Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎంబీఏకు మ్యాట్‌ మార్గం!

ఎంబీఏలో చేరదల్చినవారు రాసే జాతీయస్థాయి పరీక్షల్లో ‘మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌’ ఒకటి. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ నిర్వహించే ఈ మ్యాట్‌ స్కోరు ద్వారా ప్రతిష్ఠాత్మక మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ఎంబీఏ/ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబరు, డిసెంబరు) జరిగే ఈ పరీక్ష తాజా నోటిఫికేషన్‌ వెలువడింది.

ఫిబ్రవరిలోనే పరీక్ష ఉన్నందువల్ల ప్రస్తుతం ప్రాథమికాంశాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నించవద్దు. ముందుగా అభ్యర్థులు పరీక్ష ఏ పద్ధతిలో రాయాలో నిర్ణయించుకోవాలి. అంటే ఈ పరీక్షను అటు ఆఫ్‌లైన్‌తోపాటు ఇటు ఆన్‌లైన్‌లోనూ ఫిబ్రవరి 2018లో నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్‌లో ఫిబ్రవరి 4న, ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 17 నుంచి నిర్వహించనున్నారు (తక్కువమంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ఒకే రోజులో పూర్తవుతుంది, లేదంటే అభ్యర్థుల సంఖ్యనుబట్టి ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయిస్తారు).
ఆఫ్‌లైన్‌లో (పేపర్‌ బేస్‌డ్‌) అభ్యర్థి పరీక్ష రాయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 10 రోజుల వ్యవధి మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో పరీక్ష రాయాలనుకుంటే పరీక్షకు సుమారుగా 23 రోజులు అందుబాటులో ఉంటాయి. అంటే అభ్యర్థి ప్రస్తుతం సాధనపైనే పూర్తిస్థాయి దృష్టిసారించాలి. ప్రాథమికాంశాల అధ్యయనానికి వ్యవధి లేనందున పూర్తిస్థాయిలో మాక్‌ పరీక్షలను రాయాల్సి ఉంటుంది. అలాగే విధిగా సమాధానాలను పరిశీలించాలి. తరచూ తప్పులు చేస్తున్న అధ్యాయాలను గుర్తించి వాటిలోని అంశాలకు మరోసారి సిద్ధం కావాలి.
సమయపాలన ముఖ్యం
ఒక్క ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ మినహా మిగతావాటికి సమయపాలన చాలా కీలకం.
అందుబాటులో ఉన్న ఈ కొద్ది సమయంలో మేథమేటికల్‌ స్కిల్స్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీలపై దృష్టిసారించడం మేలు. ఈ అంశాలు రెండూ కలిపి 80 ప్రశ్నల వరకు వస్తున్నాయి. పైగా ఈ రెండు విభాగాలు అరిథ్‌మెటిక్‌ సన్నద్ధతపై ఆధారపడి ఉన్నాయి.
సరాసరి, శాతాలు, నిష్పత్తులు అనే మూడు అంశాలు, డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ చాలా కీలకం. అన్వయంలోనే కొంచెం భిన్నంగా ఉంటుంది. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలు చేయడం ద్వారా మంచి స్కోరు సాధించవచ్చు.
అయిదు అంశాల్లోనూ ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌కు సంబంధించి పెద్దగా సాధన చేయాల్సిన పనిలేదు. అయితే తాజా పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. జీఎస్‌టీ అమలు- క్రమం తప్పకుండా వస్తున్న మార్పులు, నోబెల్‌ బహుమతులు, ఉత్తరకొరియా అణు, క్షిపణి పరీక్షలు, ఇటీవలి కాలంలో అమెరికాలో వచ్చిన విధానపరమైన మార్పులు, భారత్‌, విదేశీ సంబంధాలు తదితర అంశాలను ఒకసారి పరిశీలించాలి.
లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయి దినపత్రికల్లో వచ్చే సంపాదకీయాలను పరిశీలించాలి. రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏ ఉద్దేశంతో ఫలానా అంశాన్ని రాశాడు.. ఇలా ప్రశ్నలు వేసుకుని సమాధానాలు రాబడితే పరీక్ష కోణం అలవడుతుంది. రీజనింగ్‌ అంశానికి సంబంధించి పజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ ప్రశ్నలు ప్రస్తుతం ఎక్కువగా సాధన చేయాలి. బ్లడ్‌ రిలేషన్స్‌, ర్యాంకింగ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ఇది కూడా మంచి స్కోరింగ్‌ విభాగం. అందులో దీనికి ప్రాథమిక అంశాలు అంటూ ఉండవు.
పూర్తిస్థాయి మాక్‌ పరీక్షలు రాస్తే మంచి స్కోరు సాధించే అవకాశం అభ్యర్థులకు ఉంటుంది.

ప్రవేశాల తీరు ఎలా?
టాప్‌ బి-మేనేజ్‌మెంట్‌ కళాశాలలు, రెండు అంశాల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తాయి. 1. అభ్యర్థి సాధించిన స్కోరు 2. పర్సంటైల్‌.
మొత్తం 200 ప్రశ్నలు ఉన్నా, 800 మార్కులకు స్కేలింగ్‌ ఇస్తారు. దీనిని కంపోజిట్‌ స్కోర్‌ విధానంగా చెబుతారు. దీని ఆధారంగా పర్సంటైల్‌ను నిర్ణయిస్తారు. దాదాపుగా దేశవ్యాప్తంగా 250 కళాశాలలు మ్యాట్‌ స్కోరును ప్రవేశాలకు పరిగణిస్తున్నాయి.

చివరి సంవత్సరం విద్యార్థులు కూడా...: మ్యాట్‌ రాయడానికి గ్రాడ్యుయేట్లు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా పరీక్ష రాయవచ్చు. వయసుతో నిమిత్తం లేదు.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: జనవరి 26, 2018
పేపర్‌ ఆధారిత పరీక్ష: ఫిబ్రవరి 4, 2018
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: ఫిబ్రవరి 17, 2018
అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి వచ్చేది- ఫిబ్రవరి 27 నుంచి.
అడ్మిషన్ల కోసం మ్యాట్‌ స్కోరును పరిగణలోకి తీసుకునే తెలుగు రాష్ట్రాల్లోని కళాశాలలు
* ధ్రువ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్- హైదరాబాద్
* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్- హైదరాబాద్
* శివశివాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- సికింద్రాబాద్
* విజ్ఞాన్‌జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- హైదరాబాద్
* ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్- హైదరాబాద్
* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్- హైదరాబాద్
* అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా- హైదరాబాద్
* వరంగల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- వరంగల్
* గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్- విశాఖపట్నం
* గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- విశాఖపట్నం
మ్యాట్ స్కోరును గుర్తించిన కొన్ని ప్రముఖ సంస్థలు
* బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- గ్రేటర్ నోయిడా (ఇందులో సీటు దక్కడానికి 90కుపైగా పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది).
* డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్- ఐఐటీ మద్రాస్
* ఏషియా-పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- దిల్లీ
* గ్జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఆంత్రపెన్యూర్‌షిప్- బెంగళూరు
* అమిటీ బిజినెస్ స్కూల్- నోయిడా

పి.గోపాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్‌, కౌటిల్య కెరియ‌ర్స్‌


Back..

Posted on 25-01-2018