Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
లక్ష్యం వైపు... నిరంతర ప్రేరణ!

వార్షిక పరీక్షలు కావొచ్చు, ఉద్యోగ పోటీ పరీక్షలు కావొచ్చు. చేయాల్సిన కృషి ఎంత పెద్దదైనప్పటికీ నిరంతర ప్రేరణ ఇంధనంగా ఉపకరిస్తుంది. కానీ సుదీర్ఘ సన్నద్ధతలో ఎక్కడో ఒకచోట... ఏదో ఒక దశలో ప్రేరణ పలచబడి నిరాశపడటం సహజమే. అప్పుడేం చేయాలి?
ప్రవీణ్‌, గౌతమ్‌లను కలిసినపుడు ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఉత్తమ్‌ ఎంతో స్ఫూర్తి పొందాడు. ప్రవీణ్‌ సివిల్‌సర్వీసెస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. గౌతమ్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. తను కూడా ఐఐటీలో ప్రవేశం పొందాలనుకున్నాడు. ఎంతో ఉత్సాహంగా ఇంటికెళ్ళాడు. కానీ కొద్దిరోజుల్లో ఆ ఉత్సాహం క్రమంగా తగ్గిపోయింది.
సరిగ్గా నెల క్రితం ఇలాగే జరిగింది. కళాశాలలో ఉత్సవానికి ఒక పూర్వ విద్యార్థి ముఖ్యఅతిథిగా వచ్చేడు. ఒకప్పుడు ఇదే కాలేజ్‌లో చదివిన ఆ సభలోని ముఖ్య అతిథి ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌. ఉత్తమ్‌లో ఎంతో ఉత్సాహం, ఉత్తేజం. కానీ వారం రోజుల్లోనే వాటి ఛాయలు తగ్గిపోయాయి.
ఇలాంటి విద్యార్థులనూ, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులనూ చాలామందిని చూస్తూంటాం. విజయాన్ని పొందిన వ్యక్తుల గురించి విన్నపుడూ, మంచి పుస్తకాలను చదివినపుడూ, కొన్ని సంఘటనలను చూసినపుడూ ఉద్వేగం కలగడం సహజం. కాని అది తాత్కాలికం కాకుండా చిరకాలం నిలిచివుండటం సాధ్యమేనా?
వెలిగించిన దీపం ఆరిపోకుండా వుండాలంటే నూనెను వేస్తూనే వుండాలి. అలాగే విద్యార్థులు తమలో కలిగిన ఉత్తేజం ఆవిరైపోకుండా వుండాలంటే అప్పటి విశేషాలను తలచుకుంటూనే వుండాలి. శరీరంలో శక్తికోసం శరీరానికి మూడు పూటలా ఆహారాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా మనిషిలో ఉత్తేజం అనేది ఎప్పటికీ వుండాలంటే మూడు పూటలా కాదు... నిరంతరం మనసును ప్రేరణకు గురి చెయ్యాలి. లేదంటే అది కేవలం తాత్కాలికమే అయిపోతుంది.
మనసులో ప్రేరణ కలగాలంటే బలమైన లక్ష్యం వుండాలి. ఆ లక్ష్యం గురించి ఆకలిలాంటి తపన వుండాలి. ‘నేను చేసి తీరాలి’ అనే ఆలోచనా సరళిని అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే దంతాలను శుభ్రం చేసుకోవడం ఒక దినచర్యలా మారినట్లు లక్ష్యం గురించి ఆలోచించడం దినచర్యగా మారాలి. పెద్దపెద్ద లక్ష్యాలను సాధించినవారందరిలో ఈ రకమైన తపన ఉంటుంది. అది ఆరని దీపంలా, రగిలే జ్వాలలా ఉంటుంది. పరీక్షల్లో గెలుపు పొందేవారిలో ఈ తపనను గుర్తించగలం.
* నిత్య స్ఫూర్తి నిలవాలంటే నిర్దిష్టమైన లక్ష్యం వుండాలి. దాన్ని సాధించాలనుకునే విద్యార్థులూ, పోటీ పరీక్షల అభ్యర్థులూ ముందుగా లక్ష్యాన్ని బాధ్యతగా తీసుకోవాలి. నిత్యస్ఫూర్తికీ, విజయానికీ ఇది తొలిమెట్టు. ఒక ఉద్యోగంలో అధికారిగా చేరి ఉద్యోగ బాధ్యతల్ని చేపట్టిన వ్యక్తిలా వ్యవహరించాలి. ఉద్యోగం పోతుందనే భయంతో పనిచేసినట్లు కాకుండా, ఆ విధులు సక్రమంగా నిర్వహించి, పదోన్నతులు సంపాదించి ఉన్నత స్థాయికి వెళ్ళాలనే దృక్పథంతో పనిచేసినట్లు బాధ్యతతో పనిచెయ్యాలి.
* ఒక ప్రణాళికను తయారు చేసుకుని మీకు మీరే టైంటేబుల్‌ను అమలుపరిచేటట్లు కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో ఉదాసీనత చూపించకూడదు. నిత్య ప్రేరణకూ, ఆత్మవిశ్వాసానికీ, విజయానికీ ప్రణాళికను ఆచరణలో పెట్టడం ఎంతో ముఖ్యం.
* 'No Pain- No gain'అనే విషయాన్ని ఏ క్షణంలోనూ మర్చిపోకుండా వుండే వ్యవహరశైలిని పెంచుకుంటే కష్టపడుతున్నామనే భావన కలగదు. ‘నాకు కావాలి- నేను సాధించాలంటే ఇలా కృషిచేసి తీరాల్సిందే’ అనే దృక్పథం పెరుగుతుంది.
నిత్య స్ఫూర్తికి ఒక కిటుకు ఉంది. జపాన్‌ దేశానికి చెందిన ‘తిమోతి గాల్వే’ అనే ఒక నిపుణుడు దీన్ని పరిచయం చేశాడు. STOP అనే పదంలో ఉన్న నాలుగు ఆంగ్ల అక్షరాలకు నాలుగు విషయాలను జోడించేడు. అవేంటో చూద్దాం.
S = STEP BACK T = THINK
O = ORGANISE YOUR THOUGHTS
P = PROCEED
జపాన్‌లో పెద్దపెద్ద సంస్థల్లో ఈ కిటుకును వాడతారు. ప్రతి 20 నిమిషాలకొక గంట మోగుతుంది. ఉద్యోగులు ఒక నిమిషం పాటు తమ కర్తవ్యం గురించి తలచుకుని, పైనున్న నాలుగు సోపానాలను ఆచరించి స్ఫూర్తిని పొందుతూ వుండాలి. ప్రతీ 20 నిముషాలకొకసారి గంట మోగినపుడు ఈ విధంగా ఆలోచించాలి.
STEP BACK... అంటే గత 20 నిముషాల్లో నా లక్ష్యంపై నేను తపనతో పనిచేస్తున్నానా లేదా? THINK...అంటే లక్ష్యం గురించి ఆలోచించాలి. ORGANISE YOUR THOUGHTSఅంటే ఆలోచనా క్రమాన్ని పద్ధతిలో పెట్టుకోవాలి. Proceed అంటే ఆ ప్రేరణతో ముందడుగు వెయ్యాలి. ఈ నాలుగు సోపానాలకు నిమిష కాలం కేటాయిస్తారు. అంటే... ఒక నిమిషం అవగానే మరొక గంట మోగుతుంది. ఉద్యోగులు వెంటనే కొత్త ప్రేరణతో పనిలోకి నిమగ్నులౌతారు. తిరిగి 20 నిముషాల తర్వాత మళ్ళీ గంట మోగుతుంది. ఈ విధంగా ప్రతి 20 నిముషాలకు నిమిషంపాటు ప్రేరణ పొందే పద్ధతిని వాడి ఫలితాలు పొందుతున్నారు. ఈనాటి విద్యార్థులు మొబైల్‌ ఫోన్‌లో BELL APP లేదా అలారం పెట్టుకుని, ఆ గంట మోగినపుడు ఒక నిమిషంపాటు లక్ష్యంవైపు ఉత్తేజం కలిగేలా ఆలోచించవచ్చు. అప్పుడు నిత్యస్ఫూర్తి వెలుగుతూనే వుంటుంది.
* మనిషికి క్రమశిక్షణ ఎంతో అవసరం. దీన్ని శిక్షగా భావించకుండా సమయపాలన, నిత్యస్ఫూర్తి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కృషి అనేది తాత్కాలికమైన కష్టం, ఖుషీ అనేది తాత్కాలికమైన ఇష్టం అనీ తెలుసుకుని యువతరం ప్రేరణ పొందాలి.
* ప్రేరణ కోసం ఆలోచనాత్మకమైన, ప్రభావవంతమైన వ్యాఖ్యలనూ, వాక్యాలనూ స్మరించుకోవాలి. ఉదయం నిద్ర నుండి లేచిన క్షణం నుంచి వాటిని గుర్తుచేసుకోవాలి. ఈ వాక్యాలను ‘అఫర్‌మేషన్స్‌’ అంటారు. ఉదాహరణకు కొన్నిటిని పరీశీలిద్దాం.
‘ఈ రోజు గొప్ప సుదినం’ ‘నేను ఎంతో శక్తిమంతుణ్ణి’
‘ఈ రోజు నేను ఉత్తేజంతో లక్ష్యాల గురించి పనిచేస్తా’
‘ప్రతిరోజూ నాలో ఎంతో ప్రగతిని గుర్తిస్తున్నాను’
ఇటువంటి వాక్యాలను తయారుచేసుకుని వాటిని అంకితభావంతో, భావోద్వేగంతో స్మరించుకోవాలి. ఇవి మనసును ఎంతో ప్రభావితం చేస్తాయి.
* భయాలు, బలహీనతలతో పోరాటం చెయ్యాలి. ఉదాహరణకు... వాయిదాలు వేసే బలహీనత వుందనుకుందాం. ‘ఈ పనిని ఇప్పుడే చేస్తాను. నన్ను నేను సవాల్‌ చేసుకుంటున్నాను. తయారుచేసుకున్న ప్రణాళికను అమలుచేసి తీరుతాను. అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఇలా చేసి తీరాల్సిందే’ అని మానసిక యుద్ధం చెయ్యాలి. అపుడే అనుభవంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగి ప్రేరణ కలుగుతుంది.
* నిత్యస్ఫూర్తితో ఉండాలనుకునేవారు కుంటి సాకులను వెతుక్కోవటం మానుకోవాలి. అలా చేస్తే భవిష్యత్తును దెబ్బతీసుకున్నట్టే. అందుకే తనలో ప్రేరణ కలిగే విధంగా ఆలోచించాలి.
* మనకున్న శక్తి అపారమైనది. పెద్ద లక్ష్యాలను పెట్టుకుని, వాటిని చిన్నచిన్న భాగాలుగా విభజించి, పనులను పూర్తి చేసుకోవాలి. ‘చిన్న లక్ష్యాలను పెట్టుకోవడం నేరం’ అంటారు డా॥ అబ్దుల్‌ కలాం. ‘కలలు కనండి- సాకారం చేసుకోండి’ అని కూడా అన్నారు. ఈ కలలు నిద్రలో వచ్చేవికావు. నిద్ర పోనివ్వకుండా స్ఫూర్తి కలిగించేవన్నమాట. ఈ వూహనే ‘విజువలైజేషన్‌’ అంటారు.
క్రియేటివ్‌ విజువలైజేషన్‌- అనేది ఒక చక్కటి మానసిక వ్యాయామంలాంటిది. ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్‌ ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టైన్‌ ‘వూహ’ గురించి చెప్పిన మాటలను పరిశీలిద్దాం. ‘వూహ అనేది రాబోయే రోజుల్లో వచ్చే గొప్ప ఫలితాలను దృశ్యరూపంలో చూడటమే’ అన్నారు. నిజమే! విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించి వారికి రాబోయే గొప్ప ఫలితాలను దృశ్యరూపంలో చూసే మానసిక వ్యాయామాన్ని చేస్తూవుంటే నిత్యస్ఫూర్తి ఆరని దీపంలా వెలుగుతూనే వుంటుంది.
* ‘ఉన్నదానితో తృప్తి పడాలి’ అన్నట్లు అల్ప సంతోషిలా ఉండకుండా పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టి అనుదిన ప్రేరణతో కృషి చెయ్యాలి.
* నిత్య స్ఫూర్తికి మరొక పద్ధతి వుంది. దీనిని 'COLLAGE'అంటారు. దీనికి అర్థం.. ఫొటోలు, క్లిపింగ్స్‌తో వున్న పుస్తకం. మన జీవిత లక్ష్యాలను ఫొటోల రూపంలోనూ, రాతపూర్వకంగానూ తయారుచేసుకుని ఒక పుస్తకాన్ని పొందుపరచుకోవాలి. ఈ పుస్తకాన్ని వీలయినన్నిసార్లు చూడడం ద్వారా మనసులో ప్రేరణ కలిగించుకుంటూ తగిన ప్రేరణ పొందుతుండాలి.
* ఈమధ్యకాలంలో ఒక కొత్త ఆలోచనా విధానమొకటి ప్రాచుర్యంలోకొచ్చింది. దానిని QUESTION THINKINGఅంటారు. అంటే విద్యార్థులు వారిని వారు ప్రశ్నించుకునే విధానం అన్నమాట. ఇందులో రెండు రకాలుంటాయి. మొదటిది Judger Thinking. రెండోది Learner Thinking.
మొదటిరకంలో విద్యార్థి/ వ్యక్తి తనను తాను సమర్థించుకునే ధోరణిలో ఆలోచిస్తాడు. దీనివల్ల విద్యార్థికి ఎటువంటి లాభం కలగదు. అంతేకాదు... తనపై తనకు జాలి కలిగే పరిస్థితి కలుగుతుంది. వేరేవారి సానుభూతి గురించి వెంపర్లాడే గుణం పెరుగుతుంది. కనుక మొదటిరకం థింకింగ్‌ నుంచి రెండో రకమైన Learner Thinking లోకి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా ఆరోగ్యమైన పద్ధతి.
ఈ ఆలోచనా ప్రక్రియ విధానంలో ‘నాకు కలిగిన అనుభవం ఏంటి?’, ‘నా సమస్య ఏంటి?’, ‘ఇపుడు నేనేం చెయ్యాలి?’ అని నేర్చుకునే ధోరణిలో ప్రశ్నించుకుంటూ, పరిష్కార మార్గాలను వెతుక్కుంటే సమస్యలను పరిష్కరించడం అలవాటవుతుంది. ఈవిధంగా చక్కటి అనుభవాన్ని సంపాదించి, తనను తాను అభినందించుకుంటూ ముందడుగు వేయవచ్చు.
* విజయాన్ని పొందిన వ్యక్తుల ద్వారా, ప్రసంగాల ద్వారా, పుస్తకాల ద్వారా వివరాలను తెలుసుకుంటూ ప్రభావితమవుతూ ఉండాలి. ప్రసంగాలకు ప్రత్యేకంగా వెళ్ళనవసరంలేదు. ఇంటర్నెట్‌లో ఎన్నో ఆడియో, వీడియో ప్రసంగాలను పొందవచ్చు. ఆడియో ప్రోగ్రాంలను మొబైల్‌ ఫోన్‌ ద్వారా వింటూ ఎంతో ప్రేరణ పొందవచ్చు.
* ప్రభావశీలురైన వ్యక్తుల ఫొటోలు, సందేశాలను పోస్టర్లుగా తయారుచేసుకుని, సులువుగా కనిపించేలాగ ఏర్పాటు చేసుకుని, వాటిని గమనిస్తూండాలి.
* నిరుత్సాహపరిచే వ్యక్తులకు దూరంగా వుండాలి. ఎంత పెద్ద నీళ్ళ టాంకునైనా ఒక చిన్న రంధ్రం ఖాళీ చెయ్యగలరు. అలాగే ప్రేరణ తగ్గించే వ్యక్తులెవ్వరైనా సరే... వారికి దూరంగా వుండండి.
ఈ ప్రపంచంలో ప్రతిదీ రెండుసార్లు సృష్టి అవుతుందంటారు విజ్ఞులు. మొదటిసారి వూహలో, రెండోసారి వాస్తవం లేదా భౌతిక రూపంలో. ఈ రెండు దశల మధ్యలో వూహకు రూపాన్నిచ్చే ‘ప్రయత్నం’ అనే ఆచరణ వుంటుంది. కనుక ప్రయత్నంలో లోపం లేకుండా విద్యార్థులు జాగ్రత్తపడాలి. ప్రేరణకు తగ్గట్టు ప్రయత్నాన్ని ఆచరణలో పెట్టాలి. అశ్రద్ధ చెయ్యకూడదు. ప్రేరణ, ఆచరణ అనే ఈ రెండింటినీ విరామం లేకుండా చేస్తే విద్యార్థులు విజయాన్ని సాధించగలరు.
విరామం లేకుండా సైకిల్‌ తొక్కుతూ వుంటే లక్ష్యదిశలో ప్రయాణం ముందుకు సాగుతూనే వుంటుంది. ఎప్పుడైతే సైకిల్‌ను తొక్కడం ఆపేసేమో అప్పుడు సైకిల్‌ ఏదో ఒక పక్కకు పడిపోతుంది. పడిపోకుండా వుండాలంటే గమ్యం చేరేవరకు సైకిల్‌ను తొక్కుతూనే వుండాలి. అలాగే కేవలం ప్రేరణ పొందటంతోనే సరిపెట్టుకోకుండా ఆచరణలో పెట్టి గమ్యం చేరేవరకు ప్రయత్నాన్ని కొనసాగించాలి.
ఉదయం లేచినది మొదలు రాత్రి నిద్రపోయే సమయం వరకు స్ఫూర్తి కలిగించే విషయాల గురించి ఆలోచిస్తూ ఆచరణలో పెట్టి కృషి చేయాలి. వచ్చిన ఫలితాలకు అభినందించుకుంటూ సానుకూల దృక్పథంతో వుండాలి. ఇది విజయాలు సాధించినవారి అనుభవం. పాటించి చూడండి- ఫలితాలు పొందండి!

Back..

Posted on 05-01-.2016