Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రతిష్ఠాత్మక సంస్థల్లోకి పంచ మార్గాలు!

* మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌

* జాతీయ స్థాయి ప్రకటనలు విడుదల

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి జరిగే జాతీయస్థాయి పరీక్షల్లో కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీమ్యాట్‌) ఒకటి. ప్రధానంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల్లో, బీ-స్కూళ్లలో ఎంబీఏ లేదా పీజీడీఎం సీటు పొందడానికి ఈ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి ప్రకటన వెలువడింది. దీంతోపాటు జాట్‌ (జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌), మ్యాట్‌లకు, సింబయాసిస్‌, ఇక్ఫాయ్‌, ఎస్‌పీ జైన్‌ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అడ్మిషన్లకూ దరఖాస్తు గడువు ఉంది. మేనేజ్‌మెంట్‌ విభాగంలో వివిధ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఉమ్మడి ప్రిపరేషన్‌తో అయిదు పరీక్షలకు హాజరుకావచ్ఛు కోరుకున్న కోర్సులో సీటు సంపాదించుకోవచ్ఛు.

ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో వ్యాపార నిర్వహణ రోజురోజుకీ సంక్లిష్టంగా మారుతోంది. పెరుగుతున్న పోటీని తట్టుకొని మార్కెట్‌లో నిలబడాలంటే మేనేజ్‌మెంట్‌ విభాగాలు మరింత సమర్థంగా పనిచేయాలి. దీంతో రకరకాల నిర్వహణ నిపుణులకు డిమాండ్‌ ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు మేనేజ్‌మెంట్‌ విభాగంలో విభిన్న కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశం కోసం పలు రకాల పరీక్షలను నిర్వహిస్తున్నాయి. వరుసగా వెలువడుతున్న ఆ ప్రకటనలకు ఉమ్మడి సన్నద్ధత సాగిస్తే మెరుగైన ఫలితాలను పొందవచ్ఛు

ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి ఎన్నో పరీక్షలు ఉన్నప్పటికీ ప్రశ్నలడిగే విభాగాల్లో మాత్రం పెద్దగా వ్యత్యాసం ఉండదు. ప్రశ్నల స్థాయి (కాఠిన్యత)లో తేడాలుంటాయి. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, డెసిషన్‌ మేకింగ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌ ఇవి దాదాపు అన్ని పరీక్షల్లోనూ ఉండే అంశాలు. కొన్ని సంస్థలు నిర్వహించే మేనేజ్‌మెంట్‌ పరీక్షల్లో జనరల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ నాలెడ్జ్‌కూ ప్రాధాన్యం ఉంటుంది. కానీ తుది ఎంపికలో ఆ విభాగాల్లో సాధించిన స్కోరును పలు సంస్థలు పరిగణనలోకి తీసుకోవడం లేదు.

అభ్యర్థి రాయాలనుకుంటున్న పరీక్షకు సంబంధించి పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. దీనిద్వారా ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తాయి, అందుకు సరిపోయేలా సన్నద్ధం కావడం ఎలాగో తెలుసుకోవచ్ఛు క్యాట్‌, ఎక్స్‌ఏటీ, ఐఐఎఫ్‌టీ పరీక్షల్లో ప్రశ్నలు కఠినంగా ఉంటాయి. మ్యాట్‌, సీమ్యాట్‌ ప్రశ్నలు మధ్యస్థ స్థాయిలో ఇస్తారు. శ్నాప్‌, ఐబీశాట్‌ దాదాపు క్యాట్‌కు సమానంగా నిర్వహిస్తుంటారు. ఏ పరీక్ష రాస్తున్నప్పటికీ పదో తరగతి స్థాయిలో జనరల్‌ మ్యాథ్స్‌, జనరల్‌ ఇంగ్లిష్‌ అంశాలపై పట్టు తప్పనిసరి. వీలైనన్ని ఎక్కువ మాక్‌ పరీక్షలు రాయాలి. దీనిద్వారా వెనుకబడిన విభాగాలపై శ్రద్ధ పెట్టవచ్చు సమయపాలన అలవడుతుంది.

స్కోరు ఒక్కటే చాలదు!
జాతీయ స్థాయిలో నిర్వహించే ఎంబీఏ పరీక్షల్లో కేవలం రాత పరీక్షలో ప్రావీణ్యం సాధిస్తే సరిపోదు. అది రెండో దశకు చేరడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అనంతరం నిర్వహించే గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపిస్తేనే పేరున్న సంస్థల్లో ఎంబీఏ సీటు ఖాయమవుతుంది. సంస్థలవారీ పరీక్ష స్కోరు ప్రాధాన్యం మారుతుంది. కొన్ని సంస్థలు అకడమిక్‌ ప్రతిభ, పని అనుభవం, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌, ..తదితర అంశాలకు కొంత ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఏ సబ్జెక్టు ఎలా?
* అభ్యర్థి హాజరుకానున్న పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న అంశాలపై ముందుగా సిద్ధం కావాలి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌ ఎక్కువ పరీక్షల్లో ఉన్నాయి. క్వాంటిటేటివ్‌లో నంబర్‌ సిస్టమ్‌తోపాటు పర్సంటేజెస్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్‌, టైం అండ్‌ వర్క్‌, టైం అండ్‌ డిస్టెన్స్‌, ప్రాబబిలిటీ, పర్ముటేషన్‌- కాంబినేషన్‌ తదితర అరిథ్‌మెటిక్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. నంబర్‌ సిస్టమ్‌ కీలకం. బాడ్‌మాస్‌ ఆధారంగా ఉండే లెక్కలను నిత్యం సాధన చేయాలి. వర్గాలు, వర్గమూలాలు, వేగంగా గుణకారాలు, భాగహారాలు చేయగలిగే విధంగా సాధన చేయాలి. అరిథ్‌మెటిక్‌లో తార్కిక పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ముందుగా ప్రాథమికాంశాలను చదవాలి. ఆ తర్వాత మాక్‌ పరీక్షలు రాయాలి. దీనివల్ల కొన్ని సందర్భాల్లో లాజిక్‌ ద్వారా, ఎలాంటి సూక్ష్మీకరణ లేకుండా సమాధానం రాబట్టడం అలవాటవుతుంది. సాధన ద్వారా టెక్నిక్‌ల ప్రయోగం తేలికవుతుంది. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు నంబర్‌ సిస్టమ్‌ సూక్ష్మీకరణల ప్రాక్టీస్‌ ఉపయోగపడుతుంది.
* లాజికల్‌ రీజనింగ్‌లో పజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ రెండింటికీ సిద్ధం కావాలి. ర్యాంకింగ్‌, డైరెక్షన్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, సిలాజిజం నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి ప్రాథమికాంశాలు అంటూ ఏమీ ఉండవు. నేరుగా గత ప్రశ్నలను పరిశీలించాలి. మాదిరి పరీక్షలు రాయాలి.
* లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, వెర్బల్‌ ఎబిలిటీ ఇంగ్లిష్‌కు సంబంధించినవే. ఇందులో కాంప్రహెన్షన్‌ కీలకం. జాతీయ, అంతర్జాతీయ ఆంగ్ల దినపత్రికల్లో వచ్చే సంపాదకీయాలను చదువుతూ ప్రిపేర్‌కావాలి. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, తత్వం, ఆర్థికం తదితరాలు ఉండే సంపాదకీయాలను ఎంచుకోవాలి.కొత్త పదాలు, పదబంధాలు, సామెతలను ఎలా ఉపయోగిస్తున్నారో గమనించాలి. జంబుల్డ్‌ సెంటెన్సెస్‌ను నేరుగా సాధన చేయాలి. స్పాటింగ్‌ ఎర్రర్స్‌ కోసం గ్రామర్‌లో ప్రాథమికాంశాలను తెలుసుకోవాలి. వాక్య నిర్మాణం, భాషాభాగాల నియమాలపై పట్టు పెంచుకోవాలి.
* డెసిషన్‌ మేకింగ్‌లో అభ్యర్థుల నైతిక ప్రవర్తనను, భిన్న, సంక్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నను అర్థం చేసుకొని ఎందుకు అడిగారో అవగాహనకు రావాలి. సొంతంగా జవాబును కనుకున్న తర్వాత ఆప్షన్లను పరిశీలించాలి.
* జనరల్‌ అవేర్‌నెస్‌ను వర్తమాన అంశాల ఆధారంగా చదవాలి. జనరల్‌ నాలెడ్జ్‌లో చరిత్ర, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్‌ విభాగాల్లోని సాధారణాంశాలను అధ్యయనం చేయాలి. పాలిటీలో వివిధ పదవులు నిర్వహించిన తొలి వ్యక్తులు (రాష్ట్రపతి, ప్రధాని, కాగ్‌, ఎలక్షన్‌ కమిషనర్‌), ఆర్థిక రంగంలో వివిధ అంశాల కమిటీలు, ప్రణాళికలు, ప్రపంచంలో ఎత్తైనవి, లోతైనవి తదితర జీకే విశేషాలపై అవగాహన పెంచుకోవాలి.

ఇవీ ప్రవేశపరీక్షలు
సీమ్యాట్‌
కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌)ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది.ఈ స్కోరుతో దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి సంస్థల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్ఛు.
పరీక్ష విధానం: 400 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 30.
పరీక్ష తేదీ: జనవరి 28.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ పురుష అభ్యర్థులకు రూ.1600, మహిళలు, ఈడబ్ల్యుఎస్‌, ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు రూ.1000
వెబ్‌సైట్‌: https:// cmat.nta.nic.in

ఎక్స్‌ఏటీ
దేశంలో క్యాట్‌ తర్వాత ఆ స్థాయి పరీక్ష జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎక్స్‌ఏటీ). ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, జంషెడ్‌పూర్‌తోపాటు వివిధ జేవియర్‌ విద్యా సంస్థలు, వందకుపైగా ఇతర బీ స్కూళ్లు ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
పరీక్ష విధానం: వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 30.
పరీక్ష ఫీజు: రూ. 1700.
పరీక్ష తేదీ: జనవరి 5.
వెబ్‌సైట్‌: http://www.xatonline.in

ఐబీశాట్‌
ఇక్ఫాయ్‌ విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐబీశాట్‌ ప్రకటన వెలువడింది. దీని ద్వారా ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐబీఎస్‌), హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి, పుణె తదితర కేంద్రాల్లో ప్రవేశాలు లభిస్తాయి.
పరీక్ష విధానం: ఐబీశాట్‌ వ్యవధి 2 గంటలు. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, డేటా ఆడిక్వసీ, వొకాబులరీ, ఎనలిటికల్‌ రీజనింగ్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 12.
పరీక్ష తేదీలు: డిసెంబరు 21, 22.
వెబ్‌సైట్‌: https://www.ibsindia.org

శ్నాప్‌
సింబయాసిస్‌ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సింబయాసిస్‌ నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (శ్నాప్‌) నిర్వహిస్తున్నారు. ఈ స్కోరుతో 16 సంస్థల్లోని 28 కోర్సుల్లో చేరవచ్ఛు.
పరీక్ష విధానం: జనరల్‌ ఇంగ్లిష్‌, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, డేటా సఫిషియన్సీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. 110 ప్రశ్నలు ఇస్తారు. వ్యవధి 2 గంటలు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 23.
పరీక్ష తేదీ: డిసెంబరు 15.
వెబ్‌సైట్‌: https://www.snaptest.org

మ్యాట్‌
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోషియేషన్‌ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (మ్యాట్‌) స్కోర్‌తో దేశవ్యాప్తంగా 600కుపైగా సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి.
పరీక్ష విధానం: లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్‌ స్కిల్స్, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషి‡యన్సీ, ఇంటలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి.ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.
పరీక్ష ఫీజు: పేపర్‌ లేదా ఆన్‌లైన్‌ ఏదో ఒకటి రాసుకోవడానికి రూ.1550. రెండు విధాల పరీక్షలకు హాజరుకావడానికి రూ. 2650.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబరు 1 (పేపర్‌ బేస్డ్‌), డిసెంబరు 6 (కంప్యూటర్‌ బేస్డ్‌)
పరీక్ష తేది: డిసెంబరు 8 (పేపర్‌ బేస్డ్‌), డిసెంబరు 14 (కంప్యూటర్‌ బేస్డ్‌)
వెబ్‌సైట్‌: https://mat.aima.in/dec19/

హెచ్‌సీయూ
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తవుతుంది. నాణ్యమైన విద్య అందుతుంది.
పరీక్ష విధానం: క్యాట్‌ స్కోర్‌ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 15
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.550, ఈడబ్ల్యుఎస్‌ రూ.500, ఓబీసీలకు రూ.350, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.
వెబ్‌సైట్‌: https:// smsuoh.ac.in/

ఎస్‌పీ జైన్‌
దేశంలో టాప్‌-10 బీ స్కూళ్లలో ఇదొకటి. ఈ సంస్థ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలేమీ నిర్వహించకుండా క్యాట్‌/ జాట్‌/ జీమ్యాట్‌లో చూపిన ప్రతిభతో గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి తీసుకుంటోంది. ముంబయి, దిల్లీల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో 85 పర్సంటైల్‌ సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 22.
వెబ్‌సైట్‌: https://www.spjimr.org


Back..

Posted on 04-11-2019