Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆఫర్‌.. అసలా..నకిలీయా?

ఉద్యోగాల పేరుతో అన్ని కోట్లకు టోకరా.. ఇన్ని లక్షలు హాంఫట్‌.. నిరుద్యోగులతో చెలగాటం.. అంటూ తరచూ వార్తలు వింటుంటాం. ఇలాంటివి ఎన్నో ఆశలతో ఉద్యోగాలకు అప్లై చేసుకునే యువతకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంటాయి. అమాయకుల అసహాయతను డబ్బు చేసుకోడానికి ఎందరో నకిలీలు ఎప్పుడూ పొంచి ఉంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారి వలలో పడకుండా తప్పించుకోవచ్చు.

శైలూ బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. వచ్చే ఏడాది ప్రాంగణ నియామకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగూ ఇంటర్న్‌షిప్‌ పూర్తయింది. భవిష్యత్తులో ఉపయోగపడేలా పార్ట్‌టైం ఉద్యోగం ద్వారా ఉద్యోగానుభవం పొందాలనుకుంది. అందులో భాగంగా జాబ్‌ సైట్లలో వివరాలతో నమోదు చేసుకుంది. నెలకు కనీసం రూ.10,000-రూ.15,000 వరకూ లభించే ఉద్యోగాలు వస్తాయనుకుంది.
ఊహించని రీతిలో ఎన్నో ఉద్యోగావకాశాలతో తన ఇన్‌బాక్స్‌ నిండిపోయింది. పెద్ద పెద్ద సంస్థల నుంచీ ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. శామ్‌సంగ్‌, ఎల్‌ఐసీ, డెల్‌, గూగుల్‌ వంటి సంస్థలు పెద్ద మొత్తంలో జీతభత్యాలను అందిస్తున్నాయి. ఆసక్తి ఉంటే కాల్‌ చేయమని కింద ఇచ్చిన నంబరుకి కాల్‌ చేసింది. ఫోన్‌లోనే ఇంటర్వ్యూ అయిపోయింది. దరఖాస్తు ప్రక్రియకూ, కాల్‌లెటర్‌ మొదలైన అవసరమైన పత్రాలను పంపడానికీ కొంత మొత్తం చెల్లించమన్నారు. వచ్చే జీతంతో పోలిస్తే పంపేది పెద్ద మొత్తంగా అనిపించలేదు. వెంటనే చెప్పిన అకౌంట్‌లో జమ చేసింది. అలా ఇంకొన్ని కారణాలతో మళ్లీ మళ్లీ అడిగినా జమ చేసింది. తీరా వారం, పది రోజులు గడిచినా ఎలాంటి సమాచారమూ అందలేదు. తనకు ఇచ్చిన నంబరుకు కాల్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆపై ఎన్నిసార్లు చేసినా అదే సమాధానం!
రానురానూ పెరిగిపోతున్న ఉద్యోగ పోటీ, ఒక ఉద్యోగానికి వందలు, వేల సంఖ్యలో పోటీదార్లు. దీంతో ఉద్యోగాల అన్వేషణ కష్టమవుతోంది. అందుకే చాలామంది అభ్యర్థులు మొదటి ప్రయత్నంగా ఉద్యోగ సంబంధిత వెబ్‌సైట్‌లలో తమ రెజ్యూమెలను నమోదు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇలాంటి తరుణంలో ‘మీ రెజ్యూమెను చూశాం. దానిని మీరు రాసిన విధానం మీ నాయకత్వ లక్షణాలను చూపిస్తోంది. మా సంస్థకు అవసరమైన లక్షణాలు మీలో మాకు స్పష్టంగా కనిపించాయి. మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం ఎంపిక చేశాం’ అంటూ ఫోన్‌ కాల్‌ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఆ సంతోషాతిశయంలో సందేహాలేమీ తట్టవు. పైగా ఫోన్‌ చేసింది.. పెద్ద పేరున్న సంస్థలయినప్పుడు సులువుగా నమ్మకుండా ఉండలేరు.

గ్యారంటీ అడుగుతారు; నగదు కాదు!
ఉద్యోగాన్వేషణ చేసే అభ్యర్థులు కొద్దిగా సంస్థ గురించి పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఇందుకు లింక్‌డిన్‌, ఫేస్‌బుక్‌, సంబంధిత సంస్థ వెబ్‌సైట్లు సాయపడతాయి. అభ్యర్థులు తాము సరిగా గుర్తించలేకపోతున్నామనిపిస్తే.. సంస్థ వెబ్‌సైట్‌లో ఇచ్చిన నంబరుకు ఫోన్‌ చేసి, ఈ-మెయిల్‌/ కాల్‌ వచ్చిన వ్యక్తి అక్కడ పనిచేస్తున్నారో లేదో కనుక్కున్నా ఆఫర్‌ విశ్వసనీయత తెలిసిపోతుంది.
ఫేక్‌ జాబ్‌ యాడ్స్‌ ఇచ్చేవారు సంస్థల పేర్లు, ఈ-మెయిల్‌ చిరునామాలను కొద్దిపాటి తేడాతో రూపొందించు కుంటుంటారు. అభ్యర్థులను ఇవే తప్పుదోవ పట్టిస్తుంటాయి.
అసలైన సంస్థ నుంచే వచ్చిందని నమ్మి, మోసపోతుంటారు. నియామక ప్రక్రియలో డబ్బులు అడిగారంటేనే దానిని ఫేక్‌ ఉద్యోగంగా గుర్తించాలి. చాలామంది అభ్యర్థులు అనుభవం కోసం చిన్న సంస్థల్లో తక్కువ ఉద్యోగానికి చేరుతుంటారు. కొంత అనుభవం సంపాదించాక పెద్ద సంస్థలకు మారుతుంటారు. ఇది ఆ సంస్థలకు నష్టం. కాబట్టి, అలాంటి సంస్థలు అభ్యర్థిని తమతో కొన్ని ఏళ్లపాటు అట్టిపెట్టుకోవడానికి గ్యారెంటీ అడగొచ్చు. అయితే వీరైనా నేరుగా డబ్బులు కట్టమని అడగరు. అదైనా డీడీ, చెక్‌ రూపంలో తీసుకుంటారు. ఫోన్‌లోనే ఇంటర్వ్యూ ప్రక్రియను ఏ సంస్థా ముగించదు. కొన్నిసార్లు సంస్థలు తమకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు అవసరం అయినప్పుడు కన్సల్టెన్సీల సాయం తీసుకుంటాయి. వారు సంస్థ తరపున ఫోన్‌లో ప్రాథమికంగా ఎంపిక చేస్తారే తప్ప నేరుగా ఉద్యోగానికి ఎంపిక చేయరు. నేరుగా చేశారంటే.. ఫేక్‌గా భావించొచ్చు.

సంస్థలేమంటున్నాయ్‌?
ఐబీఎం, రిలయన్స్‌, టాటా, ఎల్‌ఐసీ, ఓఎల్‌ఎక్స్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌, ఎమిరేట్స్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఏర్‌ఏషియా... ఇలా ప్రతి సంస్థ పేరుమీదా ఈ ఫేక్‌ జాబ్‌ ప్రకటనలు వస్తున్నాయి. దీంతో సంస్థలు వీటికి వ్యతిరేకంగా అధికారిక ప్రకటనలు చేస్తూ ఉద్యోగార్థుల్లో అవగాహన పెంచటానికి ప్రయత్నిస్తున్నాయి.
* షైన్‌.కామ్‌ సంస్థ #NoMoreJobFraud క్యాంపెయిన్‌ను నడుపుతోంది.
* మాన్‌స్టర్‌.కామ్‌ తమ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నవారికి తరచూ మెయిళ్ల రూపంలో హెచ్చరిస్తోంది. చేయాల్సినవి, చేయకూడనివాటిపై అవగాహన కలిగిస్తోంది.
* ఎల్‌ఐసీ ఈమధ్య తమ సంస్థ పేరు మీద వచ్చిన నకిలీ ఉద్యోగ ప్రకటన వివరాలను ప్రస్తావించింది. తాము ఉద్యోగాల నిమిత్తం చేసే ప్రకటనలు వార్తాపత్రికల్లోనే ప్రచురిస్తామని స్పష్టం చేసింది. వాటినే సంస్థ వెబ్‌సైట్‌లో ఉంచుతామని కూడా తెలియజేసింది.
* టాటా సంస్థ తాము నియామకాలు చేపట్టేటప్పుడు ఎలాంటి పైకమూ వసూలు చేయమని స్పష్టం చేసింది.
* దుబాయ్‌ ఎమిరేట్స్‌, రిలయన్స్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ తదితర సంస్థలు కూడా ఉద్యోగార్థుల నుంచి తాము డబ్బు వసూలు చేయబోమనీ, నియామకాల నిమిత్తం మధ్యవర్తుల సాయం తీసుకోమనీ స్పష్టం చేశాయి. నియామక వివరాలకు సంబంధించి సందేహాలుంటే అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవడమో, సంస్థను సంప్రదించడమో చేయాలని సూచిస్తున్నాయి.

గుర్తించేదెలా?
ఉద్యోగార్థులను మోసం చేసేవారు ప్రముఖ సంస్థల పేరుకు దగ్గరగా ఉండేలా ఈ-మెయిల్స్‌ రూపొందించుకుంటున్నారు. ఆయా సంస్థల రిక్రూటింగ్‌ అధికారుల పేరుతోనే ఈ-మెయిల్స్‌ పంపుతున్నారు. దీంతో వెబ్‌సైట్‌కు వెళ్లి పరిశీలించినా అసలైందేదో, కానిదేదో విద్యార్థులు, ఉద్యోగార్థులు తెలుసుకోలేకపోతున్నారు.
రిక్రూటర్ల నుంచి వచ్చిన ఆహ్వానం అసలైనదేనా? నకిలీది కాదు కదా? దీన్ని గ్రహించే మార్గాలున్నాయి. కొద్దిగా శ్రద్ధపెట్టాలంతే!

నేరుగా కాల్‌ వచ్చిందా?
ఎంపికైనట్లు ఈ-మెయిల్‌ అందితే సంస్థ ప్రామాణికతను తెలుసుకోవాలి. మెయిల్‌ పై భాగంలో ‘మెయిల్డ్‌ బై’, ‘సైన్‌డ్‌ బై’ వంటి వాటిని పరిశీలించడం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. నిజంగానే ఏదైనా రిక్రూట్‌మెంట్‌ ప్లాట్‌ఫాంతో సంబంధం ఉంటే వాటికి సంబంధించిన ఆనవాళ్లు తప్పక కనిపిస్తాయి. అలాగే నిజంగా సంస్థే సంప్రదిస్తే సంస్థ, ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మెయిల్‌లో అందిస్తుంది. మెయిల్‌ పంపకుండా నేరుగా సంస్థ ప్రతినిధి నుంచి కాల్‌ వస్తే.. ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన మెయిల్‌ పంపమని అడగొచ్చు.
సంస్థ నుంచి వచ్చిన మెయిల్‌లో ఉద్యోగానికి సంబంధించిన వివరాలతో సమాచారం లేదు అంటే.. తప్పక అనుమానించాల్సిందే! అలాగే తెలిసిన సంస్థ అయితే లోగో, దానిలోని అక్షరాలను క్షుణ్ణంగా గమనించాలి. ఒక్కోసారి లోగో రంగు మార్చో, అక్షరాలను అటూ ఇటూ మార్చో పంపిస్తుంటారు. అలా కూడా గుర్తించే అవకాశం ఉంటుంది.

ఏ ఈ-మెయిల్‌?
వచ్చిన ఆఫర్‌ సరైందో కాదో తెలుసుకోవడంలో ఉపయోగపడే అతి ముఖ్యమైన దారిది. సంస్థలు తమకంటూ ప్రత్యేకమైన ఈ-మెయిల్‌ వ్యవస్థను రూపొందించుకుంటాయి. యాహూ, జీమెయిల్‌, హాట్‌ మెయిల్‌ వంటి ఉచిత ఈ-మెయిల్‌ వ్యవస్థల నుంచి వచ్చాయంటే స్కామ్‌ కింద పరిగణించొచ్చు. నిజమైన జాబ్‌ ఆఫర్లు సంస్థల అధికారిక రిజిస్టర్డ్‌ ఈ-మెయిల్‌ నుంచే వస్తాయి.
మోసం చేయడంలో అనుభవమున్నవారు ఈ విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటారు. అసలైన సంస్థల ఈ-మెయిల్‌కు దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, అసలైన దానికీ, బోగస్‌ దానికీ ‘హైఫన్‌ (-)’, ‘ఫుల్‌స్టాప్‌ (.)’, ‘కామా (,)’, ‘అండర్‌ స్కోర్‌ (్గ)’, స్పెల్లింగులో చిన్న తేడాలు ఉంటాయి. అసలు సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. బోగస్‌ వాటిల్లో సంప్రదించాల్సిన చిరునామా ఉండకపోవడాన్నీ గమనించొచ్చు.

దోషాలున్నాయా?
సంస్థలు అభ్యర్థులకు మెయిల్‌ పంపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. భాష విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తాయి. అక్షర, వ్యాకరణ దోషాలు, ఇండస్ట్రీ టర్మినాలజీలో లోపాలు, ప్రభుత్వ ఉద్యోగం అనే భ్రమ కల్పించటం (సాధారణంగా ప్రభుత్వ సంస్థలు సొంత వెబ్‌సైట్ల ద్వారానే నియామకాలు జరుపుతాయి), పిక్సెల్స్‌ సరిగా లేని ఫొటోలు, ఇచ్చిన వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ పనిచేయకపోవడం వంటివి ఉన్నాయేమో చూసుకోవాలి.

ఏ నైపుణ్యాలు చూశారు?
ఒక్కోసారి ఈ-మెయిల్‌/ కాల్‌ ద్వారా సంప్రదించినపుడు బోగస్‌ సంస్థల ప్రతినిధులు ఉద్యోగ విధులను ప్రస్తావించవచ్చు. అయితే అభ్యర్థిలో తమకు కావాల్సిన అర్హతల గురించి చాలా తక్కువగా ప్రస్తావిస్తుంటారు. ఒకసారి వారిచ్చే ఉద్యోగ ప్రకటనను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అసలైన సంస్థలు ఉద్యోగానుభవం గురించి ప్రస్తావించకపోయినప్పటికీ అభ్యర్థిలో తాము చూసే నైపుణ్యాలను జాబితాగా ఇస్తుంటాయి/ ఫోన్‌లో ప్రస్తావిస్తాయి. బోగస్‌ సంస్థల వాటిల్లో ఇలాంటివి కనిపించవు.
అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించి సంస్థలకు సీవీలో ఇచ్చిన సమాచారం వరకు సరిపోతుంది. అవికాకుండా అభ్యర్థి ధ్రువీకరణకు పాస్‌పోర్ట్‌, ఆధార్‌, పాన్‌కార్డ్‌, బ్యాంకు ఖాతా వివరాలను అడిగినా అనుమానించాలి. జాబ్‌ ఆఫర్‌ ఇచ్చేంతవరకూ ఈ సమాచారంతో సంస్థలకు పనుండదు. పైగా వీటిలో బ్యాంకు ఖాతా, పాన్‌ల వరకే సంస్థలు పరిమితమయ్యే అవకాశముంది. ఏదైనా మోసం చేయాలనుకునేవారు మాత్రమే వీటి పూర్తి వివరాలను ప్రారంభ దశలో అడుగుతారు.

ఇంటర్వ్యూ ఏ విధానంలో
ఉన్నతస్థాయి ఉద్యోగాలకు మినహా ఏ సంస్థా టెలిఫోన్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాన్ని ఇచ్చేయదు. సాధారణంగా సంస్థలు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసుకునే క్రమంలో టెలిఫోన్‌ ఇంటర్వ్యూను నిర్వహిస్తాయి. దానిలో అర్హత సాధించినవారిని తరువాతి రౌండ్లకు పిలుస్తారు. ఫోన్‌లో కొద్దిపాటి సమాచారం తెలుసుకుని, ‘మిమ్మల్ని ఎంపిక చేశాం’ అని చెబితే ఫేక్‌ సంస్థగా భావించొచ్చు. ఒక్కోసారి నకిలీ సంస్థలు కూడా అభ్యర్థులను నమ్మించడానికి ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇది కొంచెం ప్రమాదకరం. గూగుల్‌లో లిస్టెడ్‌ సంస్థల సమాచారం ఉంటుంది. తగిన పరిశోధన చేసుకుని, నమ్మకమైనదని రుజువు చేసుకున్నాకే హాజరవడం మేలు.

జీతమెంత?
ప్రాంగణ నియామకాలు, కోడింగ్‌ ద్వారా చేసే ఎంపికలు మినహాయిస్తే.. ఫ్రెషర్లను సంస్థలు మరీ ఎక్కువ జీతాలతో తీసుకోవు. సాధారణంగా రూ.15,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉండొచ్చు. ఒకవేళ అభ్యర్థికి నైపుణ్యాలు మరీ ఎక్కువగా ఉన్నా మొదట తీసుకున్నాక అభ్యర్థి పనితీరును గమనించాకే జీతంలో పెంపుదల గురించి సంస్థలు ఆలోచిస్తాయి. మొదటే యాభై, అరవై, డెబ్భైవేల రూపాయలు అంటున్నారంటే అందుకు తగిన పరిశోధన చేశాకే ముందుకు సాగాలి.

డబ్బు పంపమంటున్నారా?
జాబ్‌ ఆఫర్‌ ఈ-మెయిల్‌/ ఫోన్‌కి బదులు ఇచ్చాక బోగస్‌ సంస్థలు ఇన్సూరెన్స్‌, మెడికల్‌ టెస్టులు, ప్రయాణ ఖర్చులు... ఇలా కొన్ని సాకులు చెప్పి డబ్బు పంపమని అడుగుతుంటాయి. ఏ సంస్థ అయినా అభ్యర్థికి జీతం ఇచ్చి తీసుకుంటుందే కానీ, ఎదురు డబ్బులిమ్మని అడగదు. ఎదురుగా కొన్నిసార్లు తామే అభ్యర్థికి ప్రయాణ ఖర్చులతో సహా భరిస్తాయి. కాబట్టి, ఇలా ఎదురు డబ్బులు అడుగుతున్నారంటే మోసం చేస్తున్నారని ఖరారు చేసుకోవచ్చు.

Back..

Posted on 13-11-2018