Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఆసుపత్రి మంచీ చెడూ చూసుకుంటారు!

* హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌/ మేనేజ్‌మెంట్‌

ఆధునిక యుగంలో ఆరోగ్యం పట్ల అందరికీ అవగాహనతోపాటు శ్రద్ధ కూడా పెరిగింది. ప్రతి సమస్యకీ ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటున్నారు. సేవలు కూడా ఏడాది మొత్తం.. ఇరవైనాలుగు గంటలూ అందుతున్నాయి. స్పెషాలిటీలు, సూపర్‌ స్పెషాలిటీలు పెరిగిపోతున్నాయి. దీంతో డాక్టరే ఆసుపత్రి పాలనను చూసుకునే పరిస్థితి లేదు. ఆ బాధ్యతలన్నీ ఇప్పుడు కొత్త సిబ్బంది నిర్వహిస్తున్నారు. హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ లేదా మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసినవారు ఆసుపత్రి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సాధారణ డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుల్లో చేరవచ్చు. హెల్త్‌కేర్‌ రంగం పరిధి విస్తృతమవుతుండటంతో వీరికి డిమాండ్‌ ఎక్కువవుతోంది.

వైద్యులు, రోగులు, నర్సులు, వైద్య అనుబంధ విభాగాల సిబ్బంది అందరినీ.. సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రి కార్యకలాపాలు సాఫీగా జరిగేలా చూసేవారే హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్లు. ప్రస్తుతం భారత్‌లో మెడికల్‌ టూరిజానికి ఆదరణ లభిస్తోంది. జీవనశైలి, కాలుష్యం, మారుతోన్న పరిస్థితులు...తదితరాల కారణంగా రోగాలబారినపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య స్పృహ పెరగడంతో ముందస్తు వైద్యసేవలు వినియోగించుకునేవాళ్లు అధికమయ్యారు. దీంతో ఉన్న ఆసుపత్రులు వాటి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. కొత్తవి ఏర్పాటవుతున్నాయి. వీటి నిర్వహణకు నాణ్యమైన మానవ వనరులు కీలకమైనందువల్లే చాలా సంస్థలు, ఆసుపత్రులు హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి.

ఈ రంగంలో ప్రవేశించాలని ఆశించేవారికి సేవా దృక్పథం ఉండాలి. ఎక్కువ సమయం పనిలో గడపడానికి సన్నద్ధం కావాలి. సహనమూ అవసరమే. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఒత్తిడిలోనూ పనిచేయగలిగే నేర్పు, గడువులోగా పని పూర్తిచేయగల సమర్థత అవసరం.

అవకాశాలిలా...
ఈ కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతోపాటు హెల్త్‌ ఏజెన్సీలు, లేబొరేటరీలు, క్లినిక్‌లు, జాతీయ, అంతర్జాతీయ వైద్య విభాగ సంస్థలు, ఆరోగ్య బీమా సంస్థలు, వైద్య కళాశాలలు, హెల్త్‌ కేర్‌ సెంటర్లు, నర్సింగ్‌ హోమ్‌లు, మానసిక చికిత్స కేంద్రాలు, పునరావాస కేంద్రాలు, పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్లు, ఫార్మా సంస్థలు, హాస్పిటల్‌ సప్లై ఫర్మ్‌లు, మెడికల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, హాస్పిటల్‌ కన్సల్టింగ్‌ ఫర్మ్‌లు, కార్పొరేట్‌ ఫార్మసీలు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు...మొదలైన చోట్ల అవకాశాలు లభిస్తాయి. నైపుణ్యాలు ఉన్నవారు విదేశాల్లోనూ ఆకర్షణీయ వేతనాలు పొందుతున్నారు.

అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌, ఆపరేషన్స్‌ అసిస్టెంట్‌ హోదాతో వీరి కెరీర్‌ ప్రారంభమవుతుంది. చదువుకున్న సంస్థ, అభ్యర్థి సమర్థత ప్రాతిపదికన హోదాలు కేటాయిస్తారు. కొందరిని మేనేజర్‌ ఆపరేషన్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల్లో తీసుకుంటున్నారు. ఎంబీబీఎస్‌ అర్హతతో కోర్సులు చదివినవారికి అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ హోదా కేటాయిస్తారు. తర్వాత డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ హోదాలు వస్తాయి. మంచి పనితీరు, అనుభవంతో చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ లేదా సీఈఓ స్థాయి వరకు చేరుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో...
ఎంబీఏ హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఈ కోర్సు అందిస్తోంది. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. 33 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో...లాజికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ, హెల్త్‌కేర్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాల్లో 75 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకు 25 మార్కులు కేటాయించారు. మే 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 29న పరీక్ష, జూన్‌ 25న ఇంటర్వ్యూ ఉంటాయి.

మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హైదరాబాద్‌; డెక్కన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌ ఈ కోర్సు అందిస్తున్నాయి. ఈ రెండు సంస్థల్లోనూ ప్రవేశాలకు మే 13లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను కోర్సులోకి తీసుకుంటారు. వంద మార్కులకు నిర్వహించే ఆబ్జెక్టివ్‌ పరీక్షలో రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ యూసేజ్‌, హెల్త్‌ అండ్‌ హాస్పిటల్‌ నాలెడ్జ్‌, కరంట్‌ అఫైర్స్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఒక్కో సంస్థలోనూ 60 చొప్పున సీట్లు ఉన్నాయి.

పీజీ డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌: అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ రెండేళ్ల ఈ కోర్సును అందిస్తోంది. మే 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌ లో 50 శాతం అగ్రిగేట్‌ మార్కులున్నవారు అర్హులు. వీరు క్యాట్‌/సీమ్యాట్‌/మ్యాట్‌/జీమ్యాట్‌/గ్జాట్‌/ఏటీఎంఏలో క్వాలిఫై అయివుండాలి. విద్యాపరమైన ప్రతిభ, పర్సనల్‌ ఇంటర్వ్యూ, హెల్త్‌కేర్‌ రంగంపై ఆసక్తి లాంటి అంశాలపై ఆధారపడి అడ్మిషన్‌ లభిస్తుంది.

ఎంబీబీఎస్‌ పూర్తయిందా?
ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకున్నవారు పీజీలో భాగంగా ఎండీ హాస్పిటల్‌
అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులో చేరవచ్చు. మూడేళ్ల వ్యవధితో ఈ కోర్సును కొన్ని వైద్య కళాశాలలు అందిస్తున్నాయి. పీజీ నీట్‌తో ప్రవేశాలు లభిస్తాయి. ఆర్మ్‌డ్‌ మెడికల్‌ కాలేజ్‌, పుణె; కస్తూర్బా మెడికల్‌ కాలేజ్‌, మణిపాల్‌; నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, హైదరాబాద్‌; నారాయణ మెడికల్‌ కాలేజ్‌, నెల్లూరు తదితర సంస్థలు వైద్యుల కోసం కోర్సులు నడుపుతున్నాయి. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, న్యూదిల్లీ సొంత పరీక్షతో ఎండీ (హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులోకి ప్రవేశం కల్పిస్తోంది.

సర్టిఫికేషన్లూ ఉన్నాయి..
పది సంవత్సరాల క్రితం హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేశాను. హైదరాబాద్‌, విశాఖపట్నంలలోని ఆస్పత్రుల్లో ఉద్యోగానుభవం, ఆపై అర్హతలను పెంచుకున్నాక విదేశాల్లో అవకాశం వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. మెడికల్‌ టూరిజానికి ప్రోత్సాహం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సు చేసినవారికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. హెల్త్‌కేర్‌ రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్నవారు కూడా హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు చేసివుండకపోతే నిర్వహణపరమైన లక్ష్యాలను అందుకోవడం కష్టమే. అంతటి ప్రాముఖ్యమున్న ఈ కోర్సు పూర్తిచేస్తే సుదీర్ఘకాలం ఆకర్షణీయమైన కెరీర్‌ పొందవచ్చు. ఈ రంగంలో వచ్చే కొత్త పోకడలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకుంటే ఢోకా ఉండదు. ఈ కోర్సు తర్వాత ‘సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌ హెల్త్‌కేర్‌ క్వాలిటీ’ లాంటి ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్లు చేస్తే అంతర్జాతీయంగానూ అవకాశాలు చేజిక్కించుకోవచ్చు.
- చిలుకూరి నిశాంత్‌, క్వాలిటీ మేనేజర్‌, బుర్జీల్‌ హాస్పిటల్‌, షార్జా, యూఏఈ.

ఎంపికలో ఏం చూడాలి?
అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ సభ్యులు, మౌలిక వసతులు ఉన్న విద్యాసంస్థను ఎంచుకోవాలి. కరిక్యులమ్‌ గమనించాలి. ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న సంస్థను ఎంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటిచోట క్షేత్రస్థాయి నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది. పేరున్న సంస్థల్లో కోర్సు పూర్తిచేసుకున్నవారికి ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయి. ఆసుపత్రులతోపాటు హెల్త్‌ కన్సల్టెన్సీలు, బీమా సంస్థలు, ఆరోగ్య రంగంలో సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలు నియామకాలు చేపడుతున్నాయి.

పేరున్న సంస్థలు
* హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (ప్రకటన వెలువడింది)
* అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హైదరాబాద్‌ (ప్రకటన వెలువడింది)
* అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ (ప్రకటన వెలువడింది)
* నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, హైదరాబాద్‌ (జూన్‌/ జులైలో ప్రకటన వెలువడుతుంది)
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌, జైపూర్‌ (ప్రకటన వెలువడింది)
* టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ముంబై


Back..

Posted on 02-05-2019