Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నైపుణ్యమే ఉపాధి మంత్రం

* అవగాహన లేమితో పెరుగుతున్న నిరుద్యోగం
* అవకాశాలు ఉన్నా చేజిక్కని పరిస్థితి
* పరిజ్ఞానం పెంచుకుంటేనే భవిత బంగారం
''కేవలం డిగ్రీ పట్టాలుంటే సరిపోదు. నైపుణ్యాలు కావాలి. వాటిని పెంపొందించడంపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరం ఉంది. భారత్‌ యువ దేశంగా ఆవిర్భవించబోతోంది. వారందరికీ శిక్షణ, అవకాశాలు కల్పించి అభివృద్ధిలో భాగస్వాములను చేస్తేనే యువ భారత్‌ కల సాకారం అవుతుంది.'' - ప్రధాని నరేంద్ర మోదీ
రోజురోజుకు విస్తరిస్తున్న భాగ్య నగరంలో ఉపాధి అవకాశాలూ విస్తృతంగా ఉన్నాయి. కొత్త పరిశ్రమలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామిక వాడలు సరైన అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ యువతలో చాలామంది నైపుణ్యాల లేమితో అవకాశాలను దక్కించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే విద్యార్థులు కేవలం మార్కుల కోసం చదవకుండా వృత్తిపరమైన మెలకువలపై దృష్టి సారించాలని విద్యావేత్తలు చెబుతున్నారు.
* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టి
నైపుణ్యం, విజ్ఞానం ఆర్థిక... సామాజిక అభివృద్ధికి చుక్కానిలాంటివి. ఆయా అంశాల్లో పరిణతి సాధించేలా పౌరులను తయారు చేసేందుకు.. 'ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం'(జులై 15) సందర్భంగా భారత ప్రభుత్వం 'స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌' ప్రారంభించింది. 2020నాటికి దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోంది. నగరంలోని కళాశాలల నుంచి పట్టాలు పుచ్చుకొని బయటకు వస్తున్న విద్యార్థుల్లో చాలామంది.. వారి చదువుకు సంబంధించిన ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. మౌఖిక పరీక్షలకు వెళ్లినప్పుడు భాష, సాంకేతికత, విజ్ఞానపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే వ్యాపారాలు ప్రారంభించేవారికి నిర్వహణలో అనుసరించాల్సిన ఎత్తుగడలు, జాగ్రత్తలు తెలియడం లేదు. ఈ తరహా అవగాహన కల్పించే సంస్థలు అందరికీ చేరువ కావాలి.
* పట్టాల కోసం చదివితే..
ఉపాధి కోసం హైదరాబాద్‌కు అధికంగా యువత వస్తుంటారు. అయితే నగరంలో డిమాండ్‌కు తగ్గట్లు తగిన అభ్యర్థులు దొరకడం లేదని విద్యావేత్తల అభిప్రాయం. భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకోకుండా సర్టిఫికెట్ల కోసం చదవడమే దీనికికారణం. నూతన పరిశ్రమలు, ఉపాధి రంగాల గురించి తెలియజేయాల్సిన కళాశాలలు ఆ పని చేయడంలేదు. స్వయంగా తెలుసుకుందామనే ఆసక్తి కొందరిలో కొరవడింది.
* శిక్షణ ఇచ్చే సంస్థలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేటురంగంలోని కొన్ని సంస్థలు నగరంలో నైపుణ్య శిక్షణను అందిస్తున్నాయి. పదో తరగతి మొదలుకుని బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ చదువుకున్న వారికి వేర్వేరు కోర్సులు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలుగా మారాలనుకున్న వారికీ వృత్తి విద్యా కోర్సులను నేర్పిస్తున్నారు.
* బాలానగర్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ(ఎంఎస్‌ఎంఈ) విద్యార్థులు, మహిళలు, పురుషులకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. ప్రాజెక్టు రిపోర్టు తయారీ, ఇతర విషయాల్లోనూ సహకరిస్తుంది.
* చర్లపల్లిలోని సిపెట్‌లో(సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ డిజైనింగ్‌) ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, వస్తువుల డిజైనింగ్‌, తయారీలో అధునాతన విధానాలు, మార్కెటింగ్‌ కోర్సులున్నాయి. టైర్‌-1, టైర్‌-2, టైర్‌-3, టైర్‌-4 కేటగిరీల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతలు గల విద్యార్థులకు శిక్షణ ఉంటుంది.
* రెడ్డీస్‌ల్యాబ్‌, మహేంద్రటెక్‌ వంటి పలు ప్రైవేటు సంస్థలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద వృత్తి విద్యా కోర్సుల్లో నైపుణ్యాల శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. కంప్యూటర్‌, టైలరింగ్‌, బ్యూటీషియన్‌, సాఫ్ట్‌వేర్‌ కోర్సులను అందిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.
* ఫ్యాప్సీ.. విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో పలు అంశాల్లో విద్యార్థులకు ఉపయోగపడే మెలకువలు నేర్పిస్తోంది.
* నాస్కామ్‌.. నగరంలోని జేఎన్‌టీయూ, మరికొన్ని ఇతర సంస్థలతో కలిసి యువతలో నైపుణ్యాలు పెంపొందించే శిక్షణ చేపడుతోంది.
* కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ఆన్‌లైన్‌ కోర్సులిస్తున్నాయి.
* ఇంజినీరింగ్‌లోనే అధికం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 130 నగరం చుట్టూనే ఉన్నాయి. ఇక పీజీ, డిగ్రీ, ఇంటర్‌ తదితర కళాశాలలు సరేసరి. సిబ్బంది కొరత, ప్రయోగశాలల లేమి వంటి లోపాలతోపాటు ...బాధ్యతగా చదవకపోవడం వల్ల కేవలం 15 శాతం ఇంజినీరింగ్‌ విద్యార్థులు మాత్రమే కోర్సు పూర్తవగానే ఉద్యోగాలు పొందుతున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఇతర కోర్సులు అభ్యసించిన వారు ఆంగ్లభాషా పరిజ్ఞానం, ఆత్మ విశ్వాసం, వృత్తిపై అవగాహన, భావ వ్యక్తీకరణ నైపుణ్య లోపంతో చతికిలబడుతున్నారు. రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇతర సామాజిక అంశాలను విస్మరించడం వల్ల కాలేజీ నుంచి బయటికొచ్చాక మళ్లీ శిక్షణ తీసుకోవాల్సి వస్తోంది.
* అనుసంధానం కావాలి - పార్థసారథి రసాయనశాస్త్ర విభాగం, ఓయూ
కొత్త సాంకేతికతకు అనుగుణంగా శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దాలి. నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు, ఈ తరహా శిక్షణ ఇచ్చే సంస్థలపై ప్రభుత్వం ప్రచారం చేయాలి. విద్యార్థులకు తరగతి గది నుంచే వారి చదువు, ఉన్న అవకాశాలపై వివరించాలి. విద్య, ఉపాధి రంగాలను అనుసంధానం చేసే విద్యావిధానం రావాలి.
* విమానరంగంపై చిన్నప్పట్నుంచి ఆసక్తి పెంచుకున్న నిఖిల ప్రసాద్‌ జీకే... ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక విధానాలపై అవగాహన పెంచుకున్నారు. బీటెక్‌ నాలుగో సంవత్సరంలో ప్రముఖ బోయింగ్‌ కార్పొరేషన్‌ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకొని చోటు సంపాదించిన మొదటి ఐఐటీయేతర విదార్థి ఆమె. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో భవిష్యత్తులో రాబోయే మార్పులపై అవగాహన, పాఠ్యాంశాలపై పట్టు తన విజయానికి కారణమని చెబుతోంది. అంతేకాదు నాసాలో శాస్త్రవేత్త అయ్యేందుకు ఉపయోగపడే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటోంది.
* చదువు పూర్తవగానే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించి వేర్వేరు దేశాల్లో పనిచేసిన అశోక్‌రెడ్డి ప్రస్తుతం 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మార్కెట్‌లో డిజిటల్‌ అవసరాలను గుర్తించి సొంతంగా ఆన్‌లైన్‌ కూపన్స్‌ కంపెనీ స్థాపించారు. రూ.లక్షల నుంచి మొదలైన ఆయన ప్రస్థానం అనతికాలంలో రూ.కోట్లకు చేరుకుంది. వ్యాపారం చేయాలనే అభిరుచికి అనుగుణంగా పరిశ్రమ స్థాపించి పట్టుదలతో విజయం సాధించారు.
* నగరంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు.. 130
* ఇంటర్‌ పై చదువులు చదివేవారు.. 11లక్షలు
* ఏటా ఇంజినీరింగ్‌ పూర్తిచేసే వారు.. 40వేలు
* ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో నిరుద్యోగులు.. 80 శాతం

posted on 19.07.2015; 8pm