Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉపాధికి భ‌రోసా

* కృష్ణా విశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు
* ముంబయి ఐఐటీ అధ్యాపకులచే బోధన

ఆధునిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న నేటి కాలంలో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువచేసే చర్యల్లో భాగంగా కృష్ణా విశ్వవిద్యాలయం తగిన విధంగా కృషిచేస్తోంది. ఆయా సబ్జెక్టుల్లో అదనపు పరిజ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యంతో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులకు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగానే ముంబయి ఐఐటీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భవిష్యత్తులో దీనివల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
న్యూస్‌టుడే- కృష్ణా విశ్వవిద్యాలయం: జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటులో భాగంగా 2008లో కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా సమకూర్చిన నిధులతో వర్సిటీ ఓ వైపు మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ బాలారిష్టాలు అధిగమిస్తూనే మరోవైపు విద్యపరంగా గానీ, క్రీడలు, సాంస్కృతిక అంశాల పరంగా గానీ రాష్ట్రంలో పేరెన్నికగన్న వర్సిటీలతో పోటీపడుతోంది. విశ్వవిద్యాలయ పరిధిలో దాదాపు 160 కళాశాలలున్నాయి. నూజివీడులో పీజీ సెంటరు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు సబ్జెక్టుల పరంగా ఆయా కోర్సులను అందిస్తున్న విశ్వవిద్యాలయం వారి ఉద్యోగార్జనలోనూ మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పించడంలో మరో అడుగు ముందుకు వేసింది. ప్రస్తుతం డిజిటల్ బోధన శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితిల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సబ్జెక్టుల పరంగా అదనపు ప్రయోజనాన్ని చేకూర్చాలనే లక్ష్యంతో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టింది. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కోర్సుల నిర్వహణకు ఇటీవల ముంబయి ఐఐటీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా లిబర్ ఆఫీస్-రైటర్-కాల్క్, ఇమ్‌ప్రెస్ కోర్సులకు నమోదు ప్రక్రియను చేపట్టారు. తొలుత విశ్వవిద్యాలయ కళాశాలలోని సుమారు 400 మంది విద్యార్థులను ఈ కోర్సులు నేర్చుకోవడంలో భాగస్వాములను చేయాలనేది వర్సిటీ అధికారుల లక్ష్యంగా ఉంది. నిర్దేశిత మౌలిక సదుపాయాలున్న కళాశాలలకు మాత్రమే ఈ కోర్సుల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఇవీ బోధించనున్న కోర్సులు
* లిబర్ఆఫీస్, లాటెక్స్, ఫైర్‌ఫాక్స్, కర్టిల్, టచ్, రైటర్, కాల్క్, ఇమ్‌ప్రెస్, బేస్, డ్రా తదితర కోర్సులను అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటాయి.
* లినెక్స్-ఉబుంటు, పీహెచ్‌పీఅండ్ ఎంవైఎస్‌క్యూఎల్, సీప్లస్‌ప్లస్, జావా, నెట్‌బీన్స్ అండ్‌పైథాన్, స్కిలాబ్ తదితర కోర్సులను కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ విభాగ విద్యార్థులకు అందించనున్నారు.
* ఈసీఈ, ఎలక్ట్రానిక్స్, ఈఈఈ, ఎలక్ట్రికల్ విద్యార్థుల కోసం ఆస్కాడ్-నౌఫ్రీఈడీఏ కోర్సు లభ్యం కానుంది.
* యాస్కెండ్, జేమోల్ అప్లికేషన్, జీచెమ్‌పెయింట్ వంటి కోర్సులు కెమికల్ కెమికల్ ఇంజినీరింగ్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ విద్యార్థులకు ఉపయోగపడనున్నాయి.
* మెకానికల్ విద్యార్థుల కోసం ఓపెన్‌ఫోమ్, ఆర్ట్, డిజైన్ విభాగాల కోసం బ్లెండర్, ఆర్ట్స్, టెక్స్‌టైల్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ విద్యార్థులకు జింప్, క్యూ-కాడ్ కోర్సులు, సిమ్యులేషన్స్, త్రీడీ మోడలింగ్, బిజినెస్, రోబోటిక్స్, నెట్‌వర్కింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల వారి కోసం రూబీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెబ్ డెవలపర్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, మ్యాథమెటీషియన్స్, జెనిటిసిస్ట్స్, జర్నలిస్ట్స్, మేనేజర్స్ తదితర విభాగాలవారి కోసం హైలెవల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిన పెరీ, బయోకెమికల్ నెటవర్క్స్ వారి కోసం సెల్ డిజైనర్, డిజైనింగ్ వారి కోసం ఇన్క్ స్కాప్ తదితర కోర్సులు స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ ద్వారా అందిపుచ్చుకోవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా విద్యాబోధన
ఈ కోర్సులకు సంబంధించిన బోధన మొత్తం ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. అన్నీ అర్థమయ్యే రీతిలో బోధన ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇయర్‌ఫోన్స్/హెడ్‌ఫోన్స్ పెట్టుకుని విద్యార్థులు పాఠాలు వినాల్సి ఉంటుంది. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి తగిన సమయాన్ని బోధకులు విద్యార్థులకు కేటాయిస్తారు. ఆ సమయంలో సబ్జెక్టుపరంగా ఉన్న తమ అనుమానాలను ఐఐటీ అధ్యాపకుల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. కోర్సులో చేరిన వారికి నిర్దేశించిన శిక్షణ కాలం పూర్తయిన వెంటనే ఆన్‌లైన్ పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణత సాధిస్తే ధ్రువపత్రాలను ప్రదానం చేస్తారు.

ీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం - ఆచార్య సుంకరి రామకృష్ణారావు, ఉపకులపతి
ఆన్‌లైన్ కోర్సుల ద్వారా విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులకూ దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వెబ్‌సైట్‌తో పాటు, కోర్సులకు సంబంధించిన సీడీలు తదితరాలను విశ్వవిద్యాలయానికి ముంబయి ఐఐటీ వారు అందించారు. ఇవన్నీ విద్యార్థులకు అందజేస్తాం. దీనిపై అనుబంధ కళాశాలల వారికి అవగాహన కల్పిస్తాం.

మంచి ఉద్యోగ కల్పనే ధ్యేయం - రామశేఖర్‌రెడ్డి, వర్సిటీ మానవ వనరుల అభివృద్ధి సమన్వయకర్త
ప్రతిభ ఉన్నప్పటికీ అదనపు ప్రయోజనాన్ని చేకూర్చే కోర్సులు, సాంకేతిక నైపుణ్యం కొరవడుతున్న విద్యార్థులకు ఈ ఆన్‌లైన్ కోర్సుల ద్వారా మరింత అదనపు ప్రయోజనం చేకూరనుంది. బహుళ జాతీయ కంపెనీల్లో సులువుగా ఉద్యోగాలు సాధించేందుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

నమోదయ్యాను - చెన్ను లిఖిత, విద్యార్థిని
ఆన్‌లైన్ కోర్సులో నేను నమోదయ్యాను. బోధన అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. పాఠాలు అర్థమయ్యే విధంగా చక్కగా చెబుతున్నారు. మాకు ఎంతో ఉపయోగపడుతుందనే విశ్వాసం ఉంది. ఉద్యోగ సాధనలోనూ మాకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటాను.

కంప్యూటర్ కోర్సు నేర్పిస్తున్నారు - అబ్దుల్‌మహ్మద్, విద్యార్థి
ప్రస్తుతం మాకు లిబర్ ఆఫీస్ అనే కంప్యూటర్ కోర్సును నేర్పిస్తున్నారు. నేను ఎంసీఏ విద్యార్థిని కావడంతో ఇది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వివిధ రకాలైన కంప్యూటర్ అప్లికేషన్స్‌కు సంబంధించిన కోర్సులను నేర్చుకోవాలనుకుంటున్నాను.


Back..

Posted on 30-01-2017