Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
క్యాట్‌ లేకున్నా.. మేటి ఎంబీఏ

* మేనేజ్‌మెంట్‌ విద్యకు విభిన్న ప్రవేశపరీక్షలు

ఒక బిజినెస్‌ లేదా ఆఫీసు సక్రమంగా, సమర్థంగా సాగాలంటే మంచి నాయకత్వం కావాలి. ఆ నాయకులు వినూత్న ఆలోచనలు చేయగలగాలి, సృజనాత్మకత ప్రదర్శించాలి. దార్శనికత కలిగి ఉండాలి. అభ్యర్థుల్లో అలాంటి లక్షణాలను మేనేజ్‌మెంట్‌ విద్య పెంపొందిస్తుంది. అందుకే ఎప్పటికీ డిమాండ్‌ తరగని కెరియర్లలో ఒకటిగా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన కోర్సుల్లోకి ప్రవేశించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిలో క్యాట్‌ ముగిసింది. ఇంకొన్ని ఎంట్రన్స్‌లకు త్వరలో ప్రకటనలు రాబోతున్నాయి. వాటికి ఇప్పటి నుంచే సిద్ధమైతే మంచి ఫలితాలను అందుకోవచ్చు.

కార్పొరేట్‌ కలల ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరించే ఉద్యోగాల్లో మేనేజ్‌మెంట్‌ ప్రధానమైంది. ఆ కొలువులను అందుకోడానికి మొదటిదారి క్యాట్‌ (కామన్‌ అడ్మిషన టెస్ట్‌). ఇటీవల ఈ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో మంచి స్కోరు సాధించలేకపోయినా, దరఖాస్తు చేసుకోలేకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. దేశంలోని మరెన్నో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించడానికి ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకొని అభ్యర్థులు ప్రిపేర్‌ అయితే సీటు సాధించుకోవచ్చు. తమ మేనేజీరియల్‌ లక్ష్యాలను చేరుకోవచ్చు.

జీమ్యాట్‌ - దేశవిదేశాల్లో!
గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీమ్యాట్‌)ను గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌ (జీఎంఏసీ) నిర్వహిస్తోంది.
ప్రవేశాలు: ఈ స్కోరును దేశంలోని బీస్కూళ్లతోపాటు 114 దేశాల్లోని మేనేజ్‌మెంట్‌ సంస్థలూ అంగీకరిస్తున్నాయి. గ్రేట్‌ లేక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, చెన్నై; ఎంఐసీఏ, అహ్మదాబాద్‌; అదానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌; ఐఎస్‌బీఎఫ్‌, దిల్లీ; నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ మార్కెట్స్‌, ముంబయి వంటి ప్రముఖ సంస్థలతోపాటు ఐఐఎంలూ పీజీ ప్రోగ్రామ్‌ల కోసం జీమ్యాట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
నోటిఫికేషన్‌: ఏడాది పొడవునా ఈ పరీక్ష అందుబాటులో ఉంటుంది. సంవత్సరంలో 15 రోజుల వ్యవధితో అయిదుసార్లు రాసుకునే వీలుంది. ఈ స్కోరు అయిదేళ్లు చెల్లుబాటవుతుంది.
పరీక్ష విధానం: నాలుగు విభాగాలు- అనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, వెర్బల్‌ రీజనింగ్‌ల నుంచి మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. మొత్తం మార్కులు 800. ఆన్‌లైన్‌ పరీక్ష. విభాగాన్నిబట్టి కేటాయించిన సమయంలో మార్పులుంటాయి.
వెబ్‌సైట్‌: https://www.mba.com/

మ్యాట్‌ - ఏటా నాలుగుసార్లు
మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌)ను ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) నిర్వహిస్తోంది.
ప్రవేశాలు: దీనిద్వారా దేశవ్యాప్తంగా 600 బీస్కూళ్లలో ప్రవేశం లభిస్తుందని ఏఐఎంఏ చెబుతోంది. క్రైస్ట్‌ యూనివర్సిటీ, బెంగళూరు; ఫార్చ్యూన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌; ఫాస్టిమా బిజినెస్‌ స్కూలు; వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ; న్యూదిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అమిటీ మొదలైనవి ఈ స్కోరు ద్వారా ప్రవేశాలను కల్పిస్తున్నాయి.
నోటిఫికేషన్‌: దీనిని ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబరు, డిసెంబరు) నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: పేపర్‌ ఆధారితంగా, ఆన్‌లైన్‌లో రెండు విధాలుగా పరీక్ష జరుగుతుంది. అయిదు విభాగాలు- లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, మ్యాథమెటికల్‌ స్కిల్స్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ, ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ నుంచి ఎంసీక్యూ రూపంలో 200 ప్రశ్నలుంటాయి. రెండున్నర గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పుగా గుర్తించిన సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది.
వెబ్‌సైట్‌: https://mat.aima.in/feb20/

సీమ్యాట్‌ - ఎన్‌టీఏ ఆధ్వర్యంలో
కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీమ్యాట్‌)ను గత ఏడాది నుంచి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. ఇంతకుముందు ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) జరిపేది.
ప్రవేశాలు: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన 1000కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ స్కోరు ద్వారా ప్రవేశం పొందవచ్చు. గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, జేబీఐఎంఎస్‌, గేట్‌ లేక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎస్‌ఐఎంఎస్‌ఆర్‌ఈఈ మొదలైనవి ఈ స్కోరు ద్వారా ప్రవేశాలను కల్పిస్తున్న ప్రముఖ సంస్థల్లో కొన్ని.
నోటిఫికేషన్‌: ఏడాదికోసారి నిర్వహిస్తారు. ఏటా అక్టోబరు చివరి వారంలో నోటిఫికేషన్‌ విడుదలవుతుంది.
పరీక్ష విధానం: నాలుగు విభాగాలు- క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ల నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు. మొత్తం 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. తప్పుగా గుర్తించిన సమాధానానికి 1 మార్కు కోత ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 3 గంటలు.
వెబ్‌సైట్‌: https://cmat.nta.nic.in/webinfo/public/home.aspx

ఎన్‌మ్యాట్‌ - మూడు రీటెస్ట్‌లు
గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌ (జీఎంఏసీ) దీన్ని నిర్వహిస్తోంది.
ప్రవేశాలు కల్పించేవి: ఎన్‌ఎంఐఎంఎస్‌ విశ్వవిద్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా 40 ప్రముఖ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు ఈ స్కోరు ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వాటిలో నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు; ఎస్‌పీ జేఐఎంఆర్‌, ముంబయి; జేవియర్‌ యూనివర్సిటీ, భువనేశ్వర్‌; ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌, హైదరాబాద్‌; ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, చెన్నై, దిల్లీ ఎన్‌సీఆర్‌; గీతం స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, విశాఖపట్నం; అమిటీ యూనివర్సిటీ, దిల్లీ మొదలైనవి ప్రముఖమైనవి.
నోటిఫికేషన్‌: ఏడాదికోసారి నిర్వహిస్తారు. ఏటా జులైలో విడుదలవుతుంది.
పరీక్ష విధానం: ఇందులో అభ్యర్థులకు మూడు రీటెస్ట్‌లకు అవకాశం ఉంది. 75 రోజుల టెస్ట్‌ విండోలో దరఖాస్తు చేసుకుని, పరీక్ష రాసిన తర్వాత ఆ ప్రదర్శనతో సంతృప్తి చెందకపోతే 15 రోజుల వ్యవధిలో తిరిగి రాసుకునే వీలుంది. అలా మూడుసార్లు రాసుకోవచ్చు. మూడు విభాగాలు- లాంగ్వేజ్‌ స్కిల్స్‌, క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌, లాజికల్‌ రీజనింగ్‌ల నుంచి 120 ప్రశ్నలను 120 నిమిషాల్లో పూర్తిచేయాలి. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు.
వెబ్‌సైట్‌: https://www.nmat.org.in/

ఎస్‌ఎన్‌ఏపీ (శ్నాప్‌) - పదహారు అనుబంధ సంస్థలు
సింబయాసిస్‌ నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎస్‌ఎన్‌ఏపీ)ను సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ (డీమ్డ్‌) యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
ప్రవేశాలు: ఈ స్కోరు ద్వారా దీని పదహారు అనుబంధ సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
నోటిఫికేషన్‌: ఏడాదికోసారి జరుగుతుంది. ప్రకటన సాధారణంగా ఆగస్టులో విడుదలవుతుంది.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష. మూడు విభాగాలు- జనరల్‌ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌- డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ డేటా సఫిషియన్సీ, అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ల నుంచి 110 ప్రశ్నలు వస్తాయి. 105 ఎంసీక్యూతోపాటు 5 నాన్‌-ఎంసీక్యూ ప్రశ్నలూ ఉంటాయి. మొత్తం 150 మార్కులు. 0.25 రుణాత్మక మార్కులున్నాయి. పరీక్ష కాలవ్యవధి రెoడు గంటలు.
వెబ్‌సైట్‌: https://www.snaptest.org/

గ్జాట్‌ - ప్రతిష్ఠాత్మక ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలోకి!
జంషెడ్‌పూర్‌లో హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌ విద్యకు ప్రసిద్ధి చెందిన జేవియర్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) గ్జాట్‌ - ద జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తోంది.
ప్రవేశాలు: ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐతోపాటు దేశవ్యాప్తంగా 150కి పైగా ఇతర బీస్కూళ్లు ఈ స్కోరును అంగీకరిస్తున్నాయి. ఎస్‌పీ జైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ముంబయి; ఐఎంటీ, ఘజియాబాద్‌; ఎంఐసీఏ, అహ్మదాబాద్‌ మొదలైనవి వాటిలో కొన్ని.
నోటిఫికేషన్‌: ప్రకటన ఏటా ఆగస్టులో విడుదలవుతుంది. పరీక్ష జనవరిలో నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: కాన్సెప్చువల్‌ క్లారిటీ, డేటా అనలిటికల్‌ స్కిల్స్‌, వెర్బల్‌ ఎబిలిటీలపై పట్టు ఉన్నవారు సులువుగా అర్హత సాధించగలుగుతారు. ఇది ఆన్‌లైన్‌ పరీక్ష. రెండు పేపర్లుంటాయి. పేపర్‌-1లో వెర్బల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ల నుంచీ, పేపర్‌-2లో జనరల్‌ నాలెడ్జ్‌ నుంచీ మొత్తం 99 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. సరైన సమాధానానికి ఒక మార్కు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది. పేపర్‌-2కు నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. పరీక్ష వ్యవధి 3 గంటలు.
వెబ్‌సైట్‌: http://www.xatonline.in/per/g21/pub/2076/ASM/WebPortal/1/index.html

ఇవేకాకుండా.. ఏఐఎంఎస్‌ (అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్స్‌) టెస్ట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్స్‌ - ఏటీఎంఏ; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ - ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్‌; ఎంఐసీఏ, అహ్మదాబాద్‌- ఎంఐక్యాట్‌; ఇక్ఫాయ్‌ బిజినెస్‌స్కూల్‌- ఐబీశాట్‌; ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌ (ఐఆర్‌ఎంఏ)- ఐఆర్‌ఎంఏశాట్‌ వంటి ఎన్నో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు వివిధ రాష్ట్రాలు ప్రాంతీయ ప్రవేశపరీక్షలనూ నిర్వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్‌లకు ఫిబ్రవరి చివర, మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

Back..

Posted on 19-02-2020