Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
‘పెండింగ్‌’ పరిష్కారానికి పీజీ డిప్లొమాలు

లక్షల్లో పెరిగిపోతున్న కోర్టుకేసుల సంఖ్యను తగ్గించి, సత్వర న్యాయం అందించటానికి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గం ఉపయోగపడుతోంది. దీనిలో ఏడాది కాలపు పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేస్తే చక్కటి అవకాశాలుంటాయి. 1995లో స్థాపితమైన ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆల్టర్నేటివ్‌ డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్‌ (ఐసీఏడీఆర్‌) న్యాయ మంత్రిత్వశాఖ పరిధిలోనిది. ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. 1998లో ఐసీఏడీఆర్‌ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభమైంది. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఏడీఆర్‌) విధానాలకు విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఇది ఏర్పడింది.
ఇప్పటివరకూ ఈ సంస్థ ద్వారా ఏడీఆర్‌, ఎఫ్‌డీఆర్‌ల్లో సుమారు 1500 మంది పీజీ డిప్లొమా చేశారు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకూ 18 జిల్లాల నుంచి 670 మంది జడ్జిలు, 690 మంది న్యాయవాదులు శిక్షణ పొందారు. వివాదాలను వేగంగా, సమర్థంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన భారత న్యాయస్థానాలు వివాదాల పరిష్కారంలో వేగంగా తక్కువ ఖర్చుతో ఫలితాన్ని రాబట్టడానికి ఏడీఆర్‌ ఉపయోగించుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఏడీఆర్‌ పద్ధతులు వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమలు, భవన నిర్మాణ కాంట్రాక్టులు, జాయింట్‌ వెంచర్లు, బీమా, ప్రమాద వాదనలు, భాగస్వామ్యాలు, ఆస్తి, వివాహాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఉపయోగిస్తారు.
కోర్సుల వివరాలు
ఐసీఏడీఆర్‌- హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం, నల్సార్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏడాది కాలవ్యవధి గల డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నాయి. వీటిని దూరవిద్య ద్వారా అభ్యసించవచ్చు.
1. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ ఆల్టర్నేటివ్‌ డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్‌
కాలవ్యవధి- ఏడాది, అర్హత- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మూడేళ్ల డిగ్రీ ఉత్తీర్ణత
వయసు- వయసుతో నిమిత్తం లేదు. పదవీ విరమణ పొందిన వారు కూడా అర్హులే.
ఇందులో 5 పేపర్లుంటాయి.
ప్రాజెక్టు రిపోర్ట్‌ ఉంటుంది. ప్రాజెక్టుతోపాటు ప్రతి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది.
ప్రాస్పెక్టస్‌ ఖరీదు: రూ. 300, కోర్సు ఫీజు: రూ. 15,000
ఏడీఆర్‌ కాంటాక్టు తరగతులు: హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూదిల్లీ, కోల్‌కతాల్లో వారాంతంలో మూడురోజుల పాటు (సంవత్సరం కాలంలో) ఒకేసారి కాంటాక్టు తరగతులు జరుగుతాయి. విషయ నిపుణులు డిప్లొమా కోర్సు సిలబస్‌ కవర్‌ చేస్తూ అభ్యర్థులకు ఆచరణాత్మక అనుభవం కోసం సిమ్యులేషన్‌ ఎక్సర్‌సైజెస్‌ చేయిస్తారు.
2. పీజీ డిప్లొమా ఇన్‌ ఫామిలీ డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్‌
ఈ కోర్సును దూరవిద్య ద్వారా అభ్యసించవచ్చు.
కాలవ్యవధి- ఏడాది, అర్హత- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మూడేళ్ల డిగ్రీ ఉత్తీర్ణత
ఇందులో ఆరు పేపర్లుంటాయి.
ప్రాజెక్టు ఉంటుంది. ప్రాజెక్టుతోపాటు ప్రతి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది.
వయసు- వయసుతో నిమిత్తం లేదు. పదవీ విరమణ చేసినవారు కూడా చేయవచ్చు.
ప్రాస్పెక్టస్‌ ఖరీదు: రూ. 300, కోర్సు ఫీజు: రూ.10,000
ఎఫ్‌డీఆర్‌ కాంటాక్ట్‌ తరగతులు: కాంటాక్ట్‌ తరగతులు నోటిఫై తేదీల్లో వారాంతాల్లో మూడు రోజులపాటు (ఒక సంవత్సరంలో రెండు దఫాలు) అన్ని మెట్రో నగరాల్లో, నిర్దిష్ట కేంద్రం నుంచి 30-35 అభ్యర్థుల కనీస నమోదుకు లోబడి జరుగుతాయి.
రెండు డిప్లొమాలకూ మార్కులను కాంటాక్ట్‌ తరగతుల్లో అభ్యర్థుల హాజరు తీరుపై కేటాయిస్తారు. కోర్స్‌- ఎండ్‌ రాతపరీక్ష నిర్దేశిత కేంద్రాల వద్ద జరుగుతుంది.
టీచింగ్‌ మెథడాలజీ: ప్రతి పేపర్‌కి సంబంధించి నిపుణులు తయారు చేసిన స్టడీ మెటీరియల్‌, డిప్లొమా కోర్సు కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులకు జారీ చేస్తారు. ప్రతి పేపర్‌లో ప్రశ్నపత్రాలు (మార్కులు- 20) అభ్యర్థులకు పోస్టులో పంపుతారు. అభ్యర్థులు స్టడీ మెటీరియల్‌ నుంచి, ఇతర వనరుల నుంచి కాపీ చేయకుండా సొంతంగా వారి చేతిరాత ద్వారా ప్రశ్నలకు సమాధానం రాసి మూల్యాంకనం కోసం ఐసీఏడీఆర్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపాలి.
దరఖాస్తులు ఇలా...
డిమాండ్‌ డ్రాఫ్ట్‌ పే ఆర్డర్‌ రూ. 300 పంపి ప్రాస్పెక్టస్‌, దరఖాస్తు ఫారాలు పొందవచ్చునని ఐసీఏడీఆర్‌ సెక్రటరీ జేఎల్‌ఎన్‌ మూర్తి తెలిపారు.
* చిరునామా: సెక్రటరీ, ఐసీఏడీఆర్‌, రీజనల్‌ సెంటర్‌, టెన్త్‌ ఫ్లోర్‌, గగన్‌ విహార్‌ బిల్డింగ్‌, గాంధీ భవన్‌ ఎదురుగా, ఎంజే రోడ్‌, నాంపల్లి, హైదరాబాద్‌- 500001
* దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబరు 15.
* ఫోన్‌: 040-24745165
* ఈ-మెయిల్‌: icadr.hyd@nic.in
* వెబ్‌సైట్‌: http://icadr.ap.nic.in


Back..

Posted on 22-08-2016