Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆట పాటలతో ఉత్తమ విద్య

* బహుముఖ నైపుణ్యాలందించే కేంద్రీయ విద్యాలయాలు

మంచి బడిలో చేరిస్తే చిన్నారుల భవితకు భరోసా ఉంటుంది. ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నా అందరికీ అనువైనవిగా కేంద్రీయ విద్యాలయాలు గుర్తింపు పొందాయి. ఒత్తిడి లేని విద్యావిధానం, ఆటపాటలకు ప్రాధాన్యం కేవీల ప్రత్యేకత. పిల్లలను బహుముఖ ప్రజ్ఞాశాలురుగా తీర్చిదిద్దాలని ఆశించే తల్లిదండ్రులకు ఇవి తగినవని చెప్పొచ్చు. సీబీఎస్‌ఈ సిలబస్‌, సమర్థ బోధనా సిబ్బంది, ఆటస్థలంతో కూడిన ప్రాంగణాలు... ఇవన్నీ కేవీలంటే క్రేజ్‌ను పెంచుతున్నాయి. స్వల్ప ఫీజుతో ఒకటో తరగతి నుంచి ప్లస్‌ 2 వరకు ఇక్కడ చదువుకోవచ్చు. వీటిలో ఒకటో తరగతిలో ప్రవేశాలతోపాటు మిగిలిన తరగతుల్లోని ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.

కేవీలకు ఉన్న గిరాకీ దృష్ట్యా ప్రవేశం అంత సులువుగా లభించనప్పటికీ విద్యార్థులను పారదర్శకంగా ఎంపికచేస్తారు. కాబట్టి ఒకటో తరగతిలో ప్రవేశానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయవచ్చు. మిగిలిన తరగతుల్లో ప్రవేశాలు మాత్రం ఖాళీ సీట్లు ఉంటేనే లభిస్తాయి. ప్రతి పాఠశాలలోనూ ఒకటో తరగతిలో ఒక సెక్షన్‌ ఉంటుంది. ఒక్కో సెక్షన్‌లోనూ ఆ పాఠశాల ఉన్న ప్రాంతాన్ని బట్టి కనీసం 20 నుంచి 60 వరకు ఒకటో తరగతిలో సీట్లు లభిస్తున్నాయి.

చాలా పాఠశాలల్లో ఫస్ట్‌ క్లాస్‌లో రెండు నుంచి అయిదు వరకు సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్‌ విధానంలో తరగతులు సైతం నిర్వహిస్తున్నారు. ఈ సెక్షన్లు, షిఫ్ట్‌ల కారణంగా ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం దక్కుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను ముందుగా భర్తీ చేస్తారు. ఇందుకోసం అన్ని దరఖాస్తులను కలిపి డ్రా తీస్తారు. ఈ విధానంలో ఎంపికైనవారికి ఫీజుల నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు కేటాయించారు. రెండు సీట్లు సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ (ఒకే కుమార్తె కలిగి ఉన్న తల్లిదండ్రులు) కు ఉన్నాయి. దివ్యాంగులకు 3 శాతం సీట్లు లభిస్తున్నాయి. వీటిని ఆయా విభాగాలకు చెందిన దరఖాస్తుల నుంచి లాటరీ విధానంలో భర్తీ చేస్తారు.

ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీ ఆ పాఠశాల ప్రిన్సిపల్‌, కమిటీ సభ్యుల సమక్షంలో ఆఫ్‌లైన్‌ విధానంలో లాటరీ ద్వారా చేస్తారు. 9, 11 తరగతుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తారు.

ఫీజు సంగతి?
విద్యా హక్కు చట్టం ద్వారా ప్రవేశాలు పొందినవారు ప్లస్‌ 2 వరకు ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన పనిలేదు. వీరికి పాఠ్యపుస్తకాలు, నోట్సులు, యూనిఫాం, పాఠశాలకు చేరడానికి అవసరమయ్యే ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు (ఇందుకోసం తగు వివరాలు అందించాలి). కేవీల్లో చేరిన బాలికలు ఫీజు చెల్లించనవసరం లేదు. బాలురైతే ఏడో తరగతి వరకు ఫీజు ఉండదు. ఎస్సీ, ఎస్టీ బాలబాలికలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 9, 10 తరగతులకు బాలురు నెలకు రూ.200 ఫీజు చెల్లించాలి. 11, 12 తరగతులకు కామర్స్‌, హ్యుమానిటీస్‌ కోర్సులైతే రూ.300, సైన్స్‌ కోర్సులకు రూ.400 చెల్లించాలి.

దరఖాస్తు ఇలా...
ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయసు మార్చి 31, 2019 నాటికి అయిదేళ్లు పూర్తికావాలి (ఏప్రిల్‌ 1 నాటికి పూర్తయినా పరిగణనలోకి తీసుకుంటారు) అలాగే ఏడేళ్లకు మించరాదు. దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్‌ అయి వివరాలు చేర్చాలి. వీటికి అవసరమైన పత్రాలు జత చేయాలి. అన్ని వివరాలు, పత్రాలు నమోదుచేసిన తర్వాత వాటిని ఒకసారి సరిచూసుకుని సబ్మిట్‌ చేయాలి. దరఖాస్తు చేసుకున్నప్పుడే చేరాలనుకుంటున్న మూడు కేవీలను ఎంపిక చేసుకోవాలి. మొదటి, రెండో, మూడో ప్రాధాన్యంగా వీటిని నమోదు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకుంటే చివరి దరఖాస్తునే పరిగణనలోకి తీసుకుంటారు.

ముఖ్య తేదీలు

* ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 19 (సాయంత్రం 4 గంటలు)

* రెండు, ఆపైన తరగతుల్లో ప్రవేశానికి: ఏప్రిల్‌ 2 నుంచి ఏప్రిల్‌ 9 వరకు

* ప్లస్‌ 1లో ప్రవేశానికి పదో తరగతి బోర్డు ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

వెబ్‌సైట్‌: http://kvsonlineadmission.in


Back..

Posted on 14-03-2019