Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మీ పాఠం... మీ మాటల్లోనే!

     ముఖ్యమైన పాఠ్యాంశాలను సొంత గొంతుతో రికార్డు చేసుకుని వినటం గురించి మీకు తెలుసా? ఇది పరీక్షల సమయంలో పునశ్చరణకు తోడ్పడుతుంది. గంటల తరబడి సన్నద్ధమయ్యే ఈ తరుణంలో ఈ ప్రక్రియ విసుగును కూడా దూరం చేసి చదివే అంశాలపట్ల ఆసక్తిని పెంచుతుంది.
చాలామంది విద్యార్థులు ఏడాది మొత్తం బాగా సన్నద్ధమై కూడా పరీక్షల్లో మంచి స్కోరు సాధించలేకపోతుంటారు. కొందరైతే సరిగా రాయటంలో విఫలమై మరోసారి అదే పరీక్షను హాజరవ్వాల్సివస్తుంటుంది.
ఇందుకు కారణాలేంటి?
* పరీక్షకు ముందు అనారోగ్యానికి గురవడం
* కుటుంబ సభ్యులు/ స్నేహితులతో గొడవ/ వాదన కారణంగా చదవాలనే కోరికను కోల్పోవడం
* పరీక్షా భయం
* సకాలంలో పునశ్చరణ చేయలేకపోవడం
* సరిగా పరీక్షకు ముందు కుటుంబ సభ్యుల/ బంధువుల/ స్నేహితుల పెళ్లిళ్ళు రావడం
ఈ కారణాలన్నీ పరీక్ష సన్నద్ధతకు ఆటంకాలుగా మారతాయి. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి? గుర్తుంచుకోవాల్సిన సమాచారాన్ని మీ సొంత గొంతుతో ఆడియో టేప్‌ల్లో రికార్డు చేసుకోవటం ఒక మంచి చిట్కా. కావాల్సినపుడు ఆ టేప్‌లను వినడం ద్వారా పునశ్చరణ సాధ్యమవుతుంది. ఎప్పుడూ చదవాలంటే విసుగ్గా అనిపిస్తుండొచ్చు, కానీ మీ సొంత గొంతును వినడంలో ఆ భావం దూరమవుతుంది.
ఆడియో ఎలా?
* ప్రతి సబ్జెక్టుకూ ప్రత్యేకంగా ఒక్కో క్యాసెట్‌ తయారుచేసుకోవాలి. క్యాసెట్‌ అనే కాదు; మొబైల్‌ ఫోన్లలోనూ రికార్డు చేసుకోవచ్చు. రికార్డు చేసినవాటిని ఎస్‌.డి. కార్డుల్లో సేవ్‌ చేసుకోవచ్చు.
* మీరు గుర్తుంచుకోవడానికి/ అర్థం చేసుకోవడానికి కష్టంగా భావించే ప్రశ్నలు/ పాయింట్లను రికార్డు చేసుకోండి.
* మీరు ఒంటరిగా ఉన్నపుడూ/ మిమ్మల్ని కదిలించేవాళ్లు లేనపుడూ రికార్డింగ్‌ చేయడం ప్రారంభించండి.
* రికార్డింగ్‌ నిమిత్తం ప్రశ్నలు, వాటి సమాధానాలను పెద్దగా చదవండి.
* చదివేటపుడు మైక్‌ను నోటికి 5- 8 సెం.మీ (2- 3 అంగుళాలు) దూరంగా ఉంచండి.
* ఈవిధంగా ప్రతి సబ్జెక్టుకూ ఆడియో తయారుచేసుకోండి. ప్రతీదానికి లేబుల్‌ వేసి దగ్గరపెట్టుకోండి.
ఉపయోగించడమెలా?
* ఆహారం తింటున్నపుడూ, నడుస్తున్నపుడూ, ప్రయాణిస్తున్నపుడూ, విశ్రాంతి తీసుకుంటున్నపుడూ కొంత సమయం కేటాయించి ఇయర్‌ఫోన్స్‌ సాయంతో/ అవి లేకుండా వింటూ పునశ్చరణ చేసుకోండి.
* జలుబు, జ్వరం, కంటి సంబంధ సమస్యలు వచ్చినపుడు చదువుకోవడం కష్టం. కానీ వినటానికి ఇబ్బందేమీ ఉండదు. రికార్డు చేసిన పాఠాలు విని నేర్చుకోవడం ఇలాంటప్పుడు సాధ్యం.
* ఇతర భాషల్లోని ప్రశ్నలు, సమాధానాలు, స్పెల్లింగ్‌ మొదలైనవాటిని రికార్డు చేసుకుని పదేపదే ఐదు నుంచి ఏడుసార్లు వినాలి. ఇలా చేస్తే అవి ఎప్పటికీ గుర్తుంటాయి.
* వ్యాకరణ సూత్రాలు, అర్థాలు, తేదీలు, సంఘటనలు, సారాంశం, సూత్రాలు, పదాల్లోని వాక్యాలను వేర్వేరు స్వరాల్లో రికార్డు చేసుకోవచ్చు. వాటిని మరింత ప్రభావవంతంగా హీరో, విలన్‌ తరహా స్వరాల్లోనూ చేసుకోవచ్చు. ఈవిధంగా చేయడం ద్వారా సమాచారం ఆసక్తికరంగా, గుర్తుంచుకోవడానికి తేలిగ్గా ఉంటుంది.
దీనిలో ఉన్న సూత్రం
చేతనావస్థలో ఉన్న మెదడులోని భాగమే భాష. ఏదైనా చదివినపుడు/ విన్నపుడు చేతనావస్థలో ఉన్న మెదడు చురుకుగా ఉంటుంది. అందువల్లనే సమాచారం స్వల్పకాలిక జ్ఞాపకం (షార్ట్‌ టర్మ్‌ మెమరీ)లో చేరుతుంది. కానీ, సొంత గొంతు విన్నపుడు మెదడు ఎలాంటి మినహాయింపులూ లేకుండానే దాన్ని స్వీకరిస్తుంది. ఇప్పుడు ఈ సమాచారం మెదడులోని దీర్ఘకాలిక జ్ఞాపకం (లాంగ్‌ టర్మ్‌ మెమరీ)లోకి చేరుకుంటుంది.

posted on 23.3.2015