Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కోరుకున్న కొలువు కాస్తలో చేజారిందా?

ఒక్క మార్కు కూడా రానప్పుడు ఎక్కువ బాధపడం కానీ, పాస్‌ అవ్వడానికి ఒక్క మార్కు తగ్గితే బాధపడతాం! ఒక్క పరుగు కూడా చేయనప్పుడు బాధపడం కానీ... సెంచరీకి ఒక్క పరుగు తగ్గితే బాధనిపిస్తుంది! అలాగే... అసలు ఉద్యోగం తెచ్చుకునే నైపుణ్యాలు మన దగ్గర లేకపోతే బాధపడం కానీ... ఆ స్కిల్స్‌ ఉండీ కొంచెంలో కొలువు చేజారిపోతే ఎంతో బాధపడతాం...! అలా జరగకూడదంటే ఏయే విషయాల్లో ఏం గ్రహించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
ఒక మ్యాచ్‌లో 99 పరుగులు సాధించి అవుటై, తరువాతి మ్యాచ్‌లో ఒక పరుగు సాధిస్తే సెంచరీ అవ్వదు! మళ్లీ మొదటి పరుగు నుంచీ ప్రారంభించాల్సిందే కదా! ఉద్యోగ సాధన కూడా క్రికెట్‌ మ్యాచ్‌ లాంటిదే. సెలక్ట్‌ అయ్యేవారికీ అవ్వనివారికీ మధ్య తేడా చాలాసార్లు, 99కీ, 100కీ ఉన్నంతే ఉంటుంది. చూడటానికి ఒక్క పరుగే అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క పరుగే భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. 100కి ఉన్న విలువ 99కి ఉండదు. 100లో సంతృప్తి ఉంటుంది. 99లో సానుభూతి ఉంటుంది. 100లో సాధించాం అన్న ఆనందం ఉంటుంది. 99లో దగ్గరికి వచ్చి ఓడిపోయామన్న బాధ ఉంటుంది. ఉద్యోగాన్ని సంపాదించడంలోనూ దగ్గరగా వచ్చి కూడా ఎందుకు ఓటమిపాలయ్యామన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలి.

ఉద్యోగం విషయంలో ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంటర్వ్యూకి ఇలా వెళ్లాలి, ఈ విధంగా మాట్లాడాలి, రాత పరీక్షకు ఈ రకంగా సన్నద్ధమవ్వాలి, గ్రూప్‌ డిస్కషన్స్‌లో ఇలా ప్రవర్తించాలి, టెక్నికల్‌ ప్రశ్నలకు ఈ తీరులో సమాధానమివ్వాలి.. అంటూ ఎన్నో విలువైన సూచనలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలన్నీ పెద్దపెద్ద తప్పులు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. కానీ, తెలియకుండానే చిన్నచిన్నవీ, తెలిసీతెలియనివీ తప్పులెన్నో చేస్తూ ఉంటాం.
ఎంత బాగా రాసినా, ఇంటర్వ్యూలో ఎంత బాగా మాట్లాడినా ఉద్యోగం ఎందుకు రావటంలేదో ఒక్కోసారి అర్థం కాదు. కొన్నిసార్లు మనకంటే తక్కువ చదివేవాళ్లు, మనకంటే తక్కువ నైపుణ్యాలు ఉన్నవాళ్లు కూడా ఎంపికైపోతుంటారు. అసలు ఎక్కడ పొరపాటు జరుగుతోందో ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోతుంటాం. అలా మనం తెలుసుకోలేని చిన్నచిన్న తప్పులే ‘అన్‌ఫోర్స్‌డ్‌ ఎర్రర్స్‌’ (అనవసరపు తప్పిదాలు). ఈ పొరపాట్లు రాత పరీక్షలో, గ్రూప్‌ డిస్కషన్స్‌లో, జస్ట్‌ ఎ మినిట్‌ (జామ్‌) రౌండ్‌లో, ఇంటర్వ్యూలో.. ఎక్కడైనా జరగొచ్చు. కాబట్టి మనమెంతో జాగ్రత్తగా ఉండాలి.
ఆ పొరపాట్లు ఏమిటో... అవి ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉందో తెలుసుకుందాం.
1. జామ్‌ (జస్ట్‌ ఏ మినిట్‌)
ఇందులో ఒక టాపిక్‌ను ఇచ్చి నిమిషంపాటు దాని గురించి మాట్లాడమంటారు. ‘రవి’ అనే విద్యార్థిని జామ్‌లో తన రోల్‌ మోడల్‌ గురించి మాట్లాడమని అడిగారు. అతను ‘రవీంద్రనాథ్‌ ఠాగూర్‌’ గురించి అనర్గళంగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు. తర్వాత ప్రకటించిన ఫలితాల్లో తన పేరు లేకపోవడం అతణ్ణి షాక్‌కి గురిచేసింది. ఎంత ఆలోచించినా తను ఎందుకు సెలెక్ట్‌ కాలేదో అర్థం కాలేదతడికి.
హెచ్‌ఆర్‌ అధికారిని కలిసి కారణం అడిగాడు. ‘నువ్వు ఠాగూర్‌ గొప్పతనం గురించి బాగా మాట్లాడావ్‌. కానీ, ఆయన నీకెందుకు రోల్‌ మోడల్‌ అయ్యారో.. నువ్వేం స్ఫూర్తి పొందావో ఒక్క మాట కూడా చెప్పలేదు. అందుకే నిన్ను సెలెక్ట్‌ చేయలేదు’ అని ఆయన వివరించాక రవికి అర్థమైంది. రోల్‌ మోడల్‌ ఘనత గురించి మాత్రమే కాదు, ఆ వ్యక్తి తనకెంత ప్రేరణ కలిగించారో కూడా మాట్లాడాల్సివుంటుందని బోధపడింది. తర్వాత రెండు నెలలకు వాళ్ల కాలేజీకి ఇంకో కంపెనీ వచ్చింది. అప్పుడు మళ్లీ రోల్‌ మోడల్‌ గురించే మాట్లాడమన్నారు. రవి ఈసారి ‘యువరాజ్‌ సింగ్‌’ కాన్సర్‌తో ధైర్యంగా పోరాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ అది తనలో స్ఫూర్తిని నింపిందనీ, మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడనే నమ్మకం యువరాజ్‌ వల్లే తనకు వచ్చిందనీ చెప్పాడు. ఈసారి తర్వాతి రౌండుకు సెలక్ట్‌ అయ్యాడు. ధైర్యం చేసి హెచ్‌ఆర్‌ అధికారిని అడగడం వల్ల తప్పెక్కడ జరిగిందో అర్థమైంది. దాన్ని సరిదిద్దుకోగలిగాడు.
2. చర్చల్లో దూకుడొద్దు
చాలామంది జామ్‌లో చేసే తప్పులనే గ్రూప్‌ డిస్కషన్స్‌లోనూ పునరావృతం చేస్తుంటారు. టాపిక్‌ ఒకటైతే ఇంకేదో చెప్పడమో, హెచ్‌ఆర్‌ను మెప్పించడానికి ఎక్కువగా మాట్లాడటమో చేస్తుంటారు. ఒక్కోసారి మిగతావాళ్ల గురించి ఆలోచించకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఇవన్నీ చాలా పెద్ద తప్పులు. ఎందుకంటే గ్రూప్‌ డిస్కషన్స్‌ ముఖ్యమైన ఉద్దేశమే మనం బృందంతో ఎలా ఉంటాం, టీంని లీడ్‌ చేసే సామర్థ్యం మనలో ఉందా లేదా అనేది తెలుసుకోవడం. కాబట్టి అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అందరి మాటలూ వినాలి. ఎవరినీ కించపరుస్తూ మాట్లాడకూడదు. ఇవన్నీ పట్టించుకోకుండా ఎంత బాగా మాట్లాడినా సెలక్ట్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందుకే గ్రూప్‌ డిస్కషన్స్‌లో హుందాగా ప్రవర్తించాలి. నిరాడంబరంగా ఉండాలి. దూకుడు చూపిస్తే మార్కులను కోల్పోవాల్సి వస్తుంది.
3. రాతపరీక్ష (ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌)
అన్ని రౌండ్ల కంటే ఎక్కువ తప్పులు.. చిన్నచిన్నవన్నీ ఇక్కడే చేస్తాం. ఎంతో పరిజ్ఞానం ఉన్నవాళ్లు కూడా ఇక్కడే విఫలమవుతుంటారు. అసలెక్కడ తప్పు జరుగుతోందో కూడా తెలుసుకోకుండా మళ్లీమళ్లీ చేసిన పొరపాట్లే చేస్తూ ఉంటారు. పోటీపరీక్షలకీ, కళాశాల పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. కాలేజీలో అకడమిక్‌ పరీక్ష పేపర్‌ ఈజీగా వస్తే 80-90% మార్కులు వస్తాయి. అందరూ మెచ్చుకుంటే సంతోషపడతాం. అదే పేపర్‌ కష్టంగా వస్తే 55-60% మార్కులు వస్తాయి. అందరూ తిడితే బాధపడతాం. అందుకే పేపర్‌ సులభంగా రావాలని కోరుకుంటాం. కానీ పోటీపరీక్షలు వేరు (క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌తో సహా). ‘పేపర్‌ ఈజీగా ఉంది’ అంటే ఆ పేపర్‌ మీకు మాత్రమే ఈజీ కాదు... మీతోపాటు పరీక్ష రాసే వాళ్లందరికీ ఈజీనే! మీకు 90% వస్తే మీతోపాటు అదే పరీక్ష రాసిన వాళ్లందరికీ 91%, 92%, 93% వచ్చే ఛాన్స్‌ ఉంది. అందుకే పేపర్‌ ఎంత ఈజీగా వచ్చినా... మీరెంత బాగా రాసినా.. మీతోపాటు రాసేవాళ్ల కంటే మీరు ముందున్నారా లేదా అనేదే ముఖ్యం. ఈ పోటీ ప్రపంచంలో పరుగు ఆపితే వెనుకబడిపోతాం, ఓడిపోతాం. అందుకే పరుగెడుతూనే ఉండాలి. అందరికంటే ముందుండాలి!
ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో అలా ఉండాలంటే ‘డెసిషన్‌ మేకింగ్‌’ చాలా ముఖ్యం. సాధారణంగా ఏ కంపెనీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో అయినా 50 ప్రశ్నలుంటాయి. 30-40 నిమిషాల సమయాన్ని ఇస్తారు. ఆ 50 ప్రశ్నల్లో సుమారు 20 సులువు, 20 మధ్యస్థం, 10 కష్టంగా ఉంటాయి. పేపర్‌ మొత్తాన్ని సాధించడానికి కనీసం 75-80 నిమిషాలు పడుతుంది. కానీ ఇక్కడ ఇచ్చేది 30 నిమిషాలే. కాబట్టి, ముందుగా వేటిని చేయాలో నిర్ణయించుకోవాలి. ముందుగా తేలికైన వాటిని ఎంచుకుని సాధించాలి. ఆ తరువాత మధ్యస్థ ప్రశ్నలు చేయాలి. కష్టమైనవాటిని చేస్తే ఎక్కువ మార్కులేమీ ఇవ్వరు. బాగా కష్టమనిపించిన వాటిని వదిలేయవచ్చు. అవి తెలియక కాదు.. చేయడం ఇష్టం లేక వదిలేయాలి.
టెస్ట్‌ క్రికెట్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ చాలా బంతులను వదిలేసేవాడు. ఎందుకు? క్రికెట్‌ రాక కాదు. ఆ బంతులు ఆడటం ఇష్టం లేక. అలా వదిలేస్తూ ఉంటే బౌలర్‌ విసిగిపోయి ఈజీ బాల్స్‌ వేస్తాడు. అప్పుడు సులువుగా స్కోర్‌ చేసుకోవచ్చు అన్న ఉద్దేశం ద్రవిడ్‌ది. సరిగా ఇదే కాన్సెప్టును ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో వాడాలి. కష్టమైన ప్రాబ్లమ్స్‌ను అన్నింటినీ వదిలేస్తే కచ్చితంగా సులువైనవి మిగులుతాయి. వాటిని తక్కువ సమయంలో సాధించవచ్చు. ఎక్కువ స్కోర్‌ చేయొచ్చు. ఇలా వేటిని సాధించాలి, వేటిని వదిలేయాలనే వాటి విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే సులువుగా ఆప్టిట్యూడ్‌ రౌండ్‌ను పూర్తిచేయవచ్చు.
4. హాబీల గురించి...
ఒక అభ్యర్థి ఇంటర్వ్యూ వరకూ వచ్చాడంటే దాదాపుగా ఎంపికయిపోయినట్టే! ఇంటర్వ్యూకి హాజరయ్యేటప్పుడు ఫార్మల్‌ డ్రెేస్సింగ్‌ ఉండాలి. అబ్బాయిలు గడ్డాన్ని నీట్‌గా ట్రిమ్‌ చేసుకోవడం, అమ్మాయిలు అతిగా మేకప్‌ వేసుకోకుండా ఉండటం లాంటివి అందరికీ తెలిసే ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో తెలియకుండానే తప్పులు చేస్తుంటాం. అవకాశాన్ని చివరి క్షణాల్లో పోగొట్టుకుంటుంటాం. అలాంటి వాటిలో..
* అభిరుచులు: రెజ్యూమేలో హాబీల గురించి రాసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిలో రాసినవాటిపై ప్రశ్నలను కచ్చితంగా అడుగుతారు. హాబీ అంటే మనకు అది చాలా ఇష్టమైంది అని. ఆ పని చేయడంలో మనకెంతో ఆనందం ఉంటుంది అని. అందుకే హాబీ గురించి ఇంటర్వ్యూయర్‌ అడిగినపుడు చిరునవ్వుతో బదులివ్వాలి. దాని గురించి సంతోషంగా మాట్లాడాలి.
ఉదాహరణకు హాబీ ‘క్రికెట్‌’ అని రాశారనుకోండి. అప్పుడు క్రికెట్‌ గురించి ఏం అడిగినా చెప్పగలగాలి. బ్యాట్‌ సైజు, మొదటి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఎక్కడ జరిగింది? ప్రపంచంలో పెద్ద స్టేడియం ఎక్కడుంది?... లాంటి ఏ ప్రశ్నకైనా సమాధానం రెడీగా ఉండాలి. అంతేకానీ... నాకు ‘క్రికెట్‌లో బేసిక్స్‌ మాత్రమే తెలుసు’ లాంటి సమాధానాల వల్ల రిజెక్ట్‌ అయ్యే అవకాశాలెక్కువ. సింగింగ్‌ను హాబీగా రాసినవాళ్లని గాయకుల పేర్లు, పాడమని అడగటం లాంటివి చేయవచ్చు. అలాగే కుకింగ్‌ అని చెబితే తయారీ విధానాన్ని అడగవచ్చు. అప్పుడు విసుక్కోకుండా నవ్వుతూ సమాధానాలు ఇవ్వడం ఎంతో ముఖ్యం!
* సమయస్ఫూర్తి: చాలాసార్లు ఇంటర్వ్యూల్లో అభ్యర్థి సమయస్ఫూర్తి (స్పాంటేేనిటీ)ని పరీక్షిస్తుంటారు. అందుకు అనవసరమైన ప్రశ్నలు వేస్తుంటారు. అప్పుడు ‘గుర్తు రావట్లేదు, ఆలోచిస్తున్నా’ అని చెబితే తక్కువ అభిప్రాయం ఏర్పడుతుంది.
ఉదాహరణకు ‘పొద్దున బ్రేక్‌ ఫాస్ట్‌లో ఏం తిన్నావ్‌? అని అడిగితే వెంటనే ‘ఇడ్లీ’ అని చెప్పెయ్యాలి. ఆలోచించకూడదు. ఎందుకంటే నువ్వు ఏం తిన్నావో ఇంటర్వ్యూయర్‌ వచ్చి చెక్‌ చేయరు కాబట్టి. ‘నీకు ఇడ్లీ వడ్డించేటప్పుడు మీ అమ్మ ఏ రంగు గాజులు వేసుకుంది’ అనడిగితే ఎక్కువ ఆలోచించకుండా ‘గ్రీన్‌’ అనో ‘రెడ్‌’ అనో చెప్పాలి.. వచ్చి చూడలేరు కాబట్టి. ఏ నంబర్‌ బస్సు ఎక్కి వచ్చావ్‌ అంటే ఏదో నోటికొచ్చిన నంబర్‌ చెప్పవచ్చు. ఇలాంటి ప్రశ్నలు వూరికే మన ఐక్యూను పరీక్షించడానికి అడుగుతుంటారు. ఇక్కడ కొంచెం అయోమయానికి గురైనా రిజెక్ట్‌ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఇలా తీసుకునే కొన్ని జాగ్రత్తలు సులువుగా ఉద్యోగాన్ని తెచ్చుకోవడంలో సాయపడతాయి.
ఆశించిన కొలువును చేజార్చుకోకూడదంటే చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక గొప్ప వ్యక్తి అన్నట్లు.. "Big mistakes will affect you sometime but small mistake will affect you lifetime".

- పి.వంశీకృష్ణా రెడ్డి, ఎండీ, CREATE U


Back..

Posted on 25-12-2017