Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
చెక్కుచెదరని కొత్త కొలువులు!

ఒక ఉద్యోగం.. వందల్లో దరఖాస్తులు. ఎలాగో పోటీలో నెగ్గుకొచ్చి ఉద్యోగం సాధించినా.. అది ఎన్నాళ్లు ఉంటుందో తెలియని అనిశ్చితి. ఆటోమేషన్‌తో ఈ సమస్య మరింత తీవ్రం అవుతోంది. జాబ్‌ ఎలా సంపాదించాలి.. దాన్ని ఏవిధంగా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి? ఈ సందేహాలు ఇప్పటి యువతను ఇబ్బంది పెడుతున్నాయి. ఆటోమేషన్‌తో ఎదురయ్యే అవస్థలను తప్పించే రంగాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కోర్సులు చేస్తే ఆ అవకాశాలను అందుకోవచ్ఛు.

మార్ఫు. నిరంతరం.. తప్పనిసరి. వస్తువుల నుంచి టెక్నాలజీ వరకూ అన్నింటిలోనూ రోజు రోజుకీ మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇది కెరియర్లకూ వర్తిస్తుంది. భవిష్యత్తు బెంగలేకుండా సాగాలంటే దీర్ఘకాలం కొనసాగే కొలువులను ఎంచుకోవాలి. ప్రస్తుతం పరిశ్రమల్లో ఉద్యోగాలకు తీవ్ర పోటీ ఉంటోంది. జాబ్‌పరంగా ఎదుగుదలా తగ్గుతోంది. కొన్నేళ్లుగా ఎక్కువమంది విద్యార్థులు కోర్సుల ఎంపికలో పరిమిత రంగాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, ఆటోమేషన్‌ వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది.అత్యాధునిక సాంకేతికత చొచ్చుకొస్తున్నకొద్దీ కొన్ని రకాల పాత ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. కొత్తవీ పుట్టుకొస్తున్నాయి. చాలావరకు పరిశ్రమల్లో ఆటోమేషన్‌ జరుగుతున్నప్పటికీ నైపుణ్యాల విషయంలో ఇప్పటికైతే రోబోలు మనుషులతో పోటీ పడే పరిస్థితి లేదు. అందుకే అలాంటి స్కిల్‌ ఆధారిత కెరియర్లను ఎంచుకుంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది.

లగ్జరీ బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌
కొన్ని వస్తువులను ఎన్ని కంపెనీలు అందిస్తున్నా.. ఏదో ఒక సంస్థ పేరు మాత్రం తప్పకుండా గుర్తుకువస్తుంది. అంటే ఆ సంస్థ ఆ వస్తువు ఉత్పత్తిలో ప్రసిద్ధి పొందిందని అర్థం. నాణ్యత.. ఇతర ఏ లక్షణాలైనా ఇందుకు కారణం కావచ్ఛు అలాంటి పేరు తీసుకు రావడంలో లగ్జరీ బ్రాండ్‌ మేనేజర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. దేశంలో ఆదరణ పెంచుకుంటున్న ఎమర్జింగ్‌ కెరియర్లలో ఇదీ ఒకటి. ఈ మేనేజర్లు మార్కెటింగ్‌, బిజినెస్‌ నైపుణ్యాలను ఉపయోగించి సంస్థ వస్తువులకు డిమాండ్‌ పెంచుతారు. బ్రాండ్‌ ఇమేజ్‌ను సృష్టిస్తారు.
కోర్సులు: బ్రాండ్‌ మేనేజర్లుగా చేరాలంటే డిప్లొమా, బీబీఏ, ఎంబీఏ లాంటి కొన్ని కోర్సులు చేయాలి. డిప్లొమా, డిగ్రీలకు ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. పీజీ చేయాలంటే డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని సంస్థలు కామర్స్‌ నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌
* ఎస్‌పీ జైన్‌ స్కూల్‌ ఆఫ్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, ముంబయి
* ముద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ అడ్వర్టైజింగ్‌, అహ్మదాబాద్‌
* లగ్జరీ కనెక్ట్‌ బిజినెస్‌ స్కూలు, గుడ్‌గావ్‌
* పెరల్‌ అకాడమీ, న్యూదిల్లీ, ముంబయి మొదలైనవి. అడ్మిషన వివరాల కోసం సంస్థల వెబ్‌సైట్లను పరిశీలించవచ్ఛు.
ఉద్యోగాలు: వివిధ సంస్థలు వీరిని బ్రాండ్‌ మేనేజర్‌, ఫ్యాషన్‌ గూడ్స్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌, ఫ్యాషన్‌ రిటైల్‌ మేనేజర్‌, ఫ్యాషన్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ స్పెషలిస్ట్‌, మార్కెటింగ్‌ అండ్‌ విజువల్‌ మర్చండైజింగ్‌ మేనేజర్‌ స్థానాల్లో నియమించుకుంటున్నాయి.

డేటా సైన్స్‌
డేటా సైన్స్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, ఆపరేషన్‌ రిసెర్చ్‌ తదితరాల కలయిక. ప్రపంచవ్యాప్తంగా 2.5 క్వింటిల్లియన్‌ బైట్ల డేటా ఉత్పత్తి అవుతోందని అంచనా. దీనిలో అవసరమైన సమాచారాన్ని వివిధ సోర్సుల నుంచి గుర్తించి, సేకరించడం డేటా సైంటిస్టుల విధి. ఇందుకు వివిధ సైంటిఫిక్‌ విధానాలు, అల్గారిథమ్స్‌ను ఉపయోగిస్తారు. తద్వారా వినియోగదారుల అవసరాలు, ఇబ్బందులను విశ్లేషించి మార్కెట్‌లోకి మెరుగైన సేవలను తెచ్చే ప్రయత్నం చేస్తారు.
కోర్సులు: డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కోర్సులకు ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదివి ఉండాలి. పీజీ కోర్సులకు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌, మ్యాథమేటిక్స్‌, ఇంజినీరింగ్‌ చదివినవారు అర్హులు. కోర్సుల్లో భాగంగా క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, ఆప్టిమైజేషన్‌, డేటా ఇంజినీరింగ్‌ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* ఐఐఎం- కోల్‌కతా
* ఐఐటీ ఖరగ్‌పూర్‌
* ప్రాక్సిస్‌ బిజినెస్‌ స్కూలు- బెంగళూరు, కోల్‌కతా, తిరుపతి
* సింబయాసిస్‌, పుణె
* ఎస్‌పీ జైన్‌ స్కూల్‌ ఆఫ్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, ముంబయి మొదలైనవి.
ఉద్యోగాలు: కోర్సులు చేసినవారికి డేటా అనలిస్ట్‌, డేటా ఇంజినీరింగ్‌, డేటా ఆర్కిటెక్ట్‌, స్టాటిస్టీషియన్‌ మొదలైన విభాగాల్లో అవకాశాలుంటాయి.డేటాసైన్స్‌ను వినియోగిస్తున్న ప్రధాన సంస్థల్లో ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఉబర్‌ ఉన్నాయి.

యానిమల్‌ ప్రొటెక్షన్‌
గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ మార్పుల కారణంగా ఎన్నో వృక్ష, జంతుజాలాలు కనుమరుగవుతున్నాయి. దీన్ని అరికట్టాలంటే సరైన అవగాహన కల్పించాలి. అలా అవగాహన పెంపొందించడం ఇప్పుడో కెరియర్‌గా అభివృద్ధి చెందుతోంది.
కోర్సులు: కోర్సు కాలవ్యవధి ఏడాది. ఇందులో నాలుగు ప్రధాన భాగాలు (జీవుల బాగోగులు, జంతువుల చట్టాలు, నైతికత, జంతువులపై చూపే క్రూరత్వానికి సంబంధించిన చట్టాలు, వైల్డ్‌లైఫ్‌ లాస్‌) ఉంటాయి. ఏదైనా డిగ్రీ చేసినవారు, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సులో మూడేళ్లు పూర్తిచేసినవారు, ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్ఛు.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

* నల్సార్‌ యూనివర్సిటీ యానిమల్‌ ప్రొటెక్షన్‌కు సంబంధించి పీజీ డిప్లొమాను అందిస్తోంది.
ఉద్యోగాలు: జంతు సంరక్షణ కోర్సు పూర్తిచేసుకున్న వారికి జాతీయ, అంతర్జాతీయ జంతువుల సంరక్షణ సంస్థల్లో రిసెర్చ్‌, పాలసీ స్పెషలైజేషన్‌, క్యాంపెయిన్‌, వైల్డ్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్‌, వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్పెక్షన్‌, కన్సల్టెంట్లు, ఎకానమీ విభాగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

ఆగ్‌మెంటెడ్‌ అండ్‌ వర్చువల్‌ రియాలిటీ
పోకెమన్‌ గో.. పేరు వినగానే మొబైల్‌ ఫోన్లతో ఎంతోమంది రోడ్లమీదకు వచ్చేసిన సంఘటనలు గుర్తొస్తాయి. ఏఆర్‌ అండ్‌ వీఆర్‌ టెక్నాలజీకి ఒక ఉదాహరణ ఇది. సినిమాలు, ప్రొడక్ట్‌ల మోషన్‌ పిక్చర్‌లూ దీని మహిమే. ఏఆర్‌ ఇంటరాక్టివ్‌ ఎక్స్‌పీరియన్స్‌, విజువల్‌, ఆడిటరీ మొదలైన ఇన్‌పుట్‌లను జోడిస్తే, వీఆర్‌.. ఊహాజనిత ప్రపంచాన్ని వాస్తవంగా కనిపించేలా చేస్తుంది. దీన్ని ముఖ్యంగా గేమ్స్‌, మెడికల్‌, మిలటరీ, విద్యా సంబంధ అంశాలకు ఉపయోగిస్తారు.
కోర్సులు: గంటల సమయం నుంచి రెండేళ్ల వ్యవధి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు ప్రాథమిక కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారెవరైనా ఈ కోర్సులు నేర్చుకోవచ్ఛు 3డీ మోడలింగ్‌, ప్రోగ్రామింగ్‌, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్‌, యానిమేషన్‌ మొదలైన అంశాల్లో శిక్షణ ఉంటుంది.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* గల్గోతియా యూనివర్సిటీ, గ్రేటర్‌ నోయిడా
* ఎరీనా యానిమేషన్‌, లఖ్‌నవూ
* మాయా అకాడమీ (ప్రధాన నగరాల్లోని సంస్థలన్నీ) మొదలైనవి.
ఉద్యోగాలు: కోర్సులు పూర్తిచేసిన వారిని డిజైన్‌ ఆర్కిటెక్ట్‌, సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌, సిస్టమ్‌ వాలిడేషన్‌ ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, 3డి ఆర్టిస్ట్‌ మొదలైన హోదాల్లో నియమించుకుంటారు. .

టీ మేనేజ్‌మెంట్‌
ప్రపంచవ్యాప్తంగా టీ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ ముందున్న దేశాల్లో భారత్‌ ఒకటి. అసోం, డార్జిలింగ్‌ టీలకు ప్రపంచ ఖ్యాతి ఉంది. ఈ రంగంలో కెరియర్‌ మలచుకుంటే ఎన్నో అవకాశాలను అందుకోవచ్ఛు
కోర్సులు: సర్టిఫికెట్‌, పీజీ డిప్లొమా, మాస్టర్‌ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు వాటిని చేయవచ్ఛు చాలావరకూ సంస్థలు ప్రత్యేక పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యూచరిస్టిక్‌ స్టడీస్‌, కోల్‌కతా
* ఎన్‌ఐటీఎం, డార్జిలింగ్‌ టీ రిసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌, పశ్చిమ్‌ బంగ
* దిప్రస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ స్టడీస్‌, కోల్‌కతా
* ఉపసి టీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, తమిళనాడు
* అసోం అగ్రికల్చర్‌ యూనివర్సిటీ
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌, బెంగళూరు మొదలైనవి.
ఉద్యోగాలు: కోర్సు పూర్తిచేసినవారికి టీ టేస్టింగ్‌, రిసెర్చ్‌, ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌, టీ బ్రోకింగ్‌, కన్సల్టింగ్‌, ఆక్షనింగ్‌, ప్రాసెసింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ విభాగాల్లో అవకాశాలుంటాయి.

ఫుడ్‌ ఫ్లేవరిస్ట్‌
మార్కెట్‌లో దొరికే రకరకాల ఆహార సంబంధిత ఉత్పత్తులకు వివిధ ఫ్లేవర్లను జోడించేవారే ఫుడ్‌ ఫ్లేవరిస్టులు. వీరినే ఫుడ్‌ కెమిస్ట్‌లు అనీ పిలుస్తారు. కొత్త కొత్త ఫ్లేవర్లను రూపొందించడం ఈ ఉద్యోగుల ప్రధాన విధి. వాటిలో ప్రకృతిసిద్ధమైనవి, కృత్రిమమైనవి అని రెండు రకాలుంటాయి.
కోర్సులు: డిగ్రీ స్థాయిలో బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) అందుబాటులో ఉంది. పీజీ స్థాయిలో ఫుడ్‌ సైన్స్‌, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు పీజీ డిప్లొమాలను ఆఫర్‌ చేస్తున్నాయి. డిగ్రీ స్థాయిలో కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ సబ్జెక్టుగా చదివినవారు వాటిని చేయడానికి అర్హులు.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, పంజాబ్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ
* సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌, ముంబయి మొదలైనవి.
ఉద్యోగాలు: కోర్సులు పూర్తి చేస్తే ఫుడ్‌ ప్రాసెసింగ్‌యూనిట్లు, టీ, కాఫీ, బెవరేజెస్‌, వైన్‌ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి.


Back..

Posted on 19-11-2019