Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
జ్ఞాన సాధన... లక్ష్య ఛేదన

* ఒత్తిడిని జయిస్తే ‘పది’లమైన ఫలితాలు
* అంశాల సాధన.. విశ్లేషణతో ప్రయోజనాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి విద్యార్థి జీవితంలో పదోతరగతి పరీక్షలు చాలా కీలకం.. భవితను నిర్దేశించేది, లక్ష్యాలకు దిక్సూచిగా నిలిచేది ఈ ఘట్టమే. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానం(సీసీఈ) ఇప్పటికే విద్యార్థులకు పరిచయమైనప్పటికీ ఈసారి మరింత జాగురూకతతో వ్యవహరిస్తున్నారు. గతం కంటే అధికంగా ఉత్తీర్ణత శాతం పెంచేందుకు యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టిసారించింది. ఇక మూడునెలలే ఉన్నందున ఎటువంటి ఒత్తిడి దరిచేరనీయకుండా అంశాలవారీగా ప్రణాళికతో ముందుకు సాగడం ద్వారా ‘పది’ సంగ్రహణాత్మక మూల్యాంకనం-2లో అత్యుత్తమ ఫలితాలు సాధించొచ్చు. ఆంగ్లం, భౌతిక రసాయన, సాంఘిక, జీవ శాస్త్రాలు, తెలుగు, గణితంపై పట్టు ఎలా సాధించవచ్చో ఆయా సబ్జెక్టు నిపుణులు ‘ఈనాడు’లో నిన్న వివరించిన విషయం తెలిసిందే. విద్యార్థులు తీసుకోవాల్సిన ఆహారం.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి అందాల్సిన తోడ్పాటు.. జ్ఞాపకశక్తిని పదిలపర్చుకోవడం వంటి అంశాలపై నిపుణులందించిన మరిన్ని సూచనలు ఇలా ఉన్నాయి.
గత ఏడాది నుంచి పరీక్షల సంస్కరణలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రశ్నాపత్రాల సరళి మారిపోయింది. ప్రశ్నలు ఆయా సబ్జెక్టులకు చెందిన సామర్థ్యాల ఆధారంగా ఉంటాయి. ఇవి పిల్లల్ని ఆలోచింపజేసేలా, దైనందిన జీవితానికి అన్వయించేలా, నేర్చుకున్న భావనల్ని, సూత్రాల్ని, విషయాల్ని నూతన సందర్భాల్లో స్వీకరించేలా, స్వీయ అనుభవాలను వెల్లడించేలా, విశ్లేషణాత్మక రీతిలో ప్రశ్నలుంటాయి విద్యార్థుల్ని సన్నద్ధుల్ని చేయడానికి ఈ మూడు నెలల కాలంలో ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల పాత్ర కీలకం.
ఉపాధ్యాయులు: నిర్మాణాత్మక మూల్యాంకనంలోని అంశాల్లో పిల్లలు సొంతంగా రాసిన అంశాలను విశ్లేషించాలి. రాతపనుల్లో భాగంగా ప్రతీ పాఠంలోని ప్రశ్నలను పిల్లలు సొంతంగా జవాబు రాసిన తీరును అంచనా వేయాలి. పిల్లలు ఏం రాయలేకపోతున్నారో గుర్తించి, వాటిని విరివిగా సాధన చేయించాలి.
* భాషా విషయాల్లో పుస్తక సమీక్షలు రాయించడం వల్ల విద్యార్థులకు పఠనావగాహన సామర్థ్యాన్ని పెంచొచ్చు. వీలైనంత వరకు అపరిచిత అంశాలను చదివించి, సొంతంగా రాయించడం అభ్యాసం చేయించాలి.
* భాషేతర సబ్జెక్టుల్లో వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ఆయా పాఠాలవారీగా ఆలోచింపజేసే ప్రశ్నలను ఇస్తూ అభ్యాసం కల్పిస్తే సమస్యని అధిగమింపజేయొచ్చు.
* మూడో నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల ప్రగతిని విశ్లేషించడం ద్వారా ఏ సామర్థ్యంలో వెనకబడ్డారో గుర్తించొచ్చు. జవాబులు రాసే తీరును అంచనా వేయొచ్చు. దీని ఆధారంగా నాలుగో నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని సరిగ్గా నిర్వహిస్తే విద్యార్థులకు సరైన అభ్యాసం లభిస్తుంది.
* లఘు పరీక్షలో విద్యార్థులు ఆలోచించి రాయడానికి అనువైన ప్రశ్నలివ్వాలి. పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలను ఇవ్వకూడదు. తద్వారా పబ్లిక్‌ పరీక్షల్లో వచ్చే ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకోగలుగుతారు.
* గైడ్లు, స్టడీ మెటీరియళ్లు లేదా నమూనా ప్రశ్నాపత్రాల్లో ప్రశ్నలను చదివించడం, బట్టీ పట్టించడం చేయకూడదు. పిల్లలే సొంతంగా రాసేలా ప్రోత్సహించాలి.
* పబ్లిక్‌ పరీక్షల వరకు ఉన్న పని దినాలను లెక్కించి ఒక్కో సబ్జెక్టులో కల్పించాల్సిన అభ్యాసంపై ప్రణాళిక చేసుకోవాలి. ఒక పాఠానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో విభజించుకొని ఆలోచింపజేసే ప్రశ్నలకు జవాబులు రాయించాలి. వాటి గుణదోషాలను అర్థం చేయించాలి.
* విద్యార్థులు ఇంటి వద్ద వీలైనంత మేరకు చదువుకునేలా అభ్యాసాలు ఇవ్వాలి. చూసి రాసేలా, కాపీ చేసేలా రాతపనులు ఇవ్వకూడదు.
* తల్లిదండ్రులు: నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లలు సొంతంగా రాశారా? గైడ్లు, స్టడీ మెటీరియళ్లు వంటివి చూసి రాశారా? తెలుసుకోవాలి. మొదటి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పిల్లల ప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చించాలి.
* ఇంటి వద్ద పిల్లలు అదే పనిగా రాయడం కాకుండా పాఠ్య పుస్తకాలను చదివేలా చూడాలి. పాఠాల మధ్యలోని బాక్సు ప్రశ్నలను అర్థం చేసుకోగలుగుతున్నారా? పరీక్షించాలి.
* పాఠశాల యాజమాన్యం పిల్లలతో బట్టీ పట్టించడం వంటి పనులను పురమాయిస్తే అలా చేయకుండా ఉండేలా యాజమాన్యంతో చర్చించాలి.
* సిలబస్‌ పూర్తయ్యాక విద్యార్థులను జట్లుగా చేసి ఒక్కో పాఠాన్ని కూలంకషంగా చదివి చర్చించమనాలి. పాఠం ఆధారంగా ఆలోచింపజేసే ప్రశ్నలను పిల్లలనే రూపొందించమనాలి. ఒక జట్టు రూపొందించిన ప్రశ్నలను మరో జట్టుకు ఇచ్చి జవాబులు రాయించి చర్చకు పెట్టించాలి.
సమతుల ఆహారంతోనే
సాధారణంగా పరీక్షల సన్నద్ధ సమయంలో విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కనబరుస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒత్తిడి వల్ల వేళకు అవసరమైన ఆహారం తీసుకోరు. ఇక్కడే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఈ పద్ధతి అసలే మంచిది కాదు. ఉదయం అల్పాహారం నుంచి మొదలుకొని రాత్రి భోజనం వరకు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
* మధ్యాహ్న భోజనాన్ని ఎక్కువగా తీసుకుంటే నిద్ర వచ్చే అవకాశముంటుంది. తక్కువ తిన్నా ఎక్కువ శక్తినిచ్చే తాజా పండ్లు, ఉడికించిన కోడిగుడ్డు, సలాడ్స్‌, ఎండు ఫలాలను మధ్యమధ్యలో తింటూ ఉండాలి.
* ప్రొటీన్లను అందించే రాజ్‌మా, పప్పులు, చికెన్‌, చేపలు, కోడిగుడ్లు ఆహారంలో తీసుకోవాలి. ఈ రకంగా ప్రొటీన్‌ సప్లిమెంట్‌ను అందించడం ద్వారా నరాలు ఉత్తేజితమై నీరసం, నిస్సత్తువ లేకుండా ఉండగలుగుతారు. చదివింది మెదడుకు చేరేందుకు వీలుంది. బీకాంప్లెక్స్‌, విటమిన్‌ సి, జింక్‌ వంటి యాంటీఆక్సిడెంట్లను శరీరానికి అందించే ఆకుకూరలు, బొప్పాయి, తాజా కూరగాయలు తీసుకోవాలి.
* తగుపాళ్లలో మంచి నీరు తీసుకోవడం కీలకం. మనం తాగే నీటిలో అధిక శాతం మెదడే తీసుకుంటుంది. దానికి నిరంతరం సరఫరా ఉండటం ముఖ్యం. రెండు గంటలకు ఒక గ్లాస్‌ చొప్పున నీరు, మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లలో ఏదో ఒకదానిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
* తీపి ఎక్కువగా ఉండే చాకొలెట్‌ పానీయాలు, కుకీస్‌ తీసుకోవద్దు. వాటిని ఎక్కువగా తీసుకుంటూ తగ్గించడం వల్ల చక్కెర నిల్వల స్థాయిలో హెచ్చు తగ్గులు వచ్చి కళ్లు తిరుగుతూ ఏకాగ్రత ఉండదు.
* కాఫీలు ఎంత తగ్గిస్తే అంత మంచిది. వీటిని సేవించడం వల్ల హృదయ స్పందన శాతం గణనీయంగా పెరిగి ఆందోళనను రేకెత్తిస్తుంది.
* జ్ఞాపక శక్తిని పెంచడానికి, మెదడును పదును పెట్టేందుకు కోడిగుడ్లు, చేపలు, క్యారెట్‌లను తరచూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అందించే అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజెలతోపాటు నువ్వుల్ని రోజూ చెంచాడు తీసుకోవాలి.
* యథాప్రకారం జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండడం ఉత్తమం.
* అల్పాహారాన్ని వదిలేయడం సరికాదు. అలా చేయడం వల్ల చదువుపై ఏకాగ్రత ఉండదు. అందుకే ఉదయం వేళ అన్ని రకాల తృణ ధాన్యాలతో కూడిన ఓట్స్‌, చపాతీ, రోటీ తీసుకోవాలి.
బొమ్మల భాషతోనే మెదడుకు మేత
పరీక్షల సమయంలో చదవడం వరకు ఎంత కష్టపడినా సులువుగా గుర్తుంచుకునే మెళకువల్ని ఆకళింపు చేసుకోవడం.. చదివిన వాటిని గుర్తుంచుకోవడం కీలకం. డిసెంబరులో దాదాపు అన్ని పాఠశాలల్లో సిలబస్‌ పూర్తి కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు పునశ్చరణ తరగతులు ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠ్యాంశాల్లో ఏమైనా సందేహాలుంటే వాటిని అడిగి తెలుసుకునేందుకు మంచి అవకాశమని నిపుణుడు జయసింహా చెబుతున్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారంటే..
* కంప్యూటర్‌కి బైనరీ భాష ఉన్నట్లే.. మెదడుకు బొమ్మల భాష ఉంటుంది. ఆ భాషలో చెబితేనే సులభంగా ఆకళింపు చేసుకుంటుంది. టీవీలో సీరియల్స్‌ చూస్తే చాలా కాలం గుర్తుంటుంది. అందుకే పుస్తకాల్లోని అక్షరాలకు బొమ్మల రూపంలో వూహించుకుంటే మెదడు ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటుంది. సంఖ్యలను బాగా గుర్తు పెట్టుకోవాలంటే ఫొనెటిక్‌ పద్ధతిని ఆశ్రయించాలి.
* తెల్లవారుజామున లేచి చదివితే మెదడుకెక్కుతుంది అనేది అపోహ మాత్రమే. ఎవరికైనా సరే ఓ సమయం(పీక్‌ టైమ్‌)లో చదివితే ఏకాగ్రత బాగా ఉంటుంది. వారం రోజులపాటు పరీక్షించి ఆ సమయమేదో గుర్తించి అదే సమయంలో మెదడుకు పదును పెడితే ప్రయోజనం.. అలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ చదవడానికి ఆస్కారముంటుంది.
* పరీక్షల సమయం కాబట్టి ముందస్తు ప్రణాళిక ముఖ్యం. మొదటి ఆదివారం మూడు సబ్జెక్టులు, మరుసటి ఆదివారం మిగిలిన మూడు సబ్జెక్టులను ఎంచుకొని పునశ్చరణ చేసుకోవాలి.
* ప్రతీ విద్యార్థికి పదో తరగతే మలుపు తిప్పేది. ఈ విషయాన్ని పదేపదే గుర్తు చేసుకుంటే చదవాలనే తపన పుడుతుంది. అందుకే ఈ సమయంలో సినిమాలు, షికార్లు, పర్యటనలకు స్వస్తి పలకాలి. పరీక్షలయ్యాక ఇంటర్‌ తరగతులు ప్రారంభానికి రెండు నెలల గడువుంటుంది కాబట్టి ఆ సమయంలో ఇటువంటివి ప్లాన్‌ చేసుకోవచ్చు.
* పాఠశాలలో మార్కులు ఎక్కువగా సాధించే విద్యార్థులతో స్నేహం చేయాలి. వారి సహచర్యంలో గడిపితే చదవాలనే జిజ్ఞాస పడుతుంది.
* రోజుకు 10-15 నిమిషాలు యోగా, ధ్యానం చేయడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఆటలాడటం ముఖ్యం. అలా శారీరక శ్రమ చేస్తే ఆరోగ్యంగా ఉండి మెదడు చురుగ్గా పని చేస్తుంది.
* పరీక్షల సన్నద్ధ సమయంలో రెండు వైపులా మెదడుకు పని కల్పించడం ముఖ్యం. ఎడమ భాగానికి విశ్లేషణాత్మకంగా ఆలోచించే శక్తి ఉంటుంది కాబట్టి విషయాన్ని విశ్లేషించుకోవచ్చు. కుడి భాగానికి వూహించే గుణముంటుంది కనుక సృజన జోడించుకునేందుకు ఆస్కారముంది.
* ఆత్మవిశ్వాసం ముఖ్యం. గొప్ప మార్కులు తెచ్చుకోవాలనే సంకల్పాన్ని కలిగి ఉంటే తప్పనిసరిగా విజయం తథ్యం.
* విద్యా సంవత్సరం ఆరంభమయ్యాక ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడొద్దు. ప్రస్తుతమున్న సమయంలో మంచి ప్రణాళికతో కష్టపడి చదివినా రికార్డు మార్కుల్ని సొంతం చేసుకోవడం గగనం కాదు.

Posted on 18-12-.2015