Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొలువుల నిఘంటువు.. భాషాశాస్త్రం!

మాటల్లేని ప్రపంచాన్ని ఊహించగలమా! మాట అంటే భాషే. భూగోళం నిండా భాషలే. ప్రతి భాషకూ ఎన్నో మాండలికాలు. వాటి మధ్య మరెన్నో పోలికలు, భేదాలు. ఎవరైనా ఒక భాష నేర్చుకోవాలంటే శాస్త్రీయమైన మార్గాలు ఉండాలి. పదాల పుట్టుక, అభివృద్ధి, ఇతర భాషలతో ఉన్న సంబంధం తదితరాలు తెలియాలి. ఇలాంటి వాటన్నింటినీ అధ్యయనం చేసేదే భాషాశాస్త్రం (లింగ్విస్టిక్స్‌). ప్రతి రంగంలోనూ భాషా శాస్త్ర నిపుణుల అవసరం ఉంటోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి ఆధునిక సాంకేతిక టెక్నాలజీల వినియోగంలో కూడా లింగ్విస్టిక్స్‌ తెలిసినవారి అవసరం పెరుగుతోంది. అందుకే మనిషి ఉన్నంత వరకూ మాట ఉంటుంది. మాట ఉన్నంత కాలం భాష ఉంటుంది. భాష బతికినంత వరకూ ఈ ఉద్యోగాలూ ఉంటాయి.

మనం చిన్నప్పుడు అమ్మ నేర్పిన భాషనే నేర్చుకుంటాం. స్కూల్‌కి వెళ్లిన తర్వాత మరో రెండు మూడు భాషలు వస్తాయి. అయితే ఎప్పుడైనా వీటి మధ్య సారూప్యతను గమనించారా! అంత ఆలోచించి ఉండకపోవచ్చు. కాస్త గమనిస్తే భాషల మధ్య కొన్ని పోలికలు, తేడాలు కనిపిస్తాయి. అలా వాటిని అధ్యయనం చేయడానికి ఒక శాస్త్రం ఉంది. అదే భాషాశాస్త్రం (లింగ్విస్టిక్స్‌). ఇది భాషల్లోని భేదభావాలు, సారూప్యతలను తెలుసుకుని వాటికి అర్థాలను వివరిస్తుంది. ఇలా అధ్యయనాలు సాగించే వారినే భాషాశాస్త్రవేత్తలు అంటారు. ఇప్పుడు ఇదో మంచి కెరియర్‌గా వేగంగా ఎదుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్‌ రంగం వృద్ధి చెందుతుండటంతో భాషాశాస్త్రానికి డిమాండ్‌ పెరుగుతోంది. సునిశితంగా పరిశీలించే గుణం, కొత్త సంస్కృతి, సంప్రదాయాలను, భాషలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ రంగంలో స్థిరపడొచ్చు.

ప్రపంచం బహు భాషల నిలయం. ఒకరి భావాలను మరొకరితో పంచుకోవడానికి ఉపయోగపడే సాధనమే భాష. భాషకు సంబంధించి ఏ సందేహమొచ్చినా వెంటనే మనం డిక్షనరీ చూస్తాం. అయితే అందులోని పదాలకు అర్థాలను ఎవరు పొందుపరిచారు. ఆ శబ్దాలను పలికే విధానాన్ని ఎవరు మనకందించారు? విద్యార్థులుగా మనం చదివిన పాఠ్యపుస్తకాల్లోని భాషా విధానం ఒకేలా ఎందుకుంటుంది? మనం టీవీలో వార్తలు చూస్తుంటాం. వారి పదజాలం మన వాడుక భాషలా కాకుండా ఎందుకంత సౌమ్యంగా ఉంటుంది? ప్రపంచంలో ఇన్ని భాషలు ఎలా వచ్చాయి? మనందరికీ సుపరిచితమైన ఆంగ్లాన్ని ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఎందుకు ఉచ్చరిస్తారు? చాలా భాషల్లో మామా, పాపా, దాదా, నాన్న లాంటి ఎన్నో పదాల్లో సారూప్యత ఎందుకుంటుంది? భిన్న భాషలు, మాండలికాలకు మధ్య భేదమేమిటి? సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో సిబ్బందికి ప్రత్యేక భాషా ట్రెయినర్లు ఎందుకుంటారు? ఇలా అనేక సందేహాలకు సమాధానం భాషాశాస్త్రం. దీన్ని అధ్యయనం చేసేవారే భాషాశాస్త్రవేత్తలు.

శాస్త్రీయ అధ్యయనం
భాషాశాస్త్రం అనేది భాషకు సంబంధించిన శాస్త్రీయ పరిశీలన. దీన్ని ఆంగ్లంలో లింగ్విస్టిక్స్‌ అంటారు. ఒక భాష నిర్మాణం, దాని అభివృద్ధి, ఇతర భాషలతో ఉండే సంబంధాన్ని లింగ్విస్టిక్స్‌ తెలియజేస్తుంది. ఇందులో భాష, దాని ధ్వని, నిర్మాణం, అర్థం, క్రియల తీరు తదితరాలను అధ్యయనం చేస్తారు. భాషాశాస్త్రవేత్త భాషకు సంబంధించిన అన్ని అంశాలపై, ప్రపంచంలోని అన్ని భాషలపైనా ఆసక్తిని కలిగి ఉంటాడు. ప్రధానంగా సామాజిక వ్యవస్థ (సామాజిక ఆధార భాషాశాస్త్రం), భౌగోళిక ప్రాంతాలు (మాండలిక ఆధార భాషాశాస్త్రం), సమయ వ్యవధులు (చారిత్రక ఆధార భాషాశాస్త్రం), భాష - మనసు (మానసిక విశ్లేషణ)కు మధ్య సంబంధం ఇలా అనేక అంశాలను వీరు అధ్యయనం చేస్తారు.
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారెవరైనా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశపరీక్ష ఉత్తీర్ణులై ఎంఏ లింగ్విస్టిక్స్‌ చేయవచ్చు. కొన్ని విశ్వవిద్యాలయాలకు డిగ్రీలో 55శాతం మార్కులు తప్పనిసరి. ఆపై ఆసక్తి ఉంటే ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేసుకోవచ్చు. డిప్లొమాలు కూడా ఉన్నాయి.

కోర్సులు:
* డిప్లొమా కాలవ్యవధి సంవత్సరం. గుజరాత్‌, కర్ణాటక, ముంబయి తదితర విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
* ఎంఏ నాలుగు సెమిస్టర్లతో రెండు సంవత్సరాలు ఉంటుంది. ఇందులో వీరు ఫొనెటిక్స్‌, ఫొనాలజీ, సింటాక్స్‌, సిమాంటిక్స్‌, ప్రాగ్మాటిక్స్‌ గురించి అధ్యయనం చేస్తారు. ఇండో-యూరోపియన్‌, హిస్టారికల్‌, ఇండో-ఆర్యన్‌, సోషియో, అడ్వాన్స్‌డ్‌ ఇండో-యూరోపియన్‌, అప్లైడ్‌, కంప్యూటేషనల్‌ లింగ్విస్టిక్స్‌ మొదలైనవాటిలో స్పెషలైజేషన్‌లు ఉంటాయి.
జనవరి నెలాఖరు నుంచి మేలోపు అడ్మిషన్స్‌కు సంబంధించిన విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్లు విడుదలవుతాయి.

వివిధ పరిశ్రమల్లోనూ..!
సమర్థ భాషాశాస్త్రవేత్తలకు ఇటీవలి కాలంలో వివిధ పరిశ్రమల నుంచి డిమాండ్‌ పెరిగింది. ఎడ్యుకేషన్‌, పబ్లిషింగ్‌, మీడియా, సోషల్‌ సర్వీస్‌, కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ లాంగ్వేజెస్‌, వాయిస్‌ అనాలిసిస్‌ రిసర్చ్‌, కమ్యూనికేటివ్‌ డిజార్డర్స్‌ తదితరాలతోపాటు ఇతర భాషా సంబంధ రంగాల్లోనూ అనేక ఉద్యోగాలు ఉన్నాయి. ఇన్‌ఫర్మేషన్‌ సైన్సెస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, కమ్యూనికేషన్‌ సైన్సెస్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ల్లోనూ భాషాశాస్త్రవేత్తల పాత్ర పెరిగింది.
* బోధనా రంగంలో స్కూళ్లు, కాలేజీలు, ఫారన్‌ లాంగ్వేజెస్‌ ట్రెయినింగ్‌/టీచింగ్‌ ప్రోగ్రామ్స్‌ను అందించే వివిధ సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయి
* ప్రభుత్వ రంగంలో లాంగ్వేజ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌ పర్యవేక్షకులు, వివిధ భాషలపై పరిశోధకులు, మ్యాపింగ్‌కు సంబంధించిన నిపుణులుగా భాషాశాస్త్రవేత్తలకు అవకాశాలు లభిస్తున్నాయి..
* భాషా నిఘంటువుల, పాఠ్యపుస్తకాల ప్రచురణలో పదాల ఉచ్చారణ, వ్యాకరణ పదాల నిర్వచనం, వివిధ భాషల మాండలిక వైవిధ్యం, శబ్ద వ్యుత్పత్తి వంటి అంశాలకు సంబంధించి లెక్సికోగ్రాఫర్ల అవసరం ఉంటుంది.
* స్పీచ్‌ పాథాలజీ అండ్‌ ఆడియాలజీ విభాగాల్లో భాషాశాస్త్రవేత్తలకు భాషా సమస్యలను విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, మార్గాలను సూచించడం, పిల్లల భాష అభివృద్ధి, సమస్యలకు సంబంధించిన ఉద్యోగాలుంటాయి. ఈ మధ్యకాలంలో దీనికి డిమాండ్‌ పెరుగుతోంది.
* ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీల్లో క్రిమినల్‌ కేసులను పరిష్కరించడానికి ఫొనెటిక్స్‌ విభాగంలో భాషాశాస్త్రవేత్తలు సాయపడతారు.
* కాల్‌ సెంటర్లలో ట్రెయినింగ్‌ మాడ్యూల్స్‌ని తయారు చేయడంతోపాటు అక్కడి సిబ్బందికి ప్రొఫెషనల్‌ శిక్షణను ఇవ్వడంలోనూ కీలకపాత్ర పోషిస్తారు.
* సైంటిస్టులు, ఇంజినీర్లు, అకౌంటెంట్ల బృందాలతో కలసి పనిచేస్తారు. వారు చేసే సాంకేతిక రచనల (మాన్యువల్స్‌, ఇన్‌స్ట్రక్షనల్‌ మెటీరియల్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రిపోర్ట్స్‌)ను అందరికీ అర్థమయ్యేట్లు భాషాశాస్త్రవేత్తలు రూపొందిస్తారు.
* అనువాద అధ్యయనాలు భాషాశాస్త్రంలో ఒక భాగం కావడంతో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టార్‌లలో ట్రాన్స్‌లేటర్‌లుగా చేరవచ్చు.
* వీటితోపాటు బ్యాంకింగ్‌ అండ్‌ ఫినాన్స్‌ రంగంలో అక్కడి ఉన్నతాధికారులకు కస్టమర్స్‌తో భాషాసంబంధ విషయంలో సాయపడటానికి అవకాశాలు వస్తున్నాయి.

అందిస్తున్న సంస్థలు (బ్రాకెట్‌లో కోర్సులు)
* సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ (ఎంఏ లింగ్విస్టిక్స్‌, కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌)
* ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా ఇన్‌ అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌)
* హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, సెంటర్‌ ఫర్‌ అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, హైదరాబాద్‌ (ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఇన్‌ అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ సాంస్క్రిటిక్‌ కాంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌)
* ఐఐఐటీ, హైదరాబాద్‌ (ఎంఎస్‌ కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌, ఈ కోర్సుకు మాత్రం కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌/బీఈ తప్పనిసరి. ఎంఫిల్‌ ఇన్‌ కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌)
* ఐఐటీ - హైదరాబాద్‌ (ఎంఫిల్‌ ఇన్‌ లింగ్విస్టిక్స్‌)
* పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ (ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌),
* అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (బీఏ ఆనర్స్‌, ఎంఏ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా)
* కలకత్తా యూనివర్సిటీ (ఎంఏ, పీహెచ్‌డీ).
* డెక్కన్‌ కాలేజ్‌ పోస్ట్‌-గ్రాడ్యుయేట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ)
* డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ, మధ్యప్రదేశ్‌ (బీఏ, ఎంఏ, పీహెచ్‌డీ లింగ్విస్టిక్స్‌)
* ఐఐటీ కాన్పూర్‌ (పీహెచ్‌డీ)
* డాక్టర్‌ బీమ్‌రావు అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, ఆగ్రా (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ)
* జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయం (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ, డిప్లొమా)
* లఖ్‌నవూ విశ్వవిద్యాలయం (బీఏ, ఎంఏ, పీహెచ్‌డీ, డిప్లొమా)
* పంజాబ్‌ విశ్వవిద్యాలయం (ఎంఏ ఎంఫిల్, పీహెచ్‌డీ)
* తేజ్‌పూర్‌ విశ్వవిద్యాలయం (ఎంఏ లింగ్విస్టిక్స్‌ అండ్‌ ఎండేంజర్డ్‌ లాంగ్వేజ్, ఎంఏ లింగ్విస్టిక్స్‌ అండ్‌ లాంగ్వేజ్‌ టెక్నాలజీ, పీహెచ్‌డీ)
* మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్‌ బరోడా (బీఏ, ఎంఏ)
* దిల్లీ విశ్వవిద్యాలయం (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ, పోస్ట్‌ ఎంఏ డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌)
* కేరళ విశ్వవిద్యాలయం (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ) బీ మైసూరు విశ్వవిద్యాలయం (ఎంఏ, పీహెచ్‌డీ)
* జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూదిల్లీ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ)
* భారతీయార్‌ విశ్వవిద్యాలయం, తమిళనాడు (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ)
* అన్నామలై విశ్వవిద్యాలయం, అన్నామలై నగర్‌ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా ఇన్‌ లెక్సికోగ్రఫీ, కాంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్, ఫొనెటిక్స్‌)
* భారతదేశంలోని దాదాపు అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలూ లింగ్విస్టిక్స్‌లో ఎంఏ/ ఎంఫిల్‌/ పీహెచ్‌డీలను అందిస్తున్నాయి.

ఉద్యోగావకాశాలు
లింగ్విస్టిక్స్‌లో డిప్లొమా, ఎంఏ పూర్తిచేసినవారికి అడ్వర్‌టైజింగ్‌ ఇండస్ట్రీ, కాల్‌సెంటర్లు, ఆంథ్రోపొలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌, మైసూరు, సింథసిస్‌ ఆఫ్‌ స్పీచ్‌, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిందీ లాంగ్వేజ్‌, న్యూదిల్లీ, జర్నలిజమ్‌, న్యూస్‌ అండ్‌ మీడియా, చైల్డ్‌ లాంగ్వేజ్‌, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ సెంటర్స్‌, స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ థెరపీ సెంటర్స్‌లో ఉద్యోగావకాశాలుంటాయి. ఇందులో వీరు డిక్షనరీ కంపైలర్‌గా, ఎడిటర్‌, కాల్‌సెంటర్‌ స్పీచ్‌ ట్రెయినర్‌, లింగ్విస్ట్‌, న్యూరో లింగ్విస్ట్‌, ప్రూఫ్‌ రీడర్‌, హాస్పిటల్‌ స్పీచ్‌ థెరపిస్ట్‌, టీచర్‌గా పని చేయవచ్చు.
* ఎంఫిల్‌ వ్యవధి రెండేళ్లు. ఎంఏ లింగ్విస్టిక్స్‌ కనీసం 55%తో పూర్తి చేసినవారు అర్హులు. వీరు సోషియో లింగ్విస్టిక్స్‌, లాంగ్వేజ్‌ టీచింగ్‌ అండ్‌ టెస్టింగ్‌, లెక్సియోగ్రఫీ, సైకోలింగ్విస్టిక్స్‌, ఇండియన్‌ గ్రమాటికల్‌ ట్రెడిషన్‌ మొదలైన అంశాల గురించి అధ్యయనం చేస్తారు. ఇది చేసిన వారికి గవర్నమెంట్‌ డిపార్ట్‌మెంట్్స అండ్‌ ఏజెన్సీస్‌, విద్య-ఆరోగ్య సెక్టార్‌, ట్రావెల్‌ అండ్‌ టూరిజమ్‌, జర్నలిజమ్‌ అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ సంబంధ సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ అండ్‌ కంప్యుటేషనల్‌ కంపెనీలు, పబ్లిషింగ్‌ హౌసెస్‌, ఇంటర్‌ప్రిటింగ్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ సర్వీసెస్‌, లైబ్రరీ, బిజినెస్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, మీడియా అండ్‌ అడ్వర్‌టైజింగ్‌, ఇంటర్‌నేషనల్‌ ఆర్గనైజేషన్స్‌, మార్కెట్‌ రిసర్చ్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ కంపెనీలలో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇందులో వీరు టెక్నికల్‌ రైటర్‌, ఎడిటర్‌, కాపీరైటర్‌, లెక్సికోగ్రాఫర్‌లుగా విధులు నిర్వహిస్తారు.
* పీహెచ్‌డీ కాలవ్యవధి మూడేళ్లు. అయితే అయిదు నుంచి ఆరేళ్లలోపు పూర్తవుతుంది. ఎంఏ లింగ్విస్టిక్స్‌ తర్వాత ఎంఫిల్‌ కూడా విజయవంతంగా పూర్తిచేసినవారు విశ్వవిద్యాలయాలు నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణులై పీహెచ్‌డీ చేయవచ్చు. ఇందులో అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌, కంప్యూటేషనల్‌, సోషియో, థియరిటికల్‌ లింగ్విస్టిక్స్‌ గురించి అధ్యయనం చేస్తారు. పీహెచ్‌డీ చేసిన వారికి విద్యాసంస్థలు, డేటా కేంద్రాలు, న్యూస్‌ అండ్‌ మీడియా, ట్రాన్స్‌లేషన్‌ డిపార్ట్‌మెంట్స్‌, హియరింగ్‌ సెంటర్లలో ఉద్యోగాలు లభిస్తాయి. ఆడియాలజిస్ట్‌, కమ్యూనికేషన్‌ డిజార్డర్‌ స్పెషలిస్ట్‌, బ్రాడ్‌కాస్టర్‌ లేదా న్యూస్‌ రీడర్‌, కాపీ రైటర్‌, ఎడిటర్‌, టెక్నికల్‌ రైటర్‌, ట్రాన్స్‌లేటర్‌, పబ్లిషర్‌, ఇంటర్‌ప్రిటర్‌, లాంగ్వేజ్‌ ప్లానర్‌, టీచర్‌, లెక్సికోగ్రాఫర్‌, సైకోలింగ్విస్ట్‌, టూర్‌ ఆపరేటర్‌, రిసర్చర్‌గా చేరవచ్చు.

దేశాభివృద్ధిలోనూ...
ఆధునిక కాలంలో భాషాశాస్త్రం ప్రాధాన్యం పెరుగుతోంది. ఇష్టంగా చదివితే ఈ రంగంలో అవకాశాలు అపారం. ప్రస్తుతం మల్టీనేషనల్‌ కంపెనీలు, సీక్రెట్‌ ఏజెన్సీలు, కాల్‌సెంటర్‌లలో వీరి అవసరం ఎక్కువగా ఉంది. దేశాభివృద్ధిలోనూ వీరి పాత్ర అధికం. అంతరించిపోతున్న భాషలన్నీ సజీవంగా ఉండాలంటే భాషాశాస్త్రవేత్తల అవసరం ఎంతైనా ఉంది. ఆంగ్లేయుల కాలంలో భారతదేశంలో చేపట్టిన లింగ్విస్టిక్స్‌ సర్వేను మళ్లీ ప్రారంభించే అవకాశాలు ఉండటంతో భాషాశాస్త్రం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటోంది. దేశరాజకీయాలను ప్రభావితం చేయడంలో లింగ్విస్టిక్స్‌ పాత్ర చాలా ఉంది. ప్రపంచ దేశాల్లో అమెరికా అంత ఆధిపత్యాన్ని చెలాయించడానికి కారణం భాషాశాస్త్రవేత్తలను సద్వినియోగం చేసుకోవడమే.’
- మహ్మద్‌ అన్సారీ, హెడ్‌ అండ్‌ ఛైర్మన్‌ బీఓఎస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లింగ్విస్టిక్స్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం

Back..

Posted on 24-12-2018