Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పర్యావరణానికి కొత్త మేనేజర్లు!

* ఎంబీఏలో ఎకో ఫ్రెండ్లీ స్పెషలైజేషన్లు

ప్రతి రంగం ప్రగతికీ నిర్వహణ నిపుణులు అవసరం. అందుకే మేనేజ్‌మెంట్‌ విద్యకు రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ధోరణులూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ హితానికి తోడ్పడే స్పెషలైజేషన్లకు డిమాండ్‌ ఎక్కువవుతోంది. దీంతో పలు సంస్థలు రకరకాల కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం సీమ్యాట్‌, మ్యాట్‌, ఎక్స్‌ఏటీ తదితర ప్రవేశపరీక్షల ప్రక్రియలు కొనసాగుతున్నాయి. వీటికి సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ ఎకో ఫ్రెండ్లీ ఎంబీఏలను గురించి తెలుసుకుంటే తమ అభిరుచి, ఆసక్తులకు అనుగుణమైన వాటిని ఎంచుకోవచ్చు. సంబంధిత పరీక్షలకు హాజరుకావచ్చు.

విద్య, ఉద్యోగం.. జీవితంలో స్థిరపడిపోవడం.. ఇప్పటి యువత వీటికే పరిమితం కావడం లేదు. సమాజానికి ఏదైనా చేయాలని భావిస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం, కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు, మొక్కలను నాటడం.. ఇలా చిన్నదైనా, పెద్దదైనా తనవంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఉద్యోగంలోనూ ఇదే ధోరణిని కొందరు కొనసాగించాలనుకుంటున్నారు. పర్యావరణ సంబంధిత కోర్సులవైపు దృష్టిసారిస్తున్నారు. పర్యావరణం అనగానే అందరికీ అగ్రికల్చర్‌ గుర్తొస్తుంది. కానీ ఎంబీఏలోనూ కొన్ని స్పెషలైజేషన్లను పలు విద్యాసంస్థలు ప్రవేశపెట్టాయి. సాధారణ డిగ్రీ అర్హతతో వీటిలో అడ్మిషన్‌ పొందవచ్చు.

ఫారెస్ట్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌
నగరీకరణ, అడవుల నరికివేత కారణంగా అడవులు కనుమరుగవుతున్నాయి. దీంతో వన్యప్రాణులు తరిగిపోవడం, వర్షాభావం.. ఇలా ఎన్నో నష్టాలు వాటిల్లుతున్నాయి. వీటిని సంరక్షించుకోవాలి. వన్యప్రాణులు, వివిధ రకాల కలప, అడవి సంబంధిత వనరులను పరిరక్షించడం, వాటి నిర్వహణకు సంబంధించిందే ఫారెస్ట్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌. ఈ కోర్సులో అడవుల పరిరక్షణలో ఉపయోగించే న్యాయ, ఆర్థిక, సామాజిక, సాంకేతిక, శాస్త్రీయ విధానాల గురించి తెలుసుకుంటారు.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎఫ్‌ఎం)- భోపాల్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. క్యాట్‌/ ఎక్స్‌ఏటీ స్కోరు ఆధారంగా ప్రవేశాలుంటాయి. కోర్సు పూర్తి చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఎన్‌జీఓలు, పరిశోధక, కన్సల్టింగ్‌ సంస్థలు నియమించుకుంటాయి.

నేచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌
సహజ వనరులను విచక్షణరహితంగా వాడటం, కలుషితం చేయడం వల్ల మానవాళికీ ముప్పు వాటిల్లుతోంది. వీటిని భవిష్యత్తు తరాలకు జాగ్రత్తగా అప్పగించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ ప్రాముఖ్యాన్ని తెలియజేయడమే నేచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ముఖ్యోద్దేశం. ఇందులో సహజ వనరులు, మొక్కలు, జంతువుల నిర్వహణ, హెర్బల్‌ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ పాలసీ అండ్‌ లా, ప్లాంటేషన్‌ టెక్నాలజీ, అర్బన్‌ ఫారెస్ట్రీ, మార్కెటింగ్‌ మొదలైన అంశాల గురించి తెలుసుకుంటారు.

నోయిడాలోని అమిటీ స్కూల్‌ ఆఫ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఈ కోర్సును అందిస్తోంది. మ్యాట్‌/ జీమ్యాట్‌/ క్యాట్‌/ ఎక్స్‌ఏటీ/ ఎన్‌మ్యాట్‌ల్లో స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పట్టా చేతికొస్తే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీలు, వ్యవసాయ రంగం, మైనింగ్‌ సంస్థలు, నేచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో అవకాశాలుంటాయి.

డెయిరీ మేనేజ్‌మెంట్‌
పాలు, పాల సంబంధ ఉత్పత్తులను అందించే అయిదు ప్రధాన దేశాల్లో భారత్‌ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తిలో 13% వాటా మనదేశానిదే. అయినప్పటికీ ఆధునికీకరణ పరంగా మెరుగుపడాల్సిన స్థితిలోనే ఉంది. దీనిలోకీ కొత్త టెక్నాలజీలూ, ధోరణులూ ప్రవేశిస్తున్నాయి. వీటిని సమర్థంగా నడిపించడానికి నిపుణులు అవసరమవుతున్నారు. కోర్సులో భాగంగా డెయిరీ రంగంలో రోజువారీ సమస్యలు, పరిష్కారాలను తెలుసుకుంటారు. సంబంధిత పాలసీలు, మేనేజ్‌మెంట్‌ అంశాలనూ చదువుతారు. ఫీడింగ్‌ మేనేజ్‌మెంట్‌, బయో సెక్యూరిటీ, డెయిరీ హర్డ్‌ మేనేజ్‌మెంట్‌, క్వాలిటీ కంట్రోల్‌, మార్కెట్‌ అంశాలనూ తెలుసుకుంటారు.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌
* ద నేషనల్‌ డెయిరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కర్నల్‌
* డెయిరీ సైన్స్‌ కాలేజ్‌, బెంగళూరు
* కర్ణాటక వెటర్నరీ, యానిమల్‌ అండ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ, కర్ణాటక మొదలైనవి.
సంస్థను బట్టి ప్రవేశ ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా క్యాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌/ఎక్స్‌ఏటీ స్కోరు ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నారు. కోర్సు పూర్తిచేసినవారికి అమూల్‌, విజయ వంటి పాలసంబంధ ఉత్పత్తులు, ఆహార సంబంధ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ప్లాంట్‌ మేనేజర్‌, అగ్రికల్చర్‌ యూనిట్‌ సూపర్‌వైజర్‌, క్వాలిటీ మేనేజర్‌, ఆర్‌ అండ్‌ డీ మేనేజర్‌, శానిటేరియన్‌, డెయిరీ న్యూట్రిషనిస్ట్‌ హోదాలకు వీరిని తీసుకుంటారు.

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మేనేజ్‌మెంట్‌
ఎల్లప్పుడూ డిమాండ్‌ ఉండే రంగమిది. దేశ జీడీపీలో దీని వాటా 15%. ఆయిల్‌, గ్యాస్‌, పెట్రోలియం పరిశ్రమలు కొత్త, పునరుద్ధరణీయ ఇంధన వనరుల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. కోర్సులో భాగంగా మేనేజ్‌మెంట్‌ అంశాలు, పెట్రోలియం ఎకనామిక్స్‌, పెట్రోలియం పాలసీలు, లాస్‌, రెగ్యులేషన్స్‌, ఆపరేషన్స్‌, మార్కెటింగ్‌ అంశాలను చదువుతారు. క్యాట్‌/ మ్యాట్‌/ ఎక్స్‌ఏటీ/ సీమ్యాట్‌ స్కోర్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియమ్‌ అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, దేహ్రాదూన్‌
* పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ, గాంధీనగర్‌
* స్కూల్‌ ఆఫ్‌ పెట్రోలియం మేనేజ్‌మెంట్‌, గుజరాత్‌
* రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ, రాయ్‌బరేలీ
* న్యూదిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైనవి.
ఈ కోర్సు చేస్తే జాతీయ, అంతర్జాతీయ ఆయిల్‌, గ్యాస్‌ ప్రొడక్షన్‌, ఎక్స్‌ప్లొరేషన్‌, మార్కెటింగ్‌, ఎనర్జీ/ పవర్‌, రెన్యువబుల్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

ఎనర్జీ మేనేజ్‌మెంట్‌
ఆర్థికవృద్ధిలో ఇంధన, విద్యుత్తు రంగాలది ప్రధాన పాత్ర. ప్రజల దైనందిన కార్యక్రమాలతోపాటు పరిశ్రమల అభివృద్ధికీ ఇవి జీవనాధారంగా మారాయి. ఎక్కువ విద్యుత్తును ఉపయోగిస్తున్న దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మనదేశం ఆరో స్థానంలో ఉంది. భవిష్యత్తులో ఈ విద్యుత్తు అవసరాలు రెట్టింపు అవుతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆ సవాళ్లకు దీటుగా ఇంధన రంగాన్ని అభివృద్ధి పథంలో నిలపడానికి పెట్టుబడులు, విద్యుత్తు ఉత్పత్తి, మేనేజ్‌మెంట్‌, సస్టెయినబిలిటీ వంటి వాటి ప్రాధాన్యం పెరుగుతోంది. సంబంధిత ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ నిపుణుల అవసరం ఎక్కువవుతోంది.ఈ నేపథ్యంలో కొన్ని కోర్సులు రూపొందించారు. ఇందులో శక్తిరంగానికి సంబంధించి పూర్తి అవగాహన కల్పిస్తారు.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌, గుడ్‌గావ్‌
* ఎన్‌ఐసీఎంఏఆర్‌, పుణె
* అమిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, దిల్లీ
* రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ, ఉత్తర్‌ప్రదేశ్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, దేహ్రాదూన్‌ మొదలైనవి.
ఇంజినీరింగ్‌, బీఎస్సీ డిగ్రీ చేసినవారు ఈ కోర్సు చేయడానికి అర్హులు. సంస్థను బట్టి ప్రవేశ ప్రక్రియలో మార్పులుంటాయి. సాధారణంగా క్యాట్‌/ స్నాప్‌/ జీమ్యాట్‌/ ఎక్స్‌ఏటీ/ సీమ్యాట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు పూర్తిచేసినవారికి ఇంధన, విద్యుత్తు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ పవర్‌, నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌, లాంకో ఇన్‌ఫ్రాటెక్‌ మొదలైన సంస్థలు నియామకాలు జరుపుతాయి.

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ
ప్రతి సంస్థకీ సమాజం పట్ల కొంత బాధ్యత ఉండాలి. ప్రజలు, పర్యావరణం రెండింటికీ దీనిలో ప్రాధాన్యం ఉండాలి. నిజానికి సంస్థలకు ఇది తప్పనిసరి ప్రక్రియ. అందులో భాగంగా వృథాని అరికట్టడం, కాలుష్యాన్ని తగ్గించడం, విద్యాపరమైన, ఇతర సేవా కార్యక్రమాలను సాగించడం వంటివి చేస్తుంటాయి. నైతికపరమైన అంశాలకూ ప్రాధాన్యమిస్తుంటాయి. వీటన్నింటినీ పర్యవేక్షించడానికి సంస్థలకు ప్రత్యేకమైన కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ఉద్యోగులు అవసరమవుతున్నారు. వీరు కమ్యూనిటీ, మార్కెట్‌, కోర్‌ బిజినెస్‌ స్ట్రాటజీలపైనా పని చేస్తుంటారు. కోర్సులో భాగంగా సంబంధిత చట్టాలు, బిజినెస్‌ ఎకనామిక్స్‌, సోషల్‌ వెల్ఫేర్‌, బిజినెస్‌ పాలసీ మొదలైన అంశాలను నేర్చుకుంటారు.

అందిస్తున్న సంస్థలు:
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ సస్టెయినబిలిటీ మేనేజ్‌మెంట్‌, దిల్లీ
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, పుణె
* సీఎస్‌ఆర్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌, మైసూరు
* ఐఐఎం, అహ్మదాబాద్‌
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ముంబయి మొదలైనవి.
సంస్థను బట్టి ప్రవేశ ప్రక్రియలో మార్పులుంటాయి. సాధారణంగా సీమ్యాట్‌/ మ్యాట్‌/ ఎక్స్‌ఏటీ స్కోరు ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. కోర్సు పూర్తిచేసినవారికి ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద సంస్థలు, ఎన్‌జీఓలు, వివిధ ఫౌండేషన్లలో ఉపాధి లభిస్తుంది.


Back..

Posted on 12-11-2019