Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఉత్సాహంగా ఉద్యోగ వేట!

ఉద్యోగ వేట అనగానే.. దరఖాస్తు ప్రక్రియ, ఎన్నో దశల ఎంపికలు గుర్తొస్తుంటాయి. వీటికి తోడు విపరీతమైన పోటీ. వెరసి ఉద్యోగార్థి ఒత్తిడికి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడి మితిమీరితే ఉద్యోగ సాధనలో వెనుకబడే ప్రమాదం ఉంటుందని నిపుణుల మాట. మరి దీన్ని అధిగమించాలంటే? ఉద్యోగన్వేషణను కొంచెం ఆసక్తిగా, ఆటగా మలచుకోవాలని సూచిస్తున్నారు!

చిన్న చిన్న లక్ష్యాలు
ఉద్యోగాన్ని పొందడం కొంత కష్టమైన పనే. కాబట్టి, దాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టుకోవాలి. ఉదాహరణకు- ఉద్యోగం పొందాలంటే ఖాళీల వివరాలు తెలియాలి. నేరుగానే దరఖాస్తు చేసుకోకుండా ముందుగా పరిశ్రమ గురించి పరిశోధన చేసుకోవాలి. తరువాత దానిలో ఉన్న ప్రముఖ సంస్థలు, వాటి తాజా ప్రాజెక్టులు, సాధించిన విజయాలను తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు సరిపడే సంస్థలేవో, ఆశిస్తున్నవేంటో తెలుసుకోవాలి. ఒక్కో సంస్థ ఎంపిక ప్రక్రియలో ఎన్ని దశలను నిర్వహిస్తోందో చూసుకోవాలి. ఆపైనే దరఖాస్తుపై దృష్టిపెట్టాలి.
ముందస్తు సన్నద్ధత బలంగా ఉంటేనే ఎంపిక దశలను తేలికగా దాటొచ్చు. ఆపై వారానికి ఎన్ని సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలో, సన్నద్ధమవ్వాల్సిన అంశాలకు సంబంధించీ లక్ష్యాలను పెట్టుకోవాలి. ఉదాహరణకు- ఈ వారంలో మూడు సంస్థలకు దరఖాస్తు చేయాలి. ఈ అంశాలను చదవాలి అలా! ఇవి వాటిని అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలనే తపనను కలిగిస్తాయి.

రెజ్యూమె, కవర్‌ లెటర్‌
దరఖాస్తు ప్రక్రియలో రెజ్యూమె, కవర్‌ లెటర్‌లది ప్రధాన పాత్ర. వీటిపై ప్రత్యేక దృష్టి తప్పనిసరి. మీకు నాలుగు ఆటలు వచ్చు అనుకోండి. నాలుగింటినీ ఒకేలా ఆడతారా? లేదు కదా! సంస్థలన్నీ ఆశించేది ఒకే అర్హతలున్న అభ్యర్థినే అయినా వారు అందించే ఉత్పత్తులు, సేవలను బట్టి చేసే పనులు, అవసరమైన లక్షణాల్లో మార్పులుంటాయి. కాబట్టి, ప్రత్యేకంగా ఒకటే రెజ్యూమె/ కవర్‌ లెటర్‌కు పరిమితం కావొద్దు. క్రికెట్‌ పరిభాషలో బంతిని బట్టి కొట్టే షాట్‌లా పోస్టుకు తగ్గట్టుగా వాటిని సిద్ధం చేసుకోవాలి. ఆకట్టుకునేలా, ప్రొఫెషనల్‌గా ఇంకా సొంతంగా రాయడానికి ప్రయత్నించాలి. కీవర్డ్స్‌ను చేర్చాలి. ముఖ్యంగా మొదటి 20 సెకన్లలో హెచ్‌ఆర్‌ దృష్టిని ఆకర్షించేలా చూసుకోవాలి.
‘జీవితమే ఒక ఆట..’ అని కవి ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ.. కొలువు ప్రయత్నంలో మాత్రం ఇదే విధానాన్ని పాటించాలనేది నిపుణుల మాట. ఉద్యోగాల వెదుకులాట విషయంలో ప్రారంభం నుంచే ఒక రకమైన ఒత్తిడీ, రానురానూ అనాసక్తి కలుగుతుంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఆలస్యమవుతుండటం, తిరస్కరణ, ఎంపిక అంశాలకు సంబంధించి సమాచారం ఆలస్యంగా తెలుస్తుండటం వంటివి ప్రధాన కారణాలు.
చదువుతున్నపుడైనా, పని విషయంలోనైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తాం? ఇష్టమైన వ్యాపకాన్ని చేయడమో, ఆటలు ఆడటమో.. ఇలా ఆహ్లాదాన్ని కలిగించే ఏదో ఒక ప్రక్రియను ఎంచుకుంటాం కదా! దీన్నే ఉద్యోగవేటకూ అన్వయిస్తే మంచి ఫలితాలను అందుకోవచ్చు. దీన్నీ ఒక ఆటగా చూడాలి. ఆటలో సమస్యాత్మక పరిస్థితులు, ఒకే రకమైన టాస్కులు చేయాల్సి ఉంటుంది. అయినా గెలుపు కోసం పట్టుదలగా చేస్తాం. అందుకోసం బుర్రకు పదును పెడుతుంటాం. ఈ విధానాన్నే ఉద్యోగ విషయంలో పాటిస్తే.. నేర్చుకోవడంతోపాటు గమ్యాన్నీ ఆనందంగా చేరుకోవచ్చు.

రివార్డు ఇచ్చుకోండి!
ఆట ఏదైనా గెలిచినవారికి అవార్డులు, రివార్డులు ఉంటాయి. ఒకరకంగా ఇవి ఆటగాళ్లను ప్రోత్సహించే సాధనాలు. కాబట్టి, గెలిచిన ప్రతిసారీ మీకు మీరు రివార్డు ఇచ్చుకోండి. ఉద్యోగం సాధించడం మెగా టోర్నీ అనుకుందాం. దీనిలోనూ క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్‌ ఉంటాయి. ఈ ప్రక్రియనూ అలాగే చూడండి. దశ దాటుతున్న కొద్దీ పోటీ పెరుగుతుంటుంది. ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుకు ఏం చేయాలో ప్రణాళిక ప్రకారం సాగండి. ఆట అంతా ఎలాగైతే నిర్విరామంగా సాగదో, ఉద్యోగ సాధన ప్రక్రియా అంతే. లక్ష్యాలు పూర్తయిన ప్రతిసారీ కొంత విరామం తీసుకోవచ్చు. చేసుకున్న దరఖాస్తులకు సమాధానంగా వచ్చే ఈ-మెయిల్స్, ఫోన్‌ కాల్స్‌ అన్నీ దీనిలో భాగంగా సాధించిన స్కోర్లే. దాటిన ప్రతి దశా ఒక మెట్టుకు సూచనే. ఒక మంచి విజయం సాధించామన్న ప్రతిసారీ రివార్డు ఇచ్చుకోవచ్చు!

మీ స్థానమెక్కడ?
ఆటల్లో ఒక కామన్‌ పాయింట్‌ ఉంటుంది. సమయాన్ని బట్టి ఎత్తులను మార్చడం. అలాగే ఒక్కో స్థాయి అందుకుంటున్నకొద్దీ గత స్కోరును అధిగమించేలా ప్రయత్నించడం. ఇక్కడా అంతే. ప్రారంభంలోనే గెలుపు సాధ్యం కాకపోవచ్చు. కానీ దాన్ని ట్రాక్‌ రికార్డును నోట్‌ చేసుకోవడం మాత్రం మరిచిపోవద్దు. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎంత ప్రగతి సాధించారో అర్థమవుతుంది. ఒకేలా అనిపిస్తే దాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంకేం చేయాలో తెలుసుకోవచ్చు. ఇదీ ఒకరకమైన విజయమే.


Back..

Posted on 31-08-2020