Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

మెప్పించే.. మొదటి ముద్ర!

* జాబ్‌ ఇంటర్వ్యూ గైడెన్స్‌

ఉద్యోగానికి ఇంటర్వ్యూ అనగానే అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడమే అనుకుంటారు అందరూ. అంతకంటే ముందు కొన్ని అంశాలు ఎంపికపై ప్రభావాన్ని చూపుతాయని గ్రహించరు. చిన్నవిగా కనిపించినా అవి కోరుకున్న కొలువును దక్కనీయకపోవచ్చు.. దగ్గరా చేయవచ్చు. అందుకే వాటిని తెలుసుకొని అప్రమత్తంగా వ్యవహరించడం అన్నివిధాలా మంచిది.

ఉద్యోగ జీవితంలోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించే ప్రధాన మార్గం- మౌఖిక పరీక్ష. దీని ద్వారానే అభ్యర్థులు తాము ఎంతవరకూ ఉద్యోగానికి సరిపోతారో నిరూపించుకోగలుగుతారు. ఈ ప్రక్రియకు నిమిషాల నుంచి గంటల వరకూ సమయం పట్టొచ్చు. కానీ ఎంపికవడానికి దోహదపడేది మాత్రం తొలి అభిప్రాయమే. ఆ ముద్ర సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంటర్వ్యూ సన్నద్ధత అనగానే చాలామంది ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? కష్టమైన, తెలియని ప్రశ్నలు అడిగినప్పుడు ఏం చేయాలి? ఎలా ప్రవర్తించాలి?.. వంటివన్నీ ఆలోచిస్తుంటారు. సాధన చేస్తుంటారు. ఆ ప్రిపరేషన్‌ సరైనదే. కానీ అంతకంటే ముందే కొన్ని అంశాలు సెలక్టర్ల దృష్టికి చేరతాయి. వాటి ఆధారంగా అభ్యర్థి సంస్థకూ, సంబంధిత ఉద్యోగానికీ ఎంతవరకూ సరిపోతారో అంచనా వేస్తారు. కాబట్టి, మంచి అభిప్రాయాన్ని కలిగించడానికి అన్ని కోణాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి.

సమయపాలన
చాలామంది ఇంటర్వ్యూ టైమ్‌కి వచ్చామా లేదా అనే చూసుకుంటారు. కానీ నిర్ణీత సమయానికంటే కనీసం 15 నిమిషాల ముందు చేరుకోవడం ఉత్తమం. దీని వల్ల సంస్థ విధానాలను పరిశీలించడానికీ, ఇంటర్వ్యూ తీరు తెలుసుకోవడానికీ వీలవుతుంది. ఉద్యోగం పట్ల అభ్యర్థికి ఉన్న ఆసక్తి ఆ సంస్థ ప్రతినిధులకు అర్థమవుతుంది. ఒక్కోసారి అనుకోని పరిస్థితుల వల్ల ఆలస్యం కావచ్చు. అలాంటప్పుడు ఆ విషయాన్ని ముందుగానే సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలి. ఆలస్యానికి కారణం ఎంత బలమైనదైనా వచ్చిన తర్వాత చెబితే అంత సానుకూల ప్రభావం ఉండదు. ముందుగా చెప్పడం మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

చక్కటి వస్త్రధారణ
అనువైన, అనుకూలమైన వస్త్రధారణతో ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెడితే సెలక్టర్లకు సదభిప్రాయం ఏర్పడుతుంది. దుస్తులు ధరించిన తీరును బట్టే ఒక్కోసారి వెంటనే నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొంత అతిశయోక్తిలా అనిపించినప్పటికీ ఇది నిజమే. తొలి ముద్రకు (ఫస్ట్‌ ఇంప్రెషన్‌) ఇదే మొదటి అడుగని చెప్పవచ్చు. చిన్న చిన్న పొరపాట్లను కూడా సీరియస్‌గా తీసుకొని అభ్యర్థి ఉద్యోగం పట్ల ఆసక్తిగా లేరని, ముఖాముఖికి అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయానికి వచ్చేస్తారు. దీంతో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఇంటర్వ్యూ అనగానే సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలని చాలామంది భావిస్తుంటారు. హుందాగా కనిపించే ఏ వస్త్రధారణ అయినా మంచిదే. అయితే అది ఉద్యోగానికీ, పరిశ్రమకీ తగినదై ఉండాలి. దుస్తులు నలిగిపోయి, జుట్టు చెరిగిపోయి ఉండకుండా జాగ్రత్త పడాలి.

అన్నీ అందుబాటులో!
పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో చాలా వరకు అభ్యర్థిని నేరుగా ఇంటర్వ్యూ గదిలోకి పంపేయరు. ముందు కొంత పేపర్‌ వర్క్‌ ఉంటుంది. విద్యాభ్యాసం, అదనపు నైపుణ్యాలు, వ్యక్తిగత వివరాలు తదితర సమాచారమంతా తీసుకుంటారు. అందుకే రెజ్యూమె, ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలు, ఫొటోలు, ఐడెంటిటీ కార్డు వంటివి తప్పకుండా దగ్గరుంచుకోవాలి. రెజ్యూమె ఇదివరకే ఇచ్చినా మళ్లీ ఇవ్వాల్సి రావొచ్చు. కాబట్టి, అదనపు కాపీలు దగ్గర ఉండాలి. వీటితోపాటు ఇంటర్వ్యూ కోసం ఏం అడిగారో చెక్‌ చేసుకొని, వాటినీ అందుబాటులో ఉంచుకోవాలి. అన్నింటినీ క్రమపద్ధతిలో ముందురోజే సర్ది పెట్టుకోవాలి. ఇంటర్వ్యూ మధ్యలో ఏదైనా పేపర్‌ అడిగినప్పుడు వెంటనే తీసి చూపించే విధంగా ఉండాలి. అనవసరమైన కాగితాలు, సెల్‌ఫోన్లు, చార్జర్లు, హెడ్‌ఫోన్ల వంటి వాటిని అక్కడ ప్రదర్శనకు పెట్టకూడదు. దాని వల్ల ఎదుటివారు అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. పెన్‌ను తప్పకుండా దగ్గర పెట్టుకోవాలి.

ఫలితం నాలుగు నిమిషాల్లోనే!
ఒక సర్వే ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టిన నాలుగు నిమిషాల్లోపే జరిగిపోతుందట! రిక్రూటర్లలో ఇలా వేగంగా నిర్ణయం తీసుకునేవారు 4.9% మంది ఉన్నారు. 69.9% మంది అభ్యర్థులతో ఎక్కువసేపు మాట్లాడి, ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుని నియామకం జరుపుతారు. 22% మంది మాత్రమే పూర్తి ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తారు. ఇక్కడ ఎక్కువ సమయం తీసుకునే సెలక్టర్లు.. మొదట ఏర్పడిన అభిప్రాయాన్ని రుజువు చేసుకోవడానికే ఇంటర్వ్యూ కొనసాగిస్తారు.

అసహనం వద్దు
ఇంటర్వ్యూ అనగానే కొంత ఆత్రుత, ఆందోళన సహజమే. దాని ప్రభావం ఇంటర్వ్యూ వేదిక పరిసరాల్లో ఎదురయ్యే పరిస్థితులపై పడకుండా చూసుకోవాలి. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు, రిసెప్షన్‌ లేదా ఇతర కౌంటర్ల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందడానికి వేచి ఉండాల్సి వస్తుంది. అప్పుడు అనవసరమైన అసహనాన్ని అక్కడి ఉద్యోగులపై ప్రదర్శించకూడదు. ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించే ముందు అభ్యర్థులు ఎలా ఉన్నారనే విషయాన్ని ఫ్రంట్‌ ఆఫీస్‌ సిబ్బంది నుంచి ముఖాముఖి చేసేవారు తెలుసుకుంటారు. ఇదీ ఎంపికపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే అందరితోనూ సానుకూల ధోరణితో ఉండాలి. ఎలాంటి ఆందోళన లేనప్పుడు అభ్యర్థి ఎలా ప్రవర్తిస్తారనే దానికంటే... ఒత్తిడిలో ఏవిధంగా వ్యవహరిస్తారనేదే ప్రధానంగా సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంది.

మొబైల్‌లో మునిగిపోకుండా..!
కాస్త సమయం దొరికితే చాలు.. దాదాపు అందరి చూపూ మొబైల్‌ వైపే పోతుంది. ఇది అసంకల్పితంగా జరిగిపోతుంది. కొందరికైతే అదో బలహీనతలా ఉంటుంది. ఇంటర్వ్యూ కోసం వేచే గదిలో మాత్రం అభ్యర్థి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏకాగ్రతతో వ్యవహరించాలి. ఏదైనా కారణాల వల్ల ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తే వెంటనే ఫోన్‌ అందుకొని, అందులో మునిగిపోవడం మంచిది కాదు. ఇంటర్వ్యూకి సంబంధించిన వాటినే మరోసారి చూసుకోవడం వంటివి చేయాలి. అంటే రెజ్యూమె, ఇంటర్వ్యూ ప్రకటన, ఇతర పత్రాలను పరిశీలించుకోవాలి. సంస్థకు సంబంధించినవారు అటువైపుగా వచ్చినప్పుడు మొబైల్‌లో బిజీగా ఉంటే నెగెటివ్‌ అభిప్రాయం కలిగించే అవకాశం ఉంది.

చొరవ మంచిదే!
ఇంటర్వ్యూకి వెళ్లే అభ్యర్థికి అక్కడి వారెవరూ పరిచయం ఉండరు. ఎవరూ తెలియదు కదా అని ఏమీ తెలుసుకోకుండా వేచి ఉండకూడదు. ఇంటర్వ్యూకి పిలిచిన వాళ్లే వచ్చి వివరాలు అడుగుతారని ఎదురుచూడకూడదు. కొంత చొరవ తీసుకోవాలి. ఫలానా అని పరిచయం చేసుకోవచ్చు. దీని వల్ల అభ్యర్థి ఉత్సాహం, ఆసక్తి, ఆత్మవిశ్వాసం అక్కడి ప్రతినిధులకు అర్థమవుతుంది. అలా అని అనవసరమైన విషయాలను విచారిస్తూ అతి చొరవను ప్రదర్శించడం మంచిదికాదు.


Back..

Posted on 01-08-2019