలు అలా భావించటం లేదు. మార్కుల శాతం ఉద్యోగ సాధనలో ఒక పార్శ్వం మాత్రమే. డిగ్రీ చదువుతూనే నేర్చుకోవాల్సిన అంశాలూ, నైపుణ్యాలూ ఇంకా ఉన్నాయి. వాటిపై శ్రద్ధ పెట్టటం విద్యార్థుల భవితకు ఎంతో అవసరం!

ఉపకార వేతనాలు అందించే ప్రముఖ సంస్థలు కూడా విద్యాపరమైన ప్రతిభతోపాటు ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌, నాయకత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అందుకే- మార్కుల శాతం పెంచుకుంటే భవిష్యత్తుకు ఢోకా ఉండదనే ఆలోచన ఏమాత్రం సరి కాదు. నిజానికి మంచి మార్కులతో డిగ్రీ పట్టా చేతిలో ఉన్నా నిరుద్యోగంతో ఉన్నవారెందరో! సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు అదనపు అర్హతలను సంస్థలు కోరుకుంటున్నాయి. సంస్థలు తమ ఎంపిక క్రమంలో అభ్యర్థిలో ఎన్నో అంశాలను వెతుకుతున్నాయి.

ఏటా కొన్ని లక్షలమంది ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నా, కొద్ది శాతం మంది మాత్రమే ఉద్యోగాలను పొందగలుగుతున్నారు. ఉద్యోగాల కొరత ఇందుకు పూర్తి కారణం కాదు. దేశంలోని నిపుణులైన ఉద్యోగుల కొరతే ప్రధాన కారణమని ఎన్నో నివేదికలు తెలియజేస్తున్నాయి. గ్రాడ్యుయేషన్‌ పట్టా చేతిలో ఉన్నప్పటికీ అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోలేక పోవడమే నిరుద్యోగానికి కారణమవటం చాలా సందర్భాల్లో జరుగుతోంది.

దేశవ్యాప్తంగా ఏటా 1.50 కోట్ల మంది గ్రాడ్యుయేట్లు మార్కెట్‌లోకి వస్తున్నా 75 శాతం మందికి ఉద్యోగానికి అవసరమైన కనీస ప్రాథమిక, సాంకేతిక నైపుణ్యాలు, సాఫ్ట్‌స్కిల్స్‌ ఉండటం లేదని అంచనా! ఆవశ్యకమైన ఈ వృత్తి నైపుణ్యాలుంటేనే చదువులోనైనా, ఉద్యోగంలోనైనా మెరుగ్గా రాణించగలుగుతారు. వాటిని డిగ్రీ పూర్తయ్యాకో, డిగ్రీ ఆఖరి సంవత్సరమో నేర్చుకుందామంటే కుదరదు. డిగ్రీలో చేరినప్పటి నుంచే దృష్టిసారించాల్సి ఉంటుంది.

మల్టీ డిసిప్లినరీ అవగాహన
యూనివర్సిటీల కరిక్యులమ్‌ అనేది ఎంచుకున్న సబ్జెక్టులకే పరిమితమై ఉంటుంది. విద్యార్థులూ దాన్ని పూర్తిచేయడంపైనే శ్రద్ధ చూపుతుంటారు. అయితే ఉద్యోగ ఎంపిక విషయానికొచ్చేసరికి దాదాపుగా అన్ని నియామక సంస్థలూ సగటున 60-70% మార్కులకు మించి ఆశించడం లేదు. అభ్యర్థిలో సమస్యా పరిష్కార, నాయకత్వ లక్షణాలను ప్రధానంగా చూస్తున్నాయి. అభ్యర్థికి తన పని మాత్రమే తెలిస్తే సరిపోదు. దాన్ని స్వయంగా చేయగలగడంతోపాటు ఎవరితో చేయిస్తే అది విజయవంతంగా పూర్తవుతుందో కూడా తెలిసుండాలి. అందుకు ఇతర విభాగాల పట్ల అవగాహన తప్పనిసరి.

ఉదాహరణకు- కాలుష్య నివారణ, గ్లోబల్‌ వార్మింగ్‌, విపత్తులను తగ్గించడం, ట్రాఫిక్‌- భద్రత, తక్కువ ఖర్చుతో వైద్యం, విద్యుత్‌, ఆహార కొరత... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నామో! ఇవన్నీ ఏ రంగం కిందకి వస్తాయి? ఏయే రంగాల వాళ్లు కలిసి పనిచేస్తే ఒక్కో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది? వంటివి తెలియాలంటే వివిధ విభాగాలపై అవగాహన ఉండాలి. దీనినే ‘మల్టీ డిసిప్లినరీ విధానం’ అంటున్నారు. దీని ప్రకారం విద్యార్థి తన గ్రూపు సబ్జెక్టులతోపాటు ఇతర గ్రూపుల అంశాలనూ ప్రాథమికంగానైనా తెలుసుకుంటుండాలి.

గ్రూప్స్‌, సివిల్స్‌ పోటీపరీక్షలనే గమనించండి. వీటిలోనూ సైన్స్‌ అభ్యర్థి ఆర్ట్స్‌ అంశాలనూ, ఆర్ట్స్‌ అభ్యర్థి సైన్స్‌ అంశాలనూ చదవాల్సి ఉంటుంది. అభ్యర్థికి అన్ని అంశాలపైనా అవగాహన అవసరమేనేదే వీటి ఉద్దేశం! ఈమధ్య కాలంలో మల్టీ డిసిప్లినరీతోపాటు ఇంటర్‌ డిసిప్లినరీ, ట్రాన్స్‌ డిసిప్లినరీ అనే పదాలూ ఎక్కువగా వినపడుతున్నాయి. వీటన్నింటి ఉమ్మడి లక్ష్యం కూడా వివిధ రంగాలపై అవగాహన కలిగి ఉండేలా, ఒక సమస్యను పరిష్కరించడానికి వివిధ పద్ధతులను, వివిధ రంగాల పరిజ్ఞానాన్ని ఉపయోగించేలా ప్రోత్సహించడమే. కాబట్టి, తన విభాగంతోపాటు వివిధ విభాగాల గురించీ అవగాహన ఏర్పరచుకోవడంపై విద్యార్థి శ్రద్ధ చూపాలి.

ఎంచుకున్న రంగంపై పట్టు
ఎంచుకున్న గ్రూపును బట్టే ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారో నిర్ణయమై పోయుంటుంది. కాబట్టి, విద్యార్థి తన రంగంలో ఏయే మార్పులు చోటుచేసుకుంటున్నాయో పరిశీలిస్తుండాలి. ఆర్థిక, రాజకీయ ధోరణులు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో అంచనా వేస్తుండాలి. తమ రంగంపై పట్టు ఉన్నవారిని నియమించుకోవడానికి సంస్థలు మొగ్గు చూపుతుంటాయి. ఇది తక్కువ సమయంలో ఒంట బట్టించుకునే అంశం కాదు. దీర్ఘకాలంగా పరిశీలిస్తేనే అవగాహన ఏర్పడుతుంది. అంటే.. ఈ రంగం మార్కెట్‌లో ఏ స్థానంలో ఉంది? వాటి ప్రధాన ఉత్పత్తులు ఏమిటి? అనుబంధ రంగాలేమిటి? భవిష్యత్తులో రాబోయే కొత్త వస్తువులేంటి? దీనిలో ప్రముఖ సంస్థలేవి? వాటిలో ప్రముఖులెవరు? వాటి షేర్‌ విలువ.. వంటి అంశాలన్నీ పరిశీలిస్తుండాలి. ప్రాంతీయ, జాతీయ వార్తాపత్రికలతో పాటు వాణిజ్య వార్తాపత్రికలను చదవడం ఇందుకు ఉపయోగపడుతుంది. కేవలం చదివి ఊరుకోకుండా ముఖ్యమైన మార్పులను పుస్తకంలో నోట్‌ చేసుకుంటూ ఉండాలి.

భావప్రకటన సామర్థ్యం
ఒక విషయాన్ని లేదా ఆలోచనను ఎదుటివారికి విజయవంతంగా చేరవేయడమే దీని ఉద్దేశం. ఉద్యోగం, రంగంతో సంబంధం లేకుండా సంస్థ లోపలా, బయటా అత్యవసరమైన నైపుణ్యమిది. ఒకరకంగా కెరియర్‌ రెడీగా విద్యార్థి ఉన్నాడన్న దాన్ని ఇది సూచిస్తుంది. ఆలోచనలపై స్పష్టత, వాటిని ధైర్యంగా వ్యక్తపరచగలగడం దీనిలో భాగం. ఒకరకంగా స్వీయ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం లాంటిది. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎలాంటి ప్రశ్నలు వేయాలి, ఏ సమయంలో మౌనంగా ఉండాలి అనేవీ దీనిలో ప్రధానమే. మాట్లాడటమే కాదు, రాయడంలోనూ ఈ సామర్థ్యం ఉండాలి. అలాగే ఓపికగా వినే గుణమూ ఉండాలి.

సోషల్‌ మీడియాలో మెప్పించేలా రాయడం, సామాజిక సేవాల సంస్థల్లో వాలంటీర్లుగా చేయడం, స్పోర్ట్స్‌, కల్చరల్‌ ఆర్ట్స్‌ వంటి స్టూడెంట్‌ కమ్యూనిటీల్లో చేరడం, స్నేహితులంతా బృందాలుగా ఏర్పడి డిబేట్లు పెట్టుకోవడం వంటి ద్వారా ఈ నైపుణ్యాన్ని క్రమంగా వృద్ధి చేసుకోవచ్చు. స్నేహితులకూ, లెక్చరర్లకూ వివిధ విషయాలను మెయిళ్ల ద్వారా పంపడం వంటివీ భాషా నైపుణ్యాలను పెంచుతాయి. అయితే సోషల్‌ మీడియాను ఉపయోగించే క్రమంలో ఎవరినీ నొప్పించకుండా, సమతూకంగా ఉండగలగాలి. ఆన్‌లైన్లో నిర్లక్ష్యంగా, దూషణపూరితంగా వ్యాఖ్యలను చేయకుండా సంయమనం పాటించాలి.

కొత్తగా ఆలోచించడం
అత్యంత ఆవశ్యకమైన నైపుణ్యాల్లో ఇదీ ఒకటి. సమస్యా పరిష్కారానికీ, సృజనాత్మకతకూ, సరైన ప్రణాళికను రూపొందించడానికీ, సరైన నిర్ణయాలు తీసుకోవడానికీ ఇది ఉపయోగపడుతుంది. ఏదైనా పనిని ఎప్పుడూ చేసే విధంగా కంటే ఇంకా ఎన్ని విధాలుగా చేయొచ్చో ఆలోచించడం ద్వారా అలవరచుకోవచ్చు. నిపుణులతో మాట్లాడుతుండటం కూడా ఇందుకు తోడ్పడుతుంది. ఇది విద్యార్థిని అందరికంటే ముందంజలో నిలబెడుతుంది. మూసలో ముందుకెళ్తే ఏ ప్రత్యేకతా ఉండదని గుర్తించాలి.

దేన్నైనా ప్రయోగాత్మకంగా చేసినపుడే ఈ నైపుణ్యం అలవడుతుంది. ఇందుకుగానూ సమస్యను గుర్తించి, సంబంధిత సమాచారాన్ని సేకరించడం, దాని ఆధారంగా వాటిలోని వాస్తవాలను అంచనా వేయడం, ఇతర రంగాల వారి అభిప్రాయాలను తీసుకోవడం, వీటన్నింటి ఆధారంగా పరిష్కారాలను సూచించడం వంటివి చేస్తుండాలి. ఇవి సబ్జెక్టుకు సంబంధించినవే అయ్యుండాలనేమీ లేదు. ఉదాహరణకు- ఇటీవలి ఎలక్షన్లు, తరగతిలోని సమస్యలు.. ఇలా వేటినైనా ప్రయత్నించవచ్చు. ఇక్కడ మీ ఆలోచనలన్నీ సరైనవే అవ్వాలనీ లేదు. ఇక్కడ మీ లక్ష్యం ఎన్ని దారుల్లో వెళ్లొచ్చో తెలుసుకోవడమే.

బృందంతో పనిచేయడం
పరస్పరం సహకరించుకోవడం, అవసరమైన సమయాల్లో ప్రాబల్యం చూపడం, తోటివారిని ప్రోత్సహించడం, అప్పుడప్పుడూ భావోద్వేగాలను పక్కనపెట్టి రాజీ పడగలగడం.. బృందంతో పనిచేసేటపుడు ఈ లక్షణాలు అవసరమవుతాయి. ఆధునిక ఉద్యోగ విధుల్లో చాలావరకూ ఒక పనిని ఒకరికి మించి చేసేవిగా ఉంటాయి. ఇలాంటప్పుడు నలుగురితో సమర్థంగా కలిసి పనిచేసే వారికోసమే సంస్థలూ చూస్తుంటాయి.

నిజానికి విద్యార్థుల్లో కొందరు మినహాయించి ఈ నైపుణ్యం తెలియకుండానే ఉంటుంది. విద్యాభ్యాసం అన్నాక సామూహికంగా చేసే అంశాలు విద్యార్థి జీవితంలో చాలానే ఉంటాయి. స్పోర్ట్స్‌ క్లబ్‌లు, చారిటీ సంస్థల్లో వాలంటీర్లుగా చేయడం, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ ఆక్టివిటీలు, ఇంటర్న్‌షిప్‌లు, పార్ట్‌ టైం జాబ్‌ల్లో చేరడం ద్వారా ఈ నైపుణ్యాన్ని గణనీయంగా మెరుగుపరచుకోవచ్చు.


Back..

Posted on 30-05-2019